Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ధరణి

dharani

“అయ్యో!  ఆడపిల్ల  పుట్టిందా?” …. అంటూ ఏదో ఘోరం జరిగినట్టుగా పరామర్శిస్తున్న వాళ్ళందరినీ అమాయకంగా చూస్తోందా పసికందు. ఆడపిల్లగా తను ఎదుర్కోబోయే కష్టాలు ముందే ఎరిగినట్లుగా, వెక్కివెక్కి ఏడుస్తూ తల్లి గుండెలకు హత్తుకుపోయింది.

***

“పాప వయసెంత?”

“ఏడాది నిండిందండీ”!

“పేరేంటో?”

“ధరణి” --- భూమాతలా సహనాన్ని, ఓర్పును పెంపొందించుకోవాలనో ఏమో పాపకు ఆ పేరు పెట్టారు.

***

“హమ్మయ్య! పోనీలేండి, ఈ సారైనా మగ పిల్లాడు పుట్టాడు, అదృష్ట వంతులు”… అంటున్న వాళ్ళకేసి అమాయకంగా చూస్తోంది, ఐదేళ్ళ ధరణి. అమ్మాయికి, అబ్బాయికి తేడా ఏమిటో, అమ్మాయి వలన వచ్చే దురదృష్టమేమిటో, అబ్బాయివలన వచ్చే అదృష్టమేమిటో ఆ లేత మనసుకు అర్ధం కావటం లేదు. కాని, అస్తమాను బాబునే ముద్దాడుతూ, తనని పట్టించుకోని తల్లిని చూస్తూ ఆ పసిమనసు అనుకుంటోంది...“నేను కూడా అబ్బాయినైతే ఎంత బాగుండేదో, అస్తమాను అమ్మ నన్ను ముద్దాడేది.”

***

నిద్రలోంచి ఉలిక్కిపడిలేచిన ధరణికి ఎదురుగా ఉగ్రరూపుడై ఉన్న నాన్న, భయంతో వణికిపోతున్న అమ్మ కనపడ్డారు. నాన్న ఎందుకో అమ్మను తిడుతూ, యిష్టమొచ్చినట్టు కొడుతున్నాడు. నాన్న నోటి నుంచి మళ్ళా అదే వెగటు వాసన. ఈ రోజు కూడా ఆ సీసా తెచ్చుకున్నాడేమో!  భయంతో సోఫా వెనక్కు దూరింది. రోజూ నాన్న ఏదో సీసా తెచ్చి తాగటం, అమ్మను యిష్టమొచ్చినట్లు తిట్టడం, కొట్టడం చూస్తున్న ధరణికి, అమ్మ చేసిన తప్పేంటో, నాన్న, అమ్మనెందుకలా బాధపెడుతున్నాడో అర్ధం కాలేదు. కాని, మగవాళ్ళైతే, ఆడవాళ్ళను కొట్టవచ్చని, ఆడదానిగా పుడితే అమ్మలాగే దెబ్బలు తింటూ ఉండాలనే ఆలోచన ఆ ఏడేళ్ళ పాప మనసులో మెల్లగా నాటుకుంటోంది.

***

“అమ్మా! చూడవే, అక్క బంతి యివ్వటం లేదు”, అని తమ్ముడు అరవగానే, అమ్మ వచ్చి “ధరణీ, ఆ బంతి వాడికిచ్చి నువ్వు చదువుకో, అయినా, ఆడపిల్లవి నీకు ఆటలేంటే మగరాయుడు లాగ?” అంటూ కసిరింది. అమ్మ మాటలు విని, తమ్ముడికి బంతి యిచ్చేసి, పుస్తకాల ముందు కూర్చున్న ధరణికి బుర్ర పుస్తకంపై లేదు. “ఏం, ఆడపిల్లలయితే ఆడకూడదా? తమ్ముడే ఆడుకోవాలా? తను చేసిన తప్పేంటి?” అంటూ బుర్రలో తొలుస్తున్న ఆలోచనలకు పదేళ్ల ఆ పసి హృదయంలో సమాధానం లేదు.

* * *

కాన్వెంట్ చదువు పూర్తయి, ఆరవ తరగతిలో చేరిన ధరణికి స్కూలు వాతావరణం వింతగా ఉంది. అంతమంది పిల్లలు, టీచర్లు, హడావుడిగా ఉండే పరిసరాలు, శారీరకంగా తనలో వస్తున్న మార్పు, తనలోని మార్పుపై తోటివాళ్ళు చూపిస్తున్న ఆసక్తి, అంతా గజిబిజిగా ఉంది.

* * *

“చూడు ధరణీ! నువ్వు యింకా చిన్నపిల్లవి కాదు. పెద్దదానివయ్యావు. అస్తమాను ఫ్రెండ్స్ యిళ్ళకి, అక్కడికి, యిక్కడికి అంటూ తిరగటం కుదరదు. స్కూలు, ఇల్లు అంతే! అర్ధమైందా?” అని అంటున్న అమ్మకు “ఊ...” అంటూ సమాధానం యిచ్చింది ధరణి. చూస్తుండగానే తనకు 15 ఏళ్ళు వచ్చాయి. పదో క్లాసు లోకి వచ్చింది. తమ్ముడు ఆరో క్లాసు. తనలో వచ్చిన శారీరక మార్పులను ఆబగా చూస్తున్న మగపిల్లలు, ఏదో విధంగా తనని తాకి ఆనందించే టీచర్లు, ఆమెకు యమకింకరుల్లా అనిపిస్తున్నారు. స్కూలు లోను, బయటా తనని చూసి మగపిల్లలు చేసే కామెంట్స్ కు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది. ఎందుకని ఆడపిల్లలనిలా ఏడిపిస్తారు?  ఏం, అందంగా ఉండటం కూడా తప్పేనా? అదేంటో తనని కామెంట్స్ చేసే అబ్బాయిలకి కూడా దాదాపు అందరికీ అక్కా, చెల్లెళ్ళు ఉన్నారు. తనని ఏదో వంకతో స్పృశించి శునకానందం పొందే ప్రైవేటు మాష్టారికి తన ఈడు అమ్మాయిలు ఉన్నారు. అయినా, ఎందుకనిలా ఆడపిల్లలంటే యింత చులకన? తనతో ట్యూషన్ మాష్టారి ప్రవర్తన అసహ్యంగా ఉన్నా, అమ్మకి చెప్పటానికి భయం. చదువు మానెయ్యమంటుందేమో. అమ్మో!  తనకి చదువుకోవాలని ఉంది. చదువు లేకపోబట్టే కదా అమ్మ, అలా నాన్న ఎన్ని బాధలు పెట్టినా పడుతోంది. తనకి చదువు ఉంటే ఉద్యోగం చేసుకొని, హాయిగా బ్రతకచ్చు. తను యింజనీరో, డాక్టరో చదవాలి. ఈ ఆలోచనలతో ధరణికి చదువే లోకమైంది.

* * *   

“నాన్నా! నాకు కాలేజి ఫస్టు వచ్చింది”, ఇంటర్మీడియట్ పూర్తయిన ధరణి తన మార్క్సులిస్టు తండ్రికి చూపిస్తూ, పట్టలేని సంతోషంతో అంది. “అలాగా!” అంటూ చాలా నిర్లిప్తంగా చూసిన తండ్రి చూపుకు ధరణి హృదయం విలవిల్లాడింది. తమ్ముడు సెవెంత్ బొటాబొటి అరవై శాతంతో పాసయితేనే వాడ్ని తెగపొగిడేసాడు నాన్న. వాడికి కొత్త సైకిలు, క్రికెట్ కిట్ కూడా కొనిపెట్టారు. అలాంటిది, తనకు 95 శాతం మార్కులతో కాలేజి ఫస్టు వచ్చినా కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పటం లేదు.

తన బాధ పైకి కనిపించనీకుండా, తండ్రిని అడిగింది ధరణి, “నాన్నా! నేను ఎంసెట్ రాసి, మెడిసిన్ చదువుతాను, మా లెక్చరర్స్ కూడా నన్ను తప్పకుండా రాయమన్నారు” అని. అది వింటూనే, “అక్కర్లేదు, నువ్వు డాక్టరయ్యి ఎవరినుద్ధరించాలి? ఎంత చదివించినా చివరికి పెళ్ళి దగ్గర కట్నం తప్పదు. అయినా, నిన్ను మెడిసిన్ చదివించి, అంతస్థాయి వాణ్ణి తీసుకొచ్చి, నీకు ముడేసే స్తోమత నాకు లేదు. యింత వరకు చదివింది చాలు గాని, యింట్లో కూర్చో” అన్నాడు నాన్న. దానికి అమ్మ కూడా వత్తాసు పలికింది.

ఆ మాటలు విన్న ధరణికి కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి. ఎన్ని కలలు కంది తను, డాక్టరు కావాలని. తమ్ముడు చదవకుండా, అల్లరిగా తిరుగుతున్నా, ఆరో తరగతి నుంచే ఐ.ఐ.టి. ఫౌండేషన్ అంటూ వేలకు వేలు తగలేస్తూ, తల తాకట్టు పెట్టయినా వాణ్ణి ఇంజనీరును చేయాలనుకొంటున్న అమ్మ, నాన్నలు తను చదువుతానంటే మాత్రం ఎందుకొద్దంటున్నారు? ఆడపిల్లగా పుట్టడమే తను చేసిన తప్పా? మగవాళ్ళతో సమానంగా మంచి చదువులు చదివే అవకాశం తమకు లేదా? అయినా కట్నం లేకుండా పెళ్ళిళ్ళు కావా? అంటూ తనను వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానాన్ని మాత్రం పొందలేకపోయింది. అతికష్టం మీద చదువు మాన్పించాలనే అమ్మ, నాన్నల నిర్ణయాన్ని మార్పించి, వాళ్ళను ఒప్పించి, బి.కాం. డిగ్రీలో జాయినయింది ధరణి. డాక్టర్ కావాలనే ఆశయానికి అమ్మ, నాన్నల సహకారం లేకపోయినా, జీవితంలో తను స్వతంత్రంగా స్థిరపడాలనే ఆలోచన ఆమె మనసులో దృఢంగా నిలచిపోయింది.

***

బి.కాం. డిగ్రీతో పాటు, కంప్యూటర్ కోర్సు చేసిన ధరణి రాత్రింబవళ్ళు కష్టపడి  బ్యాంకులో ఉద్యోగం పొందింది. ఆర్ధికంగా తనకు లభించిన స్వేచ్ఛతో యిక తన కష్టాలన్నీ తొలగిపోతాయనే ఆమె అపోహ తొలగిపోవటానికి ఎన్నో రోజులు పట్టలేదు. అటెండర్ నుంచి ఆఫీసర్ల వరకు తనకేసి తోటి మగ ఉద్యోగులు చూసే డేగ చూపులు ఆమెను చిత్రవధ చేస్తున్నాయి. కనీస మర్యాదా, సంస్కారం లేని మృగాల మధ్య జీవితం అరణ్య జీవనం లాగ ఉంది.

***

మేనేజర్ పిలుస్తున్నాడని కబురు రావటంతో, మేనేజర్ చాంబర్ లోకి అడుగుపెట్టిన ధరణిని చూస్తూ, “మిస్ ధరణీ! నా కంప్యూటర్ ముందు కూర్చోండి! ఒక ఇంపార్టెంట్ లెటర్ డిక్టేట్ చేస్తాను. అన్నాడు మేనేజర్ విశ్వనాధం. ఓకే సర్! అంటూ అతను చెప్తున్న లెటర్ టైపు చేస్తున్న ఆమె దగ్గరికి వచ్చి, హఠాత్తుగా భుజం మీద చెయ్యి వేసాడు విశ్వనాధం. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన ధరణిని చూస్తూ, వెకిలిగా, కాంక్ష నిండిన కళ్ళతో, “యు ఆర్ సో బ్యూటిఫుల్ టుడే...ఐ లవ్ యూ సోమచ్ ధరణీ” అంటున్న మేనేజర్ చెంప ఛెళ్ళుమనిపించింది.

అనుకోని ఈ పరిణామానికి బిత్తరపోయి చూస్తున్న మేనేజర్ మీద చింత నిప్పులు కురిపిస్తూ, “యూ రాస్కెల్! పెళ్ళయి, ఇద్దరు పిల్లలున్న నీకు నేను అందంగా ఉన్నానా? నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? యింకొక్క సారి యిటువంటి పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే, నీ అంతు చూస్తాను.” అంటూ విసవిసా బయటకు వచ్చి తన సీట్లో కూర్చొంది ధరణి.

ఆమె మనసిపుడెంతో తేలికగా, ప్రశాంతంగా ఉంది. ఏళ్ళనుండి తనలో పేరుకుపోయి ఉన్న బాధంతా కరిగిపోయినట్లనిపించింది. కరడుగట్టిన పురుషాహంకారంపై తనలో గూడుకట్టుకున్న ద్వేషం నేటికి బద్దలైంది. యిక తను పూర్వపు సహనశీలి ధరణి కాదు. తనకీ ఒక వ్యక్తిత్వం ఉంది. సహనంగా, శాంతంగా కనిపించే ‘ధరణి’ తలచుకుంటే భూకంపాలను కూడా సృష్టించగలదనే ఆలోచనే ఆమెకు భవిష్యత్తు నెదుర్కొనే ధైర్యాన్నిస్తోంది.

మరిన్ని కథలు
pani maneeshi