Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

kaatyayani

ప్రోలోగ్

సృష్ట్యాదిలో పురుషులు, స్త్రీలు లేరు.

బ్రహ్మదేవుడు తను రూపకల్పన చేసిన సృష్టిని, సరస్వతీదేవితో వీక్షిస్తున్నాడు-

హిమాలయాలు, ఎడారి భూములు, లోయలు, భూమ్మీద మూడొంతులుగా పరచుకున్న సముద్రం, ఆకాశాన్నంటే ఎత్తైన కొండలు, పైనుంచి కిందకు దూకే జలపాతాలు, ఒంపులు సొంపులతో ప్రవహించే నదీనదాలు, స్వచ్ఛమైన తేట నీటితో చెరువులు, వాటిలో మొగ్గలు, సంపూర్ణంగా విచ్చుకున్న కలువలు, గడ్డితో పచ్చటి తివాచి పరచినట్టున్న భూమి, వనాలు, కొమ్మలు, రెమ్మలతో విశాలంగా పరచుకున్న పచ్చనిచెట్లు, వాటికి అందమైన పుష్పాలు- కాయలు.. ఆకాశం నుంచి భూమిలో తను సృజించిన ప్రకృతిని సంతృప్తిగా చూస్తున్నాడు.
అప్పుడే సంపూర్ణంగా వికసించి, సౌరభాలు వెదజల్లుతున్నపుష్పం వారిద్దరి కంటా పడింది.

"చూశారా స్వామీ! రేకులన్నీ పరిపూర్ణంగా విచ్చుకుని, సుగంధాలు వెదజల్లుతున్న ఆ పుష్పాన్నొక్కదాన్ని చూస్తే చాలు మీ సృష్టి యావత్తూ నాకు అవగతమై అమితానందం కలుగుతోంది. విష్ణువు, శివుడు ఎవ్వరూ చేయలేని సృజన ఇది. నాకు గర్వాతిశయం కలుగుతోంది" అంది సరస్వతి ఆశ్చర్యానందాలకు లోనవుతూ.

"దేవీ, సృష్టి నిర్వహణకు మేము ముగ్గురం ముఖ్యమే. అది మాకు ఆదిశక్తి అప్పగించిన బాధ్యత అని నీకూ తెలుసుగా!"అన్నాడు.

"ఏదేమైనా సృష్టి ఉంటేనేగా స్థితి, లయల అవసరం. మీరే సృష్టికి ఆద్యులు. మీ భార్యగా అది నాకు గర్వకారణం, అంతే!" అంది శారదమ్మ.
ఆమెతో వాదించడం అనవసరమనుకుని నవ్వి ఊరుకున్నాడు.

కొద్దిసేపట్లో సరస్వతీదేవి మళ్లీ మామూలు స్థితికి వచ్చింది. ఆమెతో కలిసి మళ్లీ భూలోకాన్ని చూడసాగారు.

ఇందాక ఏ పువ్వునైతే చూస్తున్నారో దానిపైనే మళ్లీ దృష్టి సారించారు.

"పువ్వుకు సువాసన అద్దడం మీకే చెల్లింది. మీ సృష్టి అద్భుతం, అది నిర్వివాదాంశం" అంది ప్రశంసాపూర్వకంగా అంతలో ఎక్కడి నుంచో ఒక తుమ్మెద ’ఝుమ్మని’ ఒంపులు తిరుగుతూ ఎగురుకుంటూ వచ్చి ఆ పువ్వుచుట్టు రెండు మూడు సార్లు తిరిగి దానిపైకి ఒరిగింది. సరస్వతీమాత బుగ్గలు ఎర్రబడ్దాయి.

"అది సృష్టి కార్యం, నా సృష్టి నిరంతరం సాగాలని నీకూ తెలుసుగా" అన్నాడు ఆమె సిగ్గుపడితే ఆ బుగ్గలు ఎర్రబడ్డాయనుకుని.
కొన్ని క్షణాల తర్వాత మధువును గ్రోలిన తుమ్మెద మత్తుగా పువ్వుపై నుంచి లేచి గాల్లో ఒంపులు తిరుగుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయింది.
తన దివ్యజ్ఞానంతో పువ్వు మనసును చదివింది. ఆమె కళ్లు ఎర్రబడ్డాయి. కోపంతో ముఖం జేవురించింది. ముక్కుపుటాలు పెద్ద ఎత్తున సంకోచ, వ్యాకోచాలు చెందసాగాయి.

ఆమెలో వచ్చిన మార్పు బ్రహ్మను అయోమయానికి, ఆందోళనకూ గురిచేసింది.

‘అప్పటిదాకా ప్రకృతిలోని అందాలని చూస్తూ పరవశించిన సరస్వతీదేవిలో ఉన్నట్టుండి ఆ మార్పు ఎందుకు వచ్చింది? ఆ కోపమేమిటి?’
ఆయన ఆలోచనలో ఉండగానే ఆమె విసురుగా లేచి లోపలికి వెళ్లిపోయింది.

ఆ వెనకే హడావుడిగా బ్రహ్మ ‘సరస్వతీ..’అంటూ వెంబడించాడు.

ఆమె వెళ్లి దూరంగా ఉన్న పర్వతాల మధ్యన కూర్చుండిపోయింది.

ఆమె పక్కనే కూర్చుంటూ‘ ఇలా చెప్పకుండా లేచి రావడం భావ్యమా? నీ మనసులో ఏదన్నా ఉంటే, నాకు చెబితే, ఇద్దరం ఆ విషయం మాట్లాడుకోవచ్చుగా’ అన్నాడు దీనంగా.

‘మీకు తెలియదా? అవునులే, దేవలోకంలో ఉన్నా మీరూ మగాల్లేగా’ అంది.

‘సూటిగా చెప్పు సరస్వతీ, నీ మనసులో ఏవుందో నాకెలా తెలుస్తుంది? పైగా నాకు తెలుసని అభాండం వేస్తున్నావు’ ఆమె బ్రహ్మవంక సూటిగా చూస్తూ ‘ఆ తుమ్మెద గొప్పతనమేమిటి? పువ్వు బేలతనమేమిటి? ఇదేనా మీ సృష్టి? ’ వెటకారంగా అంది.

’నువ్వే కదా సరస్వతీ కొంతసేపటి క్రితం నా సృష్టి అద్భుతంగా ఉందని మెచ్చుకున్నావు. విష్ణువు కన్నా, శివుని కన్నా నేనే గొప్పన్నావు’
’అన్నాను. ఒక భార్యగా గర్వించాను. కానీ అక్కడ జరిగింది చూశాక ఒక స్త్రీగా గర్హిస్తున్నాను’

‘అంటే?’

ఆ పువ్వు పరిపూర్ణంగా విచ్చుకుంటే, ఎక్కడి నుంచో వచ్చిన తుమ్మెద, ఆ పువ్వు ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, దానిపై వాలి బల..వం..తం..గా మకరందం గ్రోలడం. పాపం ఆ పువ్వు అయిష్టత వ్యక్తం చేయలేదు, ప్రతిఘటించనూ లేదు. ఇదా మీ సృష్టి’ ఎగతాళిగా అంది.

బ్రహ్మఆలోచనలో పడిపోయాడు.

తర్వాతి రోజునుంచి ఆ అసమానతను సరిజేయడానికి రకరకాల జంతువులను సృష్టించాడు. అన్నీ సమానంగానే బతుకుతూ సృష్టికార్యంలో భాగం వహిస్తూ ఇబ్బడిముబ్బడిగా సంతానోత్పాదన చేస్తూ నిరాటంకంగా, అప్రతిహతంగా తమ సంతతిని వృద్ధిచేసుకోసాగాయి. తేడాలు, బేధాలు లేని జీవనం వాటిది.

సరస్వతీదేవి కూడా తన భర్త, చేసిన తప్పు దిద్దుకుని కొత్త జీవాల సృష్టి, అదీ ఒక్క ప్రత్యుత్పత్తి  తేడా తప్ప అంతా సమానమే, అన్నీసమానమే, అన్నంత  గొప్పగా జీవుల్ని సృజించాడు. ఆమె పెదవులు విడీవిడనట్టు సంతోషంగా నవ్వింది. బ్రహ్మ మనసు మురిసింది.
జంతువుల్లోని కోతులు మాత్రం అభివృద్ధి దిశగా అడుగులేస్తూ మనుషులయ్యాయి. అక్కడే మొదలైంది అసలు కథ!

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్