Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue253/684/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

(గత సంచిక తరువాయి).. గాయత్రి ఒకరోజు రమేష్ ని అడిగింది.

“రమేష్ ఒక్కసారి మనం హైదరాబాద్ వెడదాం... అమ్మా, నాన్నల్ని చూడాలని ఉంది ... ప్లీజ్ ఒక్కసారి తీసికెళ్ళవా..”

రమేష్ ఇది వరకులా ఆ మాట అనగానే గయ్ మని  అరవ లేదు. కాసేపు ఏదో ఆలోచిస్తున్న వాడిలా మౌనంగా ఉండి అన్నాడు.

“ఆడకి పోయినంక మా వొల్లు నన్ను ఇడువరు .. గుంజుకు పోయి వేరే పెండ్లి జేస్తరు .. నాకు మంచిగ ఎరిక ... గట్ల గిట్ట అయితే నువ్వు, నేను మల్ల కలువుడు సంగతి దేముడికెరుక ...సూడనికి కూడా ఉండదు.. నీకు అట్ల ఇష్టమేనా ..” గాయత్రి మాట్లాడ లేదు.

ఇష్టా ఇష్టాల ప్రసక్తి లేకుండానే తను ఇతనికి భార్య అయింది.. ఇష్టాల ప్రసక్తి లేకుండానే ఇతనితో కాపురం చేస్తోంది.. ఇష్టంతో తను ఇతనితో లేచిపోయి వచ్చిందా... లేదు.. అమ్మ, నాన్నల నిరంకుశత్వం నుంచి తనని తాను రక్షించుకోడానికి,  బంధింప బడుతున్న తన స్వేచ్చని కాపాడుకోడానికి అతని సాయం తీసుకుంది.

జీవితంలో మొదటి సారి విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టబోతూ, ఏమి తెలియని తనకి అన్నీ తెలుసు అనుకుంటున్న అతను  ఆసరా అవుతాదనుకుంది.  అది ఇలా వికటించి ఇంత భయంకరమైన పరిస్థితి వస్తుందనుకుందా!
ఎందుకూ పనికి రాని ఇతనికి తను భార్య అవడం ఎంత విషాదం! ఈ జివితాన్నా తను కోరుకుంది.. గాయత్రికి పొగిలి, పొగిలి దుఃఖం  వచ్చింది.

సన్నగా వెక్కిళ్ళు పెడుతున్న ఆమెని చూస్తుంటే ఇప్పుడు రమేష్ కి కోపం రాలేదు. జాలి వేసింది.

రమేష్ కి వ్యక్త పరచడం తెలియనంత ప్రేమ ఉంది గాయత్రి మీద .. సినిమాల్లో లాగా పాటలు పాడి, అతి ప్రేమ కురిపించి వ్యక్త పరచే శక్తి, తెలివి కూడా లేనివాడు. అతనో సామాన్యుడు..

అసలు అతను గాయత్రిని ప్రేమించాలని ఆమెతో మాటలు కలప లేదు, ప్రేమించాలని ఆమెని ఇందిరా పార్క్ కి రమ్మని పిలవ లేదు.. అందుబాటులో, కంటికి కనిపిస్తూ ఉన్న ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయితో మాట్లాడాలి, షికారు వెళ్ళాలి, సినిమాలకి తిరగాలి.. అంతే ఆరోజు అతను ఆశించింది...ఆశ పడింది. 

వయసు వచ్చిన తనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి.. అది గాయత్రి కావాలి ... ఆ కోరిక తీరింది..

ఆ పరిస్థితుల్లో గాయత్రికి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ కావాలన్న బలీయమైన కోరిక ...తను చూసిన చిన్న ప్రపంచంలో రమేష్ ఆమెకి అప్పుడు అందగాడిగా అనిపించాడు.. పార్క్ కి రమ్మని లవ్ లెటర్ రాసి ఇవ్వగానే మొనగాడులా అనిపించాడు.. ఆటోలో షికారు తిప్పుతూ విచ్చల విడిగా ఖర్చులు పెడుతుంటే ఎంతో గోప్ప వాడిలా అనిపించాడు.. సరదాగా తిరగడానికి అంత కన్నా మగాడు ఇంకెవరు అనుకుంది.   
కానీ పరిస్థితులు వికటించాయి ... పెద్దలకు వీళ్ళ వ్యవహారం తెలియడం, ఆంక్షలు, కట్టడి, వీటి మధ్య గాయత్రికి తల్లి, తండ్రులు తన ఆనందాన్ని హరించే విలన్ లుగా కనిపించారు.. తన స్వేచ్ఛను అణగ తొక్కే రాక్షసులుగా కనిపించారు.. వాళ్ళ నుంచి పారి పోవాలనుకుంది.
కానీ, అనూహ్యంగా గాయత్రి జీవితం అతన్తో, అతని జీవితం ఆమెతో ముడి పడి పోయింది. ఈ ముడి విడేది కాదు.. ఇప్పుడు గాయత్రి వద్దు అనుకున్నా అతని భార్య . ఈ వాస్తవం గాయత్రికి మింగుడు పడడం లేదు.. ఏ మాత్రం అవకాశం దొరికినా అతన్ని వదిలి పారిపోవాలని ఉంది. లేదు ఆ అవకాశం కను చూపు మేరలో కనిపించడం లేదు. భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోంది.. ఏ స్వేఛ్చ కోసం తెగించి పారిపోయిందో.. ఇప్పుడా స్వేఛ్చ మరో రూపంలో హరించుకు పోయింది. తనిప్పుడు బంధీ ... దారి, తెన్నులేని ఒక బాటసారి..ఏ దారి ఎటు పోతుందో తెలియదు.. ఎక్కడ ఆగాలో తెలియదు.. ఎక్కడ ప్రయాణం కొనసాగించాలో తెలియదు. ఇలా, ఇక్కడ ... లేదు, లేదు అలా జరగడానికి వీల్లేదు.

గాయత్రి మౌనంగా ఉండడం చూసి అన్నాడు రమేష్ మీ మమ్మీ, డాడి నిన్ను రానిస్తరని నీకు నమ్మకం ఉందా.. రానియకుంటే ఏం  చేద్దాం ... మా వొల్లు నిన్ను మాత్రం ఇంట్లకి రానియరు ...చెప్పు పోదామంటే పోదం ...గాయత్రికి ఏడుపొచ్చింది.

“అట్లా అనకు రమేష్ ... ఎంతైనా అమ్మ, నాన్న ...నాకు నమ్మకం ఉంది రానిస్తారు” అంది.

రమేష్ కి ఆమెని చూస్తుంటే బాధగానే ఉంది. కానీ ఇద్దరూ ఊరు వదిలి వచ్చాక ఏం జరిగిందో.. ఇంకా ఏం జరుగుతోందో ఆమెకి తెలియని అనేక విషయాలు అతనికి తెలుసు.

రమేష్ కొందరు చిన్నప్పటి స్నేహితుల ద్వారా, నమ్మకస్తుల ద్వారా అక్కడి విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాడు..

గాయత్రి తల్లి, తండ్రులను వాళ్ళ ఇంటి మీదకి వెళ్లి మరీ తన తల్లి నానా బూతులు తిట్టిందని,. ఆ అవమానం భరించ లేక వాళ్ళు మర్నాడే ఇల్లు ఖాళి చేసి వెళ్ళారని తెలుసుకున్నాడు. ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. అట్లాంటప్పుడు గాయత్రిని హైదరాబాద్ పంపిస్తే ఎం జరుగుతుందో అతనికి తెలుసు.. తల్లి, తండ్రుల జాడ తెలియక , షెల్టర్ ఇచ్చే వాళ్ళు లేక ఎక్కడ ఉంటుంది. తిరిగి తన దగ్గరకు రావల్సిందే..
అంతే కాదు తన కోసం అతని తల్లి చాలా మంది బంధువులకి చెప్పి పెట్టింది.. నా కొడుకు ఏడ  కనపడినా తొలక రాండ్రి.. గా పోరిని మెత్తగా తన్నున్ద్రి అని.. ఆ విషయం కూడా నమ్మకస్తుల ద్వారా తెలుసుకున్నాడు. అందుకే అతను ఒక్కసారి బయటకు వచ్చేసాక గాయత్రి కోసం కన్న వాళ్ళని, తోబుట్టువుని కూడా వదులుకోవాలని నిశ్చయించుకున్నాడు.

గాయత్రిని నెమ్మదిగా బుజ్జగించి, లాలించి తనకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో కొంత వరకు విజయం సాధించాడు. ఆ ప్రయత్నంలో కొన్ని సాహసాలు కూడా చేస్తున్నాడు.  అలాంటివే ఆటో కొత్తగా నడపడం మొదలు పెట్టినా ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశతో నర్సిమ్మ పెట్టిన లిమిట్స్ దాటి చుట్టు పక్కల ఉన్న చిన్న, చిన్న ఊళ్లకు కూడా ఆటో తీసుకుని వెళ్తున్నాడు.

నువ్వింకా కొత్త కదా ఎక్కువ దూరం నడపకు తమ్మి అంటూ నర్సిమ్మ ఆటో బాడుగకు ఇప్పించే ముందే చెప్పాడు. కానీ రమేష్ గాయత్రిని ఆనంద పెట్టడం అంటే సినిమాలకు, షికార్లకు తిప్పడం తన బాధ్యతగా గట్టిగా నమ్మి, నర్సిమ్మ ఆంక్షలు అధిగమిస్తున్నాడు. కాక పొతే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెడుతూ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. రేపు పిల్లలు పుడితే ఖర్చులు పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి అన్న ధ్యాస ఇద్దరికీ లేదు.

అలా లేదని విధి తన పని తను చేయడం మానదు కదా.

గాయత్రికి హటాత్తుగా గుర్తొచ్చింది. ఈ మధ్య తన ఆరోగ్యంలో ఏవో మార్పులు వస్తున్నాయి. ఉదయం లేస్తూనే కళ్ళు తిరుగడం, వాంతి అయేలా అవడం ... ఇదంతా అదేనా.. పైగా ఈ నెల దాటి పోయినా పీరియడ్స్ రాలేదు.

గాయత్రికి లా ప్రకారం పెళ్లీడు రాక పోయినా, శారీరక, మానసిక పరిస్థితులు మాత్రం ఆమెకి అన్ని తెలియ చేశాయి.. టి వి లు, సినిమాలు పదేళ్ళ పిల్లలకే అన్ని విషయాలు తెలియచేస్తున్న ఈ రోజుల్లో వయసు వచ్చిన గాయత్రికి తెలియడంలో ఆశ్చర్యం లేదు.
గాయత్రికి అర్ధమైపోతోంది తను గర్భవతి... గర్భవతి..

ప్రతి ఆడపిల్లా ఎంతో మధురమైనదిగా, అపురూప మైనదిగా భావించే మాతృత్వం ఆమెకి ఒక శాపంలా అనిపించ సాగింది.

పుట్టే పిల్లలు ఎలా పుడతారో..రమేష్ లాగా పుడతారా.. వాళ్ళ కులం ఏంటి? వాళ్ళకొ ఇంటి పేరు ఉండాలి కదా ... ఏ ఇంటి పేరు వాళ్ళది.. ఏమని చెప్పాలి..

తేనే తుట్టె కదిలిస్తే ఒక్క సారిగా మూగిన తెనెటీగల్లా ఆమెని ఆలోచనలు ముసురుకున్నాయి.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్