Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.. .http://www.gotelugu.com/issue276/729/telugu-serials/anveshana/anveshana/
ఆ కుర్ర బిచ్చగత్తె ప్రశ్నకి ఆమె ఒక్కసారే ఖంగు తింది ఏం చెప్పాలో అర్థం కాక క్షణం ఆలోచిస్తూ ఉండి పోయింది.

‘‘ఏమైందమ్మా? అలా మౌనంగా ఉండిపోయారు!’’ అంది యువ బిచ్చగత్తె.

‘‘ఆ!....ఆ!....ఇక్కడే క్లోక్రూమ్ ఉంది కదా! అదే సామాన్లు భద్రపరిచే గది....’’ అంటూ ఏదో చెప్పబోయింది ఆమె.

‘‘ఓహో ముందే క్లోక్రూమ్లో దాచేసారా? మంచి పని చేసారు. ఇక్కడంతా దొంగ వెధవలే! కాస్త కన్ను మూస్తే మనల్నే ఎత్తుకుపోతారు.’’ అంది ఆ యువ బిచ్చగత్తె.

‘‘అవునా...’’ ఆశ్చర్యంగా అంది ఆమె,.

‘‘అవునమ్మా! మీ దగ్గర బాగా డబ్బున్నట్టుంది కదా! జాగ్రత్త!’’ అంది ఆ యువ బిచ్చగత్తె.

ఆ అమ్మాయి అలా అనేసరికి ఉలిక్కిపడింది ఆమె. పుణ్యానికి వెళ్తే పాపం ఎదురైందంటారు. దానికి అర్థం ఇదేనేమో! అందరికీ రగ్గు కొనడం వలన తన దగ్గర ఎంతో డబ్బుందనుకుంటోంది ఈ యువ యాచకురాలు.

ఏం చెప్పాలో అర్థంకాక మౌనంగా ఉండిపోయింది ఆమె.

ఇంతలో ఎవరో వ్యక్తి కేంటీన్ దగ్గర నిలబడి టీ త్రాగుతూ తమ కేసే చూస్తూ ఉండడం గమనించింది ఆమె. నెమ్మదిగా క్రింద పడుక్కుండి పోయింది. రగ్గు తల నిండుగా ముసుగులా కప్పేసుకుంది. మాట్లాడుతూ ఉన్నట్టుండి పడుకుండిపోతున్న ఆమె కేసి ఆశ్చర్యంగా చూసింది యువ బిచ్చగత్తె. తాను ఆమె ప్రక్కనే పడుకుని ఎలాగైనా ఆమె దగ్గర డబ్బు కాజెయ్యాని నిర్ణయించుకుంది.

ఆమె ప్రక్కనే రాసుకుంటూ ఒరుసుకుంటూ పడుకుని రగ్గు ముసుగారా కప్పుకుంది.

కేంటీన్ దగ్గర ‘టీ’ త్రాగుతూ నిలబడ్డ గూండా రంగా ఎవరూ లేని ఓ మూలకి వెళ్ళి వరండాలో పడుకున్న ‘ఆమె’ కేసే చూస్తూ జేబులో ‘సెల్’ ఫోన్ తీసాడు.

గబగబా నెంబర్లు నొక్కి సెల్ చెవి దగ్గర ఆనించాడు. అట్నుండి హలో అనే సరికి ఆనందంగా ఒక చేత్తో నోరు మూసుకుంటూ శబ్దం ప్రక్క వారికి వినిపించకూడదన్నట్టు ఒరిగిపోతూ మాట్లాడేడు.

‘‘అన్నా...!’’ ఓ మూలకి ఒరిగిపోతూ నోరు ఓ చేత్తో మూసుకుని మాట బయటకు వినిపించకుండా అన్నాడు రంగా.

‘‘చెప్పు’’ అట్నుండి.

‘‘నువ్వెక్కడున్నావు?’’ అడిగాడు.

‘‘రైల్వేస్టేషన్లో...’’ అట్నుండి.

‘‘అన్నా! ఇది ఇక్కడే వుంది. చాలా సేపట్నుండి దాన్నే గమనిస్తున్నాను. ఇక్కడ ముష్టోళ్లందరికీ రగ్గులు కొని ఇచ్చింది. అదీ ఓ రగ్గు కప్పుకుని ఇక్కడే వరండాలో పడుకుంది.’’ నెమ్మదిగా గుసగుసగా చెప్పాడు.

‘‘ఓ! అలాగా! అయితే నువ్వు అక్కడే ‘ఆవిడ్ని’ కనిపెట్టుకుని ఉండు. నేను పది నిమిషాల్లో అక్కడుంటాను.’’ అంటూనే అట్నుండి ఫోన్ కట్చేసిన శబ్దం.

భద్రంగా సెల్ జేబులో దాచుకున్నాడు రంగా.

‘‘అన్నొచ్చిన వరకూ ఆగాలి. ఇంత మందిలో దీన్ని చంపడం కుదరదు. అందరూ గాఢ నిద్ర లోకి జారుకుంటారు. అప్పుడు అప్పుడు దాని గొంతు నొక్కేయాలి.’’ మనసు లోనే కసిగా అనుకున్నాడు.

ఆమె ప్రతి అడుగు గమనిస్తూ నిలబడ్డాడు రంగా. ఆమె ప్రక్కకి మరో యాచకురాలు రావడం...ఆమె ప్రక్కనే కూర్చుని ఏదో మాట్లాడుకోవడం...  ఒకరి ప్రక్కన ఒకరు ఆప్తమిత్రుల్లా ఒకర్నొకరు అతుక్కుని పడుకోవడం అంతా గమనిస్తూనే ఉన్నాడు రంగా.

అదే సమయంలో ‘విజిల్’ ఊదుకుంటూ గూర్ఖా వరండాలో ఆ చివర షాపు దగ్గర నుండి ఇటు కేంటీన్ వరకూ నెమ్మదిగా అడుగులు వేస్తూ చేతిలో కర్రతో గోడ మీద గట్టిగా కొట్టి అలికిడి చేసుకుంటూ వస్తున్నాడు.

ఆ గూర్ఖా తనకేసి రావడం చూసి రంగా టక్కున కేంటీన్ దగ్గర టీ షాపుకు వెళ్లాడు. ఓరకంట ఆమె పడుకున్న కేసి, గుర్ఖా కేసి చూస్తూ నిలబడ్డాడు.

గూర్ఖా నేరుగా ‘టీ’ కౌంటర్ దగ్గరకు వచ్చాడు.

‘‘ఏక్ చాయ్ లావ్ భాయ్’’ అంటూ చిల్లర ఇచ్చి ‘టీ’ తీసుకున్నాడు గూర్ఖా.

ఆగంతకుడి ప్రక్కనే నిలబడి ‘టీ’ త్రాగుతున్నాడు గూర్ఖా.

ఈ గూర్ఖా గాడి కళ్లల్లో పడకూడదనుకుంటూ కేంటీన్ లోపలకు వెళ్లి ‘టిఫిన్’ ఆర్డర్  చేసాడు. టేబుల్ దగ్గర కూర్చున్నాడే గాని ఆ ఆగంతకుడి దృష్టి అంతా దూరంగా వరండాలో పడుకున్న ‘ఆమె’ మీదే ఉంది.కానీ, సరిగ్గా కనిపించటం లేదు. విసుగ్గా గూర్ఖాకేసి చూసాడు. వాడు అక్కడ నుండి కదలడం లేదు.

రగ్గులు కప్పుకుని హాయిగా పడుకున్న యాచకుంలంతా గూర్ఖా ‘విజల్’ గోలకి ఉలిక్కిపడి మగత నుండి బయటకు వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు రగ్గులు మొహాల మీద నుండి తప్పించి గూర్ఖా కేసి చూసి తిరిగి రగ్గులు ముసుగారా కప్పేసుకున్నారు.

ఆ యాచకుల్లో ఉన్న ఒక నలభై ఏళ్ళ మధ్య వయసుగల బిచ్చగాడు మాత్రం నిద్ర పోకుండా ఏదో ఆలోచిస్తూ పడుకున్నట్టు నటిస్తూ రగ్గు కప్పుకున్నాడు. రగ్గు కొని ఇచ్చిన ‘ఆమె’ అందాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. మనసంతా ఆమె రూపమే నిండిపోయి అల్లకల్లోలం చేస్తోంది. ఎలాగైనా ఆమె పక్కకి వెళ్లి మాటల్లో పెట్టి లోబర్చుకోవాలని కలలు కంటూ కళ్ళు మూసుకున్నాడు.

అందరూ రగ్గు కప్పుకుని నిద్రలోకి జారుకున్నాక నెమ్మదిగా ‘ఆమె’ ప్రక్కకి చేరాలనుకున్నాడు. కానీ, ఇంతలో ఎవరో వెళ్లి ఆమె ప్రక్కలో దూరారు. లీలగా గమనించాడు. అది రోజూ తనకి తారసపడే చింపిరి జుత్తు అమ్మాయని గ్రహించాడు.

‘చెత్త గుంట. నా ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉంది. ఇప్పుడెలా’ అనుకుంటూ రగ్గు ఓరగా తప్పించి వారిద్దరినే గమనిస్తూ ఉండిపోయాడు. ఇంతలో గూర్ఖా రావడంతో అందరూ ఉలిక్కిపడిలేవడం....మళ్లీ నెమ్మదిగా వాతావరణం సద్దుమణగడం అంతా కనిపెడుతూనే ఉన్నాడు.   

ఎదురుగా కేంటీన్‘టీ’ కౌంటర్ దగ్గర ‘టీ’ త్రాగుతూ నిలబడ్డాడు గూర్ఖా ఎదవ. ‘ఆడికంట్లో పడితే ప్రమాదమే.’ అనుకుంటూ అదును కోసం...అవకాశం కోసం కాట్లకుక్కలా పొంచి చూస్తూ ఒత్తిగిలి పడుకున్నాడు ఆ బిచ్చగాడు.

అప్పుడు సరిగ్గా పదుకొండు దాటి పన్నెండు కావస్తోంది. కేంటీన్ లో ఆగంతకులిద్దరూ కూర్చున్నారు. రెండవ వాడు కూడా రైల్వేస్టేషన్ నుండి వచ్చి చేరుకున్నాడు.

కేష్ కౌన్టర్లో ఉన్న వ్యక్తి వారిద్దరినీ గమనించాడు. కేంటీన్లో కూడా మనుషుల రద్దీ తగ్గిపోయింది.

‘‘సార్! మీరు టిఫిన్ చేసి చాలా సేపయింది. మేము కూడా కేంటీన్ కొచ్చెయ్యాలి.’’ వాళ్ల దగ్గరకు కేషియర్ వచ్చి చెప్పే సరికి ఆగంతకులిద్దరూ అవాక్కయ్యారు.

‘ఆమె’ మీద దృష్టి పెట్టి ఇహపరాను మరిచిపోయి కూర్చున్న ఆగంతకులు కేంటీన్ కేషియర్ మని గుర్తు పట్టే సరికి ఉలిక్కిపడి లేచారు.‘‘సారీ సర్! మా బస్సు తెల్లవారురఝామున. ఇక్కడ బావుందని కూర్చుండిపోయాము. మీరు తెల్లవార్లూ ఉండరా?’’ ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు ఓ ఆగంతకుడు.

‘‘మళ్ళీ నాలుగు గంటలకు తెరుస్తాం సార్!  మా స్టాఫ్ కి రెస్ట్ కావాలి కదా!’’ అన్నాడు క్యాషియర్.

ఇక చేసేది లేక ఇద్దరూ కేంటీన్ లో నుండి వెలుపలకు వచ్చి క్యాషియర్ కి అనుమానం రాకుండా ఆర్టీసీ కాంప్లెక్స్ లోపలకు వెళ్లారు. గూర్ఖా రెండో రౌండు విజిల్ ఊదుకుంటూ వరండాలో తిరుగుతూ కాంప్లెక్స్ లోపలకు వెళ్ళాడు.

సరిగ్గా అదే సమయంలో..

ఛటుక్కున లేచి తల నిండుగా రగ్గు కప్పుకుంటూ గభాలున కొద్ది దూరంలో పడుకున్న ఇద్దరాడవాళ్ళ ప్రక్కకి వెళ్లి టక్కున పడుకున్నాడు బిచ్చగాడు.

ఆమె ప్రక్కన యువ యాచకురాలు, ఆ యువ యాచకురాలి ప్రక్కనే బిచ్చగాడు వాళ్లకు తగిలీ తగలకుండా పడుకున్నాడు.

ఆమె మాత్రం నిద్రపోకుండా అంతా గమనిస్తూనే ఉంది. ఆ అమ్మాయి తన ప్రక్కనే చేరి మాటల్లో దింపడం....డబ్బు గురించి ఆరా తియ్యటం....అప్పుడే తనకి ఆ అమ్మాయి మీద అనుమానం కలగడం తోనే నిద్రపోతున్నట్టు రగ్గు కప్పేసుకుని మౌనంగా ఉండిపోయింది. దూరంగా కేంటీన్ దగ్గర ఎవరో వ్యక్తి తమనే గమనించడంతో కళ్ళు మూసుకుంది.

గూర్ఖా వెళ్లిన అరగంటకే వీడెవడో వచ్చాడు. వీడెవడో మగాడిలానే ఉన్నాడు. వాడి వాలకం చూసే ఉలిక్కిపడింది ఆమె.

వీడెవడో ఎందుకు మా ప్రక్కకే వచ్చి పడుకున్నాడు? వీడు కూడా తన దగ్గర ఉన్న డబ్బు కోసమేనా? ఈ అమ్మాయి, వీడు తోడు దొంగలా?! ఏం చేయాలా అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది ఆమె..

******

అడుగు చప్పుడు దగ్గరౌతున్న కొద్దీ ఊపిరి బిగబెట్టి కళ్ళు మూసుక్కూర్చున్నాడు వార్డుబోయ్.

ఇంతలో నర్సు ఎమర్జెన్సీ వార్డులో నుండి గాబరాగా బయటకు వచ్చింది. తలుపు ప్రక్కనే బల్లమీద ఆద మరచి నిద్రపోతున్న వార్డుబోయ్ ని  తట్టి లేపింది నర్సు.

నర్సు భుజం మీద చరిచే సరికి భయంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు వార్డుబోయ్. ఎదురుగా నర్సుని చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. వరండాలో ఓ.పి. దగ్గర నుండి నడుచుకుంటూ వస్తున్న వ్యక్తుల్ని చూస్తూనే ఉలిక్కిపడ్డాడు వార్డుబోయ్. మెయిన్ గేట్దగ్గర హాల్లో ఆ మూలొకరు ఈ మూలొకరు పడుకున్న యువకులు బోరవిరుచుకుని నడుచుకుంటూ వచ్చారు.

‘‘లోపల కుర్రాడికి తెలివి వచ్చింది. రాము...రామూ అని కలవరిస్తున్నాడు. కుర్రాడి తాలూకా ఎవరైనా వచ్చారా?’’ వార్డుబోయ్ ని అడిగింది నర్సు.

‘‘ఆ! వచ్చాడు సిస్టర్. అదిగో ఆ బల్ల మీద పడుకున్నాడే ఆ కుర్రాడు.’’ చెప్పాడు వార్డుబోయ్.

‘‘ఆ కుర్రాడ్ని లేపి లోపలకు తీసుకువెళ్ళు. ఈ అబ్బాయిని చూస్తే లోపల పేషెంటు ఆందోళన తగ్గుతుందేమో.’’ అంటూ తిరిగి వార్డు లోపలకు వెళ్లబోతూ ఆగింది నర్సు.

ఆ యువకులిద్దరూ ఎమర్జెన్సీ వార్డు దగ్గర కొచ్చేసరికి నర్సు, వార్డుబోయ్ మాట్లాడుకుంటూ కనిపించారు.

యువతి చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఎటు వైపు దారితీస్తాయో తెలుసుకోవాలంటే  వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే... 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kaatyayani