Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
get ready young guns

ఈ సంచికలో >> యువతరం >>

ఆకాశంలో 'సగం' కాదు, 'అంతకు మించి'.!

womens day

మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుకున్నాం. ప్రపంచమంతా మహిళల సాధికారత కోసం నినదించింది. మహిళా స్వేఛ్చ, మహిళల హక్కులు తదితర అంశాల గురించి చర్చించుకున్నాం. పురుషాధిక్య ప్రపంచం మహిళల సాధికారత, గొప్పతనం గురించి చాలా చాలా చెప్పింది. ఏదేమైనా కుటుంబంలోనే తల్లితండ్రుల నుండి చైతన్యం మొదలవ్వాలి. ఆడపిల్లల్ని చదివించడం ఒక్కటే కాదు, దాంతో పాటుగా సమాజంలో అమ్మాయికి ఉన్న హక్కులేంటి? ఎలా ధైర్యంగా ముందడుగు వేయాలి వంటి విషయాలపై అవగాహన కల్పించాలి. స్కూలు, కాలేజీ, ఉద్యోగం చేసే వర్క్‌ ప్లేస్‌ ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులుంటాయి? వాటిని ఎలా అధిగమించాలి అనే విషయాలు తెలియచెప్పాలి. పలానా చదువు అబ్బాయిలకు మాత్రమే, పలానా ఉద్యోగం అబ్బాయిలకు మాత్రమే అనే రోజుల పోయాయి. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో కూడా మహిళలు రాణిస్తున్నారు.. ఇలాంటి చాలా విషయాల గురించి తెలుసుకుంటున్నాం. తెలుసుకుని మురిసిపోవడం ఒక్కటే కాదు. మగపిల్లలతో ఆడపిల్లలు సమానమే అన్న ఆలోచన నుండి, మగపిల్లల్ని మించి ఆడపిల్లలు అనే స్థాయికి పరిస్థితులు మారిపోయాయి.

అయితే ఎక్కడో చిన్నపాటి భయం అమ్మాయిల్ని అద్భుతాలు సాధించకుండా వెనక్కి లాగేస్తోంది. ఆ చిన్నపాటి భయాన్ని వీడితే, 'మహిళలూ మహరాణులూ' అన్న మాట సత్యం. ఇప్పటికే పారిశ్రామిక రంగంలో అమ్మాయిలు అద్భుతాలు సాధిస్తున్నారు. ఈ రంగంలో అబ్బాయిలతో పోలిస్తే, అమ్మాయిలే డెడికేషన్‌తో పని చేస్తున్నారనీ, సర్వేలు తెలుపుతున్నాయి. పెద్ద పెద్ద పారిశ్రామిక రంగాల్లో మహిళల పనితీరుకు, వారి ఆడ్మినిస్ట్రేషన్‌ స్కిల్స్‌కి అతిరధ మహారధులే షాక్‌ తింటున్నారు. వైద్య రంగంలో కూడా మహిళల పనితీరు అబ్బాయిలతో పోల్చితే చాలా మెరుగుగా ఉంటోంది. ఆకాశంలో సగం, అన్నింటా సగం అనే మాటకిప్పుడు కాస్త సాధికారత దక్కుతుందనే చెప్పాలి. అబ్బాయిలతో పోటీపడి, అన్ని రంగాల్లోనూ మహిళలు సాధిస్తున్న పురోగతి గతంతో పోల్చితే ఇటీవలి కాలంలో చాలా మెరుగుపడిందనే చెప్పాలి. ఈ ఉద్యోగం అమ్మాయిలకు సెట్‌ కాదు, అనే ఆలోచన నుండి ఇప్పుడు చాలా వరకూ స్వేఛ్చ లభించింది. అందుకే నేల పైనే కాదు, స్పేస్‌లో కూడా అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. ఇలా ఒక్కటేమిటి, విద్య, వైద్యం, ఇతర అడ్మినిస్ట్రేటివ్‌ రంగాలే కాక, రాజకీయాల్లో కూడా మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. సినిమాల విషయానికి వస్తే, తనలోని సృజనకు పదును పెడుతూ, కొత్త కొత్త మహిళా డైరెక్టర్స్‌ పుట్టుకొస్తున్నారు. సక్సెస్‌ అందుకుంటున్నారు.

స్త్రీ మూర్తి తనలోని శక్తిని మొదటగా తనంతట తానుగా గుర్తిస్తే, తానేంటో ప్రపంచానికి అర్ధమయ్యేలా చాటి చెప్పగలదు. అలాగే పురుషులు కూడా స్త్రీలను అన్నిరంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నారు. పురుషాధిక్య ప్రపంచం నుండి కాస్త బయటికి వచ్చి ఆలోచిస్తున్నారు. దాంతో మహిళ అంటే వంటింటి కుందేలు మాత్రమే అనే ఆలోచనలో మార్పు వచ్చింది. ప్రత్యేక సలహాదారుగా మహిళను గుర్తిస్తోంది పురుషాధిక్య ప్రపంచం. అందుకే ఇంటి పట్టునే ఉన్నా మహిళా శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. ఇంటి నుండే అద్భుతాలు సాధిస్తున్న మహిళలు ఎంతో మంది ఉన్నారు. తాము ఉపాధి పొందడమే కాదు, తనతోటి మహిళలు పది మందికి ఉపాధి కల్పించే ఆలోచనలు చేస్తోంది మహిళా లోకం. అప్పుడెప్పుడో లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని ఓ కవిగారు చెప్పినట్లు, నిజంగానే ఇప్పుడు మహిళా లోకం నిద్ర లేచింది. ఇదే తీరు కొనసాగితే, రాబోయే కాలంలో మహిళలు మరిన్ని ఇతర రంగాల్లో మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశాలతో పాటు, ఊహించని అద్భుతాలెన్నో సృష్టిస్తారనడంలో అతిశయోక్తి లేదు. 

మరిన్ని యువతరం