10వ తరగతి ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంటర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఆ సెట్ ఈ సెట్ అంటూ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కి రంగం సిద్ధమవుతోంది టెన్త్, ఇంటర్ విద్యార్ధులే కాదు, డిగ్రీలు పూర్తి చేసినవారు కూడా ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వైపు మళ్లాల్సిందే. తప్పదు పోటీ ఆ రకంగా ఉంది. వాడెవడో మెడిసన్ చేశాడు. వీడెవడో బీటెక్ చేశాడు. కాబట్టి మా పిల్లల్ని కూడా అలాగే చేయించాలి అని చాలా మంది తల్లితండ్రులు భావిస్తున్నారు. మెడిసెన్ అనే కాదు, మిగిలిన గ్రూప్స్‌కి సంబంధించి కూడా తల్లితండ్రుల ఆలోచనలు ఇదే రకంగా ఉంటున్నాయి తప్ప, పిల్లల ఆలోచనలకు విలువిచ్చే పేరెంట్స్ కనిపించడం లేదు. తమ ఆలోచనల్ని, కోరికల్ని పిల్లలపై బలవంతంగా రుద్దేస్తున్నారు. అదే సమయంలో పిల్లలు కూడా తమ ఇంట్రెస్ట్ దేనిపై ఉంది అనే భావన మర్చిపోయి, తల్లితండ్రుల కోరికలు నెరవేర్చాలనో లేక ఘనంగా చెప్పుకోవడానికి బాగుంటుందనో, తమ ఆలోచనను పక్కన పెట్టేసి ఆయా సెట్స్ వైపు పరుగులు తీస్తున్నారు.
ఈ వయసు చాలా కీలకం. టెన్త్, ఇంటర్ పూర్తి చేసిన ఈ విద్యార్ధులే రేపటి సమాజ భవిష్యత్‌కి దిశా నిర్దేశకులు అన్న విషయం మర్చిపోకూడదు. అందుకే ఈ సమయంలో విద్యార్ధులకు మంచి కౌన్సిలింగ్ అవసరం. ఆ కౌన్సిలింగ్‌ని ఇంటి నుండే మొదలెట్టాలి. ఇంటి ఆర్ధిక పరిస్థితులను పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పాలి. పిల్లలతో కలిసి కూర్చోని ఇతరత్రా ఫైనాన్షియల్ ఇబ్బందుల్ని గురించి వారికి వివరంగా చెప్పే ప్రయత్నం చేయాలి. అలాగే వారి ఇంట్రెస్ట్ దేనిలో అనే విషయాన్ని ప్రత్యక్షంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో బలవంతపు ఆలోచనలకు తావుండదు. సరికదా, పిల్లల్లో దాగున్న ఇన్నోవేటివ్ థాట్స్ బయటికి వచ్చే అవకాశాలుంటాయి. ఇకపోతే తల్లితండ్రుల ఆలోచనలకు తగ్గట్లుగానే పలు దళారీ సంస్థలు ఇదే అదను చూసుకుని విజృంభిస్తున్నాయి. తమ తమ సంస్థల పేరు ప్రఖ్యాతల కోసం ర్యాంకింగ్ హైక్స్ కోసం మేథస్సు ఉన్న పిల్లల్ని రకరకాల ఆఫర్లు చూపి ఆశపెడుతున్నారు. వాటికి ఎట్రాక్ట్ అయిన తల్లితండ్రులు తమ పిల్లల్ని అటు వైపుగా మళ్లించే ఆలోచన చేస్తున్నారు.
అలా కాకుండా, తమ పిల్లల మనసును ముందుగా తల్లితండ్రులు అర్ధం చేసుకుని, పేరు కోసమో, లేక తాము సాధించలేకపోయాం కాబట్టి, తమ పిల్లలతో సాధించుకోవాలన్న మూర్ఖపు ఆలోచనతో ఆస్థులూ, అంతస్థులూ అమ్మి, పిల్లలకు ఇంట్రెస్ట్ లేని రంగాల వైపు బలవంతంగా మళ్లించకుండా, వారి ఇష్టాఇష్టాల్ని గమనించి, ఆ దిశలో వారు పయనించి, భవిష్యత్తు పూల బాట వేసుకునేలా సెట్ చేయాల్సిన బాధ్యత తల్లితండ్రులదే. అలాగే పిల్లల్లో కూడా కాంప్రమైజ్ అయిపోయి కొందరు, కాంప్రమైజ్ కాలేక బలవన్మరణాలకు పాల్పడే వారు కొందరూ ఉన్నారు. ఇలా కాకుండా, తమకేది ఇష్టమో, ఏ సెట్‌లో తమకి ఇంట్రెస్ట్ ఉందో, ముందు తల్లితండ్రుల వద్ద ధైర్యంగా చెప్పగలిగి, తమకి నచ్చిన బాటను ఎంచుకుని జీవితాన్ని నచ్చిన దారిలో సెట్ చేసుకొనే ఆలోచన చేస్తే బావుంటుంది. నేటి యువతే రేపటి భవిత, ఈ యువత భవిత బాగుంటేనే సమాజం మరింత అభివృద్ధి చెందుతుంది.
|