Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

పెప్పర్‌ స్ప్రే, షాకింగ్‌ స్టిక్‌ తప్పవిక.!

pepper spray shocking stick compulsory

మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఎన్ని చట్టాలు వస్తున్నా అవి పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఉదయాన్నే లేచి టీవీ ఆన్‌ చేస్తే చాలు. ఆరేళ్ల బాలికపై 50 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం. అరవై ఏళ్ల ముసలామెని కూడా వదిలిపెట్టడం లేదు. ఆమెలో కూడా ఆ యాంగిల్‌నే చూస్తున్నారు. ఆరవై ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల కుర్రాడు అత్యాచారం. 11 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తుల అత్యాచారం. ఇవే వార్తలు. వీటిని ఫోకస్‌ చేసేందుకు న్యూస్‌ ఛానెళ్లు కూడా అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఈ అత్యుత్సాహం ఈ అరాచకాలకు మరింత ఉత్సాహాన్ని అందిస్తోందనిపిస్తోంది. చట్టాలు, పోలీసులు తమ పని తాము చేసుకుని పోతూనే ఉన్నాయి. ఇష్యూ జరగడం, ఇన్వెస్టిగేషన్‌ చేయడం, నిందితున్ని పట్టుకోవడం అంతవరకే జరుగుతోంది. మరి ఈ నిందితులంతా ఏమవుతున్నారు? మళ్లీ మళ్లీ ఇదే సంఘటనలు పునరావృతం ఎందుకవుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు.

చట్టాలు, న్యాయస్థానాలు ఏం చేస్తాయి అనే విషయం పక్కన పెడితే, మహిళలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి. ఈ నేపథ్యంలోనే మార్కెట్‌లోకి సెల్ఫ్‌ డిఫెన్స్‌ కోసం పలు ప్రొడెక్ట్స్‌ వస్తున్నాయి. పెప్పర్‌ స్ప్రే గురించి చాలా మందికి తెలుసు. ఆల్రెడీ అది వాడకంలోనే ఉంది. తాజాగా ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇచ్చే స్టిక్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటి కొనుగోళ్లు కూడా ఈ మధ్య బాగా పెరిగాయి. విపత్కర పరిస్థితుల్లో అమ్మాయిలకు ఇవి ఉపయోగపడుతున్నాయి. ఈ స్టిక్‌తో కొట్టాల్సిన పని లేదు. టచ్‌ చేస్తే చాలు కొన్ని నిమిషాల పాటు అచేతనావస్థలోకి వెళ్లిపోతారు. ఇలాంటి కొన్ని సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఆయుధాలను మహిళలు తమ వద్ద అందుబాటులో ఉంచుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. మరో పక్క ఇవన్నీ కాకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. షీ టీమ్స్‌తో మొబైల్‌ ఫోన్స్‌కి అనుసంధానమయ్యేలా కొన్ని యాప్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటిని కూడా మహిళలు ఉపయోగించుకోవాలి. వాటి గురించి తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పాలి.

పైన చెప్పిన మార్గాలన్నీ ఒకెత్తు. సెల్ఫ్‌ డిఫెన్స్‌ మరో ఎత్తు. సెల్ఫ్‌ డిఫెన్స్‌ అంటే శారీరకంగా మహిళలు కొంత శక్తిని కలిగి ఉండాలి. విపత్కర పరిస్థితుల్లో చేతిలో ఎలాంటి ఆయుధం లేనప్పుడు, తన చేతులనే ఆయుధంగా మార్చి, బుద్ధికి పని చెప్పేలా తనని తాను మలచుకోవాలి. అందుకే ఈ కోణంలోనే సెల్ఫ్‌ డిఫెన్స్‌ నేర్పించే సంస్థలకు క్రేజ్‌ పెరుగుతోంది. ఇవి అమ్మాయిలకే కాదు, వర్కింగ్‌ ఉమెన్‌తో పాటు, చిన్నతనం నుండే ఆడపిల్లలకు వీటిలో శిక్షణ ఇప్పించాలి. ఇప్పటికే చాలా చోట్ల అమ్మాయిలు వీటిలో శిక్షణ పొందుతున్నారు. ఏదేమైనా ఎన్ని ప్రత్యామ్నాయాలున్నా, మానసిక ధృడత్వం అన్నింటి కన్నా ముఖ్యం. ఎన్ని విపత్కర పరిస్థితుల్లో ఉన్నా, ధైర్యంగా నిలబడితే, వాటి నుండి బయటపడేందుకు మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకే అమ్మాయిలూ..! ఫస్ట్‌ భయాన్ని వీడండి, ధైర్యాన్ని అలవరచుకోండి.

మరిన్ని యువతరం
no medicine for smart desease