Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.....http://www.gotelugu.com/issue252/681/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

(గత సంచిక తరువాయి).... ఆ ఫోన్‌ సంభాషణ అంతా చెప్పాడు.

‘‘కీర్తనతో ఓసారి మాట్లాడాలి. తనని తీసుకుని వెళ్ళక పోతే అటు నాన్నగారు?’’ దుఃఖంలో అశోక్‌ గొంతు పోయింది.

‘‘కీర్తనా....? తనకి పదింటికి మ్యాచ్‌....’’ అస్పష్టంగా అన్నాడు ఆకాష్‌.

‘‘ఈ సమయంలో మ్యాచ్‌ ఏంటి...?’’ అసహనంగా అన్నాడు అశోక్‌.

‘‘నేను మీ ఇంటికి వెళ్ళి, క్లూ ఏవన్నా దొరుకుతుందేమో ట్రై చేస్తాను. నువ్వు కీర్తన దగ్గరకి వెళ్ళి చెప్పు’’ ఆకాష్‌ అన్నాడు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ తోవ చీలి పోయారు.

అశోక్‌ ప్రణీత్‌ ఇంటికి వెళ్ళే సరికి ఇద్దరూ బ్రేక్‌ ఫాస్ట్‌ చేస్తున్నారు. గాభరా పెట్టకుండా చెప్పాలన్న ఆలోచన కూడా మర్చి పోయి గబ గబా విషయం చెప్పేశాడు అశోక్‌. వినగానే వూహించినట్లుగా కంగారు పడ లేదు, పైగా తాపీగా ‘‘నన్ను గేమ్‌ ఆడనివ్వకుండా చేయడానికి చివరికి నాన్న గార్ని అడ్డు పెట్టుకునే స్టేజికి దిగ జారి పోతావనుకోలేదు’’ అంది.

ప్రణీత్‌ నొచ్చుకున్నట్లు చూశాడు.....అతనికి అశోక్‌ మొహం చూస్తుంటే అబద్దం చెపుతున్నట్లు అనిపించ లేదు. కానీ ఈ సమయంలో ఈ ప్రాబ్లమ్‌ రావడం ఏంటి...? అచ్చం తనకి జరిగినట్లుగానే ఎటూ తేల్చుకో లేక పోతున్నాడు.

కీర్తన మనసు కుత కుతా ఉడుకుతోంది. అన్నయ్య, ఆకాష్‌. మణిబిందో, ఎవరైతేనేం తన లక్ష్యానికి అడుగడుగునా ఆటంకం కల్పిస్తూనే వున్నారు. కానీ మరీ ఇంతకి తెగించి నాన్న గార్ని కూడా ఇరికిస్తున్నారు. కానీ తను నమ్మదు. ఇదంతా వీళ్ళాడుతున్న డ్రామా....అంతే! నిశ్చయించుకోగానే....

‘‘స్టేడియంకి వెళ్ళి పోదాం’’ త్వర పడింది.

‘‘ప్లీజ్‌ బుజ్జీ! నాన్న గారి ప్రాణాల కన్నా నీకు ఆ ఆట ముఖ్యమా?’’ దీనంగా అడిగాడు.

‘‘నాన్న గారికి ఏం కాదు. నువ్వు ఇంక ఎక్కువ యాక్ట్‌ చేయ వద్దు’’ కఠినంగా అంది. బుస్సున పొంగిన కోపాన్ని బలవంతంగా ఆపుకున్నాడు. ప్రణీత్‌, కీర్తన కసి బైక్‌ మీద వెళ్ళి పోతుంటే అసహాయంగా చూస్తుండి పోయాడు.

******************

భుజం దగ్గర నిప్పు కణిక పెట్టి కాల్చినట్లు విపరీతమైన నొప్పి. అయినా డ్రైవ్‌ చేస్తూ ఆలోచిస్తున్నాడు ఆకాష్‌. అతని ఆలోచన చివర ఏదో ఆధారం దొరికినట్లయింది. తను అశోక్‌ ఆఫీసుకి వెళ్ళినపుడల్లా తామిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని ప్రయత్నించే శ్రీధర్‌ గుర్తొచ్చాడు.

అనుమానం కలిగి అశోక్‌ ఆఫీస్‌ వైపు కారు పోనిచ్చాడు. వెళ్ళ గానే ఆఫీసు అంతా ప్రశాంతంగా వుంది. ఇంకా వర్కర్స్‌ ఎవరూ రాలేదు. శ్రీధర్‌ మాత్రం ఎప్పుడూ వుండే అవుట్‌ హౌస్‌లో హడావిడిగా వెళుతూ కన్పించాడు. వెనకనే వెళ్ళాడు ఆకాష్‌. వెళ్ళగానే చప్పుడు కాకుండా మెయిన్‌ డోర్‌ వేసేశాడు. నిజానికి ఆకాష్‌ కి శ్రీధర్‌ గురించి ఏమీ తెలీదు. గాల్లో బాణం విసిరి చూడాలనుకున్నాడంతే! చిన్నగా వినిపించిన చప్పుడుకే వెనక్కి తిరిగి చూశాడు శ్రీధర్‌. ఎదురుగా గుమ్మం పొడవునా ఆకాష్‌.

అతని మైండ్‌ ఆ విషయాన్ని డైజెస్ట్‌ చేసుకునే లోపే ఆకాష్‌ విసురుగా వెళ్ళి అతని చెంప ఫెడీల్మనిపించాడు. అతను నోరు తెరవ బోతుంటే పిడికిలి బిగించి మూతి మీద గుద్దాడు. ఆపకుండా రెండు నిమిషాలు బాదాక, తాపీగా చెయ్యి వూదుకుంటూ కుర్చీలో కూర్చుని ‘‘మొహం కడుక్కో! బైల్దేరి వెళ్దాం’’ చెప్పాడు. కళ్ళలో విపరీతమైన టెర్రర్‌ కన్పిస్తుండగా....

‘‘ఎక్కడికీ?’’ కీచుగా అరిచాడు.

‘‘భూపతి గార్ని దాచిన చోటుకి.’’

‘‘తెలిసి పోయిందా?’’ చటుక్కున నోరు జారాడు. ఇక వదల లేదు ఆకాష్‌. లేచి మళ్ళీ ఓ రౌండ్‌ ఫుట్‌ బాల్‌ ఆడి, షర్ట్‌ కాలర్‌ పట్టుకుని లేపి

‘‘పద’’ అంటూ తీసుకు వెళ్ళి కారులో కూలేశాడు.

*************

మహా రాష్ట్ర జట్టు, ఆంధ్రా జట్టు స్టేడియంకి చేరుకున్నాయి. ప్రేక్షకుల సంఖ్య వూహించిన దాని కన్నా ఎక్కువే వుంది. ముఖ్యంగా మణిబిందు, కీర్తన టీమ్స్‌, రెండూ ఒకే కాలేజిలో చదువుతూండటం మూలంగా కాలేజి అంతా అక్కడే వాలి పోయింది. బరిలో దిగేముందు.....‘‘మనసులో టెన్షన్‌ ఏమీ లేవుగా’’ ప్రణీత్‌ అడిగాడు.

‘‘వూహూ!’’ ధీమాగా తల ఆడించింది. రెండు జట్టులూ కోర్టులో దిగాయి.

టాస్‌ గెలిచిన మణి బిందు సర్వీస్‌ ఎంచుకుంది. ఆ సమయంలో ఆమె కీర్తన వైపు చూసి నవ్వింది. ఆ నవ్వులో స్నేహం తప్ప హేళన లేదు. కానీ కీర్తన అదేమీ గుర్తించే స్టేజ్‌లో లేదు.

ఆట ప్రారంభమయింది. ఇరు జట్లు హోరా హోరీగా ఆడుతున్నాయి. బెస్టాఫ్‌ త్రీ గేమ్‌. మొదటి గేమ్‌ ఆంధ్రా టీమ్‌ 15`12తో గెలిచింది. రెండో గేమ్‌ మహా రాష్ట్ర టీమ్‌ 16`14తో గెలిచింది. ఇక మూడో గేమ్‌ రసవత్తరంగా నెక్‌ టూ నెక్‌ వెళుతోంది. చూసే వాళ్ళందరికీ ఒక చక్కని ఆట చూస్తున్నామన్న అనుభూతి కలుగుతోంది.....స్టేడియం అంతా కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనిస్తోంది.

***************

ఆకాష్‌ సరా సరి శ్రీధర్‌ని పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్ళాడు. అక్కడి ఎస్‌.ఐ. వాళ్ళంతా తెలిసిన వాళ్ళే! నిమిషాల మీద శ్రీధర్‌ నుంచి నిజం కక్కించారు.

ఈ కిడ్నాప్‌ వ్యవహారం ఎప్పటి నుంచో ప్లాన్‌ చేస్తున్నారు....అందులో భాగంగా ఇక్కడ శ్రీధర్‌ జాయినయ్యాడు. ఆ ఇంట్లో కిడ్నాప్‌ చేయడానికి తగిన సమయాన్ని గుర్తించి తెలియ జెప్పడం వాళ్ళ ఉద్దేశం.

ఇదంతా మృదులా దేవి, జగన్నాధం చేశారని తెలిసి విభ్రమ చెందాడు ఆకాష్‌! భూపతి, కీర్తన చేత బలవంతంగా సంతకాలు పెట్టించి రిజిస్టార్‌ని మేపి ఆ ఆస్తి కొట్టేయాని పథకం.

భూపతిని మేడ్చర్ల ప్రాంతంలో ఓ ఇంట్లో బంధించి వుంచారని తెలిసింది.

వెంటనే పోలీసుల్ని ఎలర్ట్‌ చేశాడు ఆకాష్‌. వాళ్ళతో పాటు తనూ బయల్దేరాడు.

*****************

ఆడే వాళ్ళకీ, చూస్తున్న వాళ్ళకీ బి.పి. రేజయ్యేలా ఆట 13`13లో వుంది. అప్పుడు సర్వీస్‌ ఆంధ్రాకి వచ్చింది. కీర్తన లెఫ్ట్‌ స్సైకర్‌.
ఒక అమ్మాయి సర్వీస్‌ చేసింది. బాల్‌ ప్రచండ వేగంతో దూసుకుని వెళ్ళింది. సెంటర్‌లో వున్న మణి బిందు నేల బారుగా పడి పోయి ఆఖరి నిమిషంలో లిఫ్ట్‌ చేసింది. చప్పట్లు హోరుగా మోగాయి. నేల మీద వాలి పోతున్న బంతిని అంత ఒడుపుగా లిఫ్టు చేయటం నిజంగా గ్రేట్‌ ! కాని మణి దురదృష్టం...ఆ బంతి ఎదుటి కోర్టు లెఫ్టు స్పైకర్‌ కీర్తన వైపు కొంచెం ఎత్తులో అనువుగా వచ్చింది.

అంతే! బూస్టర్‌ కోసం కూడా చూడాల్సిన అవసరం లేకుండా మళ్ళీ బిందుకే స్మాష్‌ కొట్టింది. కిందికి వాలిన మనిషి లేచి పొజిషన్‌ చూసుకునే లోపే బంతి నేలని తాకింది.

మళ్ళీ సముద్ర ఘోషలా హర్ష ధ్వానాలు. స్కోరు 14`13. సర్వీస్‌ ఆంధ్రా జట్టుదే! గేమ్‌ పాయింట్‌, మాచ్‌ పాయింట్‌ కావడంతో అందరూ ఊపిరి బిగ బట్టారు.

ఆ అమ్మాయి సర్వీస్‌ చేసింది. మణి బిందు లిఫ్ట్‌ చేసింది. రెండు పాస్‌ తర్వాత బంతి ఇటు వైపుకీ, అటు వైపుకీ మొత్తం నాలుగు సార్లు బంతి కోర్టు మారుతుందే గానీ, ఎవరికీ పాయింట్‌ రాలేదు. అప్పుడు గమనించింది కీర్తన. ఎదుటి కోర్టులో రైట్‌ స్పైకర్‌ వుండాల్సిన పొజిషన్‌ కన్నా కాస్త వెనగ్గా వుండటం.

అంతే......తన వైపుకి దూసుకొస్తున్న బాల్‌ ని జస్ట్‌ అలవోకగా తాకింది. ఆ బంతి నెట్‌కి నాలుగు అంగుళాల దూరంలో నేల మీదకి జారి పోతుండగా ఆఖరి నిమిషంలో గమనించి అవతలి కోర్టు రైట్‌ స్పైకర్‌, నేలకి సమాంతరంగా గాల్లోకి లేచింది. కానీ ఆ ప్రయత్నం వృధా అయి బంతి నేలను తాకింది. స్కోరు 15`13.

ఆంధ్రా జట్టుని విజయ లక్ష్మి వరించింది. ప్రతిష్టాత్మకమైన నేషనల్‌ కప్‌ వాళ్ళ వశమయింది. వాళ్ళ జీవిత లక్ష్యం నెర వేరింది. టీం అంతా చేరి పరస్పర ఆనందాన్ని పంచుకున్నారు. గెలవ గానే మొదట కీర్తన ప్రణీత్‌ వైపే చూసింది.

అప్పటికే అతను కోర్టులోకి పరుగెత్తుకుని వచ్చేశాడు. మిగతా వాళ్ళని అభినందిస్తూ ఎందుకో తల తిప్పి చూడగానే మణిబిందు తదేకంగా తన వంకే చూస్తూ కనిపించింది.

నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ‘‘నిజం చెప్పండి, ఇపుడు జెలసీ గా, గుండె మండి పోతున్నట్లుగా, ఏడుపొస్తున్నట్లుగా వుందా?’’ అడిగాడు.
‘‘లేదు....అదే ఆశ్చర్యంగా వుంది. అంతేకాక 13`13లో స్కోరు వున్నపుడు నేను బాల్‌ లిఫ్టు చేశాను. నాకే తెలుస్తోంది. చాలా బాగా ఆడాను. అదే గుర్తొచ్చి సంతృప్తిగా వుంది’’ చెప్పింది.

‘‘వెరీ గుడ్‌! కీపిటప్‌! మంచి ఫ్యూచర్‌ వుంది.’’

‘‘మరి ఏం ఆలోచించారు?’’

‘‘ఏ విషయం?’’ అర్ధం కాక అడిగాడు.

‘‘నా గేమ్‌కే కాదు.....నా లైఫ్‌కే కోచ్‌గా వుండే విషయం?’’ కొత్త మాటని చేర్చి అంది. విభ్రమంగా చూశాడు. బాగా ఆలోచించుకోండి....చాలా టైం వుందిగా!’’ నవ్వుకుంటూ వెళ్ళి పోతున్న బిందుని చూసి అతని మొహం మీద నవ్వులు విరబూశాయి. కప్‌ ని టీంకి ప్రెజెంట్‌ చేశారు. అంతే కాక ఇండివిడ్యువల్‌గా కూడా మెమెంటోస్‌ ఇచ్చారు. అది తీసుకుని ఆదరా బాదరాగా ఇంటికి బయలు దేరింది కీర్తన.

***********

రమేష్‌ చెప్పిన ప్రకారం ఆకాష్‌, శ్రీధర్‌ మఫ్టీలోవున్న పోలీసు మేడ్చెర్ల లోని భూపతిని బంధించిన ఇంటికి చేరుకున్నారు.
ముందు శ్రీధర్‌ని అడ్డం పెట్టి వెనక వీళ్ళు బయలు దేరారు. కాని కాపలాగా వున్న మనుషులకి శ్రీధర్‌ మొహం లోని భయం చూసి అనుమానం వచ్చి లోపలి వాళ్ళని హెచ్చరించారు.

లోప మృదులా దేవి, జగన్నాధం, అతని తమ్ముడు, ఇంకో నలుగురు మనుషులు వున్నారు.

ఇచ్చిన గడువు పూర్తవడంతో అప్పటికే భూపతిని నానా హింసలూ పెట్టినట్లున్నారు. అతని శరీరం రక్తం ఓడుతోంది.  కాపలా మనిషి హెచ్చరికని విని కత్తులూ కటార్లు రడీ చేసుకుంటుండగానే పోలీసు పిస్టల్స్‌కి పని చెప్పారు. గాల్లో కాల్పులకేకే బెదిరారు వాళ్ళు. వాళ్ళెవరూ పెద్ద ప్రొఫెషనల్స్‌ కాదు. అందుకే ఈజీగా లొంగి పోయారు. వాళ్ళని పోలీస్‌ స్టేషన్‌కి పంపించి, భూపతిని హాస్పిటల్‌లో చేర్పించి, అశోక్‌కి ఫోన్‌ చేశాడు ఆకాష్‌.

******************

బెరుగ్గా ఇంట్లో అడుగు పెట్టింది కీర్తన.

ఎదురుగా సోఫాలో అశోక్‌ ఖిన్న వదనంతో....

‘‘అన్నయ్యా! నేను గెలిచాను’’ గంభీరంగా అంది.

‘‘లేదు..... ఓడి పోయావు.....నాన్న  గారిని నిజం గానే ఎవరో కిడ్నాప్‌ చేశారు’’ నమ్మమన్నట్లు చెప్పాడు. షాక్‌ తిన్నట్లు చూసింది. ఆ తర్వాత పట్టరాని కోపంతో ‘‘ఇదంతా ఆకాష్‌ నా మీద పంతం కట్టి’’ కీర్తన ఏదో అనబోతుండగా అశోక్‌ విసురుగా లేచి నిబడి.......
‘‘స్టాపిట్‌!.......అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు....అసలు నీ వెంట పడాల్సిన అవసరం అతనికేంటి? అంత స్టేటస్‌ వున్న వాడు కో అంటే కోటి మంది వస్తారు. ఏదో చిన్న నాటి నుండి స్నేహితుడిని కదాని నా కోరిక మీద నిన్ను పెళ్ళి చేసుకోవడం కోసం ఇన్ని అబద్దాలాడాడు’’ ఆవేశంగా అన్నాడు.

‘‘ఎందుకు?’’ కలలో లాగా అడిగింది.‘‘ఎందుకంటే ఆ వాలీ బాల్‌ పిచ్చిలో పడి మనుష్యులనీ అనురాగాల్ని మర్చి పోతున్నావు. నీ జీవితం మోడు కాకూడదని తలపించాను. ముందు నా మాట మీద నిన్ను పెళ్ళి చేసుకోడానికి యిష్ట పడినా, తర్వాత ఆకాష్‌ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు.

లక్ష్యం వుండటం మంచిదే!....కానీ దాంతో పాటు జీవితాన్ని కూడా ఆహ్లాద భరితంగా జీవించాలి. ఏం చేసినా నీ కోసమే చేస్తే, నువ్వు మా ఇద్దరి గురించి నీ ఇష్టం వచ్చినట్లుగా అంచనా వేసుకున్నావు. నిన్ను ఎంకరేజ్‌ చేస్తూ మార్చుకోవాలని అనుకోక పోవడమే మా తప్పు....నువ్వు బాధ పడ్డావు....మమ్మల్ని బాధ పెట్టావు. చివరికి నాన్న గారు....’’ అతనికి మాట లేదు. ఈ లోపే ఆకాష్‌ ఫోన్‌లో వివరాలన్నీ చెప్పాక అశోక్‌ మనసు తేలికయింది.

‘‘పద డాడీ దగ్గరకు వెళదాం’’ హడావిడిగా లేచాడు. తోవలో ఆకాష్‌తో సెల్‌లో మాట్లాడుతూనే వున్నాడు.

‘‘నిజంగా నీలాంటి స్నేహితుడు దొరికినందుకు....’’ అతని మాట పూర్తి చేయ లేక పోయాడు.

ఆకాష్‌ వ్యక్తిత్వం తెలిసి మరింత కుంచించుకు పోయింది కీర్తన. తండ్రికి తనేం చేయ లేక పోయింది. చివరికి ఆకాష్‌ తెగించి వెళ్ళి, తండ్రిని కాపాడాడు. హాస్పిటల్‌కి వెళ్ళగానే ఆకాష్‌ ఎదురై ఏం ఫర్లేదన్నట్లు అశోక్‌ భుజాల చుట్టూ చేతులు వేసి ఓదార్చాడు.

భూపతికి అక్కడక్కడ గాయాలయినా రెండు మూడు రోజుల్లో తగ్గి పోతాయని చెప్పారు. భూపతిని డిస్టర్బ్‌ చెయ్యొద్దని విజిటర్స్‌ని పంపించేశారు. అశోక్‌ని వుండనిచ్చారు. కీర్తనని ఇంటి దగ్గర డ్రాప్‌ చేయమని అశోక్‌ చెప్పాడు. అశోక్‌ అక్కడ వుండగానే కీర్తన ఆకాష్‌తో తను కప్‌ గెలిచినట్లు చెప్పింది.

‘‘కంగ్రాట్స్‌’’ ముభావంగా అన్నాడు.

‘‘యిక ముహూర్తాలే తరువాయి’’ అశోక్‌ ఆనందంగా అన్నాడు.

‘‘ఎందుకు?....మీ పందెం ప్రకారం ఓడి పోయిన నేను మళ్ళీ కీర్తన మొహం చూడ కూడదు. అందుకే చూడను’’ వడివడిగా నడుస్తూ వెళ్ళిపోతుంటే అశోక్‌, కీర్తన లిద్దరూ బిక్కమొహాలు వేసుకుని చూశారు.

****************

వారం రోజుల నుంచీ తిండి తినబుద్ది కాదు. కంటి నిండా నిద్ర రాదు. ఆకాష్‌ ఆరోజు హాస్పిటల్‌ నుంచి వెళ్ళి పోయాక మళ్ళీ కన్పించ లేదు. భూపతిని ఇంటికి తెచ్చేశారు. ఆ రోజు కాలేజి నుంచి ఫోన్‌ రావడంతో తప్పని సరయి బయలు దేరింది కీర్తన. బస్టాప్‌లో నిల్చుంది. పక్కనే వాళ్ళ కాలనీ లో తెలిసిన అమ్మాయి నిల్చుంది.

‘‘కీర్తనా! నీకో విషయం చెప్పనా?’’

‘‘ఏంటీ?’’

‘‘మన ఎదురుగా బస్టాప్‌లో ఓ హాండ్‌ సమ్‌ నిల్చున్నాడు. చూడూ! వారం నుంచీ ఇదే టైమ్‌కి కారులో రావడం, ఓ గంట ఎదురు చూపు చూసి భారంగా వెళ్ళి పోవడం, పాపం ఏ అమ్మాయి కోసమో! ఆ అమ్మాయి వస్తే బావుండును’’ బాధగా అంది.

ఎదురుగా చూసిన కీర్తనకి సంభ్రమంతో మాట రాలేదు. ఆకాష్‌ బస్టాప్‌లో నిలబడి తనకే సైట్‌ కొడుతున్నాడు. చిరునవ్వుతో పెదవులు విప్పారాయి. మళ్ళీ ప్రేమిస్తానని చెప్పింది కదాని ఇలా ట్రై చేస్తున్నాడా?

వాళ్ళిద్దరి వైపూ అనుమానంగా చూస్తోంది ఆ అమ్మాయి. ఆకాష్‌ నడుస్తూ వీళ్ళ వైపు వచ్చి...

‘‘మిస్‌!....మీ పేరు?’’ కీర్తనతో అన్నాడు.

‘‘నా పేరు కీర్తన. ఆల్రెడీ ఆకాష్‌ అనే అబ్బాయితో ప్రేమలో పడ్డాను. ఇక నాకు సైట్‌ కొట్టొద్దు’’ నవ్వాపుకుంటూ అంది.

‘‘సారీ! ఆకాష్‌కి మీరు ఇష్టం లేదు. కాబట్టి నన్నే ప్రేమించక తప్పదు.’’

‘‘నో!....ఆకాష్‌ నన్ను ప్రేమించేలా చేసుకుంటాను’’ పట్టుదలగా అంది కీర్తన.

ఆ అమ్మాయి అటూ యిటూ తల తిప్పి అయోమయంగా చూస్తోంది.

‘‘బెట్‌! అతను మిమ్మల్ని ప్రేమించడు. నన్ను ప్రేమించండి.’’

‘‘ఓ.కె.....బెట్‌....అతని తోనే మీకు చెప్పిస్తాను.’’

‘‘సరే!’’ తలూపుతూ వెళ్ళి పోయాడు ఆకాష్‌.

మళ్ళీ పందెం ప్రారంభమయింది.

` : శుభం : `

 

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi?