Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue259/695/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)...

గాయత్రి కాచిగూడా లోని తన పుట్టింటికి దగ్గరగా ఆటో దిగింది.

అప్పుడు సమయం మధ్యాహ్నం రెండున్నర..

బాబుని గుండెలకి హత్తుకుని, చేతిలో సంచితో భయం, భయంగా ఆటో దిగి ముందు ఆమె దృష్టి తన చేత తప్పటడుగులు వేయించదానికి కారణం అయిన వేప చెట్టు మీదకి వెళ్ళింది.

ఇక్కడే ఒక నాడు  తన కోసం ఒక కాలు చెట్టుకి తన్నిపెట్టి నిలబడి ఎదురుచూస్తూ గంటలు, గంటలు ఉండేవాడు రమేష్. నిట్టూర్చింది. ఆమె కళ్ళు గంగరాజు షాప్ కోసం వెతికాయి. ఆ షాప్ మూసి ఉంది.. అయితే షాప్ తెరిచి చాలా కాలం అయినట్టు షాపు ముందు చెత్త చెదారం పేరుకుపోయి ఉంది.

మెల్లగా అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న పాపాయిలా నాలుగు అడుగులు వేసింది.

ఓ గాయత్రీ ... ఆ పిలుపు వినగానే ఆమె కాళ్ళు స్తంభించి పోయాయి. గిరుక్కున వెనక్కీ తిరిగింది.

శంకర్ ... ఇంటి పక్కనే ఉండే శంకరయ్య. 

ఆమెని చూడగానే బోలెడంత ఆశ్చర్యపోయి దగ్గరగా వచ్చి అడిగాడు “ నువ్వు గాయత్రివేనా.. ఎందుకొచ్చినవ్ ... నడు నడు”అంటూ కంగారుగా ఆమె చేయి పట్టుకుని అక్కడి నుంచి లాక్కొచ్చి  రోడ్డు మీదకి తీసుకొచ్చాడు.

గాయత్రి అయోమయంగా అతడిని చూస్తూ “అమ్మ ... నాన్న “ అంది.

“ఎవ్వరు లేరు.. నువ్వు ఇన్ని దినాలు ఏడికి పోయినవు..... ఎడ నుండి వస్తున్నవు ..? అందర్నీ పరేషాన్ చేసినవు గద” అంటూ ఆమె వెళ్ళిపోయిన తరవాత అక్కడ జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు.  చివరలో ఆమె గుండె ఆగిపోయే విషయం చెప్పాడు..” మీ వొల్లు ఈడ నుండి కాలి చేసి ఏడకి పోయిన్రో ఎవరికి ఎరకలేదు ... కొన్ని దినాలు ఏడనో ఉన్నరంట ... మల్ల  ఆడ గూడ కాలి చేసి పోయిన్రంట ... మీ నాయన సచ్చిపోయిండంట..”

గాయత్రి నిలువెల్లా వణికిపోతూ గట్టిగా అరిచింది ... “లేదు .... మా నాన్న చచ్చిపోలేదు... అంత మాట అనద్దన్నా... అనద్దు”  అంటూ భోరుమంది.

శంకర్ ఓదారుస్తూ అన్నాడు.. “ ఏమో అందరు అనవట్టిన్రు... పోక పోవచ్చులే ...ఏడ్వకు.  ఇప్పుడు నువ్వు ఈడ  కనపడినవంటే బస్తోల్లు నిన్ను బత్కనియ్యరు ... జల్ది ఈడి నుండి  పో ...”

గాయత్రి నిస్చేష్టురాలై చూసింది..

“ఎందుకు అంది ... నేనేం చేశాను వాళ్ళని” అంది.

“బస్తి ఇజ్జత్ తిసినావ్ ... గా రమేష్ గాని తోని లేచిపోయినవ్ గద ... ఆడు సచ్చిన్దంట గద ... నువ్వెందుకు వచ్చినావ్ ...” గండి పడిన నదిలా దుఃఖం ఉప్పొంగి... గాయత్రి  కళ్ళు స్రవించ సాగాయి .

ఎందుకు? బస్తి వాళ్ళకి ఏం పని.. తన జీవితం తనది.. తను ఇక్కడికి వాళ్ళ కోసం రాలేదే..

తన తల్లి, తండ్రులను వెతుక్కుంటూ వాళ్ళ క్షమాభిక్ష కోసం వచ్చింది.. అన్నీ కోల్పోయి ఆశ్రయం కోసం వచ్చింది.. తనని బతకనివ్వక పోయేంత తప్పు చేసిందా.. లేదే..

“పో గాయత్రీ ... ఎల్లిపో .. నిన్ను చూస్తుంటే మస్తు జాలైతుంది.. లేపుకు పోయిన గా రమేష్ గాడు సచ్చి నీకు అన్నేయం చేసిండు... పాపం ... ఎట్ల సచ్చిండు.. టక్కర్ అయినదంట గద ... “ గాయత్రి సమాధానం చెప్పలేదు.

“పాపం దేవుడు నీకు అన్నేయం చేసిండు.. ఎట్ల  బత్కతవు మగోని తోడు లేకుంటే ఆడదాని బతుకు చౌరాస్త నే ... పోనీ నేనన్న ఉంచుకుందమంటే నీ కెరికే గద నా పెండ్లం గయ్యాలి గంప...పో.. ఏడనన్న బతుకు.. నీకె దిక్కులేకపాయే గా పోరడిని ఎందుకు గన్నవు?”
చెళ్ళున కొరడాతో గుండె మీద  కొట్టినట్టు అయింది గాయత్రికి.  అతని మొహంలోకి  వెర్రిదానిలా చేష్టలుడిగి చూడసాగింది.   తనకన్నా దాదాపు పదిహేనేళ్ళు పెద్దవాడు ... చెప్పాలంటే తండ్రి లాంటి వాడు.. చిన్నప్పటి నుంచి ఎత్తుకు తిరిగాడు.. అలాంటిది ఇప్పుడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు.

గాయత్రి ఇంక అతని మాటలు వినలేదు.  గిరుక్కున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. రోడ్డు మీదకి వచ్చిన గాయత్రికి ఉప్పెనలా దుఃఖం ముంచుకు వచ్చింది.

కడుపులో నిన్నటి నుంచి ఏమి లేకపోవడంతో కళ్ళు తిరుగుతున్నాయి.  నడిచే శక్తి కూడా లేకుండా కాళ్ళు నిస్సత్తువగా అయాయి. అతని మాటలు చెవుల్లో హోరులా వినిపిస్తున్నాయి.. ఒళ్ళంతా ఆవేశంతో మండిపోతోంది. ఎక్కడన్నా కాసేపు కూర్చోకపోతే రోడ్డు మీద పడిపోవచ్చుననిపిస్తోంది.

బాబు ఏ క్షణాన అయినా చేతుల్లోంచి జారి పడిపోతాడేమో అన్నట్టు చేతులు వణుకుతున్నాయి. రెండు చేతులతో గట్టిగా గుండెలకు హత్తుకుంది.

బ్యాగు  భుజాల పైకి లాక్కుంది.

తల వంచుకుని శరీరంలోని శక్తినంతా కూడా దీసుకుని అడుగులు బలంగా వేయడానికి ప్రయత్నించింది.  కానీ నడవలేకపోతోంది. ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో, మళ్ళి  వాళ్ళ నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుందేమో అని భయంగా ఉంది.  
ఎంత మాట అన్నాడు శంకరయ్య !

నాన్న చనిపోయాడా.. లేదు చనిపోలేదు.. తప్పకుండా ఎక్కడో ఉంటారు.. అతను  చెప్పినదంతా అబద్ధం ..

వాడు నీచుడు.. చండాలుడు ... నోటికి వచ్చినట్టు మాట్లాడాడు..

ఒక్కసారి నాన్నను చూడాలి... ఒక్కసారి అమ్మ ఒడిలో పడుకోవాలి.

అన్నయ్యతో కబుర్లు చెప్పాలి.. సాధ్యం అవుతుందా.. అవదు.. ఎప్పటికి అవదు. ఈ మహాపట్నంలో వాళ్ళు ఎక్కడున్నారని వెదకాలి..తనకేం తెలుసని వెదకాలి..

అయిపోయింది ... ఇంక ఈ బతుక్కి అమ్మ, నాన్నా అని పిలిచే అదృష్టం లేదు.. అన్నిటితో పాటు ఆ అదృష్టాన్ని కూడా తను కోల్పోయింది. ఇంక ఈ బతుకు బతికి ప్రయోజనం ఏం ఉంది! చచ్చిపోవాలి.. అవును చచ్చిపోవాలి..

ఉన్నట్టుండి బాబు కెవ్వుమని ఏడుపు మొదలు పెట్టాడు.. వాడికి పాలు పట్టి ఎంతో సేపైందన్న విషయం గుర్తుకొచ్చింది గాయత్రికి.  పేలవంగా నవ్వుకుంది.. ఎట్లా చస్తావు నన్నొదిలి అని వాడు తన ఉనికి తెలియచేసాడు.

నడుస్తూనే ఉంది..ఎక్కడ ఉందొ ఎంత దూరం నడిచిందో స్పృహ లేదు. భుజాన్ని రాచుకుంటూ వెళ్ళిన మోటార్ సైకిల్ శబ్దానికి ఉలిక్కిపడింది. కుడి భుజానికి హాండిల్ తగిలింది.. తను రాంగ్ రూట్ లో నడిచిందో.. మోటార్ సైకిల్ అతను రాంగ్ రూట్ లో అవసరానికి మించిన స్పీడ్ గా నడిపి తనకి తగిలించాడో, ఎంత దెబ్బ తగిలిందో ఆలోచించే శక్తి లేదు.. భుజం నొప్పిగా అనిపించినా పట్టించుకోలేదు.

ఇంకో నాలుగు అడుగులు వేసి నిలబడింది.

ఒక్కసారి చుట్టూ చూసింది. నారాయణగూడ చౌరస్తా కనిపించింది.  రోడ్డుకి ఒక పక్క పండ్ల బండ్లు.. వాటి పక్కనే ఒక టీ స్టాల్ ఉన్నాయి. టీ స్టాల్ దగ్గర నడిచింది.  తను ఒక కప్పు టీ తాగి బాబుకి పాలు పట్టించింది.

అక్కడే ఎటుపోవడమా అని ఆలోచిస్తూ నిలబడింది.

అగమ్యగోచరంగా ఉంది భవిషత్తు..

ఎక్కడికి వెళ్ళాలి... ఎవరున్నారు తనకి... ఒక్క తప్పడుగు జీవితాన్ని ఇలా మార్చేస్తుందని ఊహించిందా.. రమేష్ బతికి ఉంటే అద్భుతంగా లేకున్నా ఒకరకంగా ఉండేది.. జీవితంలో భద్రత ఉండేది. ఇప్పుడు భద్రత లేదు ... గమ్యం లేదు.. కనీసం ఎటు వైపు నడిస్తే ఒక ఆశ్రయం లభిస్తుందో తెలిపే దారి కూడా లేదు.

ఆలోచిస్తూనే వెనక్కి తిరిగి రద్దీగా ఉన్న రోడ్ క్రాస్ చేసి తిరిగి నెమ్మదిగా నడక సాగించింది.

ఈ నడక ఎక్కడిదాకా... ఎప్పటిదాకా ...నిట్టూర్చింది తెలుసుకోవాలంటే..  వచ్చే శుక్రవారం ఒంటిగంటకు చదవండి.....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana