వెంకటేష్ ఒక కార్పోరేట్ హాస్పిటల్ లో వార్డ్ బాయ్ గా పని చేస్తున్నాడు. రోజు హాస్పిటల్ మెట్ల దగ్గర ఎదురుచూస్తూ వచ్చిన పేషంట్లను స్ట్రెచర్ మీదకు చేర్చి వాళ్ళను వార్డులకు తీసుకెళ్లడం అతని రోజు వారీ డ్యూటీ. రోజుకు 8 గంటల డ్యూటీ అయిన, తనకు ఎవ్వరు లేక పోవటంతో మిగిలిన టైం కూడా హాస్పిటల్ లోనే గడుపుతూ వచ్చిన పేషంట్ల తాలుకు బంధువులకు తగిన సాయం చేస్తు వుంటాడు.
వెంకటేష్ వాళ్ళది సిటీ కి 100 కిలో మీటర్ల దూరంలో ఉండే పల్లెటూరు. వాళ్ళకున్న రెండు ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ ఆనందంగా బతికేవాళ్ళు. కాని కరువు కాటేయ్యడంతో చాల మంది ఆత్మహత్య చేసుకుంటే వెంకటేష్ నాన్న మాత్రము ఉసురు పోసిన వాడికే ఊపిరి తీసే హక్కు వుందని ఆత్మహత్య పాపమని వున్న పొలాన్ని అప్పుల వాళ్ళకు ఇచ్చేసి సిటీకి వచ్చి భార్య, కొడుకుతో భవన నిర్మాణ కూలీలు గా చేరి సంతోషంగా వున్న సమయంలో నిర్మాణంలో వున్న భవనం కూలి వెంకటేష్ తల్లి, తండ్రి మరణించారు. వెంకటేష్ దిక్కుతోచని స్తితిలో తిరుగుతుంటే వాళ్ళ ఊరి అతను ఆసుపత్రిలో వార్డ్ బాయ్ గా పని ఇప్పించాడు. ఆ రోజు నుంచి వెంకటేష్ హాస్పిటల్లో అందరికి చాల దగ్గరయ్యాడు.
ఏదైన ఎమర్జెన్సీ కేసు వస్తే ఆ వచ్చిన పేషెంట్ బాగై వెళ్ళే వరకు వెంకటేష్ భగవంతుడిని ప్రార్ధించేవాడు. ఒకవేళ పేషెంట్ చనిపోతే ఆ రోజంతా వెంకటేష్ బాధపడేవాడు. ఒక్కొక్కసారి అన్నం కూడా తినేవాడు కాదు. ఆరోగ్యంగా తిరిగి వెళ్ళేప్పుడు ఏ ఒక్క పేషెంట్ తాలుకు వాళ్ళు వెంకటేష్ గురించి పట్టించుకునే వారు కాదు. అయిన తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు వెంకటేష్.
ఎప్పటిలానే ఆ రోజు కూడా వెంకటేష్ హాస్పిటల్ మెట్ల దగ్గర కూర్చొని వున్నాడు. ఇంతలో రైయ్ రైయ్ మంటు అంబులెన్సు రావటంతో అలెర్ట్ అయి స్ట్రెచర్ తీసుకోని అంబులెన్సు దగ్గరకు వచ్చాడు. సుమారు పాతికేళ్ళు వుండే అబ్బాయి ప్రాణాపాయ స్తితిలో వున్నాడు. మెల్లగా ఆ అబ్బాయిని స్ట్రెచర్ మీదకు చేర్చి ఎమర్జెన్సీ వార్డుకు తరలించాడు వెంకటేష్. ఆ అబ్బాయి వెంట మౌనంగా అనుసరించింది ఒక నడివయస్కు ఆవిడ. ఆ అబ్బాయిని ఐ.సి.యు. లో అడ్మిట్ చేసి బయటకు వచ్చాడు వెంకటేష్. ఐ.సి.యు. బయట ఆ నడివయస్కు ఆవిడ అలానే మౌనంగా నిలబడి వుంది. “అమ్మ, నా డ్యూటీ టైం అయిపోంది. కావలిస్తే నేను ఇక్కడ వెయిట్ చేస్తాను మీరు వెళ్లి పేషెంట్ తాలూకు బంధువులు వేచి వుండే గదిలో వుండండి. ఇక్కడ కూర్చోడానికి కూడా వసతిగా లేదు అన్నాడు. ఆవిడ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
రాత్రి ఐ.సి.యు. బయట నేల పైనే పడుకున్నాడు వెంకటేష్. పొద్దున్నే లేచి చూసే సరికి ఆ నడివయస్కు ఆవిడ అక్కడే వుంది. బహుశా రాత్రి సరిగా నిద్రపోలేదేమో ఆవిడ చాల అలసటగా కనిపిస్తువుంది. అమ్మ మీరు ఒక్క పదిహేను నిముషాలు వుండండి, నేను వెళ్లి స్నానం చేసి మీకు కాఫీ తీసుకొని వస్తాను. ఈ రోజు నాకు డ్యూటీ ఆఫ్. అన్నాడు వెంకటేష్. ఆవిడ సరే అంది. పదిహేను నిముషాల తరవాత వచ్చిన వెంకటేష్ ఆవిడకు కాఫీ ఇచ్చి ఐ.సి.యు. లోకి వెళ్లి ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితిని గురించి అక్కడ డ్యూటీ నర్స్ ల దగ్గర వాకబు చేసాడు. అక్కడ నర్సులు అది సూసైడ్ కేస్ అని, ఇబ్బంది ఏమి లేదని, రాత్రికి ఆ అబ్బాయి కోలుకుంటాడని చెప్పారు. ఐ.సి.యు. నుంచి బయటకు వచ్చిన వెంకటేష్ ఆ నడివస్కు ఆవిడకు ఆ అబ్బాయి విషయాన్ని వివరించి దైర్యం చెప్పి టిఫిన్ కోసం క్యాంటీన్ కు తీసుకెళ్ళాడు.
“అమ్మ, ఆ అబ్బాయి .....?” అంటూ సంకోచిస్తు అడిగాడు వెంకటేష్. “ ఆ అబ్బాయి నా ఒక్కగాని ఒక్క కొడుకు విశాల్. మావారు చనిపోయినప్పటి నుంచి నా కొడుకే లోకంగా బతుకుతున్నాను. వాడు చదువులో చాలా చురుకు. మెడిసిన్ చదువుతున్నాడు. వాడి క్లాసులో వుండే అమ్మాయిని ప్రేమేస్తే ఆ అమ్మాయి వీడి ప్రేమను ఒప్పోకోలేదని వీడు ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. భగవంతుడు చల్లగా చూడబట్టి గండం గడిచింది. లేకపోతె నా జీవితం చీకటి అయ్యేది ” అంటూ కంటతడి పెట్టింది ఆవిడ .
*****
“అమ్మ, విశాల్ స్పృహ లోకి వచ్చాడు. డాక్టర్ గారు ఐ.సి.యు లోనుంచి రూంలోకి మార్చమని చెప్పాడు. పదండి మనం రూంలోకి మారుదాం అంటూ వీల్ చైర్లో విశాల్ ను కూర్చోబెట్టి తోసుకొంటూ వెళ్లి రూమ్ లో జాయిన్ చేసాడు వెంకటేష్.
సూసైడ్ గురించి వాకబు చేయడానికి వచ్చిన పోలీసులకు స్టేట్ మెంట్ ఇవ్వడానికి విశాల్ తల్లి వెళితే, రూంలో విశాల్ దగ్గర వున్న వెంకటేష్ “చూడు విశాల్ మీ నాన్న చనిపోయిన దగ్గర నుండి మీ అమ్మ నీ మీదే ప్రాణాలను పెట్టుకొని జీవిస్తుంది. భగవంతుడు చల్లగా చూసాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీవు కూడ దూరం అయ్యివుంటే ఆమె పరిస్థితి ఎలాగుండేదో ఒక్క సారి ఆలోచించు. మనకు దక్కనిది దక్కేటట్లు చేసుకోవాలి, లేకపోతే దానిని వదిలేయ్యాలి. అంతే కానీ జీవితాన్ని మద్యలోనే ఆపేసే హక్కు నీకు లేదు. నా కున్న పరిస్తితులకి నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకొని వుండాలి. కాని మా నాన్న చెప్పిన మాటలు గుర్తు పెట్టుకొని భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాను. నాకంటే నీవు ఎక్కువగా చదువుకున్నావు. నీకు మంచి జీవితం వుంది. ఇంతకంటే నేను నీకు ఎక్కువ చెప్పలేను” అని చెప్పి వెంకటేష్ వెళ్ళిపోయాడు.
*****
మరసటి రోజు పొద్దున్నే డ్యూటీకి వచ్చిన వెంకటేష్ విశాల్ వాళ్లు డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారని తెలుసుకొని అందరిలానే వీళ్ళు కూడా బాగై వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోలేదని మనసులోనే చిన్న నవ్వు నవ్వుకొని తన రోజువారీ కార్యక్రమాలలో నిమగ్నమయిపోయాడు.
*****
చాల సంవత్సరాల తర్వాత ఒకరోజు వెంకటేష్ ఎప్పటిలానే హాస్పిటల్ మెట్ల మీద కూర్చొని వుంటే “ వెంకటేష్ నిన్ను ఎం.డి. గారు పిలుస్తున్నారు” అని వేరొక బాయ్ చెప్పడంతో వెంకటేష్ ఎం.డి. గారి రూంలోకి వెళ్ళాడు. ఎం.డి. గారి రూంలో ఆయన కుర్చీకి ఎదురుగ ఎవరో కూర్చొని వున్నారు. “ నమస్తే సార్, పిలిచారంటా?” అడిగాడు వెంకటేష్. “వెంకటేష్ వీరు ప్రముఖ హార్ట్ స్పెసిలిస్ట్, ఆవిడ వీరి ధర్మ పత్ని, ఆ బాబు వీళ్ళ అబ్బాయి” అని ఆయన ఎదురుగా కూర్చొని వున్న వాళ్ళను పరిచయం చేసాడు ఎం.డి. అందరి నమస్కారం చేసాడు వెంకటేష్.
“ వెంకటేష్ నన్ను గుర్తు పట్టావా?” అడిగాడు ఆ ప్రముఖ హార్ట్ స్పెషలిస్ట్
“లేదు సార్ నేను మిమ్ములను పోల్చుకోలేక పోతున్నాను “ అన్నాడు వెంకటేష్.
“నా పేరు విశాల్, చాల కాలం క్రితం నేను ఇదే హాస్పిటల్లో ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని జాయిన్ అయ్యాను. నీవిచ్చిన దైర్యంతో చివరకు పెద్ద డాక్టర్ అయి నేను కోరుకున్న అమ్మాయినే పెళ్ళిచేసుకొని జీవితంలో స్తిరపడ్డాను. అందుకే మా అబ్బాయి కి వెంకటేష్ అని నీ పేరే పెట్టుకున్నాను. పేషెంట్లు బాగయ్యి వెళ్ళేటప్పుడు నిన్ను గుర్తు పెట్టుకోరని నీవు అంటూ ఉండేవాడివి కదా అందుకే నేను కావాలనే ఆ రోజు నీకు చెప్పకుండా డిశ్చార్జ్ అయి వెళ్లి జీవితంలో స్థిర పడ్డ తర్వాతే నిన్ను కలుసుకోవాలి అని గుర్తు పెట్టుకొని ఈ నాడు వచ్చాను “ అని లేచి నిలబడి వెంకటేష్ కు నమస్కరించాడు విశాల్ . ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో ప్రతి నమస్కారం చేసాడు వార్డ్ బాయ్ వెంకటేష్.
*****
|