Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> భగవంతుడు చూస్తూ ఉంటాడు

bhagavantudu choostu vuntaadu

 నా  పేరు దీప, నేను ఒక ప్రయివేట్ కంపెనీలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నాను.  మా ఆయన మునిసిపల్ స్కూల్ లో టీచర్  గా పనిచేస్తారు. వారిది గవర్నమెంట్ ఉద్యోగం. నా కోక పాప, 8 నెలల వయసు. రోజూ లాగే ఆ రోజు కూడా డ్యూటి ముగించుకొని ఆఫీసు నుండి బయలుదేరాను. దారి లోని మార్కెట్ లో కూరలు కొంటున్నాను. కానీ నా మనసంతా ఇంటి దగ్గరే ఉంది.  ఇంటి దగ్గర నా పాప నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆకలి తో, పాల కోసం ఏడుస్తూ ఉంటుంది.  కానీ ఎవడో మార్కెట్ లో నా వేనుకే తాచ్చాడుతున్నట్టు అనిపించింది. ఓర కంటి తో వాడిని చూసా. చదువుకున్న వాడిలా వున్నట్టు అనిపించింది. నేను అనవసరంగా వాడిని అనుమానిస్తున్నానేమో అనిపించింది. తిరిగి నా పనిలో నిమగ్నమయ్యా. కూరలకోసం రద్దీ గా వున్న అంగడి ముందుకు దూరా. ఇంతలో ఆ రద్దీలో, వెనక నుండి ఎవరో  నా నడుము తాకినట్టు అనిపించింది. ఒక్కసారిగా వెనక్కు తిరిగి చూసా. నన్ను ఫాలో అవుతున్నవాడే. కావాలనే నన్ను తాకాడు. నాలో కోపం కట్టలు తెంచు కొంది. నా కళ్ళు ఎర్రబడ్డాయి. వాడిని కొట్టాలని అనిపించింది. కానీ నా  సభ్యత నన్ను ఆపింది. నా కోపాన్ని గమనించిన వాడు హుటాహుటిన మార్కేట్ బయటకు వెళ్లి బైక్ స్టార్ట్ చేసాడు. నేను వాడినే అనుసరించాను కోపంగా. వాడు నా వైపు  హేళనగా నవ్వి బైక్ పై వెళ్లి పోయాడు. వాడి నవ్వు నాకు మరింత అసహనాన్ని కలిగించింది. ఆ బైక్ నంబర్ నా డైరీలో రాసుకొన్నా.

నా శరీరాన్ని వాడు అకస్మాత్తుగా తాకడం నా మనసు పదే పదే గుర్తు చేసుకొంటూ ఉంది. నా కళ్ళ నుండి కన్నీళ్ళు ఆగడం లేదు. నా మనసులో ఎన్నో ఆలోచనలు. ఆలోచిస్తుండగానే ఇల్లు చేరుకొన్నా. గేటు తీస్తుండగా నా బిడ్డ ఆకలి ఏడుపు వినబడింది. సరాసరి మా అత్తగారి చేతుల్లో ఉన్న నా బిడ్డ ను అందుకొని పాలు పట్టించాలి. కానీ ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు. హ్యాండ్ బ్యాగ్ టీపా పై పడేసి నా గదికి వెళ్లి తలుపు వేసా.

“ఆకలి తో బిడ్డ ఏడుస్తోంటే పాలు పట్టించ కుండా లోపల ఏం చేస్తున్నావ్?”  హాల్ లో నుండి గట్టిగా అరిచారు మా అత్తగారు. నేను సమాధానం చెప్పలేదు. నా ఏడుపు వినబడినట్టు ఉంది. నా గదికి వచ్చి నన్ను చూసింది.

“ఏమైంది దీప?” కంగారుగా అడిగింది.

“పాపకు బుడ్డీ తో పాలు పట్టించండి.“ ఏడుస్తూ అత్తగారికి చెప్పా. మా అత్త గారికి బాధతో ఏడుస్తున్న నన్ను ఓదార్చాలో లేక ఆకలితో ఏడుస్తున్న పాపకు పాలు పట్టించాలో అర్ధం కాలేదు. నిముషం తరువాత ఫ్రిడ్జ్ లో ఉన్న పాల ప్యాకెట్ ఓపెన్ చేసి, పాలు కాచడం మొదలు పెట్టింది. మా పాప తన శక్తినంతటనీ కూడదీసుకొని మరీ ఏడుస్తోంది.

“ఏమైంది? దీప ఇంకా రాలేదా?” ఇంటికొచ్చిన  మా ఆయన, మా అత్తగారిని అడిగారు.

“గదిలో ఉంది.” పాలు చల్లారుస్తూ చెప్పారు అత్తగారు.

ఆయన అలికిడి వినగానే నా కన్నీల్లు కట్టలు తెంచుకొన్నాయి. గదిలో నుండి పరిగెత్తుకొంటూ ఆయన దగ్గరకు వెళ్లాను. మరొక్క అడుగు దూరంలో నిలచిపోయాను. ఆయనకు దగ్గరవ్వాలనే ఉంది. కానీ, ఎందుకో దగ్గరవలేక పోయాను. చిద్రమైన నా ముఖాన్ని చూసి కంగారు పడ్డారు ఆయన. నన్ను దగ్గరకు తీసుకొని “ఏమైంది?” అని అడిగారు. జరిగిన విషయాన్ని ఏడుస్తూనే చెప్పాను. అది విన్న ఆయన ఒక్క సారిగా, అడుగు వెనక్కు వేసి, నాకు దూరంగా జరిగారు.

*****************

జరిగిన సంఘటన విన్న ఆయన , నన్ను దగ్గరకు తీసుకొంటారని, నన్ను ఓదార్చుతారని, నాకు ధైర్యం చెబుతారని  అనుకొన్నాను. కానీ ఆయన నన్ను దూరం పెట్టారు. అప్పటి నుండి నా మనసు మరింత భారంతో ఆవేదన చెందుతోంది

***************

మాకు పెళ్లి అయ్యి సుమారు రెండు సంవత్సరాలు కావస్తోంది. ఈ రెండు సంవత్సరాలలో మేము ఎప్పుడూ దూరం గా  ఉన్నది లేదు. ఆయనకు నేను ఎంతో ప్రత్యేకం. నన్ను ఎంతో అద్భుతంగా చూసుకొన్నారు. నేను అడిగింది ఏది కాదనలేదు. నేను వద్దంది  ఏది చెయ్యనూ లేదు. నేను ఉద్యోగం చెయ్యడం ఆయనకు ఇష్టం లేదు. కానీ నా  ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకొన్నారు. వారిది గవర్నమెంట్ ఉద్యోగం. నెలకు నలభై అయిదు వేలు జీతం. నాది ప్రయివేటు ఉద్యోగం , నెలకు పదిహేను వేలు జీతం. అయినప్పటికీ ఆయన నన్ను, నా ఉద్యోగాన్ని ఎప్పుడూ తక్కువగా చూడలేదు.  తీసుకొనే జీతం లో ఎక్కువ తక్కువలు ఉండచ్చు , కానీ చేసే పని ప్రతిదీ గొప్పదే అని చెబుతారు ఆయన.

రోజంతా ఆఫీసులో (నాకు దూరంగా) ఉండడమే ఎడబాటుగా భావిస్తారు. సాయంత్రం ఇంటికి రాగానే నన్ను తన కౌగిలిలో బంధిస్తాడు. ముద్దులతో వర్షిస్తాడు. ఇక అప్పటి నుండి నన్ను ఒక్క క్షణం కూడా విడవడు. నా ప్రతి పనినీ పంచుకొంటాడు. వద్దంటే ఒప్పుకోడు. “నేను నీ అర్దాంగుడినని, నీ కష్టసుఖాలలో, బరువు బాధ్యతలలో, ఆఖరకు నువ్వు చేసే పనిలోనూ నేను అర్ధం పంచుకోవాల్సిందే “ అని మారాం చేస్తాడు. 

నన్ను పసిపాపలా చూస్తాడు. ఎన్నో కబుర్లు చెబుతాడు. “ప్రతి మగాడు నా భర్త లా మంచి మొగుడు కాగలిగితే ఈ ప్రపంచంలో ఏ స్త్రీ కు ఏ సమస్యా ఉండదు కదా!” అంటే మురసి పోతాడు. “మిమ్మల్ని భర్త గా పొందడం నా అదృష్టం కదా!” అంటే ఒప్పుకోడు. నా లాంటి బార్య దొరకడం వల్ల తనే అదృష్ట వంతుడిని” అని వాదిస్తాడు. ఈ రెండేళ్ళలో ఆయన నాపై టన్నుల కొద్దీ ప్రేమను కురిపించారు. అదంతా గుర్తు చేసుకొంటూ ఉంటే ఇవాల్టి ఆయన ప్రవర్తన అబద్దం అనిపిస్తోంది. ఒక వేళ ఇవాల్టి ప్రవర్తన నిజం అయితే ఈ రెండేళ్ళు నేను అబద్దం లో బ్రతికానని అనిపిస్తోంది.

**************

మా అత్తగారు నన్ను భోజనానికి పిలిచారు. వద్దంటే వినలేదు. నేను డైనింగ్ కు వెళ్ళేటప్పటికే ఆయన భోజనం పూర్తి చేశారు. నాకు మెతుకు దిగలేదు. చేయి కడుక్కొని వచ్చి పడుకొన్నా. అయన కూడా అదే పడక పైకి వచ్చారు. కానీ మేము చెరో దిక్కుకు తిరిగి పడుకొన్నాం. ప్రతి రోజూ ఆయన గుండెలపై తల పెట్టుకొని పడుకొనే దాన్ని. అలా పడుకోనిదే నాకు నిద్ర పట్టదు. నా ఉస్వాస నిస్వాసలు తన గుండెకు తగులుతూ ఉంటే ఆయన ప్రసాంతంగా నిద్ర పోయేవాడు. నేను కూడా ఆయన గుండె చప్పుడును జోల పాటలా వింటూ నిద్రపోయేదాన్ని. కాని ఇవ్వాళ  ఆయన్ని పక్కనే పెట్టుకొని నేను యడబాటును అనుభవిస్తున్నా. మొట్టమొదటి సారి మా మద్య దూరం ఏర్పడింది.  ఆ రాత్రంతా నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయ్. నా మది సంద్రం లో అనేక ఆలోచనలు ఉప్పొంగుతూ ఉన్నాయ్. బాగా ఆలోచించాక నా పట్ల తప్పుగా ప్రవర్తించిన వాడిపై  పోలిస్ స్టేషన్ లో కేసు పెట్టాలని నిర్ణయించు కొన్నా.

****************

ఎవరో నన్ను నిద్ర లేపుతున్నట్టు అనిపించింది. రాత్రంతా నిద్ర లేక పొవడం వల్లనో ఏమో నా కనురెప్పలు తెరుచుకోవడానికి మారం చేస్తున్నాయ్. బలవంతంగా కళ్ళు తెరిచా.

“GOOD MORNING” కాఫీ కప్పుతో నా ముందు నిలుచున్నారు మా ఆయన. ఆశ్చర్యం వేసింది. కళ్ళు నులుపుకొంటూ చూశా.
“నిన్న నా ప్రవర్తన ఒక మంచి భర్త స్థాయిలో లేదు. నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు. సారీ............!” బతిమలాడి నట్టు అడిగాడు.
చిన్న నవ్వు ను పెదాలపై నటించాను. వంట గదికి వెళ్లాను. మా ఆయన ప్రేమగా నా దగ్గరకు వచ్చారు.

“ఇవ్వాళ నువ్వు ఆఫీసుకు  వెళ్ళద్దు. రెస్ట్ తీసుకో .” నన్ను ఉద్యోగం మానెయ్యమని అర్ధం వచ్చేలా చెప్పారు.

“ఇవ్వాళ నేను ఆఫీసుకు వెళ్ళడం లేదు.” చెప్పాను ఆయనతో.

”మరి ఎక్కడకు రెడీ అవుతున్నావ్?”

“పోలీస్ స్టేషన్ కు, వాడిపై  కంప్లయింట్ ఇవ్వడానికి!”

“పోలిస్ స్టేషన్ కు వెళ్ళాల్సిన అవసరం లేదు. నా ఫ్రెండ్, కానిస్టేబుల్ రాజేష్ ఉన్నాడు కదా. వాడికి విషయం చెప్పా. నీ డైరీ చూసి వాడికి  బైక్ నంబర్ కూడా చెప్పా. నీ పట్ల తప్పుగా ప్రవర్తించిన వాడిని ఎలాగైనా పట్టుకొంటానని నాకు మాట ఇచ్చాడు.”

“మీరు చెప్పేది నేను నమ్మను . పోలీస్ స్టేషన్ కు వెళ్ళాల్సిందే. కేసు పెట్టాల్సిందే.” వాదించాను ఆయనతో.

“పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఈ విషయం కాలనీ లో  అందరకి తెలిసి పోతుంది. అందరూ నిన్ను హేళన చేస్తారు.”

“అందరూ మీలా ఉండరు. నిన్న నేను జరిగినదంతా చెబుతే మీరు నన్ను ఓదార్చకుండా , నేనేదో తప్పు చేసినట్టు నన్ను దూరం పెట్టారు. పైగా రాత్రంతా నాతో మాట్లాడలేదు.” ఏడుస్తూ చెప్పాను.

“అందుకే కదా, పొద్దున్నే సారీ చెప్పాను.”

“మరి నన్ను ఉద్యోగం మానెయ్యమని చెబుతున్నారు కదా?”

“ఉద్యోగం మానెయ్యమని నేనెప్పుడు చెప్పాను? ఇవ్వాళ రెస్ట్ తీసుకోమనే కదా చెప్పాను.”

“మీ మనసులో ఏముందో నాకు తెలుసు. నేను ఉద్యోగం చెయ్యడం మీకు ఇష్టం లేదు.”

“ఇప్పుడు సమస్య నీ ఉద్యోగానిది కాదు, పోలీస్ స్టేషన్ ది.” గట్టిగా అరిచారు ఆయన.

“మీరు ఎన్నయినా చెప్పండి. స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇవ్వాల్సిందే” మొండిగా చెప్పాను ఆయనతో.

“నేను చెప్పేది నువ్వు అర్ధం చేసుకోవవడం లేదు. మనం పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇస్తే ఈ విషయం అందరకి తెలుస్తుంది . ఆ తరువాత కాలనీలో వాళ్ళు, వీధిలో వాళ్ళు, ఆఫీస్ లో వాళ్ళు అందరూ ఓదార్చినట్టు నటిస్తూ, సూటి పోటి మాటలతో నిన్ను మరింత వేధిస్తారు. రాజేష్ వాడిని పట్టుకొని ఫోన్ చేస్తానని చెప్పాడు. కంప్లయింట్ వద్దు.” బుజ్జగిస్తూ చెప్పాడు ఆయన.

“మీరు ఎన్నైనా చెప్పండి. నేను స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇవ్వాలని నిర్ణయించుకొన్నా.”  నా నిర్ణయాన్ని ప్రకటించా. దాంతో ఆయన కోపం ఒక్కసారిగా నషాళానికి అంటింది. తన కాలితో ఎదురుగా ఉన్న టీపాను తన్ని బయటకు వెళ్ళాడు. అది ఎగిరి ఒక మూలాన పడింది. దాని కున్న గాజు అద్దం పగిలింది.

మా అత్తగారు నా దగ్గరకు వచ్చారు. నన్ను ఓదార్చారు.

“బాధపడకు దీప! వాడ్ని మనం శిక్షించలేక పోవచ్చు. కానీ దేవుడు అన్నీ చూస్తుంటాడు. సరైన సమయం వచ్చినప్పుడు తప్పు చేసిన ప్రతి వాడినీ భగవంతుడు కచ్చితంగా శిక్షిస్తాడు. “

*************

కొద్దీ సేపు తర్వాత మోర్టర్ ఆపడానికి మెట్లు దిగి క్రిందికి వెళ్ళా. అక్కడ తాయారు పిన్ని పలకరించింది.

“ఏమేవ్ దీప! నిన్న మార్కెట్ లో ఎవడో నీ నడుము తాకాడట కదా!” గేలి చేసినట్టు అడిగింది.

“మీకెవరు చెప్పారు పిన్ని?” సూటిగా అడిగా.

“నిన్న నువ్వు మీ ఆయనో చెప్పి ఏడుస్తోంటే నాకు వినబడింది.” చెప్పింది పిన్ని. నేను ఏమి మాట్లాడలేదు. ఇస్త్రీ  బట్టలు తీసుకొని వద్దామని కాంపౌండు బయటకు వెళ్ళా.

“ఎంటే! నిన్న ఎవడో నిన్ను నడుము మీద గిల్లాడట కదా?” ఎదురింటి కనకమ్మ అత్త ఇస్త్రీ అంగడి ముందు అడిగింది. నాకు కోపం వచ్చి “ఎవరు చెప్పారు మీకు?” గట్టిగా అడిగా.

“మీ క్రింద ఇంట్లో ఉన్న తాయారు చెప్పింది. అయినా నేను అడిగిన దాంట్లో తప్పేముంది? నీకెందుకు అంత కోపం?” తిరిగి ప్రశ్నించింది నన్ను. నేను మారు మాట్లాడలేదు. కాంపౌండులో లోకి వెళ్తొంటే మా పనమ్మాయి అడ్డుపడింది. జరిగిన దాన్ని గురించి తను కూడా అడిగింది. కాలనీలో అందరూ నా గురించే మాట్లాడుకొంటూ ఉన్నారట. నాకు చాలా బాధనిపించింది. మా ఆయన చెప్పింది గుర్తుకు వచ్చింది. కాలనీలో అందరూ సూటి పోటి మాటలతో వేధిస్తారని చెప్పారు. ఆయన చెప్పింది నిజమే అనిపించింది. ఇంట్లోకి వెళ్ళా. మా ఆయన ఫోన్ మ్రోగుతోంది. నా మీద కోపంతో ఫోన్ మరచి పోయి బయటకి వెళ్ళారు. ఫోన్ లిఫ్ట్ చేశా.

“హలో!”

“హలో నేను! కానిస్టేబుల్ రాజేష్ ను మాట్లాడుతున్నా.”

“చెప్పండి అన్నయ్య!”

“బావగారు లేరా?”

“లేరు. బయటకు వెళ్ళారు.”

“ఒక సారి టివి లో ఏదైనా న్యూస్ చానల్ పెట్టి చూడు. బావగారిని కూడా చూడమని చెప్పానని చెప్పు.” ఫోన్ పెట్టేసాడు కానిస్టేబుల్ రాజేష్.
టివి పెట్టాను. టివిలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది.

“ఆడవాళ్ళ పట్ల తప్పుగా ప్రవర్తించే కొందరు యువకుల్ని పట్టుకొన్న మహిళా పోలీసులు.”

“అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన మహిళా పోలీసులు.” న్యూస్ రీడర్ న్యూస్ చెబుతోంది.

“ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిలపై కొరడా జులిపించింది మహిళా  పోలీసు సిబ్బంది. రద్దీగా ఉండే బస్సుల్లో, మార్కెట్ లో , షాపింగ్ మాల్స్ లో , సినిమా థియేటర్స్ లో కొందరి యువకులు ఆకతాయిగా ప్రవర్తిస్తూ, స్త్రీలను, కాలేజీ అమ్మాయిలను  ఇబ్బంది పెడుతున్నట్టు పెద్ద ఎత్తున కంప్లయింట్స్ రావడంతో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది మఫ్టీల్లో రంగంలోకి దిగింది. వారు కొన్ని బృందాలుగా విడిపోయి రద్దీగా ఉండే పది సెంటర్లో సిసి కెమరాలు అమర్చి అక్కడే మఫ్టీల్లో తిరుగుతూ ఆడవాళ్ళను తమ మాటలతో, చేష్టలతో ఇబ్బంది పెట్టే  ఆరుగురు యువకులను రెడ్ హ్యాండెడ్ పట్టుకొన్నారు.” అంటూ పట్టుబడ్డ వారిని చూపిస్తున్నారు. నా కళ్ళు వాడికోసం వెతికాయి. నిన్న మార్కెట్ లో  నా పట్ల తప్పుగా ప్రవర్తించిన వాడు కూడా ఆ ఆరుగురిలో ఉన్నాడు.  వాడ్ని టివి లో చూడగానే నాకు సంతోషం వేసింది. మా అత్తగారు చెప్పిందే నిజమే. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. తగిన సమయం వచ్చినప్పుడు తప్పు చేసిన వారిని  కచ్చితంగా శిక్షిస్తాడు. 

మరిన్ని కథలు
manavaseve