Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - ఇరవై ఒకటవ భాగం

Anubandhaalu twenty first Part

"బావా వీడు వట్టి రోగ్. వీడి మాటలు నమ్మకు. ప్రేమిస్తున్నాను. పెళ్ళిచేసుకుంటాను అంటూ నా వెంటపడి వేధించడం వీడికి అలవాటయిపోయింది. నాన్నతోగాని చెప్తే వూళ్ళో గొడవలవుతాయని ఓపిక పడుతుంటే వీడికి మరీ అలుసయిపోయింది. పద బావా, వెళ్ళిపోదాం." అంది ఉబుకుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ.

"ఏమిటే వెళ్ళేది? నేనుగాక నీ మెడలో తాళికట్టే మగాడు ఎవడంటా? ఏరా అమెరికా నీకేమన్నా అభిప్రాయం ఉందా దీన్ని చేసుకోవాలని? నా సంగతి తెలీదు. ప్రాణాలతో అమెరికా వెళ్ళలేవ్ గుర్తించుకో" అంటూ కళ్ళెర్రజేసి హెచ్చరించాడు.

"మహీ వీడ్ని నువ్వు ప్రేమిస్తున్నావా? దరహాసంతో అడిగాడు అనంత్.

"నేను కోరుకునేది నిన్నే బావా? ఆ కుక్కని కాదు" అంది కోపంగా.

"హలో గణపతి! విన్నావ్ గా. మహేశ్వరి నిన్ను ఇష్టపడ్డంలేదు. ఇక వెళ్ళిపో" గణపతిని హెచ్చరించాడు అనంత్.

"అరే అమెరికా! పిల్లినడిగి మెల్లో గంటకడతామా? దాని ఇష్టం ఎవడికి కావాలి? వచ్చిన దారినే అమెరికా వెళ్ళిపో. మహేశ్వరి నాది. జాగ్రత్త" అంటూ మరోసారి కళ్ళెర్రజేసాడు గణపతి.

"వెళ్ళకపోతే ఏం చేస్తావ్?"

"ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను"

"అలాగా... మహీ! వేడిని నేను కొడితే వూళ్ళో గొడవలవుతాయంటావా?"

"నువ్వు నన్ను కొడతావా... జోక్... గొప్ప జోక్" అని పగలబడి నవ్వాడు గణపతి.

"వద్దు బావా! రా వెళ్ళిపోదాం" అంటూ అనంత్ ను వెనక్కి లాగబోయింది మహేశ్వరి.

"ఎలా వెళ్లడం? ఈ కుక్క ఇక్కడ మొరుగుతూనే వుంటే వదిలేసి ఎలా వెళ్ళడం?"

"నన్ను కుక్క అంటావా? అయిపోయావురా. నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టకపోతే నా పేరు గణపతి కాదు" అంటూ కోపంతో మండిపోతూ పిడికిళ్ళు బిగించి మీదకు వచ్చేసి అనంత్ ను బలంగా కొట్టాడు గణపతి.

ఆ దెబ్బ తనకు తాకకుండా పక్కకు వంగుతూ తన పిడికిలితో గణపతి ముఖం మీద ఒక్క గుద్దు గుద్దాడు అనంత్. వాడు ఎదురుచూడని దెబ్బ. ముఖం పగిలిపోయినంత బాధతో పెద్దగా అరిచాడు. వాడికి సపోర్టుగా ఉన్న మిగిలిన ఇద్దరు కూడా ముందుకు దూకారు. దాంతో ఇక ఆగలేదు అనంత్. రెచ్చిపోయిన చిరుతపులిలా వాళ్ళమీదకు విరుచుకుపడ్డాడు. అతడు కొడుతున్న ఒక్కో దెబ్బకు ప్రత్యర్ధులకు నక్షత్రాలు కన్పిస్తున్నాయి.

అప్పటిగ్గాని మహేశ్వరికి అసలు విషయం అర్ధంకాలేదు. అనంతసాయి చూడ్డానికి మామూలు యువకుడిలా ఉన్నాడు గాని నిజానికి అతను కిక్ బాక్సింగ్ లో మంచి ప్రవేశమున్న యువకుడు. అతడ్ని పడగొట్టడం కాదుగదా, దెబ్బలనూ తప్పించుకోవడం వాళ్లకి సాధ్యం కాలేదు. చుట్టూ జనం చేరిపోయి ఏం జరుగుతుందో అర్ధంకాక కంగారుగా చూస్తున్నారు.

ముందునుండీ చూస్తున్న వాళ్ళకు తప్పెవరిదో తెలుసు కాబట్టి అనంత్ కు వత్తాసుగా వాళ్లని చితగ్గొట్టమని అరుస్తున్నారు.

వాళ్లని కొట్టడంలో అలా ఇలా కాదు. నెత్తురు చిందేలా కొట్టాడు అనంత్.

వాళ్లకు పారిపోయే అవకాశం కూడా ఇవ్వలేదు. అనంత్ కొట్టిన బాక్సింగ్ దెబ్బలకు గణపతి కూసాలు కదిలిపోయాయి.

"వదిలెయ్... ఇక వదిలెయ్, చచ్చిపోతాను" అంటూ అరిచాడు.

"వదలాల్సింది నేను కాదురా... మహేశ్వరి. వెళ్ళి కాళ్ళమీద పడి క్షమాపణ అడుగు.అది వదిలేస్తే నిన్ను వదిలేస్తాను. లేదంటే నిజంగానే చంపేస్తాను. ఇష్టంలేదని చెప్పినా వెంటపడి అల్లరి చేసే నీలాంటి చదువుకున్న పశువుల్ని బతికుండగానే తోలు వలిచి బుద్ధి చెప్పాలి" అంటూ మరో నాలుగు దెబ్బలు వేశాడు. ఇక తట్టుకోవడం వల్లకాక దొర్లుకుంటూ వచ్చి మహేశ్వరి కాళ్లమీద పడిపోయాడు గణపతి.

"బుద్దొచ్చింది మహేశ్వరీ! ఇక పొరబాటున కూడా నీ జోలికి రాను. నన్ను క్షమించు. వాడ్ని ఆగమని చెప్పు" అంటూ వేడుకున్నాడు.

ఇప్పుడు మహేశ్వరి ముఖంలో గర్వం తొణికిసలాడింది.

"ఏరా! నా బావ కొడితేనే మట్టి కరిచావ్. నా అన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? బతికుండగానే నిన్ను గోతిలో పెట్టి పూడ్చేస్తాడు. మా పెదమావయ్యకు, మా నాన్నకు తెలిసిందంటే మీ పునాదులు కదులుతాయి. ఏమనుకున్నావ్ రా? మీ నాన్న మంచితనం చూసి మావాళ్ళు సపోర్ట్ చేస్తే మీ నాన్న వూరికి ప్రెసిడెంట్ అయ్యాడు. అది మర్చిపోయి ప్రెసిడెంటు కొడుకునంటూ ఊళ్ళో రౌడీయిజం చేస్తున్నావ్. జాగ్రత్త! వెళ్ళిపొండి. పదబావా..." అంటూ అనంత్ చేయి పుచ్చుకొని లాక్కుపోయింది.

అంతదూరం వెళ్లి తిరిగి చూశాడు అనంత్.

"మరోసారి నా కంటపడే ప్రయత్నం చేయకు. అది నీకే మంచిది కాదు" అంటూ గణపతిని హెచ్చరించాడు.

రెండు వీధుల మలుపు తిరిగి తమ వీధిలోకి వచ్చేవరకూ ఇద్దరూ మాట్లాడుకోలేదు..

"నువ్వేం మాట్లాడవేమిటి?" ఇంటిని సమీపిస్తుండగా అడిగాడు.

"నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మాటలు రావడం లేదు" అంది మహేశ్వరి ఉత్సాహంగా.

"వాడిని కొట్టినందుకా?" పరిహాసంగా అడిగాడు.

అవునన్నట్టు తలవూపింది.

"థాంక్స్ బావా! నీ మరదలినయినందుకు నా పరువు కాపాడావ్. ఈ సంఘటనతో నాకో విషయం అర్ధమైంది" అంది.

"ఏమర్ధమైంది?" కుతూహలంగా అడిగాడు.

"నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో నాకు తెలీదుగాని నేనంటే నీకు చాలా ఇష్టమన్న విషయం అర్ధమైంది. ఇది చాలు. నువ్వెప్పుడూ నా మనసులో నిలిచిపోవడానికి" అంటూ అందంగా నవ్వి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా తమ మేడలోకి వెళ్లిపోయింది.

"డామిట్!... కొంపదీసి ప్రేమిస్తున్నాననే నిర్ణయానికి రాలేదు కదా!... అది మాత్రం సాధ్యం కాదులే" అనుకుంటూ మండువా లోగిట్లోకి నడిచాడు.

అప్పటికే సూర్యుడు అస్తమించి చీకట్లు అలుముకోవడం ఆరంభించాయి.

ఇంతలో రుసరుసలాడుతూ అవతల డాబా ఇంట్లోంచి మండువా లోగిట్లోకి వస్తున్న చెల్లెలు సాయిశివానీని చూసి అక్కడే ఆగిపోయాడు అనంతసాయి.

అనంతసాయి, మహేశ్వరీలు ఇద్దరూ గుడికి బయలుదేరి వెళ్లిన కొద్దిసేపటికే పొలం నుండి తన బైక్ మీద ఇంటికొచ్చాడు నవీన్. అనవసర విషయాలు కల్పించుకోవడమో, మితిమీరి మాట్లాడటమో అతనికి అలవాటు లేదు.

ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయాలనే పట్టుదల ఎక్కువ. పని పట్ల అతనికున్న శ్రద్ధ చూసి వూళ్ళో వాళ్ళే మెచ్చుకుంటారు. ఎంతో చదువుకొని కూడా వ్యవసాయం పట్ల అతను చూపే మక్కువ మెచ్చుకోదగింది. పెదమావయ్య రామలింగేశ్వర్రావు గానీ, తండ్రి రఘునాథ్ గానీ వ్యవసాయం విషయంలో నిశ్చితంగా ఉంటున్నారంటే కారణం నవీన్.

సాధారణంగా చీకటిపడితే ఇంటికి రాని నవీన్ అయిదు గంటలకే తిరిగి రావడం చూసి భ్రమరాంబ ఆశర్యపోయింది.

"ఏమిట్రా? పనయిపోయిందా?" అనడిగింది.

"లేదమ్మా! ఇంకా కొంతమేర మిగిలిపోయింది. మూడింటిలోను ఒక స్ప్రేయర్ పనిచేయడంలేదు. విత్తనాలు మొలకెత్తవు. మందులు పనిచేయవు. కరెంట్ ఉండదు. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలున్నా వేస్ట్. నిమ్మకు నీరెత్తినట్లుండే మన్మోహన్ సింగ్, భవిష్యత్తు దృష్టిలో లేని కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళు నాయకులు. మన ఖర్మ." అన్నాడు ఆవేశంగా.

"పోన్లేరా... పొద్దుటే కొట్టొచ్చులే. పురుగుల మందులేగా, ఎప్పుడు కొడితే ఏమైంది?" అంది తేలిగ్గా తీసుకుంటూ భ్రమరాంబ.

"మళ్ళీ రేపేమిటమ్మా! ఈ పూట అయిపోవాలి. మనింట్లో స్ప్రేయర్, టార్చ్ లైట్ తీసుకెళదామని వచ్చాను. రేపంటే మళ్ళీ కూలీలకు డబ్భు ఖర్చు. త్వరగా చూడు ఎక్కడున్నాయో."

"బాగుంది. టార్చ్ లైట్ మీ నాన్న గదిలో ఉంది. స్ప్రేయర్ ఇక్కడ లేదు. డాబా ఇంట్లో అటక మీద పెట్టిన గుర్తు."

"సరే. నేను వెళ్లి తెచ్చుకుంటాను. టార్చి లైట్ తీసివుంచు." అంటూ వేగంగా డాబా ఇంట్లోకి వెళ్లాడు.

అతను వెళ్లేసరికి...

అక్కడ హాల్లో శివానీ ఒక్కతే కూచుని టి.వి. లో ఏదో దయ్యాల సినిమా చూస్తోంది. అనుకోకుండా లోనకొస్తున్న నవీన్ ని చూసి కంగారుపడింది.

"ఏయ్... అన్నయ్య లేడు. ఇక్కడికెందుకొస్తున్నావ్?" దబాయించింది.

"ఏయ్ కాదు పిలవాలనుకుంటే బావాని పిలు. అయ్ ఏయ్ అంటే ముఖం పగిలిపోతుంది." అంటూ హెచ్చరించాడు.

"అలాగే బావగారూ? ఎందుకొచ్చారు?" వెటకారంగా అడిగింది.

"ఆ! నీ అందం చూసి మురిసిపోదామని ముఖం చూడు. నీ పని చూసుకో అంటూ కసురుకొని ఆ హాలునానుకొని ఉన్న గదిలోంచి అవతలి స్టోర్ రూంలోకెళ్లి అటకమీద లైట్  స్విచ్ వేసాడు.

విషయం ఏమిటో అర్ధంగాక లేచి, తనూ లోనికొచ్చింది శివాని. నవీన్ నిచ్చెన అటకకు వేసి ఆమెను పిలిచాడు.

"వచ్చిందానివి ఎలాగూ వచ్చావు. జారిపోకుండా కాస్త ఈ నిచ్చెన పట్టుకో. పైకి ఎక్కాలి." అన్నాడు.

"పైన ఏముంది?" కుతూహలంగా అడిగింది.

"చూడాలనుందా?"

"ఒక్క నిమిషం ఆగు. నేను పైకెళ్ళి వచ్చేస్తాను. తర్వాత నువ్వు చూద్దూగాని. నిచ్చెన పట్టుకో."

"ఓ. కె..." అంటూ నిచ్చెన పట్టుకుంది శివానీ.

తను చకచకా పైకి ఎక్కి అటకమీదికి వెళ్ళాడు.

తనకు అవసరమైన మోటార్ స్ప్రేయర్ పట్టుకుని వెళ్ళినంత త్వరగానూ నిచ్చెన దిగి వచ్చేసాడు.

"ఏమిటి పైకి వెళ్లి చూస్తావా?" అడిగాడు.

"ఏమున్నాయ్ అక్కడ? ఇలాంటివేనా?" అనుమానంగా అడిగింది.

"చాలా ఉన్నాయ్. వెళ్లి చూడు"

"ఇది ఎందుకు?"

"పొలంలో పైరుకు మందులు కొట్టే స్ప్రేయర్. మీ అమెరికాలో వుండవా?"

"ఉంటాయేమో! నాకు తెలీదులే. నిచ్చెన పట్టుకో. నేను పైకివెళ్ళి చూసొస్తాను"అంటూ మూడు మెట్లు ఎక్కి, తిరిగి చూసింది.

"నాకు భయంగా ఉంది. గట్టిగా పట్టుకో" హెచ్చరించింది.

"సర్లే నీ బరువుకి నిచ్చెన విరుగుతుందని నేను భయపడుతున్నాను."

"బావా! నన్ను ఉడికించాలని చూడకు. కోపం వస్తుంది నేనేమీ అంత బరువుకాదులే."

"మంచిదేగా ఎక్కు."

"ఇదిగో నీకోమాట చెప్పాలనుకొంటున్నాను. వాళ్ళేదో అంటున్నారని నన్ను పెళ్ళి చేసుకోవాలనేమీ ఆలోచన పెట్టుకోకు. నాకిష్టం లేదు. అర్ధమైందా?"

"ఆ చింతే నీకు అక్కర్లేదు బేబీ! దెయ్యాన్ని పెళ్ళిచేసుకోవాలనే ఆలోచన నాకు లేదు."

"యూ. నేను దెయ్యాన్నా... అందమంటే తెలీని మొద్దువి. అందుకే ఐ డోన్ట్ లైక్ యూ."

"షటప్! ఐ డోన్ట్ కేర్ యూ. అండర్ స్టాండ్. నిచ్చెన విరిగేలా వుంది. త్వరగా పైకివెళ్ళి చూసిరా" అంటూ నవ్వేశాడు.

"అదే. ఆ వంకర నవ్వంటే నాకు వల్లుమంట. ఆగు వచ్చాక నీ పని చెప్తా. నేను దెయ్యాన్నా... మైగాడ్!" అంటూ సణుగుకుంటూనే అలవాటులేని నిచ్చెన మెట్ల వంక పాకుతూ
పైకి వెళ్లి అటక ఎక్కింది.

అటకమీద పనికి వచ్చేవి, పనికిరానివి వ్యవసాయ పనిముట్లు ఇతర సామాగ్రి చెల్లాచెదురుగా పడున్నాయి.

"ఏమిటి చూసావా?" కింద నుంచి అడిగాడు నవీన్.

"చూసాను గాని, ఏంటి బావా! పనికిమాలినవన్నీ ఇక్కడ పారేసారేమిటి?" ఆశ్చర్యపోతూ అడిగింది.

"పనికొచ్చేవి ఏమైనా వున్నాయేమో చూడు. నేను మళ్ళీ వస్తాను." అంటూ నిచ్చెన తీసి పక్కన పడేసాడు.

అదిరిపడింది శివానీ.

"మైగాడ్! నిచ్చెన తీసావేమిటి? నేను దిగిపోతాను. నిచ్చెన వెయ్యి." భయం భయంగా కిందకు తొంగి చూస్తూ అరిచింది.

"వద్దులే. అక్కడే కూర్చో. టాటా... బై... బై..."

"ఒరే బావా. చంపేస్తాను. నిచ్చెన వెయ్యరా."

"వెయ్యను గాక వెయ్యను. ఏమిటీ? నేనంటే ఇష్టంలేదా... పెద్ద అందగత్తె దిగొచ్చిందండి. అమెరికా పొగరు. నీలాంటి దెయ్యం అటక మీద ఉంటేనే అందంగా ఉంటుంది. అక్కడే గంతులెయ్యి.

పిచ్చిపిచ్చి డాన్సులు చేస్తావ్ గా?" అంటూ పెద్దగా నవ్వుతూనే బయటకొచ్చేసాడు.

ఏడుపు ముఖంతో అటకమీద నుంచి పెద్దగా కేకలు వేస్తూనే ఉంది శివాని.

స్ప్రేయర్ తో తమ ఇంటికొచ్చేసి తల్లి అందించిన టార్చ్ లైట్ అందుకుని బైక్ వద్దకు పోబోతూ ఆగాడు. కొడుకు ముఖంలో నవ్వు చూడగానే ఏదో జరిగిందని కనిపెట్టేసింది భ్రమరాంబ.

"ఏమిట్రా ఆ నవ్వు... ఏమైంది?" అనడిగింది.

ఆ మాటతో నవ్వాపుకోలేక పైకి నవ్వేశాడు నవీన్.

"అమెరికా దయ్యం అటకెక్కిందిగాని, వెళ్ళి దించు. లేకపోతే రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది." అంటూ గబగబా వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు.

"ఒరె ఒరె! ఆగరా!" అంటూ తల్లి పిలుస్తున్నా వినకుండా తన దారిన పొలం వెళ్లిపోయాడు. మొదట అతడి మాటలు భ్రమరాంబకు అర్ధం కాలేదు.

అర్ధం కాగానే కంగారుపడిపోతూ డాబా ఇంటికి పరిగెత్తింది. ఆమె ఊహించినట్టే దిగటం ఎలాగో తెలీక అటక మీద కూర్చుని కేకలేస్తూ కనిపించింది శివాని.

వస్తున్న నవ్వుని ఆపుకుంటూ నిచ్చెన వేసింది భ్రమరాంబ.

"అత్తా! వాడెక్కడ? ఆ కోతి. రాక్షసుడు, వాడ్ని చంపేస్తాను. నన్ను అటకెక్కించి నిచ్చెన తీసేస్తాడా? పైగా నిన్ను పంపించాడా? ఎక్కడ వాడు?" అంటూ కోపంతో మండిపోతూ గబగబా మెట్లుదిగబోతూ మూడు మెట్లపైనే కాలుజారి పడిపోయింది. సమయానికి భ్రమరాంబ పట్టుకుందిగాని లేకపోతే విరుచుకుపడేది.

మేనకోడలి అవస్థ చూసి ఇక నవ్వాపుకోవడం భ్రమరాంబకు సాధ్యం కాలేదు. పెద్దగా నవ్వేసింది. దాంతో మరింత ఉడికిపోయింది శివానీ.

"అత్తా! నీ కొడుకు చేసిన వెధవపనికి నీకు నవ్వొస్తోందా? ఐ హేట్ యు... ఐ హేట్ యువర్ సన్. వాడ్ని వదలను. ఎక్కడ వాడు?" అరిచింది.

"అదేమిటే... అసలు అటక ఎందుకెక్కావ్ నువ్వు?" నవ్వాపుకుంటూ అడిగింది భ్రమరాంబ.

"ఎందుకా... నీ కొడుకునే అడుగు. నేను దయ్యాన్నట... అసలేమనుకుంటున్నాడు నా గురించి? గొప్ప అందగాడ్ననుకుంటున్నాడా...? వాడు ఎక్కడ?"

"చూడు. ఎక్కడున్నాడో వెళ్ళి నువ్వే చూడు" అంది భ్రమరాంబ.

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
nadiche nakshatram telugu serial fifteenth part