Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue262/702/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)... ‘‘వాళ్ల బట్టలు వాళ్లకు ఇచ్చెయ్యండి!’’ డ్రాయర్లతో దిగంబరంగా వచ్చిన యువకులకేసి అబిమానంగా చూస్తూ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. కావాలనే వాళ్ళ మీద ప్రేమ ఒలక బోసాడు.మంచి గానే వాళ్ళని దారికి తెచ్చుకోవాలనుకున్నాడు.


ఎస్సై మాటలు వింటూనే ఒక సెంట్రీ పరుగున క్రిందకు దిగి ఆ యువకుల బట్టలు పట్టుకుని వచ్చాడు.

‘‘ముందా బట్టలు వేసుకోండి. వీళ్ళకి టిఫిన్‌ పెట్టించారా?’’ సెంట్రీ కేసి చూస్తూ అడిగాడు ఎస్సై.

‘‘ఎస్సార్‌! స్టేషన్‌కి తీసుకు వస్తున్న దారి లోనే హోటల్‌లో టిఫిన్‌ చేసాం సార్‌!’’ పాపం వాళ్లే మాకు హోటల్లో టిఫిన్‌ పెట్టించారని మనసు లోనే అనుకుంటూ అన్నాడు ఓ కానిస్టేబుల్‌.

‘‘నువ్వెళ్లి రైటర్ని ఒక సారి రమ్మను’’ తన ఎదుటే వినయంగా నిలబడ్డ కానిస్టేబుల్‌తో అంటూనే ఆ యువకులకేసి వారగా చూసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సార్‌! మేము వెళ్లి పోవచ్చా?’’ బట్టలు చక చకా తొడుక్కుని ఎస్సై ముందు భయంగా నిలబడి అన్నారిద్దరు.

ఇంతలో రైటర్‌ ఆతృతగా మేడ మీదకు వచ్చాడు.

‘‘రైటర్‌ గారూ! హతురాలు కప్పుకున్న శాఉవా ఒకసారి పట్రండి.’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘అలాగే సార్‌!’’ అంటూ మెట్లు దిగి క్రిందకు వెళ్ళాడు రైటర్‌.

రైటర్‌తో ఎస్సై చెప్పింది వింటూనే ఇద్దరు యువకుఉ మతి చెడిన వాళ్లలా అయోమయంగా చూస్తూ నిలబడి పోయారు. ఇంతలో రైటర్‌ ‘శాలువ’ భద్ర పరచిన కవరు పట్టుకు వచ్చాడు. ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ముందున్న టేబుల్‌ మీద ఉంచాడు.

‘‘ఈ ‘శాలువ’ ఎవరిదో మీకు తెలుసా?’’ శాలువ కేసి చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ఖరీదైన శాలువ. అదీ విదేశాల్లో కొన్నది. హతురాలిదేనా? విదేశాల్లో ఉన్న కొడుకులిచ్చారా?! హతు రాలి బట్టల మూట చూస్తే ఎన్నో ఏళ్ళుగా దేశ దిమ్మరిగా దేశాలు పట్టుకు తిరుగుతున్న యాచకురాలి బట్టల్లా ఉన్నాయి.

‘శాలువ’ చూస్తే కొత్తగా....ఈ మధ్య కొన్నదిలా ఉంది. అంత ఖరీదైన ‘శాలువ’ హతురాలి దగ్గరకు ఎలా వచ్చింది? దేవాలయానికి వచ్చిన విదేశీ టూరిస్ట్‌ లు ఇచ్చారా?! పరి పరి విధాలుగా ఆలోచిస్తూ వారిని అడిగాడు.

ఎస్సై అక్బర్‌ ఖాన్‌ మది నిండా ఆలోచనలు గింగిర్లు తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకైనా మంచిదని ‘శాలువ’ గురించి ఈ యువకులను అడిగితే ఏం సమాధానం వస్తుందో అన్న ఉద్దేశంతో అడిగాడు.

‘‘సార్‌....సార్‌.....ఈ శాలువ....ఈ శాఉవ ‘ఆమె’ కప్పుకోగా నేను చూసాను....’’ ఉన్నట్టుండి ఆ ఇద్దరిలో ఒక యువకుడన్నాడు.

‘‘ఎవరు?’’ ఆతృతగా అడిగాడు ఎస్సై.

‘‘అదే సార్‌! మా మీద కత్తితో ఎటాక్‌ చేసిందే ఆమె సార్‌?’’ అన్నాడు రెండో యువకుడు.

ఆ యువకులు ఇద్దరి మాటలు వింటూనే అదిరి పడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఆమె....అంటే...!! ముసలమ్మకి రొట్టె, జామ్‌ తినడానికి ఇచ్చింది....ఆమెనా మీరు చెప్తున్నది.’’ అన్నాడు ఎస్సై.

‘‘అవును సార్‌! ఆమె!’’ అన్నారిద్దరూ ఒక్కసారే ముక్త కంఠంతో. ఆ యువకులు చెప్పింది వింటూనే అదిరి పడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
‘ఎవరామె?! ఆమె కొంపతీసి ఉగ్రవాది కాదు కదా! ఆ ముసలమ్మని చంపాల్సిన అవసరం ఆమెకేముంది?? లేదా  ఆ ముసలమ్మ కొడుకులే ఇదంతా చేయించారా?’ కొంప దీసి కిరాయి హంతకురాు కాదు కదా? అరే అల్లా... దేశం ఏ దిశకెళ్తూంది. ఆలోచిస్తున్న కొద్దీ మతి పోతోంది ఎస్సై అక్బర్‌ ఖాన్‌ కి.

‘‘మీ ఇద్దర్నీ వదిలేస్తాను. మీ మీద ఎలాంటి కేసు బుక్‌ చెయ్యను. కానీ, నాకో సహాయం చెయ్యాలి.’’ ఆ యువకులిద్దరి కేసి ఓరగా చూస్తూ అన్నాడు ఎస్సై.

‘‘ఏం చెయ్యాలి సార్‌?’’ ఉత్సాహంగా అన్నారిద్దరూ.

‘‘మీ మీద ఎటాక్‌ చేసిన ఆమెని మీరు గుర్తించ గలరు కదా! ‘ఆమె’ ఎక్కడున్నా మీరు వెతికి పట్టుకోవాలి. మీ వెనుకే మా కానిస్టేబుల్స్‌ని పంపిస్తాను. వాళ్ళు సివిల్‌ డ్రస్సుల్లో యాత్రీకుల్లా మీ వెనుకే ఉంటారు.’’ చెప్పాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఎస్ సార్! ‘ఆవిడ’ ఎక్కడ కనిపించినా పట్టుకుని మీ కానిస్టేబుల్స్‌కి అప్పగిస్తాం సార్‌?’’ అన్నాడొక యువకుడు ఆనందంగా. ‘‘సార్‌! ఆవిడ దొరికాక మా మీద మళ్లీ కేసు పెట్టి సెల్‌లో పడేసి చితక బాదెయ్యరు కదా!’’ అన్నాడు రెండో వాడు భయం భయంగా. ఎస్సై అక్బర్‌ ఖాన్‌ చిన్నగా మనసు లోనే నవ్వుకున్నాడు.

‘‘వెళ్లండయ్యా! వెళ్లండి! సార్‌ మనసు మార్చుకునే లోపు ఇక్కడ నుండి ఉడాయించెయ్యండి.’’ ఆ యువకులిద్దరి వెనుకే నిలబడ్డ కానిస్టేబుల్‌ ఒకడు వాళ్ల చెవి దగ్గర చిన్నగా గుస గుసగా చెప్పి ఇద్దర్నీ ఎలర్ట్‌ చేసాడు.

ఇద్దరూ చక చకా గదిలో నుండి బయటకు వస్తూ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ కేసి చూసి వినయంగా నమస్కారం పెట్టారు.

‘‘సార్‌! వెళ్ళొస్తాం సార్‌!’’ అన్నాడొక యువకుడు గది దాటుతూ.

‘‘ఏం! మళ్లీ రావాలని సరదాగా ఉందా?’’ వాళ్లిద్దర్నీ దగ్గరుండి సాగనంపుతున్న సెంట్రీ వాళ్లని మోచేత్తో ముందుకు తోస్తూ అన్నాడు.
ఎస్సై అక్బర్‌ ఖాన్‌ వాళ్ల ధ్యాసలో లేడు. ఆ యువకులిద్దరూ చెప్పింది విన్న దగ్గర్నుండి ‘ఆమె’ ఎవరు? అన్న అన్వేషణతో ఆలోచనలో పడి పోయాడు.

‘ఈ యువకులిద్దరే ‘ఆవిడ్ని’ గుర్తించ గలరు. వీళ్ల ద్వారానే ‘ఆమె’ని పట్టుకోవాలి. ఎలా?! ఆమె ఇంకా ఇక్కడే ఉంటుందా? రాత్రి  ఆ సంఘటన జరిగిన వెంటనే ఊరు విడిచి పారి పోలేదు కదా! ఒకవేళ పారి పోతే ఏం చెయ్యాలి?’ అనుకుంటూ ఉన్నట్టుండి టక్కున సీట్లో నుండి లేచాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘వెంటనే వెళ్ళి  అసిస్టెంట్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కేంప్‌ ఆఫీసుకి వెళ్లి ఏసిపి గారికి కేసు పూర్వాపరాలు తెలియ జెయ్యాలి. ఆయన సఅహా ప్రకారం నడుచుకోవాలి. ఏదన్నా తేడా వస్తే తను బలై పోతాడు’ సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ గారికి కూడా విషయం చెప్పాలి. అనుకుంటూనే పోలీస్‌ స్టేషన్‌ నుండి ఆత్రుతగా బయటకు వచ్చాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

*********************

దర్శనం క్యూ లైన్లో ఉన్న ఆమె గర్భాలయం చేరుకునే సరికి సాయంత్రం అయి పోయింది. క్యూ లైన్లోనే ప్రసాదం ప్యాకెట్లు, బిస్కట్లు కొనుక్కుని ఆకలి తీర్చుకుంది.

క్యూ లైన్లకిరువైపులా టీస్టాల్స్‌, స్నాక్స్‌ కౌంటర్లు ఏర్పాటు చేసారు.భక్తుఅందరూ గంటల తరబడి క్యూలైన్లో  ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా బాత్‌రూమ్‌లు, మంచి నీటి కొళాయిలు అన్నీ క్యూ లైన్ల పొడవునా ఉన్నాయి.

మధ్యాహ్నం వేళ మధ్యలో దేవాలయం అరగంట మూసేసి దేవుడికి ‘రాజ భోగం’ పూర్తి చేసారు. అదే సమయంలో అర్చకులు కూడా దేవుడి కోసం వండిన ‘రాజ భోగాన్నే’ వారూ అల్పాహారంగా స్వీకరించి మళ్లీ దేవాయం తెరిచారు.

ఆమె!

గర్భాలయంలో దేవుడి ముందు స్వామికి నమస్కారం చేసుకుంది. అష్టోత్తర నామార్చన చేయించుకుంది. వర్సులో ఉన్న నోట్లన్నీ తీసి స్వామి వారి హుండీలో వేసింది.

హుండీ దగ్గరే నిఅబడ్డ దేవాలయ ఉద్యోగి ఆమె పర్సులాంటి బ్యాగ్‌ లో నుండి నోట్లన్నీ ఏరి మరీ స్వామి వారి హుండీలో వెయ్యడం చూస్తూనే నోరు తెరుచుకుని ఆశ్చర్య పోయాడు.

సాధారణంగా భక్తులు స్వామి వారికి సమర్పించే కానుకలు ఏ రూపంలో వేసినా ముడుపుల రూపంలో పసుపు వస్త్రంలో భద్రంగా మూడు ముడులు వేసి మరీ హుండీలో  వేస్తుంటారు.

ఆమె గర్భాలయంలో స్వామి వారి చుట్టూ ప్రదక్షిణ చేసి పూజాది కార్యక్రమాలు ముగించుకుని వస్తూ తన దగ్గరున్న చేతి బ్యాగ్‌ లో నుండి నోట్లన్ని తీసి హుండీ లో వెయ్యడం చూసిన అర్చకుడు ఆశ్చర్య పోయాడు.

స్వామి వారి దర్శనం చేసుకుని కొద్ది దూరంలో ఉన్న ఆండాళ్‌ సన్నిథిలో అమ్మ వారికి మొక్కుకుని తన మెళ్ళో ఉన్న బంగారు గొలుసు తీసి హుండీ లో వేసింది ఆమె.

‘తల్లీ నా మనోభీష్టం నెరవేర్చు. గమ్యం తెలీని నా అన్వేషణ ఫలించేలా చెయ్యి తల్లీ’ అంటూ మొక్కుకుని గుడిలో నుండి బయట పడింది ఆమె.
అప్పటికే సాయంత్రం అయి పోయింది. శీతా కాలం కావడంతో చీకట్లు ముసురుకున్నాయి.

నున్నగా గుండు చేయించుకోవడం వలన తల మీద ముసుగు కప్పుకున్నా చీర నిలబడకుండా జారిపోతోంది. ఆమె కూడా చీర చెంగు జారి పోయినా పట్టించుకోకుండా దేవాలయం చుట్టూ తిరుగుతూ గాలి గోపురం ముందుకు వచ్చింది.

అప్పటికే చీకటి చిక్కగా అలుముకుంది. చలి కూడా శరీరాన్ని గజ గజ లాడిస్తోంది. అప్పటి కింకా ఆరు గంటలు కూడా కాలేదు. కొండ ప్రాంతం కావడం వలన మంచు దట్టంగా కురుస్తోంది.

క్లోక్‌ రూమ్‌లో పెట్టిన బ్యాగ్‌ తీసుకుంది. బ్యాగ్‌ లోపలి నుండి చిన్నగా మడతలు పెట్టిన బెడ్‌ షీట్‌ తీసి శరీరం నిండా కప్పుకుంది.
గాలి గోపురం ముందరున్న సిమ్మెంటు దారిలో నడుస్తూ ఆలోచిస్తోంది.

ఇక ఇక్కడ ఉన్నా ప్రయోజనం లేదు. ఏం చెయ్యాలి?!’ అనుకుంటూనే ఏదో గుర్తొచ్చిన దానిలా బ్యాగ్‌ ప్రక్క జిప్‌లో ఉన్న సెల్‌ ఫోన్‌ తీసింది.
సైలెంట్‌ మోడ్‌లో ఉన్న సెల్‌ ఫోన్‌ లో పాతిక పై చిలుకు మిస్‌డ్‌ కాల్స్‌ ఉన్నాయి. అన్నీ ఒకే ఒక్క వ్యక్తి నుండి వచ్చిన కాల్స్‌. సెల్‌ తీసి చూసింది.

ఉదయం నుండి ఎడ తెరిపి లేకుండా చేసిన కాల్స్‌ అవి. తను బయల్దేరినప్పుడే పాత నెంబర్లన్నీ తీసి మూలన పడేసింది. కొత్త నెంబరు తీసుకుంది. ఈ నెంబరు ఎవరికీ తెలీదు. ఒకే ఒక వ్యక్తికి తెలుసు. ఆ వ్యక్తివే వరుసగా ఇన్ని మిస్‌డ్‌ కాల్స్‌.

‘ఏమైందబ్బా?! ఎందుకంత ఆతృతగా చేసింది? తనే ఎప్పుడన్నా...అవసరముంటే చేస్తానని కదా చెప్పింది?! మరి!’ అలా ఆలోచిస్తూనే ఒక్క సారి ఆనంద భరితురాలైంది. ఆమె!

‘అంటే....అంటే.....తన....తన.....ఆశ.....శ్వాస....ధ్యేయం....ధైర్యం....తన చెంతకు చేరాయా...తన పూజలు ఫలించాయా?

(ఆమె అన్వేషణ గమ్యం చేరిందా? ఆమె ఆశలు ఫలించాయా..?? అంతలోనే అనుకోని అవాంతరాలు ఆమేని చుట్టుముట్టాయా??? ఇవన్నీ తెలియాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే......)
జరిగిన కథ
మరిన్ని సీరియల్స్