Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> మృత్యు కేళి

mrutyukelee

టాక్సీ వచ్చి అరగంటవుతోందనీ అమ్మని  త్వరగా బయలుదేరమనీ అక్కకి చెప్పాడు గౌతమ్. అసలు, రాత్రికే బయలుదేరి, ఏర్ పోర్ట్ దగ్గరలో వున్న పిన్నీ వాళ్ళింటికి వెళ్ళి అక్కడ నుంచీ త్వరగా చేరుకోగలమని కూడా చెప్పాడు.... నాలుగో సారి హెచ్చరిక తో కూడి ప్రేమగా విసుక్కున్నాడు గౌతమ్... తన తల్లి షాలిని ని.  నాన్న గారికి ఇష్టమైన జంతికలు ప్యాక్ చేసుకుంటూ, మిగిలిన పనులు హడావుడి గా పూర్తి చేస్తూనే వుంది. ఏర్ పోర్ట్ కి గంట ముందుగా చేరుకోవాలి, ఇక్కడనుంచీ అక్కడికి రెండు గంటల పైనే పడుతుంది. ఇంకా మూడు గంటల టైం మాత్రమే వుంది.  తనూ వెళ్ళే వాడే కానీ, ఓ మీటింగ్ లో తన అవసరం ఎక్కువ ఉండబట్టి అమ్మను   డ్రాప్ చేయలేకపోతున్నందుకు బాధ గానే వున్నాడు. ఆఫీసు పని మీద నాన్న సింగపూరు వెళ్ళారు. తన పని పూర్తి కావడానికి మరో నెల రోజులు పడుతుందని తెలిశాక, అమ్మని కూడా అక్కడికి రమ్మనమని అన్నారు. కొద్ది రోజులుండి సింగపూర్ అంతా చూసి వెళ్ళచ్చని. నాన్న గారి ఉద్యోగ కార్యక్రమాలలో దేశాలు తిరుగుతూండడం, అప్పుడప్పుడు అవకాశం ఉన్నపుడు, వీసాలు ఉన్న చోట్లకీ అమ్మ కూడా  వెళ్తుండడం మామూలే. కాని ఎందుకో అమ్మ ఈ సారి ప్రయాణానికి చాలా ఆలస్యం చేస్తోందని గమనించాడు. ప్రత్యేకించి కారణం ఏమీ లేక పోయినా.

ఎట్టకేలకి బయల్దేరి వెళ్ళింది షాలిని. దారిలో టాక్సీ టైరు పంక్చర్, చాలా సేపు ట్రాఫిక్ జాం, వంటి సమస్యలని అధిగమించుకుని, నిన్ననే  ఎందుకు బయలుదేరి రాలేదా అని టెన్షన్ పడుతూ, టాక్సీ అతన్ని తొందర పెడుతూ, అతని సారీలు వింటూ,  ఎట్టకేలకి ఎయిర్ పోర్ట్ చేరుకుంది.  డిస్ ప్లే బోర్డ్,  షాలిని  ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినట్లు చూపిస్తూంటే, కంగారుగా  చెకిన్ కవుంటర్ లోకి వెళ్ళింది. అక్కడ డ్యూటీలో లిప్ స్టిక్ మాత్రమే అందంగా ఉన్న ఓ అమ్మాయి బబ్బుల్ గం నముల్తూ   షాలిని ఫ్లయిట్ వెళ్ళి పోయినట్లు లిస్ట్ చూడ కుండానే  చెప్ప గలిగింది. కొద్ది సేపు బిత్తర పోయింది. షాలిని  గురించి చాలా సార్లు అనౌన్స్ మెంట్ లు చేసి  ఫ్లైట్  సాగిపోయిందిట. మంచి చాక్లెట్ కాఫీ ఒకటి తెచ్చుకుని  కొంచెం సేపు రిలాక్స్ అయ్యి జరిగిన సంఘటనని జీర్ణించుకుంటూ, బాధగా వున్నా, కొంచెం మామూలుగా ఉండే ప్రయత్నం చేసుకుంటూ, తక్షణ కర్తవ్యంగా  సింగపూర్ ఫోన్ చేసి తను ఫ్లైట్ మిస్ అయిందనీ, రిసీవ్ చేసుకోవడానికి రావద్దని భర్త కి చెప్పింది. తిరిగి  ప్రయాణానికి గురించిన వివరాలు, ఏర్పాట్లు గురించి అక్కడి అధికారులని కలిసి అందుకు వలసిన విధి విధానాలని   చర్చించి తేల్చుకుని, లగేజ్ ట్రాలీతో సహా వెనక్కి వచ్చి టాక్సీ  పిలిచి ఇంటికి బయలుదేర బోయింది. అంతా జరిగేసరికి దాదాపు ఓ గంట  సమయం పైనే పట్టింది.  బయటకి వస్తూండగానే ఏర్ పోర్ట్ లో అంతా హడావుడి గా కనపడింది. కంగారు కంగారు గా కార్లు దిగి కొందరు ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళడం, కార్ల పైన డిష్ లున్న అనేక వ్యాన్లు, కార్లు,  గమనించింది.  తనకి చెకిన్ లో కనిపించిన అమ్మాయి తన వద్దకి వచ్చి,

ఓ షేక్ హాండ్ ఇచ్చి, తనని చాలా అదృష్టవంతురాలని, తను ఎక్కవలసిన విమానం సముద్రం లో కూలిపోయినట్లు ఓ వార్త అందిందనీ  దాదాపు ఎవ్వరికీ బ్రతికే అవకాశం లేదనీ చెప్పి, తనకి బ్రతికే  అదృష్టం ఇంకా వుందనీ ఎంతో ఆనందం, ఎక్సైట్ మెంటూ కలగలిపి చెప్పి తిరిగి  వెనక్కి  వెళ్ళిపోతూ,  ఈ సంఘటన ని కవర్ చెయ్యడానికి వచ్చిన మీడియా వారికి షాలినిని  చూపించి మరీ వెనుతిరిగింది. ఈ తతంగమంతా చూసిన టాక్సీ డ్రయివర్,  వెళ్ళి పోతానని చెప్పి, వేరే టాక్సీ మాట్లాడుకొమ్మని తెలిపి వెళ్ళిపోయాడు. షాలిని తప్పించుకున్న మృత్యువు గురించి, ఆవిడని మృత్యుంజయురాలిగా అభివర్ణిస్తూ  ఓ అరగంట సేపు అన్నిరకాల మీడియా వారు,  కలాలు, కెమేరాలు, వీడియోలతో విసిగించి పారేశారు. అవన్నీ లైవ్ లో చూసినవాళ్ళు గౌతం కి ఫోన్ చేసి చెప్పడంతో అతను టీవీ కవరేజ్ చూసి, ఉద్వేగాన్ని అణుచుకోలేక విలపిస్తూ తనూ బయలుదేరి వస్తున్నానని ఫోన్ చేసి తల్లికి చెప్ప బోయాడు.  వాడిని రానవసరం లేదనీ తను బయల్దేరి వచ్చేస్తున్నానని, నాన్న గారికి కూడా చెప్పాననీ చెప్పి వాడిని ఊరడించింది. వేరే టాక్సీ పిలిచి తన లగేజ్ ఎక్కింపించి ఇంటికి బయలుదేరింది.

ఈ సారి తొందరేం లేకపోయినా టాక్సీ వేగాన్ని కనిపెట్టనంత రిలాక్స్ డ్ గా కళ్ళు మూసుకుని కూర్చుంది. టాక్సీ డ్రయివరు రెండు వైపులా కిరాయి తీసుకుని సిటీ నుంచి వచ్చాడు. ఇక్కడ ఇప్పుడు బేరాలుండవు, ఎందుకంటే,  మళ్ళీ ఉదయం ఆరు దాటాకా గానీ మరో విమానం దిగదు, అటువంటి తనకి తిరుగులో పెద్ద కిరాయి తగిలే సరికి, ఈ సొమ్ముని ఓనరు కనపడకుండా ఎలా దాచెయ్యాలా అనే ఆలోచనలతో ఉబ్బితబ్బిబ్బౌతున్నాడు. తన కిష్టమైన పాటని వింటూ హమ్మింగ్ చేసుకుంటూ నడుపుతున్నాడు. ఎదురుగా వస్తున్న టర్నింగ్ లో అంత వేగం అదుపు చెయ్యలేక పోవడం, మనసు తనకొచ్చే ’లాభం’ లెక్క వేసుకుంటుండడం తో  ఎదురుగా వచ్చిన  పెద్ద లారీ  టాక్సీ మధ్య భాగానికి గట్టిగా గుద్దుకోవడం  క్షణాల్లో జరిగిపోయింది.  అదే పక్క  విండో వద్ద కూర్చున్న షాలిని  మరలా కళ్ళు తెరవక్కరలేకుండా చివరి ఊపిరి తీసుకుంది.

ఇక్కడ షాలిని పార్థివ శరీరమైనా దొరికింది.  ప్రమాదం జరిగిన విమాన ప్రయాణీకుల దేహాల కోసం సముద్రంలో ప్రయత్నాలు ప్రారంభమయినాయి.  ఇది  మృత్యుహేల. తప్పించుకున్న షాలిని ని మృత్యువు వెంటాడి వేటాడి ఆడుకున్న ఓ కేళి.

మరిన్ని కథలు
spoorti