Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue270/717/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)....  గాయత్రి మూడు రోజులుగా ఆ గుడిలో తల దాచుకుంది. రమణ తన మీద హటాత్తుగా చేసిన దాడితో మతి పోయి, దిక్కు తోచక ఎవరూ తనని రక్షించే వారు కనిపించక వెర్రి దానిలా బాబుని, సామాను తీసుకుని  నేరుగా బస్ స్టాండ్ కీ  వెళ్లి కనిపించిన బస్ ఎక్కింది.. అది ఏ బస్సో ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు.. కండక్టర్ వచ్చి టికెట్ అడిగిం దాకా అయోమయంలో ఉండి పోయింది.   

“ఈ బస్ ఎక్కడికి వెళ్తుందండి” అడిగింది.

“ఎక్కడి కెళ్ళాలి మీరు” అడిగాడు..

“ తెలియదు”  అంది కన్నీళ్ళతో

“ విజయవాడ ఎల్తుంది ఈ బస్సు మీ వాళ్ళెవరూ లేరా” అడిగాడు.

తల అడ్డంగా ఊపింది.

అతను సానుభూతిగా చూసాడు.

గాయత్రి ఆశగా అడిగింది “ విజయవాడలో శరణ్య గారు అని ఆఫీసర్ గారు ఉంటారు మీకు తెలుసా..”

“ఏ ఆఫీస్ లో పని చేస్తారండి..” అడిగాడు.

గాయత్రికి మొదటి సారి తన తెలివి తక్కువ తనం మీద చిరాకు వేసింది. ఆవిడ ఎక్కడ పని చేస్తారు, ఏ పోస్ట్ లో ఉన్నారో కూడా తెలుసుకో లేదు. ఆవిడ ఫోన్ నెంబర్ తీసుకో లేదు.. ఆవిడ ఇంటి అడ్రస్ ఎక్కడన్నా రాసుకోవాల్సింది. ఆవిడ చేసిన సాయం అందుకుందే తప్ప ఆవిడ గురించిన వివరాలు తెలుసుకుందా.. ఛ ...

గాయత్రి మౌనం చూసి ఈ అమ్మాయి ఏదో కష్టంలో ఉంది అనుకున్నాడు కానీ ఆ కష్టం ఏంటో తెలుసుకుని సాయం చేసేంత సమయం, ఆలోచన అతనికి లేవు. అందుకే “విజయవాడకి టికెట్ కొట్టమంటారా” అనడిగాడు.

గాయత్రి సంచి లోంచి వంద రూపాయల నోటు తీసి ఇచ్చింది.. ఖర్చులకు పోగా ప్రతి నెలా అంతో, ఇంతో దాచుకోవడం వల్ల ఈ ఆపద సమయంలో ఆ డబ్బు ఉపయోగ పడుతోంది. విజయవాడ వెళ్లి ఎలాగోలా కష్ట పడి శరణ్య అడ్రెస్స్ సంపాదిస్తే చాలు.. తనని ఆదుకునే దేవత ఆవిడే దారి చూపిస్తుంది.

కండక్టర్ టికెట్ , చిల్లర ఇచ్చి వెళ్ళి పోయాడు.

కిటికి లోంచి బయటకి చూస్తూ ఒళ్లో ఉన్న బాబుని జోకొడుతూ ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటి ఈ జీవితం.. ఇది విధి రాతా.. లేక తన స్వయంకృతాపరాధమా ! ఇలా ఎంత కాలం  సమస్యలు తరుముతుంటే పారిపోవాలి.. సమస్యలు.. జీవించి ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయి... ఎంత కాలం పారిపోగలదు! ఎక్కడికని పారిపోగలదు! శరణ్య కనిపిస్తుందా.. తనకి ఆశ్రయం ఇస్తుందా.. ఆవిడ ఇంట్లో ఎంత హాయిగా ఉంది. అక్కడ పని మనిషిగా ఉన్నా చాలు.. ఆ అదృష్టం కలుగుతుందా.. ఎలా ? ఎలా ఆవిడని వెతకాలి.. ఎలా ఆవిడని కలుసుకోవాలి!

లేదు... ఆవిడని మహా నగరంలో ఎక్కడని వెతకడం! కలవక పోవచ్చు.. ఆవిడ జీవితం ఆవిడది.. తనకి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి, ఒక చిన్న ఉద్యోగం చూపించడమే ఎంతో పెద్ద విషయం.. అసలు ఆవిడ ఎవరు? తనకి, ఆవిడకి ఏం  సంబంధం .. ఎందుకు ఇంత సాయం చేయాలి.
సుశీల గారు ఎంత మంచి ఇల్లాలు.. అలాంటి ఇల్లాలికి ఒక నీచుడు భర్త.. ఇన్ని నెలల నుంచి తను ఉంటున్నా ఏనాడూ తన వైపు కూడా చూడని రమణ అలా ఎందుకు ప్రవర్తించాడు.. ఇదంతా తన దురదృష్టమా.. తను ఇలా పారిపోవడాన్ని సుశీల గారికి ఏమని చెప్తాడో..  ఆవిడ ఆయన చెప్పేది నమ్ముతుందా.. ఇలాంటి రమణలు ఈ ప్రపంచంలో ఎందరున్నారో.. అలాంటి వాళ్ళ నుంచి ఎంత కాలం తను పారిపోవాలి.. ఎంత దూరం పారిపోవాలి.. అసలు ఎందుకు బతకాలి..

విజయవాడ,  విజయవాడ కండక్టర్ అరుపుతో ఆలోచనల నుంచి తెప్పరిల్లి  సంచులను, బాబుని మోస్తూ బస్ దిగింది. కానీ ఎటు వెళ్ళాలో తెలియక నేరుగా కాంటీన్ కి వెళ్లి ఇడ్లి బాబుకి తినిపించి తనూ తిని అక్కడే కూర్చుంది చాలా సేపు. ఆ తరవాత ప్రయాణికులతో క్రిక్కిరిసి పోడంతో అక్కడి నుంచి బయలు దేరి ఆగుతూ, నడుస్తూ ఎటు పోతోందో తెలియక కనకదుర్గ అమ్మ వారి గుడికి వచ్చింది.
ఇవాళ్టికి రెండో రోజు .. పగలూ, రాత్రి భక్తులతో నిండి ఉండే ఆ దేవాలయంలో తల దాచుకుని అక్కడే ఎవరికీ కనిపించకుండా గడుపుతూ, పులిహోర, ప్రసాదం తింటూ, గడుపుతోంది.. కానీ ఇలా ఎన్ని రోజులు గడప గలదు. ఎవరన్నా చూస్తే ఎంత ప్రమాదం. గాయత్రి ఊహించిందే జరిగింది.. శివాలయం పూజారి గారు అటుగా వెళ్తూ గాయత్రిని చూసారు.. దీనావస్థలో, ఒడిలో ఏడాది పిల్లాడితో, రెండు సంచులు దగ్గరగా జరుపుకుని బిక్కు, బిక్కుమంటూ కొండని ఆనుకుని కూర్చున్న గాయత్రిని సమీపించి అనుమానంగా అడిగాడు “ఎవరమ్మా నువ్వు.. “
గాయత్రి భయంగా లేచి నిలబడింది. సమాధానం చెప్పలేదు.

“ఎక్కడి నుంచి వస్తున్నావు.. ఇక్కడెందుకున్నావు” ఆయన స్వరంలో గద్దింపు.

గాయత్రికి భయంతో కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. ఆమె కళ్ళ నీళ్ళు చూసి కొంచెం తగ్గి నెమ్మదిగా అడిగాడు “ ఎవరు నువ్వు ఇక్కడ ఏం  చేస్తున్నావు..”

గాయత్రి వెక్కి, వెక్కి ఏడుస్తూ చెప్పింది  “నాకెవరూ లేరండి.. దిక్కు లేని దాన్ని నాకు ఒక్క సాయం చేయండి .. శరణ్య గారని పెద్ద ఆఫీసర్ ... ఆవిడ అడ్రస్ చెప్పండి చాలు.”

“శరణ్యా!.. ఈ పేరు ఎక్కడో విన్నానే..” ఆయన కాసేపు ఆలోచిస్తూ ఉండి “కొత్తగా వచ్చిన  డేప్యుటి  ఎం ఆర్ వో గారా అన్నాడు.  ఆ గుడికి ఎం ఆర్ వోలు, డేప్యుటి కలెక్టర్ లు, కలెక్టర్ లు వచ్చినప్పుడు చాలా హడావుడి జరగడం , వాళ్ళందరికీ ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేక పూజలు చేయడం సామాన్యం .. అందులోను శరణ్య మొదటి సారి ఎం ఆర్ వో తో కలిసి  వచ్చింది. ఆ రోజు ఆమె కొత్తగా ఉద్యోగంలో చేరిందని అర్చన చేసి వృద్ధిలోకి రావాలని దీవించారు పూజరులంతా. వారిలో శివాలయం పూజారిగా ఆయన కూడా ఉన్నాడు.  చిన్న వయసులో ఉన్న ఒక అందమైన అమ్మాయిని డేప్యుటి ఎం ఆర్ వోగా చూడడంతో అందరికి బాగా గుర్తుండి పోయింది.

ఆయన అలా అడగగానే గాయత్రి గబా, గబా అడిగింది “అవునండి ఆవిడే.. మీకు ఆవిడ తెలుసా.”

“నీకు ఏమవుతుంది ఆవిడ?” అంత పెద్ద ఆఫీసర్ తాలూకు అమ్మాయి అని తెలియగానే కొంచెం శ్రద్ధగా అడిగాడు ఆయన.

“అన్నీ అవుతారండి, నన్ను ఆవిడ దగ్గరకి చేర్చి పుణ్యం కట్టుకోండి మీ పాదాలకు నమస్కరిస్తాను”  దీనంగా వేడుకుంది గాయత్రి.
“అలాగే, అలాగే.. దేవాలయం ఆఫీస్ లో చెప్తాను వాళ్ళు నీకు సాయం చేస్తారు... ఇక్కడే కూర్చో నేను గంటలో వస్తాను పూజ టైం అయింది”  అంటూ ఆయన వెళ్ళి పోయాడు. ఆయన వెళ్ళిన వైపు ఆశగా చూస్తూ అలా కొండనానుకుని కూర్చుండి పోయింది. 

( గాయత్రి  శరణ్యను కలుస్తుందా.. పూజారి  గారు గాయత్రికి శరణ్య ఆచూకీ తెలియజేస్తాడా....... తెలుసుకోవాలంటే వచ్చేశుక్రవారం దాకా ఆగాల్సిందే...    )

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్