Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> విలువలు

viluvalu

నారాయణ  కాష్ కౌంటర్లో బీజీ గా ఉన్నాడు. రామరాజు సేవింగ్స్ కౌంటర్ నుంచి వచ్చి, మీ నాన్నగారు ఫోన్ చేశారు. ఖాళీ అయినప్పుడు ఆయనకి ఫోన్ చెయ్యి అన్నాడు. మిగతా కౌంటర్లలా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి ఫోన్లు తీయడం అతనికి కుదరదు . లంచ్ బ్రేక్ కి కౌంటర్ క్లోజ్ చేసిన తరువాత వెళ్లి తండ్రికి ఫోన్ చేశాడు.

" ఏమీ లేదురా ఇవాళ మళ్ళీ కొంచెం ఆయాసం గా ఉంది. వచ్చేటప్పుడు డాక్టర్ ని కలిసి రాత్రి మళ్ళీ ఎక్కువ వస్తే ఏమి చేయాలో కనుక్కుని రా" అని పెట్టేశాడు రాఘవరావు.

నారాయణ ఆలోచనలు తండ్రి ఆరోగ్యం మీదకి పోయాయి. గత కొద్దీ రోజులు గా కొంచెం ఆయాసం వస్తోంది. దగ్గర లో ఉన్న డాక్టర్ కి చూపిస్తే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది అని ఏవో మందులు రాశాడు.

కానీ అవి ఎక్కువ పనిచేసినట్టు లేదు. వెళ్ళేటప్పుడు డాక్టర్ ని కలిసి వెళ్ళాలి అనుకుని కౌంటర్ లో పనిలో పడి పోయాడు. కాష్ క్లోజ్ చేసిన తరువాత లెక్కలు సరి చూసుకుని టేలీ అయిన తరువాత ఊపిరి పీల్చుకుని రాజయ్య ని టీ తీసుకు రమ్మన్నాడు. టీ సిప్ చేస్తూ కాస్త రిలాక్స్ అవుతుంటే, హెడ్ క్యాషియర్ ఓ పావు గంటలో ఛెస్ట్ లో కి రా  ఆర్బీఐ  కి స్టేట్ మెంట్ ఇవాళ పంపాలి అని ఇంటర్కం లో చెప్పాడు.
ఇంకా పది నిమిషాలు రిలాక్స్ అవవచ్చు అనుకుంటూ ఉండగా, రమణి వచ్చి ఎదురుగా వచ్చి కూర్చుంది.

రమణి అతని కొలీగ్. చాలా మంచి అమ్మాయి. కొద్దీ రోజులు క్రితం ఆమె తనకి ప్రపోజ్ చేసింది. వాళ్ళ వాళ్ళు సంబంధాలు చూస్తున్నారని, అభ్యంతరం లేకపోతే మనం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అంది.

ఇప్పుడు వచ్చి ఎదురుగా కూర్చుని ఆ విషయం ఎత్తక పోయినా జవాబు ఆశిస్తోందని అతనికి తెలుసు. పైకి తేల  లేదు కానీ ఆమె అంటే అతనికి గౌరవమే కాకుండా ఒక రకమయిన అభిమానం

"నాన్నా గారికి కొద్దీ రోజులగా వంట్లో బాగోటల్లేదు. కొంచెం వర్రీ గా ఉంది. కొద్దిరోజులు టైం ఇస్తారా ?" అన్నాడు.

" అయ్యో నాకు తేలియదే? . అలాగే" అనే లేచి వెళ్ళిపోయింది. నారాయణ కూడా లేచి చెస్ట్ కేసి  నడిచాడు.

********

చిన్న ప్రాబ్లెమ్ అనుకుంటే నాలుగు రోజులయినా తగ్గక పోగా, పాదాలూ అవీ వాస్తే, తండ్రిని  మిత్రుల సలహా మీద ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాడు నారాయణ . వాళ్ళు రక్త పరీక్ష లు అవీ చేసి చిన్న బాంబు పేల్చారు. కిడ్నీ లో ప్రాబ్లెమ్ ఉన్నట్టుంది.  ఇంకా కొన్ని టెస్టులు చేయాలని చెప్పి రక్తం సాంపిల్స్ ఇంకో పెద్ద లేబొరేటరీ కి పంపారు. వాటికే నారాయణకు ఎనిమిది, తొమ్మిది వేల  దాకా అయింది. అతను పని చేస్తున్న  బ్యాంకు. సర్వీసు బెనిఫిట్స్ లో భాగం గా తండ్రికి కూడా ఇన్సురెన్సు కొంత కవర్  అవుతుంది కానీ, చాలా పరిమితులు ఉన్నాయి.
నారాయణ తండ్రి  రాఘవరావు, ఆ ఊళ్ళో నే ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేసి ఆ ఆమధ్యనే రిటైర్ అయ్యాడు. పెన్షన్ ఏమీ రాదు. నారాయణ చిన్న వయసు లోనే రాఘవరావు భార్య మరణించడం తో మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నారాయణ ని చాలా ప్రేమ గా తన కున్న ఆదాయంలో నే లోటు లేకుండా పెంచుకొచ్చాడు. డిగ్రీ అవగానే తండ్రిని ఒక్కడినీ  వదలడం ఇష్టం లేక పెద్ద చదువులు ఆలోచించకుండా భీమవరం లోనే ఓ  ప్రైవేట్ బ్యాంకు లో ఉద్యోగం వస్తే అక్కడే ఉండి  పోయాడు.

రాఘవరావు తండ్రి నుంచి కొద్దిపాటి భూమి మాత్రం సంక్రమించింది. కానీ దానికి హాక్కుదారులు అతనికి ఇంకో ముగ్గురు అన్నలు ఉన్నారు. పెద్ద అన్నగారు రాజారామ్ హైదరాబాద్ లో అత్తగారి తాలూకు ముత్యాల వ్యాపారం చూసుకుంటున్నాడు. వాళ్ళ అత్త మామలకి రాజారామ్ భార్య నీలవేణి ఒక్కత్తే కూతురు . అందు చేత ఇల్లరికం అల్లుడి లా ఉండి  పోయి వాళ్ళు ఎప్పటినుంచో చేస్తున్న వ్యాపారం చూస్తూ చాలా బాగా గడించాడు. రెండో అన్న గారు రామకృష్ణ  హైద్రాబాద్లో ఏజీ ఆఫీసులో ఆడిటర్  గా రిటైర్ అయ్యాడు. మూడో  అన్నగారు అర్జున రావు చెన్నైలో ఒక ఆడిటర్ కంపెనీ లో ఉద్యోగి.   తండ్రినుంచి సంక్రమించిన భూమిని అమ్మి ఇతని వాటా ఇతనికి ఇచ్చి వాళ్ళు పంచుకుని  వెళ్లి పోయి చాలా కాల మయ్యింది. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళల్లో కలిసినా రాక పోకలు తగ్గాయి.

రిటైర్ అయిన తరువాత, కొడుకు తో కూడా చెప్పకుండా, రాఘవరావు పెద్ద తప్పు చేశాడు. అతను,  ఇంకో తోటి టీచర్ వరహాలరావు ఒకే మాటు రిటైర్ అయ్యారు. ఇద్దరికీ ఒకే రోజున రిటైర్మెంట్ డబ్బులు పీఎఫ్ వగైరా ఒకే మాటు వచ్చాయి.  అదే రోజు  వరహాల రావు, రాఘవరావుని ఓక కోరిక కోరాడు. తనకి చవకగా ఒక ఇల్లు  వచ్చిందని. దానిని మరునాడే రిజిస్టర్ చేసుకోవాలని. తనకి  కొంత డబ్బు తక్కువ అయిందనీ, రాఘవరావు ఇప్పుడు  సద్దితే,తన కొడుకు హైదరాబాద్ లో ఒక స్థలం అమ్మి డబ్బుకొద్ది రోజులలో పంపుతాడని అది   రాగానే బ్యాంకు వడ్డీ తో సహా  ఇచ్చేస్తానని బ్రతిమాలాడు. కొన్ని సంవత్సరాలుగా తెలుసు కాబట్టి రాఘవరావు ఒప్పుకుని నాలుగు  లక్షలు పైచిలుకు అతనికి ఇచ్చాడు. వరహాల రావు చెప్పిన ఆరు నెలల గడువు అయిపోవడంతో, రాఘవరావు, అతనిని అడిగినా కొడుకు ఇంకా స్థలం అమ్మలేదనీ, కొన్ని బేరాలు వచ్చాయి త్వరలో అయి పోతుందనీ చెబుతూ వచ్చాడు. ఎప్పటి కప్పుడు నారాయణ తో చెప్పే ధైర్యం లేక ఇంకా బిల్లు పాస్ అవలేదనీ,   బెనిఫిట్స్ త్వరలో వస్తాయని కొడుకు తో చెబుతూ వచ్చాడు.

అన్ని టెస్టులూ పూర్తి చేసి భీమవరంలో డాక్టర్లు తేల్చిన దేమిటంటే, రాఘవరావు కి కిడ్నీ పాడయినట్టున్నదనీ, వెంఠనే హైదరాబాద్ తీసుకువెళ్లి, అవసరమయితే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించాలని చెప్పడం తో నారాయణ కి ఆందోళన కలిగించింది. ఆ రాత్రే తండ్రి తో అన్నాడు. వెంఠనే చెన్నై  వెళ్లాలనీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చి ఉంటె ఇప్పుడు కొంత అయినా కలిసొచ్చేది అనీ ఇంకా అవి రాక పోవడం ఆశ్చర్యం గా ఉందనీ, మరునాడే వెళ్లి తాను స్కూల్ లో కనుక్కుంటాననీ అన్నాడు.

రాఘవరావుకి ఇంక చెప్పక తప్పలేదు. జరిగింది కొడుక్కి చెప్పి విచారంగా కూర్చున్నాడు. మొదట నారాయణ కి తండ్రి మీద చాలా కోపం వచ్చింది. తనకి మాటయినా చెప్పకుండా అంత  డబ్బు ఇవ్వడం అతనికి కొరుకుడు పడలేదు. చిన్నప్పటి నుంచీ తండ్రి స్వభావం తెలుసు కాబట్టి అతను ఎక్కువ ఆలోచించలేదు.

కిడ్నీ మార్పిడి అవసర మయితే ఖర్చు ఎలా సమకూర్చుకోవాలో నారాయణ కి అంతు  పట్టలేదు. ముందు ఆఫీసు లో అడ్వాన్స్ పెట్టి హైద్రాబాద్ తీసుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. విషయం తెలిసి రమణి కూడా కొంత డబ్బు ఇచ్చింది,  తరవాత చూసుకోవచ్చు అని.
 అతను తండ్రిని తీసుకుని చెన్నై లో ఉన్న మీసాల పెదనాన్న ఇంటికే వెడదామని నిర్ణయించుకున్నాడు. , ఎప్పుడో చిన్నప్పుడు చూసినప్పుడు తనని ముద్దు పెట్టుకున్నప్పుడు అర్జున రావు గుబురు మీసాలు కిత  కిత  పెట్టేవి. అందుకే అతను  మీసాల పెదనాన్నగా గుర్తు .  తరువాత అర్జున రావుని ముత్యాల పెదనాన్న ఇంటి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు మళ్ళీ  చూడడం జరిగింది. ఉన్న రెండు రోజులూ అర్జున రావు  నారాయణకి బాగా దగ్గర అయ్యాడు. తండ్రిని తీసుకునిసర్కార్  ఎక్సప్రెస్ లో వస్తున్నట్టు ఫోన్ చేశాడు. అర్జున రావు స్స్టేషన్ కి వస్తున్నట్టు మెసేజ్ పెట్టాడు. మీసాల పెదనాన్న స్టేషన్ కి రావడం నారాయణ కి ఆనందం వేసింది. అడయార్  లో వాళ్ళ ఇంటికి వెళ్ళగానే తన తండ్రికోసం ఒక రూమ్ ప్రత్యకంగా రెడీ చేసి ఉంచింది సత్యవతిదొడ్డమ్మ. మీసాల పేద నాన్న కొడుకు మురళి  అమెరికా కి చదువు కి వెళ్లిన తరువాత వాడి రూమ్ ఖాళీగానే ఉందని అందు లోనే ఇద్దరినీ ఉండమని ఏర్పాటు చేసింది.

భోజనాలయింతరువాత తండ్రి పడుకుంటే, అర్జున రావు, నారాయణ బయటికి వచ్చారు మాట్లాడుకుంటూ. నారాయణ పరిస్థితి వివరించాడు. ఒక వేళ మార్పిడి అవసర మయితే ఖర్చులు ఎలా అన్నది బాధిస్తోందని పెదనాన్నతో మనసు విప్పి చెప్పాడు నారాయణ. పెదనాన్న చూపిస్తున్న  ఆప్యాయత తో అతను సంకోచం లేకుండా అన్నీ వివరించాడు.

పెదనాన్న సహాయంతో టెస్టులు చేయించేటప్పటికీ తెచ్చిన డబ్బు దాదాపు అయిపొయింది. టెస్టులు జరుగుతూ ఉండగానే, అర్జున రావు,  హైదరాబాద్ లో ఉన్న అన్నలిద్దరికీ  పరిస్థితి వివరించాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవరో స్నేహితుడికి  ఇవ్వడం వలన ఏర్పడిన పరిస్థితి ని కూడా వివరించాడు.

డాక్టర్లు తేల్చిందేమిటంటే నెల లోపు మార్పిడి చేయాలని. ఆ నిర్ణయం వచ్చిన రోజు అర్జున రావు ఇంటి  డాబా మీద నారాయణ, ఆయన,  సమీక్షించుకోవడానికి కూర్చున్నారు. నారాయణ దొడ్డమ్మ పైకి  టీ తెచ్చి ఇచ్చింది. ఆవిడ అక్కడ కూర్చోబోతూ ఉంటె  అర్జున రావు సంజ్ఞ చేస్తే కిందకి వెళ్లి పోయింది.

" మనం సేకరించిన వివరాలు బట్టి కనీసం పన్నెండు పదిహేను లక్షలు చేతులో పట్టు కోవాలి రా. నీ పరిస్థితి చూస్తే  ఏమీ బాగో లేదు" అన్నాడు అర్జున రావు.

ఏమీ మాట్లాడకుండా, నారాయణ విచారం గా కూర్చుని ని ఎదో ఆలోచిస్తూ ఉంటె మళ్ళీ ఆయనే అన్నాడు

" నువ్వు అధైర్య పడకు ముగ్గురం అన్నదమ్ములం వున్నాము కదా. పరిష్కారం ఆలోచిద్దాము" అన్నాడు ధైర్యం చెబుతూ

" నేను మెల్లిగా తీర్చుకుంటాను పెదనాన్నా" అన్నాడు నారాయణ

" ఆ విషయం నువ్వు మాట్లాడకు . నీకు తండ్రి కంటే ముందు వాడు మా తమ్ముడు రా" అని అంటూ ఉంటె అతని కళ్ళు చెమ్మగిల్లాయి. 
 నేను మొన్ననే మురళి ని అమెరికా పంపడానికి అంతా ఊడ్చాను. అయినా, దొడ్డమ్మ గోల్డ్ పెట్టి కొంతా, కొంత స్నేహితుల దగ్గరా పోగేసి రెండు లక్షలు సేకరించగలను. హైదరాబాద్ పెదనాన్నలు ఇప్పుడు ఆదుకోవాలి. ముఖ్యంగా మన ప్రాబ్లెమ్ సాల్వ్ చేయవలసింది రాజారామ్ పెదనాన్నే.సరే నేను ఆలోచిస్తాను. నువ్వు ఆందోళన పడకు. లేటయింది పడుకో" అని లేచాడు  అర్జున రావు.

********

హైదరాబాద్ లో అన్నదమ్ములు  ఇద్దరూ అర్జునరావు ఫోన్ లో చెప్పిన విషయాలు భార్యలకు చెప్పారు. రామకృష్ణ భార్య కాత్యాయని    " రాఘవ అంత తెలివితక్కువ పని ఎలా చేశాడు?" అని ఊరుకుంది. రాజారామ్ భార్య నీలవేణి మాత్రం " ఈ రోజుల్లో రాఘవ లాంటి మూర్ఖుడు ఉన్నాడంటే నమ్మలేకుండా ఉన్నాను. కాగితం పత్రం లేకుండా, ఏ అవసరాలు వస్తాయో ఊహించకుండా అంత డబ్బు ఎలా ఇచ్చేశాడండీ" అని చాలా చిరాకు పడింది" .

అర్జున రావు అన్న లిద్దరికీ ఒక పెద్ద ఉత్తరం రాశాడు. ఇద్దరికీ వేరే వేరే రాసిన ఉత్తరాలని రాజారామ్, రామకృష్ణ లు  ఒకే మాటు అందుకున్నారు. అర్జునరావు రాసిన ఉత్తరం లో అన్నదమ్ముల చిన్నతనం అంతా కళ్ళకు కట్టినట్టు వివరించాడు.

భీమవరం దగ్గరగా ఉన్న వీవీరవాసరం లో వాళ్ళ చిన్నతనం అంతా  గడిచింది. అన్న దమ్ముల నలుగురి మధ్యా రెండేసి సంవత్సరాలు తప్ప పెద్ద వయసు వ్యత్యాసం లేదు. ఆఖరి వాడు రాఘవరావు మాత్రం అర్జున రావు కంటే నాలుగేళ్లు చిన్నవాడు . తండ్రి రమణయ్య తనకు ఉన్న నాలుగెకరాల మాగాణి, ఒక ఎకరం కొబ్బరి తోట తో, భార్య నాగరత్నం సహాయం తో జాగ్రత గానే నెట్టుకొచ్చేవాడు. అనుకోకుండా వచ్చే గాలివానలు పంటల్నినాశనం  చేసినప్పుడు మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నాగరత్నం పొదుపు గా నడపడం తో పిల్లలిని బాగానే సాకుతూ వచ్చాడు. అప్పుడప్పుడు రాఘవరావు ఆరోగ్యం ఆయాసం వచ్చి ఇబ్బంది పెట్టేది.  ఆ సమయం లో వాడు పడే అవస్థ చూసి తల్లి తండ్రులు తమ మిస్సహాయక స్థితి కి బాధ పడుతూ ఉండేవారు. ఎన్ని మందులు వాడినా తరుచు గా వచ్చే ఆ బాధని తప్పించలేక పోయేవారు. అందుకే వాడంటే ఇంట్లో అందరికీ ప్రత్యేక అభిమానం.

తల్లి ఏదయినా పిండి వంట చేస్తే, అందరికంటే వాడికి ఎక్కువ పెట్టి, ఆయాసం వస్తుంది కాబ్బట్టి, దాచుకుని మెల్లిగా తినమనేది. పాల కోవా అంటే పిల్లలు అందరికీ చాలా ఇష్టం. అది చేసి పిల్లలకి పెట్టినప్పుడు పెద్ద వాళ్ళు ముగ్గురూ గుటుకూ, గుటుకూ మని త్వరగా తినేసేవారు. ఆ తరువాత, అమ్మ చూడ కుండా ఒకళ్ళ తరువాత, ఒకరు రాఘవ దగ్గర చేరే వారు. కళ్ళు మూసుకుని  చెయ్ సాచి 'ఎవరు పెడతారో ఎవరు పెడతారో" అని రాఘవ్ ముందు కూర్చునేవారు. అలా ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వెళ్లి అడిగితె వాడు దాచుకున్నవన్నీ తాను తిన కుండానే వాళ్లకి పెట్టేసి వాడు. వాళ్ళు చిన్నప్పుడు ప్రతి ఏటా ఆత్రుత గా ఎదురు చూసేది సుబేహ్మణ్య సష్టి తీర్థం. వాళ్ళ ఇంటికి వెనక వీధిలో ఉన్న సుబ్రహ్మన్యేశ్వరుడి గుడి దగ్గర ప్రతి సంవత్సరం తీర్థం జరిపే వారు.

ఆ రోజు మాత్రం తెల్లవార గాట్లే లేచి, మరుగు మరుగు వేడి నీళ్లు స్నానం చేసి, తండ్రి తో గుళ్ళోకి వెళ్లేవారు. పిల్లలు మాత్రం సష్టి కి తమ తండ్రి ఇచ్చే డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో చాలా రోజుల  ముందు నుంచీ  ఊహించుకునే వారు. ముందే తండ్రి తో ఇంతకి  తక్కువ కాకుండా ఇవ్వాలని చెబుతూ ఉండేవారు. ఎప్పుడూ వాళ్ళు ఆశించేదానిలో సగం మాత్రమే రమణయ్య ఇవ్వ గలిగే వాడు. బంతి, చక్రాల తో లాగే కర్ర బండి, బుడగలు లాంటి వస్తువులు పెద్ద వాళ్ళు ముగ్గురూ కొనేవారు. రాఘవ మాత్రం అన్నీ చూసేవాడు కానీ ఏదీ కొనేవాడు కాదు. డబ్బులు దాచుకునేవాడు.

ఒక సంఘటన అందరి మనసులలోనూ ఎప్పుడూ నిలిచి పోయి ఉంటుంది. ఓకే రోజు పెద్ద వాడు రాజారామ్,వాడి నేహితులందరూ నినిమాకి వెడు తున్నారనీ తాను కూడా వెడతాననీ బాగా మారాం చేస్తున్నాడు. చిన్న మొత్తమయినా జేబు ఖాళీ గా ఉండటం తో కాస్త చిరాకు  పడ్డాడు రమణయ్య తరవాత వెడుదువు గానిలే అని సర్ది చెప్పబోయాడు. రాజారామ్ ఏడుపు లంకించుకున్నాడు. ఇంతలోకి రాఘవ తనకి తీర్థం కోసం ఇచ్చిన డబ్బులు దాచుకున్నవి తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. ఆ వేళ అందరూ మాటలేకుండా నిలబడి పోయారు. రమణయ్య వాడిని ఎత్తుకుని ముద్దు పేట్టేసు కున్నాడు.

ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నో కళ్ళకి కట్టినట్టు వివరించాడు అర్జున రావు తన ఉత్తరం లో . చివరన "వాడి కొడుకు ఇవ్వాళ  నిస్సహాయ స్థితి లో ఉంటె నాకు గుండె తరుక్కు పోయింది. మనం ముగ్గురం కలిసి వాడికి వైద్యం చేయించే ఖర్చు,  వాడు మనకి చిన్నప్పుడు ఇచ్చిన ఆనందం తో పోల్చుకుంటే విలువలో చాలా తక్కువ. మన అమ్మ నాన్న భౌతికంగా ఇవ్వాళ ఉంటె  మనం వాడికి వైద్యం చేయిస్తే ఎంత సంతోషిస్తారు? భౌతికం గా  లేక పోయినా మన మనసుల్లోఎప్పుడూ ఉన్నట్టే కదా.! నాకు సాధ్య మయినంత నేను ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా ఆలోచిస్తారని ఆసిస్తూ - అర్జు " అని ముగించాడు.

భార్య తో కలిసి చదివిన రామ కృష్ణ తో బాటు, భార్య కాత్యాయని  కూడా కళ్ళు తుడుచు కుంది. "మీరు ఎంత ఇవ్వగలరో చూసి మీ అన్నయ్యతో మాట్లాడండి. అవసరమయితే నా బంగారం అమ్మండి" అంది లేచి వెడుతూ.

ఆ ఉత్తరం  రాజారామ్  ఒక్క డే చదివి  కళ్ళు తుడుచుకుని ఆలోచన లో పడ్డాడు. అతని ఆర్ధిక వ్యవహారాలన్నీ భార్యే నీలవేణి చూస్తుంది. మిగతా వ్యాపార వ్యవహారాలు తాను చూసినా, డబ్బు అంతా  ఆవిడదే కంట్రోల్. తన పుట్టింటినుంచే అంతా వచ్చింది కాబట్టి ఆర్ధిక నిర్ణయాలు తానే తీసుకోవాలి అన్న భావం చాలా సందర్భాలలో ఆవిడ స్పష్టం చేసింది. అలా అని ఇలాటి సమయాలలో ఆమె వద్దన్నా నిర్ణయం తీసుకునే ధైర్యం చేయడని కాదు. కానీ ఎందుకో అతనికి అలా చేయడానికి మనసు ఒప్పదం లేదు. అవసరమయితే తనకి వ్యాపారం లో ఉన్న మిత్రుల సహాయం తీసుకుందామనుకున్నాడు. కానీ అతనికి ఓకే ఆశా రేఖ మనసులో మెదిలింది.

******

ముత్యాల వ్యాపారానికి సంబంధించిన ఆఫీసు నుంచి భోజనానికి ఇంటికి వచ్చిన రాజారామ్, హాలులో తన ప్రయాణాలకు వాడే సూట్ కేసు అదీ సద్ది, ట్రావెల్  కిట్ తో రెడీగా ఉండడం తో కొంచెం ఆశ్చర్య పడ్డాడు. ఇంతలోకే నీలవేణి లోపలినుంచి వచ్చి అయిందింటికే చెన్నై కి ఫ్లయిట్. భోజనం చేసి రెడీ అవండి. రామకృష్ణ కి కూడా ఫోన్ చేసి చెప్పాను . అతను కూడా వస్తాడు మీతో. అంది అతని కళ్ళల్లోకి చూడ కుండా
" ఉత్తరం చదివావా?" అన్నాడు ఆమె కేసి చూస్తూ. ప్రొద్దుటే క్రితం రోజు వాడిన షర్ట్ ఉతకడానికి తీసే ముందు జేబులు చూస్తుందని అతనికి తెలుసు. అదీ క్రితం రోజు అతని మనసులో మెదిలిన ఆశారేఖ. కానీ ఇంత ఆశించలేదు

" ఆ ఉత్తరం చదివిన తరువాత ఇది చేయక పోతే మన డబ్బు వ్యర్థం. మీరు అక్కడికి వెళ్లి మొత్తం ఎంత కావాలో ఫోన్ చేయండి. ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ చేయిస్తాను. దానికి నీ వాటా ఇంత అని మిగతా వాళ్ళని ఏమీ అడగ కండి. మనం భరించవచ్చు"  అతని కళ్ళలోంచి జారిన నీళ్లని చూసి ఆమె కూడా కళ్ళు తుడుచుకుంది.

********

చెన్నై లో ముగ్గురు అన్నదమ్ములు కలిసి నారాయణ కీ, రాఘవరావు కి  ధైర్యం చెప్పారు. తమ కిడ్నీ ఇవ్వడానికి ముగ్గురూ సిద్ధ పడ్డా ఎవరిదీ సూట్ అవలేదు. ఆఖరికి రాఘవరావు బ్లడ్ గ్రూప్ కి కావలసిన కిడ్నీ డోనర్ కోసం ప్రకటన ఇచ్చారు. నాలుగు రోజులకి నారాయణకి వరహాల రావు నుంచి ఫోన్ వచ్చింది. తనది అదే బ్లడ్ గ్రూప్ అనీ వెంఠనే బయలుదేరి వస్తున్నానని, తన కిడ్నీ ఇస్తానని చెప్పాడు. ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తున్న రమణి కి అన్నీ షేర్ చేశాడు నారాయణ.

మరిన్ని కథలు
mangalyam