మిత్రుడు : నీకు చిత్ర విచిత్రసేనుడనే పేరెందుకుకబ్బా?
చిత్రవిచిత్రసేనుడు: నేను చిత్రవిచిత్రాలు చేసి చూపిస్తాను కనక?
మిత్రుడు : ఏదీ, ఒక చిత్ర విచిత్రం చేసి చూపించు !
చిత్రవిచిత్రసేనుడు : నువ్వు ప్రస్తుతం నా ఆత్మతో మాట్లాడుతున్నావు. నా కాళ్ళకేసి చూడు.!
మిత్రుడు : నీ కాళ్ళు కనిపించడం లేదే?
చిత్రవిచిత్రసేనుడు : అదే.....నువ్వు నా ఆత్మతో మాట్లాడుతున్నావన్నాగా!!
...............................................
రాజు : మన రాజ్యంలో ప్రతి ఇంటికీ ఒక మరుగుదొడ్డి ఉచితంగా కట్టిస్తామన్నాము కదా...ప్రజలకి సంతోషమేనా?
మంత్రి : లేదు ప్రభూ!
రాజు : ఏం? ఎందుకూ?
మంత్రి : ప్రతి ఇంటికీ రెండు పందులు తప్పనిసరిగా ఇస్తామని సెలవిచ్చారు గదా,..జనానికి నచ్చలేదు మహారాజా!!
...............................................
ఒక పరిచారిక : పని మనకప్పగించకుండా, రాణీగారే స్వయంగా వడియాలు పెడుతున్నారా?
రెండో పరిచారిక : ఔను , శత్రువులెవరైనా విషం కలుపుతారన్న భయంతో !
ఒక పరిచారిక : మరి వడియాలు ఎండేదాకా, ఆవిడే కాపలా కాస్తారా?
రెండో పరిచారిక : అదుగో, ఆ మూల కర్రతో నుంచున్న ముసుగు మనిషి ఆ పని చూసుకుంటారు!
ఒక పరిచారిక : ఎవరా ముసుగు మనిషి?
రెండో పరిచారిక : (రహస్యంగా) మన రాజుగారే !!
...............................................
సేవకుడు : మహారాజా మన రాజ్యంలో " మావోయిస్టులు " ప్రవేశించారట !
మహారాజు : ఎవరు వాళ్ళు ? వాళ్ళవల్ల మనకేం ప్రయోజనం?
సేవకుడు : ప్రయోజనం లేదు ప్రభూ, వాళ్ళవల్ల ప్రమాదం తథ్యం అంటున్నారు !
మహారాజు : ఐతే వాళ్ళని వెంటనే నిర్మూలించండి. ఆలస్యం దేనికీ?
సేవకుడు : వాళ్ళని " ఎన్ కౌంటర్ " లోనే హతమార్చాలట!
మహారాజు : " ఎన్ కౌంటర్ " అంటే "
సేవకుడు : అది తెల్సుకోవడానికే మన పండితులు నిఘంటువులు తిరగేస్తున్నారు ఆలస్యం చేస్తున్నారు ప్రభూ!
మహారాజు : ఐతే వాళ్ళని కూడా " మావోయిస్టుల " తో కలిపి హతమార్చండి!
...............................................
అంతఃపుర కన్య-1 : ఆస్థాన వైద్యులు, అశ్వగంధ లేహ్యం ప్రత్యేకంగా తయారు చేసి, రాజుగారికి తినిపిస్తారు తెలుసా?
అంతఃపుర కన్య-2 : అలా చెయ్యమని, రాణీగారు ఆదేశించారు !
అంతఃపుర కన్య-3 పెద్దరాణీగారా?
అంతఃపుర కన్య-4 (రహస్యంగా ) పెద్దరాణీగారు ముసల్దైపోయింది కదా ...! కొత్తగా వచ్చిన చిన్నరాణీగారు ఆదేశించారు ( ముసిముసి నవ్వులతో)
...............................................
దేవతల్లో ఒకడు : నువ్వు కొమ్ములు తిరిగున్నా, బలవంతుడివైనా తెలివిగలవాళ్ళం మేమే !
రాక్షసుల్లో ఒకడు : తెలివున్నా, పిరికివాళ్ళు కదా మీరు !
దేవతల్లో ఒకడు : ఎలా ?
రాక్షసుల్లో ఒకడు : మేం వాసుకి పడగ పట్టి క్షీరసాగరం చిలికాం ! మీరు తోక పట్టుకుని చిలికారుగా?!
దేవతల్లో ఒకడు : హు! బుద్ధి గడ్డి తిని, పొద్దున్నే నీతో వాదించడం తప్పైపోయింది!
రాక్షసుల్లో ఒకడు : చూశారా///మీరు బుద్ధితో గడ్డి తింటారు ! మేం ఏది తిన్నా నోటితోనే తింటాం!!
దేవతల్లో ఒకడు : బాబూ...నీకో దండం ! వొస్తా!!
...............................................
సేవకుడు : దండనాయకా, మన ఆవులకీ, గేదెలకీ గొర్రెలకీ, చేలో ఒక్క పోచ గడ్డి లేదు !
దండనాయకుడు : ఎలా? ఆశ్చర్యంగా వుందే?
సేవకుడు : ఆశ్చర్యమే నాయకా....కంచెలు చేలు మేసేసినాయ్..!!
...............................................
యుద్ధభూమి శిబిరంలో రాజు : దండనాయకా....మీరు పదివేల సైన్యంతో వెళ్ళారే, శత్రురాజు కోటను ముట్టడించారా? తిరిగొచ్చేశారేం?
తిరిగొచ్చిన దండనాయకుడు : శతృరాజు కోట, కంటికి కనిపించలేదు .ఎలా ముట్టడి చేయం ప్రభూ?
రాజు : కోట కనిపించకపోవడమేమిటి? విడ్డూరంగా లేదూ??
దండనాయకుడు : శతృరాజు ఎవరో ఒక మళయాళ మాంత్రికుడికి కోటలో ఆశ్రయమిచ్చాడట ప్రభూ..ఇదీ మనకందిన సమాచారం..!!
...............................................
చెలికత్తె-1 : నీపేరు తులసి అన్నావు, కృష్ణతులసి, రామతులసి, విష్ణుతులసి, విభూతి తులసి, కర్పూర తులసి వా?
చెలికత్తె-2 : వన తులసి!!
...............................................
శిష్యుడు : గురువుగారూ, నా పూర్వజన్మపుణ్యఫలమెరుగ కోరి, మీకు పాతికేళ్ళుగా సపర్యలు చేశానే? దయతో సెలవీయరా?
గురువు : నా బోటి వాడికి పాతికేళ్ళుగా సపర్యలు చేయాలని నీకు రాసిపెట్టి వుంది.! అదే నీ పుణ్యఫలం...ఫో!
|