గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి..... http://www.gotelugu.com/issue274/725/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/
(గత సంచిక తరువాయి).... మరో పది రోజులు గడిచాయి. డాక్యుమెంటరీ అద్భుతంగా వచ్చింది. ఆ డాక్యుమెంటరీకి వాయిస్ ఓవర్ ఇచ్చిన అమ్మాయి మృదు మధురంగా విజయవాడ చరిత్ర చెప్తుంటే నేపధ్య సంగీతం సన్నగా వినిపిస్తుంటే చూడడానికి, వినడానికి కూడా హాయిగా ఉంది.
“ఇది నేను గవర్నమెంట్ కి చూపించి ఆడ్ ప్రయత్నం చేస్తాను” అన్నాడు తేజ.
“గుడ్ ఐడియా ... చాలా బాగా వచ్చింది.. తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు” అన్నాడు అనిరుద్ మనస్ఫూర్తిగా.
“మనం ఈ లోగా ఇంకో మంచి కధ విమెన్ బేస్డ్ స్టోరీ ప్లాన్ చేయాలి షార్ట్ ఫిలిం కి” అన్నాడు తేజ.
“నేను హైదరాబాద్ వెళ్తానురా.. మళ్ళి వస్తాను .. ఈ లోగా ఆలోచించు” అన్నాడు అనిరుద్.
“ఓకే .. వెళ్లిరా ఎప్పుడు వస్తావు రిటర్న్” అడిగాడు తేజ.
“చూస్తాను.. నేను మాత్రం అక్కడ ఏం చేస్తాను వంటరిగా..”
“ అందుకే పెళ్లి సంబంధాలు చూస్తాను అన్నాను” అన్నాడు తేజ.
“ చూడు ... కుదిరితే వెంటనే చేసుకుంటా.. నాక్కూడా చేసుకోవాలనిపిస్తోంది..”
“ ఓ .. నిజమా అయితే ఇవాళే పేపర్ కి యాడ్ పంపిస్తా నీ ఫోటో ఒకటి ఇవ్వు” హుషారుగా అన్నాడు తేజ.
“నాకు నచ్చిన అమ్మాయి దొరక్క పోతే..”
“దొరికే దాక వెతుకుదాం ..”
అనిరుద్ కాసేపు మౌనంగా ఉండి అన్నాడు.. “అత్యాశ అనుకోక పోతే గాయత్రిని చేసుకోవచ్చా ...”
తేజ సంభ్రమంగా చూసాడు.. “నిజమా ... గాయత్రిని చేసుకుంటావా..”
“ఆమె , మీరు ఒప్పుకుంటే..”
“వావ్ ఎందుకు ఒప్పుకోము... “
“నాకన్నా ఆ అమ్మాయి చాలా చిన్నది కదరా..”
తేజ ఉత్సాహం ఆ మాటతో నీరు కారిపోయింది .. “అవును కదా” అన్నాడు.
మళ్ళి వెంటనే అన్నాడు.. “శరణ్యతో మాట్లాడదాం ... వయసులో కొంచెం పెద్దవాడివి అయినా నిన్ను చేసుకుంటే ఆ అమ్మాయి జీవితం కూడా సెటిల్ అవుతుంది.. నీ దగ్గర సెక్యూర్టీ గా ఉంటుంది ..”“శరణ్య నా చెంప పగల కొడుతుందేమో” నవ్వుతూ అన్నాడు అనిరుద్.
కానీ అతని అంచనా తప్పు అయింది.
తేజ అనిరుద్ ప్రపోసల్ చెప్పగానే ఎగిరి గంతేసింది శరణ్య.. “గాయత్రి ఒప్పుకుంటే ఇంతకన్నా ఆనందం నాకు ఇంకోటి లేదు తేజా” అంది.
“మనం ఒప్పిద్దాం” అన్నాడు.
“ చెప్దాం.. బలవంతం చేయద్దు” అంది.
మర్నాడు గాయత్రిని ఇంటికి తీసుకు వచ్చి అనిరుద్ ఎదురు గానే గాయత్రిని అడిగింది శరణ్య..
“గాయత్రీ అనిరుద్ గారు నిన్ను పెళ్లి చేసుకుని నీకు మంచి జీవితం ఇవ్వాలని అనుకుంటున్నారు.. నీకు ఇష్టమేనా.” ఆ మాటకి గాయత్రి నిర్ఘాంత పోయి చూసింది.“నన్నా” అంది ...
“నిన్నే ... కాక పోతే ఆయన నీకన్న బహుశా పదిహేనేళ్ళు పెద్దవాడు. మిలటరీలో చేసి వచ్చారు.. ఆస్తిపాస్తులున్నాయి. నువ్వంటే ప్రేమ ఉంది.. నిన్ను బాగా చూసుకుంటారు. నీకు ఇష్టమైతే నేను, తేజ బయటికి వెళ్తాం మీరిద్దరూ మాట్లాడుకోండి..”
“వద్దు, వద్దు” కంగారుగా అంది గాయత్రి.
“ నీకు ఇష్టం లేదా లేకపోతె చెప్పేయ్” అంది శరణ్య.
“ అది కాదు” గాభరాగా అంది గాయత్రి.
“ చూడు గాయత్రి చిన్న దానివి.. అందమైన దానివి..అమాయకురాలివి .. నీకా పెద్ద ఉద్యోగం రాదు.. లోకజ్ఞానం, ధైర్యం లేవు ... వీడికి ఏడాది వయసు...మీ ఇద్దరికీ కూడా ఒక అండ కావాలి. మీకు చాలా భవిష్యత్తు ఉంది.. అనిరుద్ గురించి నాకు బాగా తెలుసు.. నిన్ను ప్రేమగా, గౌరవంగా చూసుకుంటాడు.. ఒకటే లోపం ఏంటంటే నీకన్న వయసులో పెద్ద.. కొంచెం ఎక్కువే పెద్ద..”
“అది కాదండీ..” గాయత్రి ఏదో చెప్పబోయి ఆగి పోయింది.
“చెప్పు గాయత్రి ... ఏమిటి నీ అనుమానం” మృదువుగా అడిగింది శరణ్య.
అప్పటి వరకు మౌనంగా ఉన్న అనిరుద్ నోరు విప్పాడు. “ వాళ్ళు చెప్పడం కాదు నేను కూడా మాట ఇస్తున్నాను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను నిన్ను, బాబుని కూడా .”
గాయత్రి తల వంచుకుంది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్ళు చుక్కలు, చుక్కలుగా రాలసాగాయి.
శరణ్య ఆమె దగ్గరగా జరిగి గాయత్రి భుజం మీద చేయెసి “ఇష్టం లేకుంటే నిన్ను బలవంతం చేయరు ఎవరూ ఏడవకు” అంది.
గాయత్రి గభాల్న శరణ్య భుజాల మీద తల వాల్చి వెక్కి వెక్కి ఏడుస్తూ “బాబు సంగతి ఏంటి .. వాడికి తండ్రి ఎవరని చెప్పను” అంది.
ఆ మాటకి అందరూ తెల్ల మొహం వేసి అంతలోకే తేలిగ్గా నవ్వేస్తూ “నువ్వు ఆయనకీ భార్య అయితే వాడు కొడుకు కాదా” అన్నారు.
“వాడు నా కొడుకు ... స్కూల్లో చేర్చేటప్పుడు తండ్రిగా నా ఇంటి పేరుతో సహా నా పేరే రాస్తాను.. అన్ని లీగల్ రైట్స్ ఇస్తాను. ఇంక నాకు పిల్లలు అవసరం కూడా లేదు.. వాడే నా కన్న కొడుకుగా భావిస్తాను” అన్నాడు అనిరుద్.
శరణ్య అనునయంగా అంది “ఇంతకన్నా అభయం ఇచ్చే వాళ్ళు ఎవరుంటారు గాయత్రి .” గాయత్రి సమాధానం చెప్ప లేదు..
కొద్ది సేపు తల వంచుకుని కూర్చుండి పోయింది.
ఇంతలో బాబు నిద్ర లేచి ఏడవడం తో లేచి వెళ్లి బాబుని భుజాన వేసుకుని వచ్చి తేజ వైపు, శరణ్య వైపు చూసింది.
గాయత్రి ఏం చెప్పాలనుకుంటున్నదో అర్ధం కాక తన అయిష్టం చెప్పడం ఇష్టం లేక బాబుని తీసుకుని వెళ్లి పోతున్నట్టుంది అనుకుంది శరణ్య. గాయత్రి తీరు నచ్చలేదు.. కానీ మళ్ళి తనకు తనే సర్ది చెప్పుకుంది.. మరీ పెద్దవాడు అనిరుద్ .. ఎంత రెండో పెళ్లి అయినా తను మాత్రం ఎలా ఒప్పుకుంటుంది!
ఇంతలో గాయత్రి బాబుతో ముందుకు నడిచి అనిరుద్ దగ్గరకు వెళ్లి ఒక్క సారి అతని మొహంలోకి చూసి బాబుని భుజం మీదనుంచి తీసి అతని ఒళ్లో పడుకోబెట్టి వంగి అతని పాదాలకు నమస్కరించింది.
అనిరుద్ కంగారు పడుతూ ఒక చేత్తో బాబుని పట్టుకుని, మరో చేత్తో ఆమెని లేవనెత్తుతూ “ఓ గాడ్ నాకిలాంటి సెంటిమెంట్స్ ఇష్టం ఉండదు.. బి ఫ్రెండ్లీ ... భార్యాభర్తలిద్దరూ మంచి స్నేహితులు” అన్నాడు.
తేజ, శరణ్యాల కళ్ళల్లో ఆనందం దీపావళి వెలుగులా పరుచుకుంది.
*************శుభం*********** |