Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> చురక!

churaka
ఆఫీసునుండి అలసిపోయి ఇంటికి వచ్చిన రాజారాం కాళ్ళూ చేతులూ ముఖం కడుక్కుని దుస్తులు మార్చుకుని వచ్చి హాలులో సోఫాలో కూలబడ్డాడు విశ్రాంతిగా.

ఇంతలో భార్య లలిత వేడి వేడి కాఫీ తెచ్చి అతడి  చేతికి  అందించి తిరిగి వంటగదిలోకి వెళ్ళింది...
మధురమైన ఫిల్టర్ కాఫీ రుచి ఆస్వాదిస్తూ త్రాగి,  జేబులోంచి  తనకిష్టమైన  బ్రాండ్ సిగరెట్టు తీసి వెలిగించి గుండెలనిండా దమ్ములాగి ‘ఉఫ్’ అంటూ వదిలి సోఫాలో వెనక్కివాలి  తన్మయంగా ఇలా కళ్ళు మూసుకున్నాడో లేదో  ‘నాన్నా నాన్నా’ అంటూ  కేకలు పెడుతూ అలా బాబిగాడు వచ్చాడు

‘అబ్బబ్బ ఈ పిల్లలు కాసేపైనా విశ్రాంతిగా ఉండనివ్వరు కదా , ఒరేయ్ కాసేపు అమ్మ  దగ్గరికి పో ’ కొడుకుని కసురుకున్నాడు  రాజారాం.
అంతటితో ఊరుకోక ‘లలితా వీడికేం కావాలో చూడు’ భార్యనుద్దేశించి  కేకపెట్టాడు

‘కాసేపు చూసుకోండీ ప్లీజ్.... ఇక్కడ పనిలో ఉన్నాను’ వంటగదిలోనుండే లలిత జవాబిచ్చింది 

‘ఊహూ... నేను వెళ్ళను. నాన్నా నువ్వు ఇప్పుడే నాతో రావాలి’ పట్టువదలని విక్రమార్కుడిలాగా షంటుడు మొదలెట్టాడు  బాబి  
‘ఎక్కడికిరా?’

‘రా ముందు’ తండ్రి చేయి పట్టి లాగాడు

ఇంక తప్పదనుకుని లేచి చేతిలో సగం కాలిన సిగరెట్టు గుండెలనిండా  మరో దమ్ము లాగి వదిలి బాబి  వెనకాలే వెళ్ళాడు
తండ్రిని   సరాసరి తమ గదిలోకి  తీసుకెళ్ళాడు బాబి

అక్కడ ఎదురుగా కనపడిన దృశ్యం చూసి  దిమ్మతిరిగింది రాజారాం కి ...

గదిలో  వాలు కుర్చీలో వెనక్కివాలి, దర్జాగా కాలు పై కాలు వేసుకుని,  అతడి పదేళ్ల  కూతురు రజని నోట్లో చివర్ల  చీపురు పుల్లలు  పెట్టుకుని, అంటించినట్లుగా చేసి , అచ్చం తండ్రి   చేస్తున్నట్లుగానే, గుండెలనిండా పొగ పీల్చి  వదిలినట్లుగా చేస్తూ ,కళ్ళు మూసుకుని కూర్చుని ఉంది???

  చిత్రంగా రాజారాం మనసులో అంతర్మథనం మొదలైంది......

‘ఈ పసిది ఇదంతా ఎక్కడ, ఎప్పుడు నేర్చుకుంది ?

అయినా ఎక్కడో  నేర్చుకోవాల్సిన పనేముంది?  ఇంట్లో దాని కళ్ళ ముందు  నేను రోజూ కాలుస్తుంటే  కళ్ళార్పకుండా చూస్తోందిగా! ఇవాళ ఇది చేస్తే  రేపు బాబిగాడు కూడా చేస్తాడు????

‘అయితే మాత్రం ఇంత చిన్న పిల్ల ఇలాంటి పనులు చేస్తుందా? ఎంత ధైర్యం?

గడబిడగా బుర్రని తొలుస్తూ ఉవ్వెత్తున చెలరేగుతున్న అతడి ఆలోచనలను త్రొక్కి వేస్తూ పురుష అహంకారం పొడుచుకొచ్చింది రాజారాం కి !  
హఠాత్తుగా అతడిలోని తండ్రి మేల్కొని....ఒక్కసారిగా బాధ్యత గుర్తుకొచ్చింది!!

అంతే , కుడి చేతిలో సిగరెట్టు ఎడం చేతిలోకి మార్చి , పట్టరాని ఆవేశంతో పసిపిల్ల రజని రెక్క పట్టుకుని బరబరా హాల్లోకి  ఈడ్చుకొచ్చి చెంప  పగిలేలా లాగి పెట్టి ఒక్కటిచ్చాడు

ఆ దెబ్బకి గూబ గుయ్యిమనడంతో రజని తారస్థాయిలో ఏడుపు మొదలుపెట్టింది, భయంతో బాబి కూడా ఏడుపు లంకించుకున్నాడు
ఉన్నట్లుండి బిగ్గరగా  పిల్లల  ఏడుపులు  విని  వంటగదిలోంచి పరిగెత్తుకొచ్చిన లలిత ...... 

‘నాన్నా  అక్క అచ్చం నువ్వు చేసినట్లే చేస్తోంది కదా? మరి అక్కనెందుకు కొట్టావు?’ వెక్కుతూనే అయిదేళ్ళ బాబిగాడి నోటినుండి వెలువడిన తూటాల్లాంటి మాటలకి ..... నివ్వెరపోయింది !!

కూతురి చేష్టల ఆఘాతంనుంచే ఇంకా కోలుకోని రాజారాం హృదయాన్ని,  బాబిగాడి మాటలలో నిక్షిప్తమైన    ‘నిన్నెవ్వరూ  కొట్టరేం మరి’  అన్న  అవ్యక్త భావం , శరాఘాతమై తాకి  విలవిలలాడించింది!

చివరిదాకా  కాలిన సిగరెట్టు మంట తగిలి వేళ్ళు చురుక్కుమంటే .... ‘తుంటి కొడితే  పళ్ళు రాలినట్లు’ గా .....వీపు చురుక్కుమన్నట్లై ఉలిక్కిపడ్డాడు రాజారాం!!
మరిన్ని కథలు
gouri