Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nannakorika

ఈ సంచికలో >> కథలు >> శిక్ష

siksha

రిటైర్ అయినప్పటినుంచీ రాఘవయ్య గారికి  రోజూ మధ్యాహ్నం మూడు నాలుగు మధ్య ఒక కునుకు తీయడం  అలవాటు.
ఆ రోజు నాలుగింటికి లేవగానే " అరుణ ఆఫీసు నుంచి ఫోన్ చేసింది. ఇవాళ సాయంత్రం నగల షాపు కి వెళ్ళాలి, మిమ్మల్ని వాకింగ్ కి వెళ్లకుండా రెడీగా ఉండ మంది"  కాఫీ అందిస్తూ ఆర్డర్ వేసింది ఆయన భార్య జానకమ్మ

అరుణ ఆయనకి ఒక్క గానొక్క కూతురు. స్టేట్ బ్యాంకు లో  ఆఖరి పది సంవత్సరాలూ, అరుణ చదువూ అన్నీ చెన్నయి లోనే జరిగాయి. చెన్నైలో ప్రఖ్యాత స్కూల్ 'పద్మశేషాద్రి' లోనూ ఆ తరువాత చెన్నై ఐఐటి లోనూ చదువు పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్ లో లాజిటెక్ కంపెనీలో మంచి ఉద్యోగం తెచ్చుకుంది అరుణ . చదువులో గానీ, ప్రవర్తన లో కానీ అరుణ ఎప్పుడూ వాళ్లకి ఎటువంటి చికాకులూ కలిగించలేదు. తల్లి దగ్గరకంటే తండ్రి  దగ్గరే ఆమెకి  ఎక్కువ చనువు. " ఎక్కువ గారం పెట్టేస్తున్నారని"  భార్య  అంటూ ఉన్నా, అరుణ అడిగినవన్నీ కొని ఇవ్వడం, అవి అందు కున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందం  చూసి ఆయన కూడా ఆనందించడం పరిపాటి

అరుణ కి  చిన్నప్పటినుంచీ నగలు కొనుక్కోవడం, కొన్న తరవాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకి వెళ్లడం చాలా ఇష్టం. ప్రతి పుట్టిన రోజుకీ ఆమెకి ఎదో ఒక నగ కొనడం అది వేసుకుని చెన్నయికి కొద్దీ దూరంలో ఒక చిన్న కొండ మీద ఉన్న మురుగన్ గుడినీ, కొండకింద ఉన్న అమ్మవారి గుడినీ చూసుకు రావడం ఆ కుటుంబానికి  ఆనవాయితీ

నార్త్ ఉస్మాన్ రోడ్డు లో ఉన్న వల్లీ సిల్క్స్ లో నగలు కొనడం వాళ్ళకి ఆనవాయితీ. ఎందుకంటే, రాఘవయ్య గారికి ఆప్త మిత్రుడూ, బ్యాంకు లో ఆయనతో కలిసి పనిచేసిన నారాయణ గారు, రిటైర్ అయినతరువాత ఆ షాప్ లో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు . అందుచేత వీళ్ళు ఎప్పుడూ  నగలూ అవీ కొన్నప్పుడు వీలయినంత తగ్గింపు ధరకి ఆయన ఆరెంజ్ చేసేవాడు. నారాయణ గారికి పిల్లలు లేరు. ఆయనకీ అరుణ అంటే చాలా ఇష్టం. ఇవాళ కూడా అక్కడికి వెళ్ళాలి కాబట్టి ముందుగానే నారాయణగారికి  ఫోన్ చేసి వస్తున్నామని చెప్పాడు ఆయన. సాయంత్రం ఇంటికి రాగానే అరుణ చెప్పింది. మూడు లక్షలు బోనస్ వచ్చిందనీ, ఆ డబ్బుతో గాజులు, ఒక రవ్వల నెక్ లెస్  కొనుక్కుంటానని చెప్పింది తండ్రికి. ముగ్గురూ కలిసి వల్లీ సిల్క్స్ లో   అనుకున్నట్టు గా నగలు కొన్నారు.

మర్నాడు శనివారం అరుణకు ఎలాగు శలవు కాబట్టి, ముగ్గురూ డ్రైవర్ ని పెట్టుకుని కారులో తిరువళ్లూరు అవతల ఉన్న మురుగన్ టెంపుల్ కి వెళ్లారు. కొండమీద శ్రీ వారిని దర్శించుకున్నప్పుడు ధరించిన కొత్త నగలు,  కొండ క్రింద ఉన్న అమ్మ వారి గుడికి వచ్చినప్పుడు షాప్ వాడు ఇచ్చిన ఒక చిన్న గుడ్డ సంచీ లోపెట్టి  తన హేండ్ బాగ్ లో పెట్టుకుంది అరుణ.   గుడి లో చాలా రద్దీ గా ఉంది.   గర్భగుడి కి ముందుగా ఉన్న ఆలయ ప్రాంగణం లోకి ప్రవేశించేదాకా క్యూ సరిగానే ఉన్నా, ఆ ప్రాంగణంలో ప్రవేశించగానే సడన్ గా తోపులాట ప్రారంభమయింది. హేండ్ బాగ్ ఎవరో కొద్దిగా లాగినట్టనిపించి ముందుకు లాక్కుని దగ్గరగా పెట్టుకుంది అరుణ.

గర్భ గుడిలో దర్శనం పూర్తి చేసుకుని బయటకు రాగానే బాగ్ కేసి చూస్తే జిప్ తెరిచి ఉంది. కంగారుగా బేగ్ లో చూస్తే నగలు పెట్టిన గుడ్డ సంచీ లేదు. వెంఠనే తల్లికీ తండ్రికీ చెప్పింది. ఎంతవెదికినా కనపడ లేదు. అప్పుడు అరుణ ముఖంలో చూసిన విచారం రాఘవయ్య గారిని కలిచి వేసింది. వీళ్ళు ఇలా కంగారు పడుతుంటే ఎవరో అన్నారు "వెంఠనే వెళ్లి సీసీ కెమెరా రూమ్ లో చెప్పండి" అని.

కెమెరా రూమ్ లో ఉన్నవాళ్లు స్క్రీన్స్ చూసి దొంగని గుర్తించి పారిపోకుండా పట్టుకునే అవకాశ ముందంటే, రాఘవయ్య గారూ అరుణ, గుడి ప్రాంగణం లోనే ఉన్నసీసీ కెమెరా రూమ్ లోకి వెళ్లారు. అక్కడ ముగ్గురు నలుగురు వ్యక్తులు పోలీసుల డ్రెస్ లో ఉన్నారు. వీళ్ళని వివరాలడిగి ఏవో స్క్రీన్స్ మీద కాసేపు చూసి ఎవరి మీదా అనుమానంగా లేదన్నారు. అయినా పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వమన్నారు. రాఘవయ్య గారు పోలీసు స్టేషన్ వైపు వెడితే, అరుణ జానకమ్మ గారు అక్కడే ఉండి పోయారు.

*****

ఆ చిన్న టెంపుల్ టౌన్ లో అమ్మవారి టెంపుల్కి  దగ్గరగానే ఉన్న పోలీస్ స్టేషన్ ఇంచార్జి కరుప్పన్. ఆ రోజు, క్రిందటి వారం కేసుల ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపడానికి అంతా  తయారు చేసి కుర్చీలో వెనక్కి వాలి సిగరెట్ ముట్టించి రైటర్ ని 'చాయి' చెప్పమన్నాడు. సిగరెట్ దమ్ము లాగి తాను ఉద్యోగం లో చేరడానికి చేసిన అప్పు ఇంకా ఎంత ఉందా అని మనసులో లెక్క వేసుకున్నాడు. మొదటి పది ర్యాంకులు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ డబ్బు చెల్లిస్తేనే పని అవుతుందని తెలిసి అతను ముఫై లక్షలు అప్పుచేసి ఉద్యోగం సంపాదించాడు. ఇక్కడ వచ్చే ఆదాయ వనరులు బట్టి, ప్రస్తుత స్టేషన్లో పోస్టింగ్ కి కూడా రెండు లక్షలు ఇచ్చుకున్నాడు. ఇంకో రెండు మూడు గోల్డ్ కేసులు వస్తే అప్పు నుంచి బయట పడవచ్చని అతని లెక్కల  లో తేలింది , తక్కువ శ్రమతో ఎక్కువ రాబడి లభించే అవకాశం పక్కనే ఉన్న టెంపుల్ లో ఆపేరేట్ చేసే గోల్డ్ గ్యాంగ్ అని అతనికి ఈ స్టేషన్లో చేరే ముందే అతని  సీనియర్ చెప్పాడు.

ఎప్పుడూ రద్దీ గా ఉండే ఆ టెంపుల్ లో ఇద్దరు అడా, ముగ్గురు మగవాళ్ళు కలిసి ఒక గ్యాంగ్ గా పనిచేస్తూ ఆపేరెట్ చేస్తున్నారు. అక్కడ ఆరెంజ్ చేసిన కెమెరాలు, మిగతా ఇన్వెస్టిగేషన్ పద్ధతులతో అక్కడ ఏ దొంగతనం జరిగినా పోలీసులు తలుచుకుంటే అయిదు నిమిషాలలో పట్టేయవచ్చు. అందుకె, ఆ గ్యాంగ్, పక్కనే ఉన్న స్టేషన్ ఇంచార్జి తో 60:40 షేరింగ్ అగ్రిమెంట్ కి వచ్చేశారు. తమిళ నాడులో చాల మందికి బంగారం మీద పెట్టుబడి పెట్టడం అలవాటు. అన్ని రకాల స్థాయి వాళ్ళనుంచీ డిమాండ్ వల్లే అక్కడ ప్రతి ఊళ్లోనూ గోల్డ్ షాపులు, వాటి మీద అప్పు ఇచ్చే వ్యాపారాలు ఎక్కువ. గ్యాంగ్ చేతిలో పడ్డ చాల మంది అమాయకులు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లరు. కొద్ది మంది వెళ్లినా 'ఎఫ్ ఐ ఆర్' రెకార్డ్ చేయమని ఖచ్చితంగా అడగరు. బాగా చదువుకున్న వాళ్ళు ఒత్తిడి చేస్తే రికార్డు చేస్తారు. రెకార్డ్ చేసిన వాటిలో మాత్రమే పై అధికారులకి షేర్ పంపించాలి స్టేషన్ ఇన్ఛార్జ్. అందు చేత తప్పని సరి అయితే తప్ప 'ఎఫ్ ఐ ఆర్' రెకార్డ్ చేయరు.

****

టీ తాగుతూ  అప్పు తీర్చడం ఎప్పటికి అవుతుంది అన్న ఆలోచనలో ఉండగా, రాఘవయ్య గారు అతని రూమ్ లోకి హడావిడి గా ప్రవేశించారు. అప్పటికే ఆయన బయట హాలులో కనుక్కని  'ఎస్ఐ'   ఆ రూమ్ లో ఉన్నారని చెబితే అక్కడికి వచ్చారు. వస్తూనే కంగారు గా ఇలా దొంగతనం జరిగిందనీ మీరు వెంఠనే వచ్చి సహాయం చేయాలని కోరారు. దానికి కరుప్పన్ " కంగారు పడకండి సార్. కూర్చోండి . ఎలా జరిగింది ? ఏమేమి పోయాయి ?ఎంత విలువ ఉంటుంది? అక్కడ సీసీ కెమెరాల రూమ్ లో అడిగారా? మీరు ఎక్కడ ఉంటారు ? ఏమి పని చేస్తూ ఉంటారు? అని ప్రశ్నలు గుప్పించాడు.. అన్నింటికీ రాఘవయ్య గారు జవాబు చెప్పారు. నగలు కొన్న బిల్లు కూడా నగలు ఉన్న గుడ్డ సంచీలో ఉందని గుర్తుకు వచ్చి ఆ విషయం కూడా చెప్పారు.

" ఈ మధ్యన కొన్ని జరిగాయని మా నోటీసు లోకి వచ్చింది సార్. వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒక పని చేయండి, మీరు ఫోన్ నెంబర్, పేరు ఇచ్చి వెళ్ళండి. మేము త్వరలోనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము" అన్నాడు లేచి నుంచుని వినయంగా.
అతను ఇచ్చిన పేడ్ లో తన పేరు ఫోన్ నెంబర్ ఇచ్చి బయటికి వచ్చారు రాఘవయ్య గారు. అనుభవం లేక 'ఎఫ్ ఐ ఆర్' రాయమని చెప్పాలని ఆయనకీ తట్టలేదు. అతను మాట్లాడిన విధానం బట్టి, అతను తప్పకుండా విచారణ  చేస్తాడని ఆయనకి అనిపించింది. వెంఠనే గుడిలో అరుణ, జానకమ్మ గారి దగ్గరికి వచ్చి, జరిగినది చెప్పారు. ఇప్పుడు ఇంతకన్నా ఏమి చేస్తాము? అని చెన్నై తిరిగి వచ్చేశారు.
మరునాడు  ఆదివారం. ప్రొద్దుటే రాఘవయ్య గారు నారాయణ గారికి ఫోన్ చేసి జరిగినది  చెప్పారు. మామూలుగా కూడా ప్రతి వారం నారాయణ గారు వీళ్లింటికి వచ్చి కొంచం సమయం గడపడం అలవాటు. వార్త వినగానే ఆయన వెంఠనే వచ్చారు. ఆయన్ని చూడగానే అరుణ కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. గుళ్లో ఆమె ముఖం లో విచారం చూశారు గాని కళ్ళ నీళ్లు పెట్టుకోవడం చూడ లేదు రాఘవయ్య గారు . నగల షాపులో  నారాయణ గారు, అరుణ  కలిసే అన్నీ సెలెక్ట్ చేశారు. అరుణ కళ్ల ల్లో దుఃఖాన్ని చూసి నారాయణ గారు కలత చెందారు. " బాధ పడకమ్మా నీ నగలు మళ్ళీ నీకు వచ్చేలా చేసే బాధ్యత నాది" అన్నారు ఆమెకి ధైర్యం చెబుతూ. అది అంత సులువైన  పని కాదని మనసులో ఆయనకీ తెలిసినా.

అరుణ,  లోపలికి  వెళ్లిన తరువాత, మొత్తం జరిగినదంతా మళ్ళీ వివరించి చెప్పించుకున్నారు నారాయణ. పోలీసులు శోధించి,  దొంగలిని పట్టుకుని మళ్ళీ ఆ నగలు ఇప్పిస్తారన్న నమ్మకం వాళ్లకి ఏ కోశానా కలగలేదు. స్టేషన్లో జరిగింది  మళ్ళీ వింటున్నప్పుడు నారాయణ గారికి  మనసులో ఒక అనుమానం పొడ చూపి, దాని గురించి నివృతి చేసుకుందామని పించింది. వెంఠనే ఆయన రాఘవయ్య గారితో అన్నారు " మనం తాంబరం బ్రాంచ్ లో ఉన్నప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కి సహాయం చేసాం గుర్తు ఉందా ?"  అన్నారు. "

"అవును గుర్తు లేకేం? నటరాజన్ . ఆయన పొరపాటున 50000 ఇంకో అకౌంట్ కు ఆన్ లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తే, వాళ్ళని కాంటాక్ట్ చేసి ఆయనకీ ఆ అమౌంట్ తిరిగి ఇచ్చేలా సహాయం చేసాం. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు" అన్నారు.

" మీ దగ్గర ఆయన నెంబర్ ఉంటె కలిపి ఇవ్వండి. నేను ఒక మాటు మాట్లాడుతాను. ఆయన మనకి ఏమయినా సలహా ఇస్తాడేమో చూద్దాం" అన్నాడు నారాయణ గారు

జానకయ్య గారు నంబరు వెదికి నటరాజన్ కి ఫోన్ చేయగానే ఆయన లైన్ లోకి వస్తే ఆయన్ని పలకరించి, నారాయణ గారు మాట్లాడతారని ఫోన్ నారాయణ గారికి ఇచ్చ్హారు.

నారాయణ గారు ఫోన్ తీసుకుని నటరాజన్ తో పది నిమిషాలు మాట్లాడి ఫోన్ కట్ చేశారు.

" ఏమంటాడు ఆయన?"  అన్నారు కుతూహలంగా రాఘవయ్య గారు. కాఫీ తెచ్చి ఇచ్చి  అరుణ కూడా  వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంది

"  నా అనుమానం నిజమే అన్నాడు ఆయన. మన వస్తువులు అదే రూపం  లో మనకి దొరకడం అసంభవం అంటున్నారు. వాటిని కొద్దీ గంటలలోనే చేతులు మర్చి కరిగించేస్తారట. 'ఎఫ్ ఐ ఆర్' రాయమని ఒత్తిడి చేయకపోవడం పొరపాటు అన్నారు. ఆయన చెప్పినదేమిటంటే ఒక విధంగా అయితే వస్తువుల విలువ మనకి తిరిగి రావచ్చట. అది ఎలాగంటే ఎవరయినా కమిషనర్ లేదా ఐ.జి స్థాయి ఆఫీసర్ సహాయం తీసుకుంటే ఆ పని జరగవచ్చు అంటారు. ఆ స్థాయి ఆఫిసర్ మనకి ఎవరు తెలుసు ?" అన్నారు నారాయణ గారు రాఘవయ్యగారి కేసి ప్రశ్నార్థకం గా చూస్తూ

ఇదంతా వింటున్న అరుణ " నేను 'పద్మశేషాద్రి'  లోచదువుతున్నప్పుడు అనిత నా క్లాసుమేట్. వాళ్ళ నాన్నగారు ఎదో పెద్ద  పోలీసు ఆఫీసరని చెబుతూ ఉండేది . ఇప్పుడు ఎక్కడపనిచేస్తున్నారో తెలియదు. ఇంటర్ తరువాత అది మెడిసిన్ లో చేరింది. నేను కనుక్కోనా ?" అంది.

"వెంఠనే కనుక్కో అన్నారు" రాఘవయ్య, నారాయణ గారు ఇద్దరూ ఒకేమాటు

తన రూమ్ లోకి వెళ్లి ఒక పదినిమిషాలు తరవాత వచ్చి చెప్పింది అరుణ.  అనిత తండ్రి కమిషనర్ రేంక్ లో రిటైర్ అయి ప్రస్తుతం క్రికెట్  బోర్డు కి విజిలెన్సు సెల్ లో  ఉన్నారట. కావలిస్తే ఇక్కడ ఎవరికయినా చెప్పిస్తానాని చెప్పిందట. వెంఠనే అరుణని తీసుకుని నారాయణ గారు టీ నగర్ లో అనిత వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్నగారిని కలిసి మొత్తంవివరించి సహాయం అడిగి,  వివరాలన్నీ ఇచ్చివచ్చారు.
మరునాడే అమ్మవారి గుడి దగ్గర ఉన్న స్టేషన్ ఇంచార్జి కరుప్పన్ రాఘవయ్య గారికి ఫోన్ చేసి, స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ రాసి ఇవ్వమన్నాడు. అక్కడికి వెళ్లిన తరువాత పోయిన వస్తువుల వివరాలన్నీ బరువు తో సహా అన్నీ రిపోర్ట్ లో రాయించుకుని 'ఎఫ్ ఐ ఆర్' రెకార్డ్ చేసుకున్నాడు.

"ఐ.జి గారు  మీకు తెలుసని  ముందే చెప్పవచ్చు కదా సార్" అన్నాడు కొంచం నిష్టూరంగా. రాఘవయ్య గారు ఏమీ అనకుండా నవ్వి ఊరుకున్నారు. కరుప్పన్ వివరించాడు. గ్యాంగ్ ని పట్టుకోగానే కోర్ట్ లో ప్రవేశ పెడతామని, కొన్ని మాట్లు కోర్ట్ కి రావలిసి ఉంటుందని , అలా వచ్చినపుడు  చూపించిన వస్తువులని మీ వస్తువులే అని గుర్తించినట్టు చెప్పాలనీ చెప్పాడు.పోయిన వస్తువులే ఉండవని, మొత్తం అదే విలువకు వేరే వస్తువులు ఉంటాయనీ చెప్పాడు.

స్టేషన్ కి రాఘవయ్య గారు వెళ్లి వచ్చారని తెలిసి నారాయణ గారు వచ్చారు. ఇద్దరూ కలిసి నటరాజన్ గారికి జరిగింది చెప్పి థాంక్స్ చెప్పారు.
 దొంగిలించినవి కరిగించేస్తారు కాబట్టి, వేరే వస్తువులు చేయించి కోర్టులో కేసు నడిపి ఇస్తారని. కొంచం టైం పట్టినా పోయిన విలువకి సరి పడ్డా వస్తాయని నటరాజన్ గారు  చాలా వివరించాడు

అంతా విన్న అరుణ " మళ్ళీ ఎవరినో దోచుకుని, వాళ్ళని మన్ని ఏడిపించినట్టే ఏడిపించి మనకి ఇస్తే మంచిదేనా ?" అంది

" నటరాజన్ చెప్పిన దాని బట్టి అలాగే జరగక్కర లేదు. మనవె ఇంకో రూపం లో ఇస్తారు. అందు చేత మనకి అభ్యన్తరం ఉండడక్కరలేదేమో" అన్నారు నారాయణ గారు నచ్చ చెబుతూ

" మనకి తిరిగి వచ్చినా,  ఇంత  అన్యాయంగా ప్రవర్తిస్తూ ఎంతమందికో మనస్తాపం కలిగించే స్టేషన్ ఇంచార్జి, గుడిలో దొంగల గ్యాంగ్, వీళ్ళందరూ ఏ శిక్షా లేకుండా తప్పించు కుంటారన్నమాట" అంది.

నగలు పోయిన తరువాత తాను వచ్చినపుడు అరుణ పడిన మనస్తాపం, ఆపుకోలేని దుఃఖంతో ఉన్న ఆమె ముఖం  నారాయణ గారిమనసులో చెరగని ముద్ర అయి గుర్తుకు వచ్చినప్పుడల్లా కోపం పొంగుకు వస్తోంది. ఏదయినా చెయ్యాలి అనే ఆలోచన ఆయనకి మెదిలింది.

****

దాదాపు రెండు నెలల తరువాత ఒక రోజు. వారం వారం పంపే కేసుల ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపడానికి అంతా  తయారు చేసి కుర్చీలో వెనక్కి వాలి టీ చెప్పి మనసులో లెక్కలు వేసుకుంటున్నాడు కరుప్పన్ . ఈ మధ్యన గుడిలో గేంగ్ ద్వారా ఏవీ గోల్డ్ కేసులు లేవు. పైగా ఆ రాఘవయ్య 'ఎఫ్ ఐ ఆర్' కేసులో,  పైవాళ్ళ వత్తిడి వల్ల మొత్తం విలువ కోర్టు లో కట్టి కేసు నడప వలిసి వస్తోంది. అందు చేత అప్పు తగ్గించు కోవడం కుదరలేదు.

" నమస్కారం సార్"  అంటూ ఒకాయన వచ్చి ఎదురుగా నుంచోవడంతో ఆలోచనలోంచి బయట పడి   "ఏమిటి" అన్నట్టు చూశాడు వచ్చిన వ్యక్తి కేసి చూసి.

ఆ వచ్చిన ఆయన " సార్ గుళ్లో నా భార్య హ్యాండ్ బేగ్ లోంచి నగలు కొట్టేశారు సార్. ప్లీజ్ మీరు వచ్చి సహాయం చేయండి సార్. అక్కడ సీసీ కెమెరా వాళ్ళు ఎవరు దొంగిలించారో కనపడటం లేదు అంటున్నారు సార్"  అన్నాడు ఆందోళన పడుతూ.

" కూర్చోండి కంగారు పడకండి. వాళ్లకి కనపడలేదంటే ఇప్పుడు నేను వచ్చి చేసేదేదీ లేదు. ఏమేమి పోయాయో చెప్పగలరా? అన్నాడు

" నా భార్య కాసుల పేరు, ఆరు గాజులు, మొత్తం నాలుగయిదు లక్షలు చేస్తుంది సార్" అన్నాడు దీనం గా

"ఈ మధ్యన కొన్ని జరిగాయని మా నోటీసు లోకి వచ్చింది సార్. వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒక పని చేయండి, మీరు ఫోన్ నెంబర్ పేరు ఇచ్చి వెళ్ళండి. మేము త్వరలోనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము' అన్నాడు.  మనసులో 'ఎఫ్ ఐ ఆర్'  రాయకపోతే ఎంత అప్పు తీరుతుంది అన్నవి   లెక్కలు వేసుకుంటూ

వచ్చిన వ్యక్తి ముందు కరుప్పన్ ఇచ్చిన పేడ్ మీద పేరు, ఫోన్ నెంబర్ రాయబోయి ఆగి " 'ఎఫ్ ఐ ఆర్' రెకార్డ్ చేయండి సార్. పేపర్ ఇవ్వండి రిపోర్ట్ రాసి ఇస్తాను అన్నాడు.

వచ్చిన వ్యక్తి చదువుకున్న వాడని 'ఎఫ్ ఐ ఆర్' రాయడం తప్పదని గ్రహించి  రైటర్ ని పిలిచి రిపోర్ట్ తీసుకో మన్నాడు. రిపోర్ట్ ఇచ్చి, త్వరలోనే మళ్ళీ వచ్చి వాకబు చేస్తాను సార్ అని ఆ వ్యక్తి వెళ్లి పోయాడు.

****

ఆ రాత్రి ఇంటికి వచ్చి కరుప్పన్ సీసీ కెమెరా రూమ్ ఇంచార్జి కణ్ణన్ కి ఫోన్ చేశాడు. " ఇవాళ 'ఎఫ్ ఐ ఆర్' రాయవలసి వచ్చింది. మనగ్యాంగ్ పిక్ అప్ చేశారా?" అన్నాడు

" పీకప్ చేశారు సార్. రేపు పొద్దున్నేకరిగించకుండా ముందు చూస్తా. లేకపోతే ఈ మధ్య మనవాళ్ళు కొంచం తెలివి మీరారేమో అనిపిస్తోంది" అని పెట్టేశాడు.

మరునాడు ప్రొద్దుటే తొమ్మిదింటికి స్టేషన్కి బయలు దేరుతోంటే  కణ్ణన్ ఫోన్ చేశాడు ప్రత్యేక సెల్ ఫోన్ లో. వాళ్ళు ఇటువంటి వాటికి వేరే నంబర్స్ పెట్టుకున్నారు. " సార్ నాకు ఎదో  అనుమానంగా ఉంది. మనవాళ్ళు పిక్ అప్ చేసిన గుడ్డ సంచిలో పసుపు కొమ్ములు మాత్రమే ఉన్నాయి. నగలు ఏమీ లేవు. సంచీ నాకు చూపించారు" అన్నాడు ఆందోళనగా

" నిన్న అదొక్కటేనా? ఇంకోటి ఏమన్నా పిక్ అప్ చేశారా?"

"లేదు సార్" అదొక్కటే అన్నాడు.

'' నిన్న వచ్చినాయన  వస్తువుల వివరాలిచ్చాడు. 'ఎఫ్ ఐ ఆర్' కూడా రాసేశాం . దాని విలువ బట్టి పైకి  పంపాలి. ఈ మధ్యనే ఒక దెబ్బ తిని ఉన్నాము కదా?" పర్యవసానాలు అన్నీ మనసులోకి వచ్చి ఆందోళనగా అన్నాడు. దానితో పాటు కోపం కూడా వచ్చింది. " హెడ్డు కి చెప్పి వాళ్ళని లోపల వేయమను " తరవాత సంగతి  చూద్దాము అన్నాడు అప్పటికి.

గ్యాంగ్ ని తెచ్చి రెండురోజులు పోలీసులు  అడిగే పద్దతి లో ఎంత అడిగినా ఉపయోగం లేకపోయింది. ఇంకో గ్యాంగ్ ఎవరూ వేరే ఆపరేట్ చేసే ప్రశ్నే లేదని , హెడ్డు. కెమెరా టీం స్పష్టం చేయడంతో, మొత్తం మిస్టరీ గా మిగిలి పోయింది.

మరుసటి వారం 'ఎఫ్ ఐ ఆర్' స్టేటస్ రిపోర్ట్ లో ఇది చేర్చడం తప్పక పోవడం వల్ల, అప్పు తగ్గడం అటుంచి, మళ్ళీ డబ్బు తెచ్చి పైకి  పంపవలసి వచ్చింది కరుప్పన్ కి  . జరిగింది పైకి  చెప్పుకునే పరిస్థితి కాదు

****

రెండు నెలల తరువాత ఆ పెద్దమనిషి మళ్ళీ వచ్చాడు. నా 'ఎఫ్ ఐ ఆర్' ఏమైంది అంటూ.. కరుప్పన్ చిరాకు పడుతూ '' ఒకళ్ళు దొరికారు .కానీ వాళ్ళు  దొంగిలించిన సంచీ లో ఏమీ లేవు అన్నాడు "

" అదేమిటి సార్ లేకపోవడమేమిటి? మీరు  అసలు వాళ్ళని  కాకుండా ఇంకొకళ్ళని పట్టుకున్నారమో అన్నాడు సందేహంగా .

"వేరే టీం ఎవరూ లేరయ్యా " అని నోటిదాకా వచ్చి ఆగిపోయాడు. అంత  ఖచ్చితం గా మీకు  ఎలా తెలుసు అంటాడేమోనని.

"కోర్టులో అవసరం ఉంటుందేమోనని వల్లీ సిల్క్స్ లో కొన్నప్పుడు తీసుకున్న రసీదు కూడా పట్టుకు వచ్చాను సార్. మీరు ప్రయత్నం చేస్తే పట్టుకోగలరు అని చాలామంది చెప్పారు సార్" అన్నాడు ఆయన అమాయకంగా.

" ఇంకా ఇన్వెస్టుగేషన్ పూర్తి అవలేదు. ప్రోగ్రస్ ఉంటె ఫోన్ చేస్తాం లెండి. ఇప్పటికి వెళ్ళండి" అన్నాడు కరుప్పన్ కుర్చీ లోంచి లేస్తూ

*****

రెండు నెలల తరువాత కోర్టు ఇచ్చిన నగలు పెట్టుకుని రాఘవయ్య గారికీ, నారాయణ గారికీ చూపించి " మనం కొన్నవాటిలా లేకపోయినా ఇవీ బాగానే ఉన్నాయి. వాళ్లకి బాగానే శిక్ష పడి  ఉంటుంది మన వస్తువులు దొంగిలించినందుకు" అంది అరుణ నవ్వుతూ

" నీలాంటి దాన్ని అంత బాధ పెట్టిన వాళ్లకి, చేసిన దానికి చెయ్యని దానితో కలిపి  శిక్ష పడుతుందమ్మా " అన్నారు నారాయణ గారు నవ్వుతూ

మరిన్ని కథలు