Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> సo నామం

samnaamam

ఎక్స్క్యూస్ మి సార్.అన్నాడో యువకుడు గుమ్మం దగ్గర నుంచుని.చూడ్డానికి చక్కగా ఉన్నాడు.చేతిలో ఏదో పుస్తకం కూడా ఉంది.సందేహం లేదు.వీడు రియల్ ఎస్టేట్ స్థలమో పోలమో కొనమని ,లేదా హీనపక్షం ఫోన్ నెంబర్ అయినా ఇమ్మని తినేస్తాడు.పోనీలే అని ఫోన్ నెంబర్ ఇస్తే ఒక్కసారంటే ఒక్కసారి వచ్చి మా వెంచర్ లు చూడండని వేధించేస్తారు.  అనుకున్నాడు శేఖరం మనసులో అతని వంక ధీర్ఘంగా చూస్తూ.
ఆ యువకుడే మళ్ళీ ,సార్ మిమ్మల్నే అన్నాడు.

వద్దు బాబూ వద్దు.నాకు స్థలాలు, పొలాలు కొనే ఉద్దేశం కానీ,ఆ ఆర్దిక స్థోమత కానీ లేవు.వెళ్ళిరా చెప్పాడు శేఖరం.

సార్ క్షమించాలి .మీరు పప్పులో కాలేసారు.చిన్న నవ్వు నవ్వాడతను.

ఇందాక వంట చేస్తూ పప్పు తాలింపు పెట్టినప్పుడు నా కాలి మీద పప్పు పడిందా ఖర్మ అని మనసులో అనుకుంటూ తన కాళ్ళ వంక చూసుకుని అరె ఏం లేదుగా అన్నాడు.

అరె మీరు భలే చమత్కారంగా మాట్లాడతారు సార్ .అందుకే ,మీ ఈ చమత్కారాన్నీ ,మీలోని కవినీ సన్మానించాలనే మా సంస్థ వారు మీ అనుమతి తీసుకు రమ్మని నన్ను పంపారు.చెప్పాడతను కాస్త వినయంగా

నాకు సన్మానమా.ముఖంలో కొంచెం ఉత్సాహం కనబరచాడు.వెంటనే అతని చేతిలోని గరిటెని దివానీ కాట్ పైకి విసిరేసి రండి రండి లోనికి రండి అని అతన్ని సాదరంగా ఆహ్వానించి,ఏవేవ్ లక్ష్మి ఓ సారి ఇటురా బిగ్గరగా పిలిచాడు.

ఏంటి మీ సోది సీరియల్ చూడనివ్వకుండా.అని నసుగుతూ నడుచుకొచ్చింది లక్ష్మమ్మ.

సోది కాదే సోడాకాయి మొహందానా.నాకు సన్మానమట.ఇన్నాళ్లూ నన్ను కవిగా ఎవరు గుర్తిస్తారూ అదీ ఇదీ అనేదానివిగా.ఇప్పుడు చూడు ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చారు.వెళ్ళి టీ పెట్టి పట్టుకురా .ఆర్డరేయడంతో అక్కడినుండి వంటగదిలోకి నడుస్తూ పోయిందామె. అవునూ అని ఆ కుర్రాడు వైపు పరిశీలనగా చూసి నీ పేరు అడిగాడు శేఖరం.

వామన రావు చెప్పాడతను. అలా వారి మాటా మంతీ కొనసాగుతుండగానే .అక్కడికి వచ్చిన లక్ష్మమ్మ ,మీ సంస్థ పేరేమిటి నాయనా.
సాహితీ పాతాళం అండీ .మీరు కావాలంటే మా సంస్థ గురించి వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు.

అలాగా, అంతా బానే ఉందిగానీ నాయనా ఈయనికి మించిన కవులు ఈ ఊరిలో కౌరవులంతమంది ఉండగా ఈయనేదో ఏకలవ్యుడైనట్టు ఇతన్ని వెతుక్కు మరీ వచ్చావేం .అడిగింది లక్ష్మమ్మ చిన్నగా బుగ్గలు నొక్కుకుంటూ.

అదే మేడమ్ ఇక్కడ మా సంస్థ చేస్తున్న వినూత్న ప్రయత్నం .గొప్ప కవులూ,మేధస్సు గల కొత్త వారికే మా ప్రాధాన్యత.ఆల్రెడీ పబ్లిసిటీ ఉన్నవారికెందుకూ మళ్ళీ పబ్లిసిటీ.చెప్పాడతను.

అది కాదు నాయనా.అని లక్ష్మమ్మ మరింకేదో అడిగేoతలో ,అబ్బా లక్ష్మి ,నువ్వు ఉండు పుండు లా సలుపెట్టక.అని ఆవిడ నోరు నొక్కేసి ,అవునూ ఇంతకీ సన్మానం ఎప్పుడు ,ఎక్కడ అడిగాడు ముఖంలో నవ్వుతో. సన్మానం ఎల్లుండే సార్.మన జలగ ఆడిటోరియమ్ లో సాయంత్రం ఆరు గంటలకి .మీకు సన్మాన పత్రం, ఇరవై వేల నగదుని మీకు అందజేస్తారు.కానీ పూలదండలూ,శాలువాలూ మీరే తెచ్చుకోవాలి.ఒక వేళ అవి మేమే కొని మీకు కప్పాలి అంటే వాటికి ఓ అయుదు వేలు మాకు ఇస్తే చాలు చక్కటి పెద్ద పూలదండ,మరియు శాలువా మేమే కొని మీకు కప్పుతాం.ఎల్లుండి లోపు మంచి దండలూ శాలువాలూ మీరు కొనాలంటే కష్టమని ఈ సలహా ఇచ్చాను.అలాగే అందరూ మమ్మల్నే కొనమన్నారు.మీరు మాత్రమే వేరుగా కొనుక్కుంటే మీ శాలువా ,దండ వేరుగా కనిపిస్తాయి.చెప్పాడు వామనరావు.
ఆ మాటలు విన్న లక్ష్మమ్మ కొంచెం అసహనంగా, అసలు సన్మానం ఎందుకో తెలీదు .ఎవరు చేస్తారో తెలీదు కానీ నీకు మాత్రం డబ్బులు ముందే ఇవ్వాలా.

అబ్బా, డబ్బాలా చప్పుడు చేయక కొంచెం ఒబ్బిడిగా మాట్టాడు మరి.అని మళ్ళీ ఆమెని వారించిన శేఖరం ,అతను అడిగినట్టే అయుదు  వేలు తీసి ఇచ్చేశాడు.

తరవాత అతను చెప్పిన రోజు,టిప్ టాప్ గా బాగా తయారయ్యాడు.తర్వాత ఆ కాలనీ వారికీ చెప్పాడు. దూరంగా ఉన్నవాళ్లకి వాట్సప్ లో తెలియజేశాడు.విషయం ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు.అంతా అయ్యాక ఆ రోజు రానే వచ్చింది.శేఖరం ఆనందానికి అవధులు లేవు. ఆ ఆడిటోరియమ్ కి వెళ్ళాడు.ఒక్క బేనర్ కూడా లేదు.లోపలికెళ్ళాడు.జనం ఓ మాదిరిగా నిండారు.బహుశా నింపారు.అనుకున్నాడు మనసులో.సభ లో ఒకే బేనర్ ఉంది దానిపై తనతో పాటు పది మంది కవుల పేర్ల వరకూ ఉన్నాయి.కొంచెం పట్టి,పట్టి చూడగా ఆ సన్మానం పదం కూడా తప్పుగా రాయించారు.మా కింద నా ఒత్తు పడింది.దాంతో సమ్నామo అని ఉంది.కొద్ది సేపటికి అందరికీ సన్మానం చేశారు.అది కూడా చాలా వేగంగా చక చకా ఓ ఎం.ఎల్.ఎ చేతుల మీదుగా శాలువాలు కప్పించి ఓ దండ,ఫోటో టప టపలాడించి పక్కకి నెట్టేశారు.ఆ ఎం.ఎల్.ఎ కి టైమ్ తక్కువగా ఉందట.అందుకే అతనితో అలా ఆ సన్నాసి కార్యక్రమం అదే సన్మాన కార్యక్రమo దడ దడలాడించారు.తర్వాత వామనరావుని ,ఇదేంటి నాకు ఇరవై వేలు నగదు పురస్కారం కదా ఇస్తానంది.అడిగాడు.

మీకు సన్మానమే ఎక్కువ సార్.కానీ ఏదో చేస్తున్నాం.సంతోషించండి.అయినా అంతా మీకే ఇచ్చేస్తే మా సంస్థకి ఏం మిగులుతుంది.అందుకే మీకు పది మాకు పదివేలూనూ.అయినా మీలాంటి వాళ్ళు వీదికో పదిమంది దొరుకుతారు.కానీ మీకు సన్మానం ఖర్చు, ఈ కార్యక్రమ ఖర్చు భరించే స్పాన్సర్ ని పట్టుకోవడం ఎంత కష్టమో తెలుసా.అర్దం చేసుకోండీ.చెప్పి అక్కడినుండి వెళ్లిపోయాడు.

వినినంతనె వేగపడక అని అందుకే అంట.నే చెప్తే విన్నారూ.సన్మానం అనగానే సర్వం మర్చిపోయి ఎగబడి ఎదురెళ్ళకూడదు.మీ లాంటి వారి బలహీనతల్నే ఇలా కొందరు డబ్బు చేసుకుంటున్నారు.అన్నీ కనుక్కుని ,ఆ సంస్థ స్వరూపం తెలుసుకున్నాక ఒప్పుకోవాలి కానీ ఇలా గుడ్డిగా ఎదురెళ్తే ఇలానే ఉంటుంది. మోసపూరిత మూస సన్మానాలకి బలైపోతారు.చెప్పింది లక్ష్మమ్మ,శేఖరం వంక తినేసేలా చూస్తూ.అప్పటికే మొహం వెళ్లాడేసిన శేఖరం, వాడి పేరు వామన రావు అన్నప్పుడే నేను గ్రహించాల్సింది.నన్ను “బలి” చక్రవర్తి ని చేస్తాడని.ఇది సన్మానం కాదు.సం టైప్ ఆఫ్ నామం. అదే సo నామం అనుకున్నాడు మనసులో కసిగా .

మరిన్ని కథలు
paschattapam