Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> అలా గుర్తింపు పొందడమే నాకు ఇష్టం.

alaa gurtimpu pondadame naku ishtam

సెల్ ఫోన్ లో రైమ్స్ చూస్తూ ఉంటే గానీ ముద్ద మింగుడు పడదు మా బాబుకు. అందుకే యూట్యూబ్ లో ఇంగ్లీష్ రైమ్స్ చూపిస్తూ బాబుకు గోరు ముద్దలు తినిపిస్తోంది మా ఆవిడ. కానీ తన కలవరం అంతా టివి సీరియల్ పై ఉంది. ఎర్ర గులాబి డైలీ సీరియల్  తొమ్మిది వందల ఎనభై ఒకటవ ఎపిసోడ్ వస్తోంది టివి లో . విషం కలిపిన పాయసాన్ని అత్తకు ప్రేమగా తినిపిస్తోంది ఆ సీరియల్ లోని కోడలు. ఓ వైపు టివి లో తెలుగు సీరియల్  , మరో వైపు సెల్ ఫోన్ లో ఇంగ్లీష్ రైమ్స్. ఆ గోల భరించలేక బాల్కానీ లోకి వెళ్ళా. మబ్బుల చాటున చంద్రుడు చాలా అందంగా ఉన్నాడు. నా పసితనంలో ఆరుబయట వెన్నెల్లో ఆడుకొన్న ఆటలు గుర్తుకు వస్తున్నాయ్. కానీ ఇప్పటి పిల్లలకు ఆడుకోవడానికి చంద్రుడి వెన్నెల అవసరం లేదు, సెల్ ఫోన్ లో ఛార్జింగ్ ఉంటే చాలు. గోరు ముద్దలు పెట్టే తల్లులు కూడా టివి సీరియల్స్ లో చిక్కుకొని చంద్రుడిని మరచి పోయారు. పిల్లలయితే సెల్ ఫోన్ తోనే మాట్లాడుతారు, సెల్ ఫోన్ తోనే ఆట్లాడుతారు, సెల్ ఫోన్ తోనే పోట్లాడుతారు. అప్పట్లో ఖాళీ దొరికితే పుస్తకాలతో కాలక్షేపం చేసే వాళ్ళం. చదువుకొన్న వాళ్ళు తక్కువగా ఉండే కాలంలో మంచి మంచి పుస్తకాలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు మంచి చదువులు చదివిన మనుషులు ఎక్కువయ్యారు. కానీ మంచి పుస్తకాలు కనుమరుగయ్యాయి.

నేను పదవ తరగతి లో ఉన్నప్పుడు కధలు బాగా చదివేవాడిని. చిన్న చిన్న కథలు, కవితలు రాసే వాడిని కూడా. మా తెలుగు మాస్టార్ వాటిని చదివి నన్ను చాలా మెచ్చుకొనే వారు. నన్ను సరదాగా “ రైటర్” అని పిలిచే వారు. మాస్టర్ అలా పిలిచినప్పుడు నాకు చాలా బాగా అనిపించేది. నా కథలు, కవితలు డైలీ లోనో, వీక్లీ లోనో ప్రచురణకు పంపాలన్న నా కోరిక తీరే లోపే నేను యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది. మార్కుల కోసం, ర్యాంకుల కోసం  యుద్ధం చేయాల్సి వచ్చింది. ఒకసారి యుద్ధంలోకి దిగాక గెలిచేవరకూ పోరాడాలి. లేకపోతే ప్రాణాలు వదలాలి. నేను కూడా పోరాడాను. ఏళ్ల తరబడి పోరాడాను. పదిలో ఫస్ట్ క్లాస్ మార్కుల కోసం, ఇంటర్ లో ఎంసెట్ ర్యాంక్ కోసం, బిటెక్ లో క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం, కంపెనీలో టి.ఎల్ ప్రమోషన్ కోసం పోరాడాను. అన్నీ సాధించాను. కానీ కథలు, కవితలు రాసే అలవాటును కోల్పోయాను . నా పనితనం మెచ్చి కంపెనీ వాళ్ళు ఆన్ సైట్ కు పంపిస్తామని చెప్పారు. ఐదు రెట్లు ఎక్కువ జీతం ఇస్తామని చెప్పారు. కానీ నేను ఇష్ట పడలేదు. తల్లిదండ్రులను వదలి, పెళ్ళాం పిల్లల్ని వదలి దేశం కాని దేశం కు వెళ్ళాలి. డబ్బు కోసం అక్కడ మరోసారి యుద్ధం మొదలు పెట్టాలి. తిరిగి వచ్చేటప్పటికి నాకు కథలు, కవితలు రాసే అలవాటు ఉండేదన్న విషయం కూడా మరచి పోతానేమో. అందుకే వెళ్లనని చెప్పాను. ఇక్కడే ఉంటానన్నాను. తిరిగి కథలు  రాయడం మొదలు పెట్టాను. చిన్నప్పుడు వదిలేసిన నాలోని రచయితకు ఓనమాలు గుర్తు చేసాను.  పగలంతా ఆఫీస్ లో కంప్యూటర్ తో పోరాటం చేసి, సాయంత్రం ఇంటికి రాగానే నాలోని రచయితతో స్నేహం చేసే వాడిని. మనసుకు నచ్చిన పని ఏదైనా మనకు సులభంగా ఒంటబడుతుంది. కొన్ని నెలలలోనే ఎన్నో కథలు రాసాను. ఓ వైపు కథలు రాస్తూ,  డైలీ లోనో (లేక) వీక్లీ లోనో వాటిని ప్రచురించడానికి గల అవకాశాల కోసం ఎదురు చూస్తుండగా ఓ రోజు మా ఆవిడ, మా అమ్మగారితో నా గురించి చెప్పడం నా చెవిలో పడింది. “ ఈ మధ్య ఆయన ఎందుకో అదోలా ఉంటున్నాడు. మనతో సమయం గడపడం  తగ్గించేసాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏదో రాస్తూ ఉంటాడు, తనలో తనే మాట్లాడుకొంటూ , తనలో తనే నవ్వుకొంటూ, తనలో తనే బాధ పడుతూ ఉంటాడు. ఆయన ప్రవర్తన నాకు అస్సలు అర్థం కావడం లేదు.” అని చెప్తోంది. బాగా ఆలోచించా. తను చెప్పింది నిజమే. నేను నాలోని రచయితకు దగ్గరవుతున్నా. పలితంగా కుటుంభానికి దూరం అవుతున్నా. సాయంత్రం ఇంట్లో ఉండే ఆ కాస్త  సమయంలో కూడా  ఎక్కువ భాగం  నా గదిలో ఒంటరిగా గడుపుతున్నా. నా సంతోషం కోసం వాళ్ళను బాధ పెడుతున్నా. అందుకే మరోసారి  అయిష్టంగా నాలోని రచయితను ఉయ్యాలలో వేసి, జోల పాడి కొంత కాలం నిద్రపుచ్చాలని నిర్ణయించుకొన్నా.

****************

ఆదివారం కావడం చేత బాల్కానీలో బాబుతో ఆడుకొంటూ ఉండగా మా ఆవిడ ఇంట్లో నుండి పరిగెత్తుకొంటూ వచ్చింది. తన స్నేహితురాలు రాసిన కథ ఒకటి వెబ్ లో ప్రచురింపబడిందని మొబైల్ లో చూపించి, నన్ను కూడా ఏదైనా మంచి కథను ప్రచురణకు పంపమని అడిగింది. తను అలా అడగగానే నాకు చాలా సంతోషం వేసింది. నేను రాసిన కథలలో ఏ కథను పంపుదామా అని ఆలోచించే లోపే “ఆత్మహత్యలు” చేసుకొంటూ ఉన్న ఇంటర్మీడియట్ పిల్లల గురించి రాయమని తనే నాకు సలహా ఇచ్చింది. నిజమే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రధానమైన సమస్యలలో ఇది కూడా ఒకటి.

కార్పోరేట్ కాలేజీల వారికి డబ్బు కావాలి, తల్లిదండ్రులకు పిల్లల ర్యాంకులు కావాలి. కానీ పిల్లల మంచి చెడులు ఎవ్వరికీ అవసరం లేదు. అందువల్లే ఇంటర్మీడియట్ చదివే కొన్ని వేల మంది పిల్లలు మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. తాము ఏం చదువుతున్నామో, ఎందుకు చదువుతున్నామో వారికే అర్థం కావడం లేదు. వారి ఆశలకు, వారి లక్ష్యాలకు వారి చదువుతో ఎంత మాత్రం పొంతన ఉండదు. తల్లి కోరిక కోసం డాక్టర్ కావాలనో,  తండ్రి పరువు కోసం ఇంజనీర్ కావాలనో కష్ట పడుతారు తప్ప తమ మనసు దేన్ని ఇష్టపడుతోందో గుర్తించే  సమయం గానీ, స్వేచ్చ గానీ వారికి లేదు. మార్కుల కోసం, ర్యాంకుల కోసం యుద్ధం చేస్తున్నారు వాళ్ళు . గెలుపు కోసం శక్తికి మించి పోరాడుతున్నారు వాళ్ళు. పలితంగా ఒత్తిడికి లోనవుతున్నారు. ఒత్తిడిని తట్టుకోలేని వాళ్ళు ప్రాణాలు వదులుతున్నారు.
నేను ఇంటర్ లో ఆర్ట్స్ గ్రూప్ చదవాలని అనుకొన్నా. తెలుగులో స్పెషలైజేషన్ చేసి “రచయిత” గా గుర్తింపు పొందాలని కలలు కన్నా. కానీ నాలోని వాడి కోసం కాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం సైన్సు లో చేరా. మనసుకు నచ్చిన పని ఏదైనా, మనకు సులభంగా ఒంటబడుతుంది. కానీ నచ్చని పని చెయ్యడం చాలా కష్టం గా ఉంటుంది. నాకు ఇంటర్మీడియట్ అలాగే అనిపించింది. కాలేజిలో చదువుతున్నట్టు కాదు, మార్కుల కోసం, ర్యాంకుల కోసం యుద్ధం చేస్తున్నట్టు అనిపించేది. నా మనసు లోని లక్ష్యానికి, నా ముందు ఉన్న పుస్తకాలకు పొంతన కుదిరేది కాదు. అయినప్పటికీ చదివాను. నా చుట్టూ ఉన్న వాళ్లకు సంతోషం కలిగించేవి అన్నీ సాధించాను. కానీ నా మనసుకు సంతోషం కలిగేది ఏదీ చెయ్యలేక పోయాను. అందుకేనేమో ముప్పయి ఏళ్ళు నిండినా నా చిన్ననాటి కల నేరవేరనేలేదు. నా కథ ఒక్కటీ ఎక్కడా ప్రచురింపబడలేదు. నేను ఇంతవరకూ ఏ కథనూ ప్రచురణకు పంపనేలేదు. ప్రచురణ అంటే గుర్తుకు వచ్చింది. నేను వెంటనే ఒక మంచి కథ రాయాలి. సండే బుక్ కోసం ప్రచురణకు పంపాలి. నా కలను నేరవేర్చుకోవాలి. అందుకే రాస్తున్న డైరీ ను పక్కకు  పెట్టి పేపరు, పెన్ను తీసుకొని బాల్కానీ లోకి వెళ్ళా. రాయడం మొదలు పెట్టా.

“ఏమండీ! మీరు డైరీ లో రాసిన కథ చాలా బాగుంది. ప్రచురణకు దీన్నే పంపండి.” అంటూ మా ఆవిడ నా డైరీ ను నా ముందుకు తీసుకొని వచ్చింది. డైరీ లో రాసింది కథ కాదు, నా ఆలోచనలు మాత్రమే అని చెప్పాలని అనుకొన్నా గానీ,  అప్రయత్నంగా డైరీ ను చదివా. నా ఆలోచనలు కూడా నా కథలులాగే  గమ్మత్తుగా అనిపించింది. అందుకే నేను డైరీ లో రాసిన విషయాన్నే కధలా  ప్రచురణకు పంపాలని నిర్ణయించుకొన్నా.

ఒక వేళ ఈ కథ గనుక ప్రచురింపబడితే పిల్లల ఇష్టాలను, లక్ష్యాలను,  వారి శక్తిని  దృష్టిలో పెట్టుకోకుండా తమ ప్రిస్టేజ్ కోసం  పిల్లలపై  చదువు పేరుతో ఒత్తిడి పెంచే తల్లిదండ్రులు కొందరైనా మారుతారని ఆశిస్తున్నాను. అంతేకాక  కథను ప్రచురించాలన్న నా చిన్న నాటి కల కూడా  నెరవేరుతుంది. అలాకాక ఈ కథ ప్రచురణకు నోచుకోక పోతే మరో కథ ద్వారా త్వరలోనే మీకు పరిచయం అవుతాను. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ! నా పేరు రాజు. “రైటర్ రాజు”. అలా గుర్తింపు పొందడమే నాకు ఇష్టం.


 

 

మరిన్ని కథలు
anukunnaamani annee jaragavu annee