Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue264/705/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి).... సనత్ కుమార్ ఆమె మొహంలో కలుగుతున్న భావాలు చూస్తూ మృదువుగా అన్నాడు “ కంగారు పడకండి. నాకు తెలుసు ఏం జరిగిందో.. కాని స్టాఫ్ కి తెలియదు.. అక్కడి సూపర్ వైజేర్ కి తెలియదు.. మిమ్మల్ని అపార్ధం చేసుకోడం వాళ్ళ జన్మ హక్కు.. వాళ్ళల్లో పెద్ద మనసు మనం ఆశించ కూడదు. కాక పోతే ఏదన్నా అలాంటి సమస్య వచ్చినప్పుడు ఎలా పేస్ చేయాలో మీరే మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి. ఇది కూడా మీ ట్రైనింగ్ లో భాగం.”

శరణ్య మొహంలో రంగులు మారుతోంటే అతను చెప్తున్నది స్థాణువై వినసాగింది.

“నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయడం లేదు శరణ్యా .. జరిగింది, జరుగుతున్నది చెప్తున్నాను. ఇలాంటివి మీ సర్వీసులో చాలా చూడాల్సి వస్తుంది.  మనం మంచి పని చేస్తే మనలను ఇలా అన్ పాపులర్ చేయడం జనాలకి సహజం. ఇదే పని ఒక మినిస్టర్ రికమండేషన్ తో వాళ్ళ బంధువుల కోసం చేస్తే ఎవరూ మాట్లాడరు. మీరు కొత్త కాబట్టి, పైగా టెర్రర్ కాబట్టి మీ మీద ఇలాంటి రూమేర్స్ చాలా కామన్ ..ఎందుకు చెప్తున్నానంటే మీరు అధైర్య పడద్దు  అని చెప్తున్నా.. మన వెనకాల మనలను అబ్సర్వ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు.  సో బి కేర్ఫుల్ . అలా అని మీరు చేసే మంచి పనులు మానద్దు. మీ విధి నిర్వహణలో ఎప్పటికప్పుడు అప్రమత్తులై ఉండండి.. మీకేం కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి.”

ఆయన సహృదయతకి శరణ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. థాంక్ యూ సర్ అంది.

“ఇట్స్ ఓ కె ... ఇంతకీ ఆ అమ్మాయి సంగతి ఏంటి? ఎలా ఉంది?”

“తెలియదు.. ఆరోజు అక్కడ వదిలి సత్య వాణి అనే కార్యకర్తకి అప్ప చేప్పి వచ్చాను. మళ్ళి ఈ గొడవల్లో వెళ్ళ లేదు కదా.. ఇప్పుడు వెళ్ళ గానే ఆ అమ్మాయి సంగతి చూస్తాను”. అంటూ తేజ గాయత్రి పేరు మీద డిపాజిట్ చేయమని యాభై వేలు ఇచ్చిన సంగతి చెప్పింది.

“అతను " వావ్ మీరు చాలా అదృష్టవంతులు... ఒక మంచి వ్యక్తీ భర్త కాబోతున్నాడు” అన్నాడు.

“అవును సర్ ... నేను చాలా అద్రుష్టవంతురాలిని” అంది.

తరవాత అతని దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది.

శరణ్య వెళ్లేసరికి గాయత్రి పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని రఘుపతి రాఘవ రాజా  రాం అని పాట నేర్పిస్తోంది.  అందరూ ముద్దుగా అర్ధ చంద్రాకారంలో ఆమె చుట్టూ కూర్చుని చిట్టి చిట్టి చేతులతో భజన చేస్తూ గాయత్రి చెప్తున్న పదాలను చిలకల్లా చెప్తున్నారు.

ఇద్దరు ఆయాలు కొంచెం ఎడంగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

శరణ్యని చూడగానే అందరూ భక్తీ గౌరవాలతో లేచి నిలబడి నమస్కరించారు. గాయత్రి ఆమె దగ్గరగా వెళ్లి “ మేడం మంచి నీళ్ళు ఇమ్మంటారా”  అని అడిగింది.

“ఎలా ఉన్నావు గాయత్రీ ...? సారీ.. అనుకోకుండా నేను బిజీ అయి పోయి నీ దగ్గరకు రాలేక పోయాను. నిన్ను ఇక్కడ పడేసి వెళ్ళి పోయాను అనుకున్నావా” ఆప్యాయంగా అడిగింది శరణ్య.

“ఛి లేదు మేడం ... సత్యవాణి అక్క నన్ను చాలా బాగా చూసుకుంది.. ఇక్కడ అందరూ కూడా నన్ను ప్రేమగా చూసుకున్నారు. మీరు ఆఫీస్ పని మానేసి నా దగ్గరకు వస్తారా అస్తమానం” అంది గాయత్రి.

“పాప చాలా బుద్దిమంతురాలు మేడం .. అందరితో చక్కగా కలిసిపోయింది. పిల్లలని ప్రేమగా చూసుకుంటోంది. ఈ పాప వచ్చాక మాకు ఎంతో సుఖంగా ఉంది. పిల్లలకి అక్షరాలు కూడా నేర్పిస్తున్నది” అన్నారు ఆయాలు.

“ అలాగా .. చాలా సంతోషం గాయత్రి మంచి పేరు తెచ్చుకున్నావు. బాబు ఎలా ఉన్నాడు” అడిగింది శరణ్య. బొమ్మలతో ఆడుకుంటున్న బాబుని ఎత్తుకుని వచ్చింది గాయత్రి “ వీడికి కూడా గుడ్డు పెడుతున్నాను .. కొంచెం బలం పట్టాడు” అంది.

“అప్పుడేనా వారానికేనా” అంది కానీ నిజం గానే బాబు పుష్టిగా కనిపించాడు.

“సరే నువ్వు నాతో బాంక్ కి రావాలి రెడీ అయి రా” అంది.

“ఎందుకు మేడం”  ఆశ్చర్యంగా అడిగింది గాయత్రి.

“ చెప్తా .. అది సరే ఏంటి అక్కా అని మానేసి మేడం అంటున్నావు” నవ్వుతూ అడిగింది.

“అందరికి మేడం కదా మీరు” అని సిగ్గుగా నవ్వింది గాయత్రి.  శరణ్య కూడా నవ్వేసింది.

మరి కాసేపట్లో బాబుని చూసుకోమని మిగతా వాళ్ళకి చెప్పి గాయత్రిని తీసుకుని బాంక్ కి వెళ్ళింది. అక్కడ శరణ్య మీద గౌరవంతో ఎవరూ ఏమి అభ్యంతరాలు పెట్టకుండా గాయత్రి పేరు మీద సేవింగ్స్ ఎకౌంటు, బాబు పేరు మీద ఎఫ్ డి చేసారు. ప్రతినెల వడ్డీ సేవింగ్స్ ఎకౌంటు లో పడేలా ఏర్పాటు చేసి పాస్ బుక్ గాయత్రికి ఇచ్చి జాగ్రత్త చేసుకోమంది శరణ్య.

గాయత్రికి అసలు ఏం జరుగుతోందో తెలిసే సరికి మతి పోయింది. “ఇంత డబ్బు నాకు ఎందుకు మేడం” అని అడిగింది.

“నీకు కాదు నీ  కొడుకు చదువుకి ..  ఈ డబ్బు నేను ఇవ్వలేదు నా కాబోయే భర్త ఇచ్చాడు” అంది శరణ్య. 

విశాలంగా ఉన్న కళ్ళతో శరణ్య వైపు చూసింది ఆ చూపులో ఎవరా అదృష్టవంతుడు అనే భావన కనిపించింది శరణ్యకి ...

ఇంకా  ఏదో అనబోతున్న గాయత్రిని వారిస్తూ “ పద, పద వెళ్దాం ... నాకు తెలిసిన ఒకళ్ళ ఇంట్లో ఒక రూమ్ అద్దెకి ఉందిట చూసుకుందువు గాని”  అని కారులో కూర్చుంది శరణ్య.

గాయత్రి నోట మాట వింటూనే మంత్ర ముగ్ధ లాగా ఆమెని అనుసరించింది.

గాయత్రికి రూమ్ నచ్చింది.. శరణ్యని అభిమానించే ఒక టీచర్ గాయత్రికి చాలా తక్కువ అద్దెకి ఒక వంట గది, ఒక హాలు, కం పడక గది ఇచ్చింది. “మీరు ఈ అమ్మాయి గురించి అసలు వర్రీ అవకండి నేనున్నాను ... జాగ్రత్తగా చూసుకుంటాను” అని మాట ఇచ్చింది ఆవిడ.

మరునాడే గాయత్రి షిఫ్ట్ అయే లాగా ఏర్పాట్లు చేసి ఆమె చేతికి కొంత డబ్బు ఇచ్చింది శరణ్య.

“మీ ఋణం ఎలా తిర్చుకోను” కన్నీళ్ళతో అంది గాయత్రి. 

“డిగ్రీ పూర్తీ చేసి, మంచి ఉద్యోగం సంపాదించుకుని, బాబుని పెద్ద వాడిని చేసి” అంది నవ్వుతూ శరణ్య. 

గాయత్రిని సెంటర్ లో డ్రాప్ చేసి అందరి దగ్గరా సెలవు తీసుకుని ఆఫీస్ కి బయలు దేరింది.  

ఆమె ఆఫీసుకి వెళ్లే సరికి ఆ వాతావరణంలో ఒక అనారోగ్యకరమైన మార్పు గమనించింది. 

ఎప్పటి లాగే అందరూ గౌరవంగా లేఛి నిలబడి నమస్కారం చేసినా ఆ గౌరవంలో లోపం, కృత్రిమత కనిపించింది. సనత్ కుమార్ అంతకు ముందే అప్రమత్త చేయడం వలన శరణ్య పట్టించుకో లేదు. 

మామూలుగానే తన పనులు మొదలు పెట్టింది. పెండింగ్ ఫైల్స్ చూసి కొన్ని సంతకాలు చేసింది.. కొన్ని సందేహాలతో పక్కన పెట్టింది. రెండు, మూడు ల్యాండ్ డిస్ప్యుట్ కేసులు వచ్చాయి. 

వాటికి సంబంధించిన వివరాలు సూపరింటెండెంట్ తో చర్చించింది. గంభీరంగా రోజు గడిచి పోయింది.

గాయత్రిని కష్టాలలోనుండి గట్టెక్కించే మంచి ప్రయత్నంలో శరణ్యకు ఎదురు కాబోతున్న సవాలు  ఏమిటి? వాటిని శరణ్య ఎలా పరిష్కరించుకోబోతుంది?? తెలియాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana