Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> కరుణ

karuna

సుగుణాకర్ ఇంట్లో అంతా హడావుడిగా వుంది..

అతని సతీమణి సుశీల చిన్నబ్బాయి ఫణీంద్రను పురమాయించే పనిలో పడింది. మాటిమాటికీ టూవీలర్ తీసుకొని బజారుకు వెళ్తూ.. తల్లి చెప్పిన వస్తువులు తెచ్చిచ్చే పనిలో నిమగ్న మయ్యాడు ఫణీంద్ర.. ‘అన్నీ ఒక్కసారి చెప్పదుగాక చెప్పదని’ మనసులో గొణుక్కుంటూ. సుగుణాకర్  తేప, తేపకు చేతి గడియారం వంక చూస్తూ.. కాలుగాలిని పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. పదే, పదే గేటు తెరుచుకొని వెళ్లి వీధిలోకి తొంగి చూస్తూ.. పెద్దబ్బాయి హరీంద్రకు జాగ్రత్తలు చెబుతూ.. మెడకు గుదిబండలా తయారైన కుమార్తె కరుణను చూసి ‘లోనికి వెళ్లి కూర్చో..’ మని సంకేతాలిస్తూ .. సతమతమవుతున్నాడు.

ఆయనగారి అవస్థ  గమనిస్తూ.. ‘హరీంద్ర గనుక  అమ్మాయి అయితే మరెంత కంగారు పడేవారో..!’ అని మనసులో సుశీల ముసి ముసి నవ్వులు నవ్వుకుంటోంది.

గత వారమే హరీంద్ర కోసం అమ్మాయిని చూడ్డానికి సుగుణాకర్ సతీ సమేతంగా మరో ముగ్గురు బంధువులతో బీదరు వెళ్ళాడు. అమ్మాయిని అంతా నచ్చారు. అదే విషయం చెబుతూ ‘మా అబ్బాయి హరీంద్ర కూడా మీకందరికీ నచ్చినట్లయితే మా ఇంటికి రండి..’ అని సుగుణాకర్ ఆహ్వానం మేరకు అమ్మాయి తాలూకు వాళ్ళు.. ఈ రోజు వస్తూండడమే  హడావుడికి కారణం.

సుగుణాకర్ ఇంట్లోలాగానే అమ్మాయికీ అన్నయ్య, ఒక తమ్ముడు.. తండ్రి లేడు.  తల్లి రాజ్యలక్ష్మి కుటుంబ బాధ్యతలు వహిస్తూ.. పెద్దకొడుకు వివాహం చేసింది. ఆమె బీదర్లో  పేరున్న సంఘసేవకురాలు. అమ్మాయి   గారాబంగా పెరిగినా.. చదువు అశ్రద్ధ చేయలేదు. బి.టెక్. పూర్తి చేసి ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అంతఃస్తులు కలిసిన కుటుంబమని.. మంచి సంప్రదాయ సంబంధమని.. ఖాయపర్చుకోవాలని ఆతృత పడ్తున్నాడు సుగుణాకర్. కాని  కరుణతో స్థబ్దత నెలకొన్న ఇంట్లో మళ్ళీ వసంతాలు చిగురిస్తాయా.. అనే అంశం అతడి  ఎదలోని ఆందోళనకు అసలు కారణం.

ఇంతలో గేటు ముందాగిన కారు చప్పుడయ్యింది. రాజ్యలక్ష్మి, వాళ్ళ పెద్దబ్బాయి, కోడలు మరో ఇద్దరు బంధువులు కార్లోనుండి దిగుతుండగా.. సుగుణాకర్ పరుగులాంటి నడకతో వెళ్లి అతిథులకు రెండు చేతులా నమస్కరిస్తూ.. వినయపూర్వకంగా ఆహ్వానం పలికాడు. కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు అందించాడు.

కాళ్ళు కడుక్కొని అంతా హాల్లో ఆసీనులయ్యారు.

“అక్కయ్యా.. ప్రయాణం కులాసాగా జరిగిందా..” అంటూ కుశలప్రశ్నలతో నాంది పలికాడు సుగుణాకర్.

“అంతా సవ్యంవంగా జరిగింది అన్నయ్యా..” అంటూ.. ఫణీంద్ర ట్రే లో అందిస్తున్న    మంచినీళ్ళ గ్లాసు తీసుకుంది రాజ్యలక్ష్మి.

“మా చిన్నబ్బాయి ఫణీంద్ర” అంటూ పరిచయం చేసాడు సుగుణాకర్. ఫణీంద్ర అందరి వంకా  చూస్తూ  అభివాదం చేసాడు.

“హరీంద్ర తరువాత మరో అమ్మాయన్నారు..” అంటూ.. అమ్మాయి ఏది.. అన్నట్లుగా గుమ్మం వైపు చూడసాగింది రాజ్యలక్క్ష్మి. మంచినీళ్ళ గ్లాసు ఖాళీ చేస్తూ.

సుశీల గుండెల్లో రాయి పడింది. ఆందోళనగా సుగుణాకర్ వంక చూసింది.   

“అక్కయ్యా.. మీరు నన్ను క్షమించాలి. మీకారోజు  నాకూతురు కరుణ గురించి చెప్పలేదు. రెండు కుటుంబాలు కలిసే వేళ ఎలాంటి దాపరికాలూ లేక పోవడం క్షేమదాయకం” అంటూ దీనంగా కరుణ కథ టూకీగా చెప్పాడు.

“కడుపు చించుకుంటే కాళ్ళమీద పడ్తుందన్నట్లు.. ఎంతో తల్లడిల్లాను. ఎంతైనా కన్నమమకారం.. ఏం చెయ్యాలో బోధపడలేదు. విడాకులకు ఇరువురూ సమ్మతంగానే వున్నారని కోర్టు చుట్టూ తిరిగాను. ఏడాదిలోగానే విడాకులు మంజూరయ్యాయి. ఇప్పుడు మాఎదపై కుంపటై కూర్చుంది” అంటూ కంట తడిపెట్టాడు సుగుణాకర్.  

హాల్లో నిశ్శబ్దం ఆవహించింది.

కళ్ళు తుడ్చుకుంటూ “కరుణా.. ఒకసారిలారామ్మా..” అంటూ ఆప్యాయంగా పిలిచాడు సుగుణాకర్.

కరుణ భయం.. భయంగా వచ్చి సుశీల ప్రక్కకు వచ్చి కూర్చుంది. ఆమె కళ్ళు కన్నీటి కడవలయ్యాయి. తెరలు తెరలుగా కన్నీరు దొర్లసాగింది.

రాజ్యలక్ష్మి తదేకంగా కరుణ వంక చూస్తోంది.. మబ్బుకమ్మిన చంద్రబింబంలా వుంది ఆమె ముఖవర్చస్సు. అందరి చూపులూ కరుణపైనే వాలాయి. సుశీల కొంగు ముఖానికి ఒత్తుకొని దుఃఖాన్ని దిగమింగుతోంది. సుగుణాకర్ అన్యమనస్కుడయ్యాడు. హరీంద్ర, ఫణీంద్రలు తలలు వంచుకొని నేల చూపులు చూడసాగారు.

“అన్నయ్యా.. బాధపడకండి” అంటూ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అంది రాజ్యలక్ష్మి. “మాకు అన్నీ విషయాలు తెలుసు..” అనగానే సుగుణాకర్, సుశీలలు నిశ్చేష్టుడయ్యారు. “కరుణ నాకు వాట్సాప్‍లో ఉత్తరం పోస్ట్ చేసింది” అంటూ సెల్ ఫోన్ ఓపెన్ చేసివ్సుగుణాకర్‍కు అందిస్తుంటే.. కరుణ చటుక్కున   లాక్కోబోయింది.

“కరుణా.. ఇందులో తప్పేమీ లేదమ్మా..” అంటూ వారించింది రాజ్యలక్ష్మి. “ఇది ఏ ఒక్కరో చదువాల్సింది కాదు. నీవు  వ్రాసిన దాంట్లో ఏ తప్పూ లేదు సమాజానికి తేటతెల్లం చేయాల్సిన  అవసరముంది. అప్పుడే కొంతలో కొంతైనా మార్పు రాకపోదు.  కరుణా.. నీ ఉత్తరం నేనే చదివి అందరికీ వినిపిస్తాను” అంటూ వాట్సాప్‍లో మళ్ళీ వెదుకసాగింది రాజ్యలక్ష్మి.  చటుక్కున కరుణ లేచి పరుగులాంటి నడకతో పడకగదిలోకి వెళ్లి దిండులో తలదూర్చింది. గుండె వేగం పెరిగింది.

“ గౌరవనీయులు.. రాజ్యలక్ష్మి గారికి,

నమస్కారములు” అంటూ ఉత్తరం చదవడం మొదలు పెట్టింది రాజ్యలక్ష్మి. హాలంతా సద్దుమణిగింది.

“మా అన్నయ్య పెళ్లిసంబంధం గురించి మా వాళ్ళంతా మీ ఇంటికి వస్తున్నారు. నేను వాళ్ళ అమ్మాయిని. నా పేరు కరుణ. నా గురించి మా నాన్న ఏం చెబుతాడో..! ఏమో..! అనే అనుమానంతో ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. మీకు కొన్ని నిజాలు చెప్పడం నాధర్మం.

నా వల్ల మా కుటుంబం అప్రతిష్ట పాలయ్యింది. అది కేవలం నా తప్పిదమే. దాని మూలాన మాకుటుంబంతో సంబంధం కలుపుకోడానికి విముఖత చూపొద్దని రెండు చేతులా నమస్కరిస్తూ ప్రాధేయపడ్తున్నాను. దయచేసి ఈ ఉత్తరం సాంతం చదివి నిర్ణయం తీసుకోండి.

ఆనాటి సంఘటన నా మనో వేదన మీ ముందుంచుతున్నాను..”

రాజ్యలక్ష్మి ఉత్తరం చదువుతుంటే అందరి కళ్ళ ముందు కరుణ వాక్యాలు సజీవదృశ్యాలుగా కదలాడు తున్నాయి.

***

అప్పుడే తెల, తెలవారుతోంది.. కట్టుబట్టలతో కరుణ తన మెట్టినింటి నుండి పుట్టింటికి బయలుదేరింది. చేతిలో చిల్లి గవ్వ లేదు.. ఎవరూ గుర్తించకుండా ముఖానికి హోనీ చుట్టుకుంది. దాదాపు పది కిలోమీటర్లు. అలవాటు లేని నడక.. కాళ్ళు  సహకరిస్తే ఏడయ్యేసరికి  సదాశివపేటకు చేరుకోవచ్చని మనసును ధృఢ పర్చుకుంది. వెనుదిరిగి మెట్టినింటి వైపు కడసారిగా కన్నెత్తైనా చూడకుండా నడకలో వేగం
పెంచింది.

సదాశివపేట బస్‍స్టాండు సమీపించగానే కరుణ గుండెలో దడ.. దడ.. దడ.. ఆరంభమయ్యింది. కాళ్ళు వణుకుతూ ముందుకు సాగడం లేదు. రాత్రి భోజనం మాట అటుంచి.. అవాంఛనీయమైన వాంతులతో తల్లడిల్లింది. శక్తినెంతగా పుంజుకున్నా.. కాయానికి నీరసం ఆవహించక తప్పలేదు. కళ్ళు తిరుగబోతున్నామని హెచ్చరిస్తోంటే.. మరో రెండడుగులు ముందుకు వేసి వీధి సందులోని  చింత చెట్టు కింద గద్దెపై చతికిలపడింది. కళ్ళు నెమ్మదిగా మూతలు పడ్డాయి. కొద్దిసేపు దీర్ఘ శ్వాస తీసుకుంది.  బలవంతంగా కళ్ళు తెరచి వంగి వీధి చివరంటా చూసింది.. ‘ఎవరైనా తనను చూస్తున్నారా..!’ అన్నట్లుగా.  ఎదురుగా గేటు కనబడేసరికి ఎదలో దుఃఖం తన్నుకొచ్చింది. ఎంత ఆపుకుందామన్నా ఆగడం లేదు. ఎడం చేత్తో చున్నీని ముఖానికొత్తుకుని వెక్కి, వెక్కి  నిశ్శబ్ద రోదనతో చెట్టుకొరిగింది.

తను పుట్టిపెరిగిన ఇల్లు. ఇంటి గేటు అడుగు చట్రంలో కాలు బెట్టి కిల, కిలా.. నవ్వుతూ అటూ.. ఇటూ.. ఊగిన రోజు గుర్తుకు రాసాగింది. గేటుపై గీతలు.. మరకలు పడకుండా చూసుకునే తను.. తన జీవితంపై స్వయంకృపారాధంతో గీసుకున్న చెరిస్తే చెరగని ఎరుపు గీత మరకతో గేటునెలా ముట్టుకోను..! అని మనసు సందేహిస్తోంది. ఈ బుద్ధి మొదలుండాలని గత జ్ఞాపకాలను తవ్వుతూ.. వెటకరిస్తోంది.

‘అవును నిజమే.. అన్నయ్య తరువాత నన్నుకని వీధిలో పారేయలేదు.. అల్లారు ముద్దుగా పెంచారు. మళ్ళీ తన తరువాత తమ్ముడు పుట్టినా.. నన్ను ఆశ్రద్ధ చేయలేదు. నేను ఏది అడిగితే అది క్షణాల్లో ప్రత్యక్షమయ్యేది. ఆడపిల్లకంత అలుసివ్వడం  మంచిది కాదని.. హద్దుల్లో పెట్టుకోవాలనేది అమ్మ. నాన్న తేలిగ్గా కొట్టిపారేసే వాడు. నాన్న నామీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసాను. హద్దులు మీరాను. రామాయణం చదువుకోరా అని అమ్మ చెబితే నేను ప్రేమాయణం వెలగబెట్టాను. పదోతరగతిలోనే పరపురుషుని స్పర్శకు ప్రాకులాడే దాన్ని. ప్రేమ అంటే ఏంటో..! అర్థంగాక పోయినా అదినన్నావహించిందనుకొని గాలిలో  తేలిపోయే దాన్ని.

నా చిత్తచాంచల్యంపై పరిశోధనలు  చేసాడేమో..! నేను  జూనియర్ కాలేజీలో  చేరినప్పుడు నాకు చేరువయ్యాడు ఆటోనడిపే  ఆగమయ్య. రోజూ నన్ను  తన ఆటోలో కాలేజీకి తీసుకెళ్ళే వాడు.. తిరిగి తీసుకొచ్చే వాడు. డబ్బులివ్వబోతే.. తీసుకునే వాడు గాదు. అదే ప్రేమనుకున్నాను. వారాంతపు సెలవుల్లో క్లబ్బులకూ.. పబ్బులకూ.. తీసుకెళ్తుంటే..  జీవితమంటే ఇలా ఉండాలని సంబరపడి పోయాను.   
వెయ్యేండ్లు తపస్సు చేసినా నీలాంటి అందమైన అమ్మాయిని భార్యగా పొందడం అసాధ్యమంటూ ఆగమయ్య అన్నప్పుడల్లా.. బూరెలా పొంగిపోయేదాన్ని. వరకట్నం తమ ఇంటి వంశాచారమే కాదంటే పెళ్ళికి కాదనలేక పోయాను. గుట్టుచప్పుడు గాకుండా గుళ్ళో పెళ్లి జరిగింది.. ఆటో సైన్యమంతా  సహకరించారు.

ఆగమయ్య ఇంట్లో ఏంమ్మాయ చేసాడో ఏమో..! గాని నాలుగు రోజులు నన్ను మహారాణిలా చూసుకున్నారు. అగ్రకులం అమ్మాయని.. ఇంటికి పెద్ద కోడలని ప్రేమలు కురిపించారు. ఆగమయ్యకు పెళ్లీడుకొచ్చిన ఒక చెల్లెలుంది. నాతో సరిగ్గా మాట్లాడేదిగాదు. అయినా సరిపెట్టుకున్నాను.  

మా ఇంట్లో వాళ్ళు నా జోలికి గాని.. నా వార్తకు గాని రాలేదు. ఇక్కడా వాతావరణం ప్రశాంతంగా వుంటే సునామీ వచ్చే ముందు ఇలాగే వుంటుందని ఊహించలేక పోయాను. వారం తిరిగితే రోగం తిరుగుతుందన్నట్లు.. నేను ఆగమయ్య ఇంట్లో ఇముడలేక పోయాను.
ఆగమయ్య నాన్న పశువుల తోళ్ళ వ్యాపారి. ఇంట్లో అంతా ఈగల మోత. ముక్కుపుటాలు అదిరిపోయేలా కంపు వాసన. నాకు చలం వ్రాసిన మైదానం నవల గుర్తుకు వచ్చింది. నాకోసం నాలుగు రోజుల పాటు పక్కింటి వారినడిగి గది తీసుకున్నారన్న విషయం తెలుసుకొని.. వారింట్లోనే అద్దెకుందామని మొట్టమొదటి సారిగా ఆగమయ్యను కోరుకున్నాను. అద్దె నీబాబు చెల్లిస్తాడా.. అని    ఆగమయ్య నా చెంప ఛెళ్ళుమనిపించాడు. నేను గజ్జున వణకి పోయాను.

రాత్రుళ్ళు బాగా తాగి రావడం.. నాకిష్టమున్నా లేకున్నా.. పశువులా తన వాంఛ తీర్చుకొని మరో ఇంట్లో దూరటం నాకర్థమైంది.. అతని అభిమతం ‘కంచానికొక్కడు.. మంచానికిద్ద’రని. కన్నీరుమున్నీరయ్యాను. ఎవరికి చెప్పుకోను.. చెప్పుకున్నా నాముఖం మ్మీద ఉమ్మేయక మానరు. ఇది నా స్వయంకృపారాధం.

మొదటిసారిగా నాబుర్ర ఉపయోగించాను. నెలతప్పానని అబద్ధం చెప్పాను పర్యవసానం ఏంటో చూద్దామని. అది తెలిసిన మరుక్షణం అత్తా మామ.. ఆడపడుచు నా మీదకు మూకుమ్మడిగా దాడి చేసారు. మానాన్ననడిగి డబ్బులు తేవాలని.. లేదంటే.. తోలు వొలిచి అమ్ముకుంటామని బెదిరించాడు మామయ్య.  

రాత్రి పెద్ద గొడవ జరిగింది. నా చేత బలవంతంగా ఏదో ఆకుపసరు త్రాగించారు. నేను వాంతులు చేసుకున్నాను. ‘ఛస్తావో.. డబ్బు తెస్తావో.. తేల్చుకో.. విదాకులు కావాలా తీసుకో..” అంటూ మహా తేలిగ్గా చెప్పాడు ఆగమయ్య. “డబ్బు దండిగా తెచ్చే మరో దాన్ని తెచ్చుకుంటాను. మాచెల్లెలు పెళ్లి జరిపిస్తా”నంటూ.. నా ముఖంమ్మీద వాతలు పెట్టడానికి వస్తుంటే డబ్బు తెస్తానని ప్రాధేయపడి తప్పించుకున్నాను.           
జీవితాంతం మనం కలిసి నడుద్దామని బాస చేసి  కట్టుకున్న వాడు మానవత్వం మరిచి కనికరం లేకుండా కాలదన్నితే కండ్ల ముందర కనబడేవి రెండే  రెండు దారులు.  ఒకటి ఆత్మహత్యగా శిక్ష. లేదా పుట్టింటి ఆలింగనగా రక్ష.’ అనిమనసులో కరుణ కుమిలిపోతుంటే కాకి తలపై రెట్ట వేసింది. చటుక్కున ఈలోకానికి వచ్చింది కరుణ. హాండు బ్యాగులో నుండి వాటర్ బాటిల్ తీసుకొని నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మేసింది. మరి కాసిన్ని త్రాగింది. కాస్తా ఒంట్లో సత్తువ వచ్చినట్లనిపించి.. లేచి పుట్టింటి  వైపు ఒక్కొక్క అడుగు కదిపింది.
    గేటు తీసుకొని లోనికి వెళ్ళడం ధైర్యం చాలలేదు. సుశీల ఇల్లు ఊడుస్తున్నట్లు కిటికీలో నుండి కనబడుతోంది.

“అమ్మా..” అంటూ కరుణ దీనంగా పిలిచింది.

సుగుణమ్మ కిటికీలో నుండి చూస్తూ “చెయ్యి ఖాళీ లేదు..వెళ్లిరా..” అంది. వచ్చింది తన కూతురు కరుణ అని తెలుసు. కాని కరుణ చచ్చిపోయి నెల మాసికం సైతం పెట్టామని మనసులో సుగుణమ్మ కుత కుతలాడిపోతోంది.

గేటుపై తల వాల్చి బిగ్గరగా ఏడ్వసాగింది కరుణ.

భళ్ళున వీధి గుమ్మం తెరుచుకొని పరుగెత్తుకుంటూ వచ్చాడు సుగుణాకర్. గేటు తెరచి కరుణను హృదయానికి హత్తుకున్నాడు. అతని గుండె చెరువయ్యింది.

“ఆ దరిద్రపు దాన్ని ఇంట్లోకి రానివ్వకండి“ అంటూ సుగుణాకర్ వెనకాలే సుడిగాలిలా వచ్చింది సుశీల. చేతిలో చీపురు కరుణ వీపు చీరేస్తా అన్నట్లుగా ఊగుతోంది. సుగుణాకర్ కనుసైగతో..వీదిలో బాగుండదు అన్నట్లుగా సుశీలను వారించాడు.  కరుణను ఇంట్లోకి తీసుకెళ్లాడు.

“ఇదుగో.. ఇప్పుడే చెబుతున్నా.. నా చిట్టితల్లిని ఎవరూ ఏమీ అనొద్దు.. ఏమీ అడుగొద్దు. ముందుగా ప్రేషప్ కానివ్వండి” అంటూ సుగుణాకర్ మునుపటిలాగానే ప్రేమతో కరుణ తల నిమురాడు. అదే చేతులతో సుశీలను, అప్పుడే స్టడీ రూంలోనుండి వచ్చిన పెద్ద కొడుకు హరీంద్రనూ చూసుకుంటూ సమాధాన పర్చాడు. చిన్న వాడు  ఫణీంద్ర కండ్లను బండి చక్రాల్లా తిప్పుకుంటూ జీవశ్చవంలా వున్న  కరుణను చూడసాగాడు. సుశీల మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ వంటింట్లోకి దారితీసింది.

***

రాజ్యలక్ష్మి ఉత్తరం చదవడం కాసేపాపి తన కళ్ళజోడు సవరించుకుంటుంటే హాల్లోని వారంతా ఈ లోకానికి వచ్చారు. తిరిగి ఉత్తరం చదువసాగింది రాజ్యలక్ష్మి.

“మా అమ్మా.. నాన్న.. అన్నయ్య.. తమ్ముడు చూపిస్తున్న ఆదరణతో నేనింకా సజీవంగా వున్నాను.

మీరు సంఘ సేవకులుగా రాష్ట్రంలో మంచి పేరు గడించారు. మీ అడుగుజాడల్లోనే నేనూ నడవాలనుకుంటున్నాను. ప్రతీ పాఠశాలకు వెళ్లి నాజీవితానుభావాలను వివరిస్తూ.. పిల్లలను చైతన్యవంతులుగా తీర్చి దిద్దుతూ.. నాశేషజీవితం గడపాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకు అనువైన టీచరు ఉద్యోగానికై ప్రయత్నిస్తాను.

నన్ను దయతో క్షమించి మాకుటుంబంతో సంబంధం కలుపుకోవాలని ప్రార్థిస్తున్నాను” ఉత్తరం చివరి వాక్యాలు పూర్తిగా చదువలేక పోయింది రాజ్యలక్ష్మి. కళ్ళల్లో నిండిన నీటిని కళ్ళజోడు తీసి తుడ్చుకోసాగింది.

కరుణనోదార్చడానికై వెళ్తున్న సుశీల వెనుకాలే దృష్టి సారించిన రాజ్యలక్ష్మి లిప్తకాలం మౌనంవహించి తిరిగి  నోరు విప్పింది. ఆమె పెదాలపై కనీ కనబడని చిరునవ్వు విరబూస్తోంది.

తన నిర్ణయం ఏమిటోనని సుగుణాకర్ గుండె చేతిలో పట్టుకొని దీనంగా రాజ్యలక్ష్మి వంక చూడసాగాడు.

“చూడు అన్నయ్యా.. మా ఇంట్లో.. మీ ఇంట్లో.. ఒక్కర్తే అమ్మాయి. అమ్మాయిలను అల్లారుముద్దుగా పెంచాం. విద్యా బుద్ధులు చెప్పించాం. నేటి విద్యావిధానం అయితే నేమి.. మీడియా ప్రభావమైతే నేమి.. ‘మర్కటన్యాయ’  బాటలో నడిచే వయసులో మనసును అడుపుచేసుకోలేక పోతున్నారు.

పూర్వం పాఠశాల సమయాలలో పంతుళ్ళు.. తతిమ్మ సమయాలలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపే వారు. వారి భవిష్యత్తుకై బంగారు బాటలు వేసే వారు. కాని ఇప్పుడు వారికి సమయమెక్కడిది..? కరుణ చేసిన తప్పుకు మనమూ  బాధ్యులమే.
ఇపుడు కరుణ పశ్చాత్తాపంతో కుమిలి పోతోంది. ఆమె చేసిన ఒక తప్పుకు జీవితమంతా శిక్షించడం సబబుగాదు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను. కాని చేయదలచుకున్న సేవ పెళ్లి చేసుకున్నాక కూడా చెయ్యవచ్చు.  ఈ విషయాలన్నీ మేమంతా చర్చించుకునే వచ్చాం. మా రెండో అబ్బాయి కళ్యాణ్‍ను  మీరు చూసారుగా.. అతడు కరుణ అంటే ఆసక్తి కనబరుస్తున్నాడు. మాకూ మీ అమ్మాయి నచ్చింది. ఇదుగో కరుణా.. ఇటురామ్మా.. “ అంటూ పిలిచింది రాజ్యలక్ష్మి. పిలిచినప్పుదు రాక పోవడం మర్యాద అనిపించు కోదని. కరుణను  అడుగులో అడుగు వేయించు  కుంటూ తీసుకు వచ్చింది సుశీల.

“ఇదుగో  మా చిన్న బాబు  ఫోటో.. నీకు నచ్చితే మా ఇంటి చిన్న కోడలుగా చేసుకుంటాను.  మా కుటుంబ సభ్యులమంతా కలిసి తీసుకున్న నిర్ణయమిది. పూర్వం కుండ మార్పిడి అనేవారు ఇప్పుడు నేను కూతురు మార్పిడి అంటాను” అని చిరునవ్వుతో  కళ్యాణ్ ఫోటో కరుణ చేతిలో పెట్టింది రాజ్యలక్ష్మి.

ఇది కలా..! నిజామా..! అని స్థాణువై పోయారు సుగుణాకర్ దంపతులు. మోకాళ్ళపై కూర్చుండి రాజ్యలక్ష్మికి కృతజ్ఞతలు తెలుపుకోసాగారు.  
కరుణ రాజ్యలక్ష్మి కాళ్ళపై పడిపోయింది.

***

మరిన్ని కథలు
munduchoopu