Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

హైటెక్‌ జమానా మమ అనాల్సిందేనా

hitech jamana
స్నానం చేయాలంటే బకెట్‌ నీళ్లు కావాలి. కానీ మారుతున్న ప్రపంచం మనిషికి గుక్కెడు నీరు కూడా అందనీయకుండా చేస్తోంది. దక్షిణాఫ్రికాలాంటి దేశంలో రాజధాని నీటి ఎద్దడితో సతమతమవుతోంది. ఈ నీటి సమస్యకు ప్రపంచంలోని ఏ దేశం అతీతం కాదు. నీటి వనరులు రోజు రోజుకీ అడుగంటిపోతున్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? పర్యావరణవేత్తలు హెచ్చరికలు, ఆందోళనలు ఓ పక్క కొనసాగుతుంటే, ఇంకో పక్క అభివృద్ధి పేరుతో నీటి వనరుల్ని అంతం చేసుకుంటూ పోతున్నాం. మనం సృష్టించుకుంటున్న ఈ సమస్యకి మనమే కొత్త కొత్త పరిష్కార మార్గాలు వెతకాలి.

మార్కెట్‌లోకి నీళ్లు అవసరం లేకుండానే స్నానం చేసేయడానికి ఓ క్రీమ్‌ వచ్చేస్తోంది. దీన్ని ఒంటికి రాసుకుని టవల్‌తో తుడిచేసుకుంటే, స్నానం చేసేసినట్లే. పైగా ఇది స్నానం చేస్తే శుభ్రం అయ్యే దాని కంటే ఎక్కువగా శరీరం నుండి మలినాల్ని, సూక్ష్మ జీవుల్ని తొలిగిస్తుందట. సైనిక అవసరాల కోసం ఈ తరహా సాంకేతికతను వినియోగిస్తుంటారు. భోజనం చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో సైనికులు ట్యాబ్లెట్స్‌ మింగుతారు. అది ఆహారానికి ప్రత్యామ్నాయం. పైన చెప్పుకున్న క్రీమ్‌ సబ్బుకీ, నీటికీ ప్రత్యామ్నాయం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నీటి సమస్యని తగ్గించడానికి మూత్రాన్ని ఫిల్టర్‌ చేసే ఏర్పాట్లున్నాయి.

భవిష్యత్తులో అదే టెక్నాలజీని మనం ఫాలో అవక తప్పదు. వైద్య రంగంలో అద్భుతాల గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాం. ఒకప్పుడు ధర్మా మీటర్‌ని చంకలోనో, నాలుక కిందో పెట్టేవారు. ఇప్పుడు ధర్మల్‌ సెన్సార్స్‌ వచ్చేశాయి. ఒకప్పుడు రక్త పరీక్షల కోసం పెద్ద మొత్తంలో రక్తాన్ని సేకరించేవారు. క్రమక్రమంగా అది తగ్గుతూ వచ్చింది. సమీప భవిష్యత్తులో జస్ట్‌ చర్మానికి ఓ పట్టీ లాంటి సాధనాన్ని అతికిస్తే, ఆ పట్టీ ద్వారా ఎలాంటి నొప్పి లేకుండా, వైద్య పరీక్షలన్నీ ఓ వ్యక్తికి క్షణాల్లో చేసేసే సాంకేతికత ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. మరో ఆరు నెలల్లోనో, ఏడాదిలోనో ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తుంది.

మన చేతిని డాక్టర్‌ టచ్‌ చేయకుండానే ఆన్‌లైన్‌ ద్వారా పైన చెప్పుకున్న సాంకేతికతను వినియోగించుకుని వైద్యం చేసేసే రోజులు ఎంతో దూరంలో లేవు. అయితే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్లుగానే, అనంతకోటి ఉపాయాలకు అంతకు మించిన సమస్యలు సర్వ సాధారణమే. పెరుగుట విరుగుట కొరకే అని పెద్దలు చెప్పింది ఇందుకోసమేనేమో. అన్నింటికీ మమ అనేస్తామంటే కుదరదు మరి. 
మరిన్ని యువతరం
Is crime a wrong parent