Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> జ్ఞాపకాలు

jnaapakaalu

ఆల్ ఇండియా రేడియోలో స్టేషను డైరక్టరుగా వుద్యోగం చేసి పదవి విరమణ పొందిన పురుషోత్తమరావుకి ఇప్పుడు వయస్సు ఎనభై అయిదేళ్ళు. ప్రొగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా తన ప్రస్థానం సాగించి పలు రేడియో స్టేషన్లలో రకరకాల కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టి తన పటిమను చాటుకొంటూ విధులను నిర్వర్తించి వేల కొద్ది శ్రోతల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని పొందారు. అంచలంచలుగా ఎదుగుతూ డైరక్టరుగాచేసి పదవి విరమణ పొందిన తను ఇప్పుడు పల్లెటూరిలో తండ్రి తనకు ఆస్తిగా ఇచ్చిన పెద్ద పెంకుటింటిలో నిశ్చింత జీవితాన్ని గడుపు తున్నాడు.

ఆయనకు ఓ కొడుకూ, కూతురు. ఇద్దరు పిల్లలు ఇండియాలో ఇంజినీరింగ్ పూర్తి చేసి పై చదువులకు అమెరికాకు వెళ్ళి ఆ చదువులు పూర్తవుతూనే అక్కడే వుద్యోగాలు సంపాయించుకొన్నారు. ఇండియాకు రామని తెగేసి చెప్పిన కొడుకూ, కూతురికి అక్కడే అమెరికాలో సెటలై పోయిన వాళ్ళ బంధుగణంలో సంబంధాలు చూసి పెళ్ళి చేసి పెట్టారు పురుషోత్తమరావు దంపతులు.ఇప్పుడు ఆ కొడుకూ కూతురి పిల్లలు కూడా డాక్టర్లని, ఇంజినీర్లని పెద్ద చదువులు చదివి వాళ్ళూ అక్కడే వుద్యోగాలు చేస్తూ వున్నారు. అందువల్ల వేరు గత్యంతరంలేక పురుషోత్తమరావుదంపతులు రేండేళ్ళకొకసారి అమెరికాకు వెళ్ళి కూతురు,కొడుకు,మనవలు, మనవరాళ్ళతో కొన్నాళ్ళపాటు వుండి తిరిగి ఇండియాకు వస్తుంటారు. ఈ మధ్య కాలంలో అలా అమెరికాకి వెళ్ళడంకూడా వయస్సు భారం వల్ల తగ్గించుకున్నారు.

ముసలాళ్ళిద్దరికి వయస్సు భారమనేకాని ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగానే వున్నారు.కాకపోతే పురుషోత్తమరావుని మంచంమీద నుంచి మెల్లగా ఒకరు లేపి బాత్ రూంకు తీసుకువెళ్ళాలి.భోజనాలవేళప్పుడు కూడా ఆ పనే చెయ్యాలి. అందుకోసం నమ్మకమైన ఓ పనిమనిషిని ఇంట్లోనే వుంచుకున్నారు.ఆ వృధ్ధ దంపతులకు అన్నీ ఆ పనిమనిషే !

పురుషోత్తమరావుగారి పెంకుటిల్లు రెండు గ్రౌండ్ల స్థలంలో మధ్యనుంటుంది. అది పెంకుటిల్లయినా చాలా అందంగా వుంటుంది. ఇంటికి పెరటి వేపులో కొబ్బరి, మామిడి, అరటి,జామచెట్లు ఇంకా రకరకాల పూల మొక్కలతో పచ్చగా వుంటుందెప్పుడు. అదే విధంగా ఇంటికి ముందు భాగాన కూడా ప్రహరి గోడకు ఆనించినట్లు బంతి, మల్లె, గులాబి, సన్నజాజి పూలమొక్కలతోఅహ్లాదకరంగా వుండి అందరిని ఆకర్షించే విధంగా కనబడుంది.పని మనిషి సహాయంతో ఆ ఇంటని పురుషోత్తమరావే పరామర్శిస్తుంటారు.. ఆయనకు అదో హాబి.తనకు తల్లిదండ్రుల ద్వారా ఆస్తిగా వచ్చిన ఆ ఇంటికి అప్పుడప్పుడు సున్నాలు వేయించడం తప్ప ఓ చిన్నఆల్టరేషన్ కూడా చేయలేదు పురుషోత్తమరావు. నిజం చెప్పాలంటే తనకున్న ఆర్థిక స్థోమతుకు ఇంటిని డిమాలిష్ చేసి కొత్తగా,అందంగా,మాడరన్ గా కట్టుకోవచ్చు. కాని ఆపని చేయలేదాయన.తల్లితండ్రులగుర్తుగా అలాగే వుంచేసుకొన్నాడు.

ఆ రోజు పురుషోత్తమరావు ఉదయం టిఫన్ తిన్న తరువాత ఇంటి వసారాలో వాలు కుర్చిలో కూర్చొని పూలమొక్కలను,రోడ్డుమీద వెళుతున్నజనాన్ని,వాహనాలనుచూస్తూ వున్నాడు. అప్పుడు కేంద్రప్రభుత్వం ఆధీనంలోని ఆల్ ఇండియా రేడియో జీబొకటి వచ్చి ఇంటిముందాగింది.జీబులోనుంచి తను స్టేషను డైరక్టరుగా చేస్తున్నప్పుడు ప్రొగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా వచ్చి చేరిన దయాకరరావు దిగాడు. కాంపౌండు వాల్ గేటు తీసుకొని లోనికి వచ్చాడు,

"నమస్తే సార్ !"పురుషోత్తమరావుకు దగ్గరగా వెళ్ళి అన్నాడు దయాకరరావు,

"నమస్తే !మీరూ...."అతన్ని పోల్చుకోలేక చేతిని నొసలు మీదుంచుకొని అతని ముఖంలోకి చూస్తూ అడిగాడు పురుషోత్తమరావు,

"నేనే సార్ !దయాకరరావుని. మీరు మరో ఆరు నెలల్లో పదవి విరమణ పొందుతారనగా ప్రొగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా మన స్టేషనులో జాయినయ్యాను. మీ వద్ద కాస్తో కూస్తో పని నేర్చుకున్నాను “చెప్పుకున్నాడు దయాకరరావు,

"ఏమో! నాకు పెద్దగా గుర్తుకు రావడంలేదు.లోనికి రండి “అని లేవబోయాడు పురుషోత్తమరావు.ఆయన లేవడానికి ఇబ్బంది పడుతోంది గ్రహించిన దయాకరరావు లేపి రెట్ట పట్టుకొని లోనికి నడిపించి సోఫామీద కూర్చొబెట్టి తనూ కూర్చొన్నాడు.

అంతలో రెండు ప్లేట్లలో పిండి వంటలు తెచ్చి టీపాయిమిదుంచింది పురుషోత్తమరావుగారి శ్రీమతి. వెంటనే లేచి ఆమెకు నమస్కరించాడు దయాకరరావు.ఆమెకూడానమస్కరించి వంటగదిలోకి వెళ్ళి పోయింది.

"అంటే దాదాపు ఇరవై అయిదేళ్ళ క్రితం నాటి మాటన్న మాట.మంచిది.ఇప్పుడు మీరేమిటిగా వున్నారయ్యా!"

"అసిస్టంటు డైరక్టరుగా వున్నాను సార్ !".

"మంచిది. ఏమిటి సంగతి?"

"ఏమి లేదు సార్ !మనం ప్రతి ఏటా జరుపుకొంటున్నట్టు ఈ సంవత్సరంకూడా ఉగాది వేడుకలను భారి ఎత్తున జరపాలని నిశ్చయించాం. అందులో భాగంగా ఈ సంవత్సరం మిమ్మల్నిసన్మానించాలనికూడా నిర్ణయించుకున్నాం. దయతో తమరు కాదనకుండా మా ఆహ్వానాన్ని మన్నించి రావాలనికొరుతున్నాం"సంతోషంతో చెప్పాడు దయాకరరావు. కారణం పురుషోత్తమరావుని సన్మానించాలన్న ప్రతిపాదనను మొదటగా కమిటి ముందుంచింది తనే!.

పురుషోత్తమరావు ఒక్క నిముషం ఆలోచించి "ఓకే! ఇరవై అయిదేళ్ళ తరువాత నన్ను గుర్తుంచుకొని, గుర్తించి సన్మానించాలనుకున్నందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను .తప్పకుండా వస్తానయ్యా! కారణం నేను పదవి విరమణ పొందినా మన రేడియో స్టేషనుతో నాకేదో అవినాభావ సంబంధముందన్నట్లు ఫీలవుతుంటాను" అని అంటుండగా ఆయన శ్రీమతి కాఫీ తెచ్చి టీపాయిమీదుంచింది.దయాకరరావు కాఫీ తాగి మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు.

జీబులో కూర్చొన్నాడు. జీబు వెళుతోంది. దయాకరరావు ఆలోచనలు ముఫ్ఫై ఏళ్ళు వెనక్కు వెళ్ళాయి---

"నమస్తే సార్ !నా పేరు దయాకరరావు. ప్రొగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా కడప నుంచి బదిలి మీదొచ్చాను."

"ఓఁ...కూర్చొండి దయాకరరావుగారూ! “అని రెండు ఫైళ్ళలో సంతకాలు పెట్టి అవుట్ ట్రేలో వేసి “ఏ వూరు మీది?" అడిగాడు పురుషోత్తమరావు.

"కడపే సార్ !"

"అంటే గత సంవత్సరం సెలక్షన్ జరిగిందే ఆ బ్యాట్చివాడవన్నమాట.ఈ వూరిభాష రాదు కదూ!?"

"అవును సార్ !"

"పర్వాలేదు.నేనున్నానుగా!నేనిక్కడికి వచ్చినప్పుడు నాకూ ఈ తమిళ భాష రాక కాస్త ఇబ్బంది పడ్డాను. క్రమేపి అడ్జస్టయి ఆ భాషను కూడా నేర్చుకున్నాను. అలాగే మీరూ అవుతారని నా నమ్మకం. ఇక వృత్తిరీత్యా మీకెలాంటి సందే హాలొచ్చినా నన్ను సంప్రదించండి" అంటూ కాలింగ్ బెల్ నొక్కాడు. లోనికొచ్చిన అటెండరుతో”వీరినితీసుకెళ్ళీ తెలుగు సెక్షన్ లో వున్న ఎనౌంసర్కు పరిచయం చేసి ప్రొగ్రామ్ ఎగ్జిక్యూటివ్ సీట్లో కూర్చోపెట్టమని చెప్పు. మీరు అతనితో వెళ్ళండి. తతిమ్మా సెక్షన్ల వాళ్ళను మీటింగులో పరిచయం చెస్తానులే"అన్నాడు పురుషోత్తమరావు,

నాడు పురుషోత్తమరావు తనకు కల్పించిన భరోసాతోనే చక్కగా తన వుద్యోగధర్మాన్ని సాగిస్తూ ప్రస్తుతం అసిస్టంటు డైరక్టరుగా విధులను నిర్వర్తిస్తున్నాడు దయాకరరావు.తనఎదుగుదలకు అన్ని విధాల సహకరించిన మాజీ స్టేషను డైరక్టరును ఉగాది రోజున సన్మానించటం తన కర్తవ్యంగా భావించి మనసులోనే ఆనందపడి పోయాడు దయాకరరావు——

జీబు రేడియో స్టేషనులో ఆగింది. దయాకరరావు వెళ్ళి తన సీట్లో కూర్చొని సంబంధిత అధికారులను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి ఉగాది వేడుకలకు కావలసిన పూర్తి కార్య క్రమానికి ఏర్పాట్లు చేయమని పురమాయించాడు.

*****.

ఆ రోజు ఉగాదిపర్వదినం.ఆల్ ఇండియా రేడియో స్టేషను ప్రాంగణం రంగురంగుల లైట్లతో, ముంగిట ముగ్గులతో, మావిడి తోరణాలతో అచ్చమైన తెలుగుదనం వుట్టి పడుతూ అందంగా ముస్తాబైన  పెళ్ళికూతులిలా దేదీప్యమానంగా వెలిగి పోతోంది. బయట వాకిట్లో సుస్వాగతం అన్న బేనరుతోపాటు నాటి కధానాయకుడు, సన్మాన గ్రహిత పురుషోత్తమరావుకి స్వాగతం పలుకుతున్నట్టు ఆయన ఛాయా చిత్రంతో తెలుగు,తమిళం,ఆంగ్ల భాషల్లో రాసిన కార్యక్రమ సరలితో మరో మూడు బేనర్లు గుమ్మాల ముందుంచారు.

ఆరు గంటలకే హాలు మొత్తం నిండి పోయింది. కొందరు సీట్లు లేక బయట నిలబడి వున్నారు, కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా కొన్ని సాంస్క్రతిక కార్యక్రమాలు జరిగాయి. గంట తరువాత కాఫీకని బ్రేకిచ్చారు. స్టేషను వారే కాఫీతో పాటు అల్పాహారాన్నీ ఏర్పాటు చేశారు కనుక అందరూ వెళ్ళి అల్పాహారాన్ని సేవించి కాఫీ తాగొచ్చి వాళ్ళ సీట్లలో ఆశీనులైయ్యారు. ఈలోపు పురుషోత్తమరావు దంపతులను వేదికనలంకరింజేశారు దయాకరరావు,

స్వాగతం పలుకులు అయిన తరువాత సభాధ్యక్షులు మాట్లాడారు. తదనంతరం స్టేషను డైరక్టరు తమిళుడైనందున ఆంగ్లంలో మాట్లాడి పురుషోత్తమరావు దంపతులను దండలతో దుశ్సాలువులతో సన్మానించి, జ్ఞాపికలను అందజేసి కూర్చొన్నాడు. తదుపరి అసిస్టెంటు డైరక్టరు దయాకరరావు మైకు ముందుకొచ్చాడు.     

"ఆహుతులకు నమస్కారం! సహజంగా వున్నత పధవులనధిరోహించి పదవి విరమణ పొంది వెళ్ళిపోయిన తరువాత వాళ్ళను పట్టించుకునే వారుండరు. ఒకవేళ వాళ్ళను ఎక్కడైనా చూసినా చూడనట్టు వెళ్ళిపోతారు.కానీ...మనకు స్టేషను డైరక్టరుగా చేసి పదవి విరమణ పొంది వెళ్ళి పోయిన గౌరవనీయులు పురుషోత్తమరావు గారిని అంత సులువుగా మనం మరచి పోలేక పోతున్నాం. కారణం వారు మన రేడియో స్టేషను ద్వారా శ్రోతలకు ఎన్నో కొత్త కార్యక్రమాలను అందించారు. అదే విధంగా మాకు...అంటే మా రేడియో స్టాపుకు ఎన్నో సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి వాటిని అమలుపరచి అవి అందరూ అనుభవించేలా చేశారు. హోదాలతో పని లేకుండా అందరిని అక్కున చేర్చుకొని ప్రేమని పంచి మంచిని పెంచి ముందుకు నడిపించారు.ఉధాహరణకు ఇక్కడున్న కొందరు క్రింది తరగతి వుద్యోగులు పనికి క్రమంగా రాకుండా చెడు వ్యసనాలకు లోనై పాడై పోతున్న సమయంలో వారిని దగ్గరకు తీసుకొని కౌన్సులింగ్ చేసి ఆ వ్యసనాలనుంచి మళ్ళించి ఆర్థిక సహాయం చెసేవారు.ఇంకా వారి కుటుంబాలకు కావలసిన పప్పు,ఉప్పు,బియ్యమంటూ తిండికి కావలసిన వస్తువులను తన డబ్బుతో కొని పెట్టి వాళ్ళను పస్తులు వుండకుండా చేసేవారు. అలాంటి సంఘటనలను కొన్ని స్వయాన నేనే చూశాను. ఇవాళ అలా ఆ చెడు వ్యసనాలనుంచి బయట పడ్డ ఆ క్రింది తరగతి వుద్యోగులే దాదాపు ఆరు మంది ఈ కార్యక్రమానికి శ్రమ దానం చేశారు. ఇది కేవలం పురుషోత్తమరావుగారిమీద వారికున్న ప్రేమాభిమానాలకు నిదర్శనం. పోతే మనకోసం,ఈ రేడియో స్టేషనుకోసం ఆయనో గొప్పపని చేశారు. అదో మధురమైన జ్ఞాపకం కూడా! దాన్ని వారి మాటల్లోనే విందాం. ఇప్పుడు పురుషోత్తమరావుగారు మాట్లాడతారు"అని ముగించి కూర్చొన్నాడు దయాకరరావు.
        పురుషోత్తమరావు నిలబడి మాట్లాడ లేడు కనుక మైకును వారి వద్దకు తీసుకువెళ్ళారు.
        "వేదికనలంకరించిన పెద్దలకు,ఆహుతులకు,ఇంకా ఈ కార్యక్రమాన్ని జయప్రదం కావించిన అందరికి నా నమస్కారాలు. సహజంగా ఏ వ్యక్తైనా సరే,ఎంతటిగొప్ప పదవిలో వున్న వాడైనా సరే పదవి విరమణ పొందిన తరువాత తను వుద్యోగం చేసిన ఆ సంబంధిత కార్యాలయానికో లేక కర్మాగారానికో రెండు మూడేళ్ళ తరువాత గుర్తుండరు. కొత్త నీరొచ్చిపాతనీటిని కొట్టుకు పోయినట్టు కొత్తవాళ్ళు ఆ సీటుకు వస్తూనే పాతవారిని, వారి సేవలను మరచి పోవడం చాలా సాధారణ విషయం.అది సహజం కూడా! అలాంటప్పుడు ఇరవై అయిదేళ్ళకు ముందు పదవి విరమణ పొందిన నా విషయంలో గుర్తుంచుకోవడాలు, పలకరింపులతో గౌరవించడాలన్నవి కనీసం వూహించ లేమన్నదే నా భావన. అలాంటి నాకు ఈ రోజు ఇంతటి గౌరవం దక్కుతుందంటే అది భగవంతుని దయేననుకొంటున్నాను. నిజంగా నా జీవితంలో ఇదో సుదినం. జీవిత చరమాంకంలో లో వున్న నాకు ఇలాంటి గౌరవం దక్కు తుందంటే నా జీవితం ధన్యమైనట్టే! బహుశా ఇది నా పూర్వజన్మ సుకృత ఫలంగా భావిస్తున్నాను. అందుకు నేనూ ,నా శ్రీమతి  సర్వదా మీ అందరికి కృతజ్ఞులం. ఇందాక నా శిష్యుడు లేక మిత్రుడు నేనేదో ఈ రేడియో స్టేషనుకు చేశానని దాన్ని గూర్చి ఇప్పటికి ఈ రేడియో సిబ్బంది మాట్లాడుకొంటున్నారని చెప్పాడు. అది నిజమే!?నాడు నేను చేసిన ఆ చిన్న పని నేడు ఇంత గొప్పగా మాట్లాడబడుతుందంటే అందుకు ఈ రేడియోలో పని చేసే అధికారులతో పాటు క్రింది తరగతి సిబ్బందే కారణం. అదేమిటంటే నాడు కేంద్ర ప్రభుత్వపు పర్యావరణ శాఖ దేశమంతటికి జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతి ఇంట ఓ మొక్కను నాటి పెంచటం, అలా చేయడంద్వారా కాలుష్యాన్ని నివారించగలమన్నారు.బాగావానలు కురిసి దేశం సస్యశ్యామలమౌతుందన్నారు. అలా అందరూ చేశారో లేదో నాకైతే తెలియదుకాని నేను మాత్రం నాడు మా ఇంట్లో ఓ వేప  మొక్కనూ,ఈ రేడియో స్టేషనులో ఓ మామిడి మొక్కనూ నాటాను. ఇక్కడ నాటిన ఆ మామిడి మొక్కను నా పదవి విరమణ రోజు వరకు నేనే సంరక్షించాను. పదవి విరమణ పొందిన తరువాత దాన్ని గురించి ఆలోచించలేదు. ఇంకా చెప్పాలంటే మరచి పోయాను కూడా! అయితే మొన్న నన్ను ఈ ఉగాది వేడుకలకు ఆహ్వానించటానికి వచ్చిన  అసిస్టెంటు డైరక్టరు దయాకరరావుని చూస్తూనే ఆ మొక్కను గూర్చి గుర్తు తెచ్చుకొని మరి అడిగాను అదేమైందని? అందుకాయన అన్నారూ...అది మన రేడియో స్టేషను తోటమాలి సంరక్షణలో చక్కగా పెరిగి పెద్ద మానై ఇప్పుడు ప్రతి సంవత్సరం కాపుగా బోలెడు మామిడి పళ్ళను మనకు అందిస్తోందని చెప్పాడు. ఆ మాట విన్న నేను అమితానంద భరితుడనైయ్యాను. ఆ చెట్టును చూడాలని వువ్విళ్ళూరుతూ ఇవాళ మూడు గంటలకే కార్యక్రమానికి వచ్చాను. నాడు నేను నాటిన మొక్కను నేడు పెద్ద చెట్టుగా చూసి ఆశ్చర్య పోయాను.ఆ చెట్టు నీడన కాస్సేపు సేద తీరాలని కుర్చీ వేయించుకొని కూర్చొని రెండు గంటలపాటు ఆనందంగా అక్కడే వుండి పోయాను. అందుకే ఆ చెట్టును పెంచి పోషించిన తోట మాలీలెందరో వాళ్ళందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను “అంటూ తన కళ్ళనుంచి కారి పోతున్న ఆనంద బాష్పాలను తుడుచుకున్నాడు పురుషోత్తమరావు. అప్పుడు ఆహుతులు కూడా చలించి ఆయన వేపు ఆసక్తికరంగా చూస్తుండగా మళ్ళీ ఆయనే "కనుక ఇప్పుడు నేను చెప్పబోయే విషయం సభకు సంబంధించినది కాకపోయినా అది నా కోరిక. దానిని నా అభ్యర్థనగా మీ ముందు వుంచుతున్నాను.ఆ నా అభ్యర్థనను మన్నించి మీరుకూడా మీ ఇళ్ళలో  భావి తరాలకు పనికి వచ్చే ఏవేని మొక్కలు నాటండి. తద్వారా మనముంటున్న ఈ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా మార్చండి. అలా మారుస్తారని నమ్ముతాను. జైహింద్ !"అంటూ ఆనందంతో ముగించాడు సభికుల కరతాళ ధ్వనుల మధ్య పురుషోత్తమరావు,
 

మరిన్ని కథలు
konchem touchlo vunte chepta