Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pellichoopulu

ఈ సంచికలో >> కథలు >> తొలి అడుగు..

toli adugu

“ధూమపానంతో చిత్త వైకల్యం.”

తాజా అధ్యనం లో సిగరెట్ అలవాటు వున్న వారిలో మెదడులో జ్ఞాపక శక్తికి కీలకమైన ప్రదేశంలో కాల్షియం నిక్షేపాలు పెరుగుతున్నట్లు గుర్తించారు.ఇవి అభివృద్ధి చెందడం మనిషి జీవితానికి ప్రమాదకరంగా గుర్తించారు..నెదర్లేండ్ కు చెందిన యునివర్సిటీ మెడికల్ సెంటర్ ప్రతినిధులు.

1971 నుండి స్మోకర్స్ పై పరిశోధన చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.”దినపత్రికలో వచ్చిన ఆ క్లిప్పింగ్ చదివిన శారద ఒక్కసారిగా మూడీగా మారిపోయింది. దాదాపు ఏడు సంవత్సరాల తన ఉపయోగం లేని పోరాటం గుర్తుకొచ్చింది.  పెళ్ళైన తర్వాత మొదటి రాత్రిలోనే ఆ నరకం ప్రత్యక్షమై పోయింది.

“ ఏమండీ !నాకు సిగరెట్ వాసన పడదు.ప్లీజ్.”

“ఏంఫర్వాలేదు..నెమ్మదిగా అలవాటు అయిపోతుంది.అయినా యివి చాలా ఖరీదైన సిగరెట్స్.  ఈమధ్య అమ్మాయిలు కూడా అలవాటు పడిపోతున్నారు.నేనేమైనా బ్రాంది విస్కీలు తాగుతున్నానా?”

“అదికాదండీ !స్మోకింగ్ ఈజ్ ఇంజ్యురియాస్ టు హెల్త్ అంటున్నారు.”

“అదా?పెళ్ళిగురించి కూడా ఎంతో మంది రక రకాల కామెంట్స్ చేస్తుంటారు.మనకు రెండు చెవులు .ఎందుకో తెలుసా?ఒకటి వినడానికి ..రెండోది విడిచి పెట్టడానికి.అయినా ఇటువంటి టైంలో  యీటాపిక్  మనకు అవసరమా?”   అదిమొదలు యిన్ని రోజులు తను చేసిన ప్రయత్నాలు కాలిన బూడిదయ్యాయి.

సిగరెట్ నా మొదటి భార్య దాని జోలికి రాకు..అదే నా బలహీనత.అదొక్కటి తప్ప నీకు యేమికావాలో అడుగు. అనవసరంగా బుర్ర పాడుచేసుకోకు.నాబుర్ర పాడుచేయకు.”

మరోమాటకు అవకాశం యివ్వకుండా ఖండితం గా చెప్పిన భర్త బ్రహ్మాజీ మాటలకు అవాక్కైన దానిలా మౌనాన్ని ఆశ్రయించింది ఈ ఏడు సంవత్సరాలు.మళ్ళీ..ఈనాడు పేపర్లో వచ్చిన వార్త మనసును  కల్లోల పరుస్తుంటే పిచ్చి దానిలా ఆ వార్తనే పదే పదే చూస్తూ కాలాన్ని పరిసరాలను మర్చిపోయింది.

“అమ్మగారూ!వంట అయిపోయింది..నేను వెళుతున్నాను..”

వంట మనిషి వనజ మాటలకు ఈలోకంలోకి వచ్చిన శారద

“అరే ..టైం ఒకటవుతోందా?నువ్వెళ్ళు  ..”

అన్యమనస్కంగా లేచి..స్నానానికి బాత్ రూము వైపు అడుగులేసింది. మోద్దుబారిపోయిన మనసు..అగమ్య గోచరమైన భవిష్యత్తు..ఆలోచించు కుంటూ..హాల్లోకి అడుగుపెట్టి..  అప్రయత్నంగా అక్కయ్య .. డాక్టర్  అవనికి లేండ్ ఫోన్ నుండి డయల్ చేసింది.

“హాయ్ శారూ..లంచ్ అయ్యిందా?”

అవని ఆప్యాయం గా అడిగింది.

“ఇంకా లేదక్కా!నా బ్రతుక్కి అదొక్కటే తక్కువయ్యింది..”

అన్య మనస్కంగా సమాధానమిచ్చింది.

“ఏంటే?ఏమయ్యింది ?మళ్ళి ఏదైనా ప్రాబ్లమా?బ్రహ్మాజీ ఎక్కడ?”

ఆదుర్దా తొంగిచూసింది..అవని మాటల్లో.

“ఆయనే నాప్రోబ్లం ..ఏమిచేయాలో అర్ధం కాక నీకు ఫోన్ చేసాను.”

“పాతదేనా?కొత్త ప్రాబ్లమా?”

“అదే ప్రోబ్లం ..ధూమపానంతో చిత్త వైకల్యం అంటూ ఈరోజు మరోవార్త ..ఏంచేయాలో అర్ధం కావడం లేదు.”

“ఈసమస్యకు పరిష్కారం డాక్టర్లకే తెలియడం లేదు.ప్రజల్లో బ్రతుకు మీద భయం పోయింది.

స్మోకింగ్ లైఫ్ కు త్రెట్ అని ప్రతి రోజు టివీలలో ధియేటర్లలో చెపుతూనే వున్నారు ..వీళ్ళు చూస్తూనే వున్నారు.

లంగ్ కేన్సర్ ..త్రోట్ కేన్సర్  క్లిప్పింగ్స్ విడియోల్లో భయంకరంగా చూపిస్తున్నా స్మోకింగ్ తగ్గడంలేదు ..

ఈ మధ్య అమ్మాయిలు కూడా ఆధునిక ఫేషన్ అనుకుంటు..అలవాటు పడిపోతున్నారు.నేను డాక్టర్గా వేలాదిమందికి కౌన్స్ లింగ్ యిచ్చాను.నోయూజ్..”

“నాకు కబుర్లు కాదు..పరిష్కారం కావాలి.స్వంత అక్క డాక్టరు..అన్న లాయరు..అయినా ?”

“అంటే విడాకులు కావాలా?సరే..ప్రయత్నిద్దాం.”

“అక్కా !జోకులాపి సమస్యకు రా.”

“అయితే వద్దంటావ్..నేనేదో మాయచేసి మీవారికి సిగరెట్లతో విడాకులు యిప్పించే ప్లాన్ చేద్దామనుకున్నాను.

నువ్వు వద్దంటే సరే..నీయిష్టం.”

అక్క అవని మాటలకు అయోమయంగా ఫోన్ రిసీవర్ నే చూస్తూ

“అక్కా!అసలే నాబుర్ర వేడెక్కిపోయింది.జోకులేసి పూర్తిగా పాడుచేయకు.”

“జోకు కాదు నిజమే చెపుతున్నాను..లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో మా హాస్పిటల్ తరఫున “యాంటీ టొబాకో వారోత్సవాలను” ప్లాన్ చేస్తున్నాము..అన్నయ్యతో చెప్పించి ముందు శాన్విత స్కూల్ నుండి మొదలుపెడతాము.

నీ సమస్యకు యేదైనా పరిష్కారం దొరకొచ్చు..యింకా చాలా టైం వుంది..గుర్రం ఎగరావచ్చు అంటారు..ఏమో !చూద్దాం.అన్నట్లు శాన్విత స్కూల్ పేరు అడ్రస్ నా సెల్లుకు మెసేజ్ పెట్టు.హాయిగా లంచ్ లాగించి ..నీకు యిష్టమయిన   టివీ సీరియల్స్ కు అంకితమై పో. ఉన్న ఒక్కబుర్రను పాడుచేసుకోకు.. సీయూ..శారూ!”

అక్క మాటల్లో ని ఒక్క మాట అర్ధం కాకపోవడం తో యాంత్రికం గా.. రిసీవర్ ను క్రెడిల్ చేసి ఫోన్ వంక అదోలా చూస్తూ అక్క అవని మాటల్ని బుర్రలో గుండ్రాలుగా తిప్పుకుంటూ..

ఆకలి రాజ్యానికి అంకితమైపోయింది ..భర్త పొగ దెబ్బకు బలై పోతున్నశారద.

**********

“ఏమండోయ శ్రీవారూ! ఒకచిన్న మాట ...పొరపాటున నామాట అనుకునేరు..మీ గారాల పట్టి శాన్విత  స్కూల్ నుండి.అదికూడా కొరియర్లో..రేపు ఫోన్ కూడా రావచ్చు.ఫాదర్స్ మీటింగ్ అని..అసలే ఆ ప్రిన్సిపాల్ మహా కోపిస్టి తల్లి ..ఎలా మేనేజ్ చేస్తారో ?”ఆఫీస్ నుండి వచ్చిన భర్తకు కాఫీ అందిస్తూ..తన సహజ ధోరణిలో వార్తా ప్రసారం చేసింది శారద వైఫ్ ఆఫ్ బ్రహ్మాజీ .  

అప్పటి వరకు పడిన ఆందోళన మనసులోనే దాచుకుంటూ.

పొగలు కక్కుతున్న కాఫీ గురించి పట్టించుకో కుండా ఆలోచనలో పడిపోయాడు భర్త బ్రహ్మాజీ.

మొన్నే లక్షల ఫీజు కట్టి..యూనిఫాం..బుక్స్ ..నోట్ బుక్స్..షూ..బస్ ఫీజ్ ..చెత్త చెదారం కింద మరో లక్ష   సమర్పించి బ్రతుకు  జీవుడా అని గాలి పీల్చుకుంటుoటే..ఈ కొరియర్ మరో అనుకోని షాక్.

“మరీ టివీసీరియల్ రచయితలా బుర్ర బద్దలు కొట్టుకోకండి.చదువంటే సాగుతున్న సీరియల్లా అనంతమైనది.

యిప్పుడు మన శాన్విత ఐదో తరగతిలో వుంది.అంటే మరో పదిహేను సంవత్సరాలు ..తమరు యిప్పుడే జుట్టు పీక్కొనే కార్యక్రమానికి నాంది పలికితే అమ్మాయి డిగ్రీ నాటికే మీబుర్ర పిహెచ్డి తీసుకుంటుంది.” తన మనసును చదివేసినట్లు చెపుతున్న భార్య శారద మాటలతో షాక్ నుండి బయటికి వచ్చాడు బ్రహ్మాజీ.

“మొన్ననేగా ఉన్నదంతా వూడ్సేసారు..అప్పుడే మరో ఊడుపా?”

“ఊడుపులో  కోతలో వెళ్ళండి మీకే  విషయం తెలుస్తుంది.”

“పోనీ నువ్వు వెళ్ళిరాకూడదు?”

సిగరెట్ వెలిగించుకుని పొగను రింగులు రింగులుగా వదులుతూ అడిగాడు.

“నేనా ? అవకాశమే లేదు..ఓన్లీ ఫాదర్స్అని రాసి అండర్ లైన్ చేసారు.  రేపు మీరే వెళ్లాలి .”

సిగరెట్ పొగకు ఇరిటేట్ అవుతూ కిచెన్ లోకి వెళ్ళిపోబోతూ ఆగి చెప్పింది.

“సరే శాన్విని అడుగుతాను..దానికేమైనా ఐడియా ఉండొచ్చు.”

“అనవసరంగా దాని బుర్ర పాడుచేయకండి.ఇది దాని చదువు ప్రోబ్లం అయ్యుండదు.”

“సరే..రేపు నేను యెలాగూ వెళ్ళాలి..అదే తెలుస్తుంది.”

మరో దమ్ము లాగుతూ కాఫీ కప్పు కాళీ చేసాడు.

“అమ్మాయి గ్రౌండ్ కెళ్ళింది.వచ్చె టైం అయ్యింది..మిమ్మల్ని యిలా ధూమపాన శకటంలా చూస్తే బాధ పడుతుంది.  కనీసం అమ్మాయి ముందైనా జాగ్రత్త పడండి.”   కసిని కంఠంలోనే దాచుకుని చిన్నగా హెచ్చరించి కిచన్ లోకి వెళ్లిపోయింది శారద.

********

కూతురు శాన్విత చదువుతున్న స్కూల్.ఆదివారం అయినా కొంతమంది తండ్రులతో నిండిపోయింది..అంటే నాకు వచ్చిన కొరియర్సే అందరికి వచ్చుంటాయి.అంటే సమస్య నా ఒక్కడిదే కాదన్న మాట..

స్వగతంగా అనుకుంటూ ప్రిన్సిపాల్ రూము ముందున్న కుర్చీలో కూలబడిపోయాడు.అప్పటికే వరండాలో వున్న విజిటర్స్ చైర్స్ దాదాపు నిండిపోయాయి.అప్పుడు మైకు లోంచి వినిపించింది..చిన్న అనౌన్స్ మెంట్.

“నగరంలో ప్రసిద్ధి చెందిన హాస్పిటల్స్ వారు నిర్వహిస్తున్న కార్య క్రమానికి విచ్చేసిన అందరికి స్వాగతం. మైకులో మీపేరు తోబాటు మీ అమ్మాయి లేదా అబ్బాయి పేరు అనౌన్స్ చేసి రూము నెంబర్ చెప్తాము.

మా వాలెంటీర్స్..మీకు అలాట్ చేసిన గదిని చూపిస్తారు.అక్కడున్న డాక్టర్స్ కి సహకరించండి.

మీ కోసం ఏర్పాటు చేసిన ఈ సెమినార్ విజయవంతం చేయగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.”

ప్రిన్సిపాల్ గొంతు గుర్తు పట్టాడు బ్రహ్మాజీ. హమ్మయ్య ..ఊడుపులు కోతలు లేవు అనుకుంటూ సంబరపడి పోయాడు ..పిచ్చి బ్రహ్మాజీ .

*****

డాక్టర్ ముందు పేషెంట్ లా వినయంగా కూర్చున్నాడు బ్రహ్మాజీ.

“మీరు  ఫిఫ్త్ క్లాస్స్ స్టూడెంట్  శాన్విత ఫాదర్ బ్రహ్మాజీ కదూ?”

“అవును సర్.”

“మీకు మీ అమ్మాయి అంటే యిష్టం కదూ?”

“ఇష్టం మాత్రమే కాదు ప్రాణం సర్.”

మీరు స్మోక్ చేస్తారా?”...

“చెప్పండి..మాకు ఎలా తెలుసని ఆలోచించకండి.మీ అమ్మాయే కాదు స్మోకర్స్ పిల్లలందరు యిచ్చిన స్టేట్ మెంట్స్ బట్టే మీ అందరిని పిలిపించామని ప్రిన్సిపాల్ మేడం చెప్పారు.మీరు నిజం చెప్పకపోయినామా చెకప్ లో తెలిసిపోతుంది. అయినా మీకు చెకప్ వేస్ట్.మీ చేతి వేళ్ళు..పెదాలు చూస్తుంటేనే అర్ధమవుతోంది. 

“చేస్తాను సర్.”

“మీరు నన్ను సర్ అనకండి..డాక్టర్ అనండి..మీకు ఈ అలవాటు ఎప్పటినుండి?”

“కాలేజి డేస్ నుండి డాక్టర్.”

“దట్ మీన్స్ క్రానిక్ హేబిట్ ..ఎప్పుడైనా చెక్ చేయించుకున్నారా?”

“లేదు డాక్టర్.”

“మీరు స్మోక్ చేసేటప్పుడు వదిలే పొగలో వుండే కెమికల్ కంటెంట్ గురించి ఐడియా ఉందా?”

“నో డాక్టర్.”

“పోనీ స్మోకింగ్ మూలంగా మీకు కలిగే  సమస్యల గురించి అవగాహన వుందా?”

“టివీల్లో చూస్తున్నాను.అంతే..డాక్టర్.”

“చూసినప్పుడు మీకు భయం అనిపించదా?”

“సరే ..మీరు బయట స్మోక్ చేస్తారా?ఇంట్లోనా? ఐమీన్ టాయ్ లెట్స్ ..క్లోజుడ్ రూమ్స్ లైక్ బెడ్ రూమ్ ?”

“పబ్లిక్ ప్లేసుల్లో చేయను ..బెడ్ రూము ..టాయ్ లెట్స్ ..”

“స్మోక్ చేసాక బ్రష్ చేసుకొని మీ అమ్మాయి శాన్విత ను ముద్దు చేస్తారా?బ్రష్ చేసుకోకుండానా?”

“మీ మౌనాన్ని  అర్ధం చేసుకున్నాను.మీరు మీ అమ్మాయికి ప్రేమను అందిస్తున్నానని అనుకుంటున్నారు..కాని అమ్మాయి లంగ్స్ ను “నికోటిన్..సైనైడ్ ..ఆర్సెనిక్ ..కార్బన్ మొనాక్సైడ్” ..వంటి విషాలతో నింపేస్తున్నారు.

చిన్న పిల్లల త్రోట్..లంగ్స్ చాలా డెలికేట్ గావుండి ఈవిషాలకు తొందరగా యాక్టివేట్ అవుతాయి.త్రోట్ కేన్సర్ లంగ్స్ కేన్సరుకు టార్గెట్ అవుతాయి. టొబాకో మూలంగా స్ప్రెడ్ అయ్యే బాక్టీరియా TUBERCULOSIS  అనే డిసీజ్ కుదారి తీస్తుంది.దాన్నే మనం టిబి అంటాం.మీకు  మీరే పిల్లల జీవితాన్ని స్పాయిల్ చేస్తున్నారు.

ఇప్పుడు మనం పీలుస్తున్న గాలి ..తింటున్న ఆహారం ..తాగుతున్న నీరు ..వుపయోగిస్తున్నపాలు..ఒకటేమిటి అన్ని కలుషితాలే .కల్తీ లేనిది అమ్మా నాన్నల ప్రేమమాత్రమే.కాని దానిని కూడా విషతుల్యం చేస్తున్నారు.

పిల్లల సంగతి వదిలి మీ జీవిత భాగస్వామి గురించి చూద్దాం. తనెప్పుడైనా మీ స్మోకింగ్ గురించి ఫిర్యాదు  చేసారా?”

“చేసి వుండరు..కారణం  మిమ్మల్ని హర్ట్ చేయడం యిష్టం లేక..లేదా ప్రేమ కావచ్చు.కనీసం ఆమెకైనా మెడికల్ టెస్ట్ చేయించారా?చేయించి వుండరు.మనదేశ సర్వేప్రకారం..జర్దా..గుటకా ..పాన్ మసాలా .. తింటున్న  వారితో కాపురం చేస్తున్న స్త్రీల  మనోగతం..తెసిస్తే షాకై పోతారు.అసహ్యించు కుంటు..గతిలేక ..   చేస్తున్నామని చెపుతున్నారు.ఇంత కంటే దౌర్భాగ్యం మరొకటి వుంటుందా?

విడాకులకు అప్లై చేసిన ఎంతో భార్యల  ప్రధమ ఆరోపణ వింటే తట్టుకోలేరు.అది సిగరెట్ కంపు భరించ లేక అని. మీరుఆ స్టేజ్ లోకి  రాకుండా చూసుకోండి.ప్రస్తుతానికి వద్దాం. ఒక్కసారి ఈ లేబ్ రిపోర్ట్ చూడండి.” ఒక బిగ్ సైజ్ బ్రౌన్ కవర్ బ్రహ్మాజి ముందు పెట్టాడు డాక్టర్. వణికే చేతులతో ఆకవర్  తీసుకొని పేరు చూస్తూనే షాక్ తినేసాడు.బ్రహ్మాజీ గారూ!అందులో వున్న లేబ్ రిపోర్ట్ మీ అమ్మాయిది.

స్కూల్ మానేజ్ మెంట్ లయన్స్ క్లబ్ వారితో కలిసి స్టూడెంట్స్ తో సర్వే నిర్వహించి..సిగరెట్ స్మోకింగ్  అలవాటున్న ఫాదర్స్ ను గుర్తించారు.అందులో కొందరిని ఎన్నుకొని వాళ్ళ పిల్లలను డాక్టర్స్ తో టెస్ట్  చేయించారు.అందులో మీ అమ్మాయి శాన్విత ఒకరు.”   డాక్టర్ టెస్ట్ రిపోర్ట్ చెప్పక ముందే చేతుల్లో మొదలైన వణుకు శరీరమంతా వ్యాపించి నట్లు చలి జ్వర పేషెంట్ లా వణికి పోయాడు.హీనమైన స్వరంతో..అతిప్రయత్నం మీద నోరిప్పాడు.

“డాక్టర్ !మా అమ్మాయికి ..?”

“ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదు.ప్రైమరీ క్లాస్ స్టూడెంట్స్ కొందరికి కొన్ని సింటమ్స్ బయట పడ్డాయి. టొబాకో ఎఫెక్ట్ మూలంగా “primary complex”  మొదలైనట్లు గుర్తించాము.”

  “అంటే ఏమిటి డాక్టర్?” వణుకు గోతులోకి వచ్చేసింది.

“అచ్చ తెలుగులో చెప్పాలంటే “టిబీ కి తొలి మెట్టు” అని చెప్పాలి.”

“అంటే మా శాన్విత కి టిబి ?” పిచ్చి చూపులు చూస్తూ బ్రెయిన్ డెడ్ మనిషిలా టేబుల్ మీద తల వాల్చేశాడు.

“బ్రహ్మాజీ గారూ! అప్సెట్ కాకండి.ముందు వాటర్ తాగి నేను చెప్పేది వినండి.మీ అమ్మాయికి యిప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు.ముఖ్యంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదము రాదు.”

“చెప్పండి డాక్టర్ !నా తల్లి కోసం నేను ఏమి చేయడానికైనా సిద్ధం.”

“బ్రహ్మాజీ గారూ! ..ప్రమాణం చేసే ముందు ..మాట యిచ్చే ముందు..తొందర పడకూడదు. తప్పకుండా చేస్తామని డాక్టర్ ముందు సవా లక్ష కధలు చెపుతారు.హాస్పిటల్ గేట్ దాటగానే మర్చిపోతారు. యిప్పటికి స్మోకింగ్ చేయ కూడదని కొన్ని వేల మందికి కౌన్స్ లింగ్ యిచ్చాం.ఒక్కరు కూడా మానలేదు. రేపు మీరూ అంతే.”

“నోడాక్టర్ ..నా శాన్విత మీద ఒట్టేసి చెపుతున్నాను..నేను ఏమి చేయాలో చెప్పండి..మాట తప్పను.”

“సిగరెట్ స్మోకింగ్ మానేయాలి.మీరు టెస్ట్ లు చేయించుకొని మీకు క్లీన్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఎవరికి ..ఎవ్వరికీ ముద్దులు పెట్ట కూడదు.అర్ధమయిందనుకుంటాను.”

“అర్ధమయ్యింది డాక్టర్.”

“మీకు ఈ వ్యాధి ఇప్పటికే వచ్చుండాలి.ముద్దులతో బాక్టీరియా వ్యాప్తి చెంది ..మరొకరికి స్ప్రెడ్ అవుతుంది.  అటు చూడండి అక్కడ వున్న తండ్రులు అందరూ స్మోకర్సే.పిల్లలకు ప్రేమ అందిస్తున్నామనే భ్రమలో..పిల్లలకు  జబ్బులు అంటిస్తున్నారు.డాక్టర్గా నేను చెప్పవలసింది చెప్పాను.ఇక మీ యిష్టం.మీరు ప్రిన్సిపాల్ మేడంని కలవండి.టెస్ట్ అయ్యాక రిపోర్ట్ తో బాటు ప్రిస్క్రిప్షన్ పంపిస్తాం.రెగ్యులర్ గా మందులు వాడి ప్రతి మూడు  నెలలకు టెస్ట్ లు చేయించుకోండి.ఓకే ..సీయూ”     ప్రిన్సిపాల్ ముందు బ్రహ్మాజీ దోషిలా కూర్చున్నాడు.

 “మిస్టర్ బ్రహ్మాజీ !యిది మీ ఒక్కరి సమస్య కాదు.లక్షలాది మంది సమస్య.చదువుకున్న మీలాంటి వారు స్మోకింగ్ అనే వ్యసనానికి బానిసలుగా మారి భావి భారత పౌరులైన పిల్లల జీవితాలతో బాటు..భార్యల జీవితాలను మాత్రమే కాదు అన్నెం పున్నెం ఎరుగని పబ్లిక్ ఆరోగ్యాలను నాశనం చేస్తున్నారు.

మనం పీల్చుకోడానికి తగినంత ఆక్సిజన్ గాలిలో లేదు.రోడ్ మీద తిరుగుతున్న కార్లు..బస్సులు  వెదజల్లుతున్న “కార్బన్ మొనాక్సైడ్” తో బాటు దుమ్ము ధూలితొ బాటు స్మోకర్స్ విడుస్తున్న సిగరెట్ పొగతో మనుషుల వూపిరి తిత్తులు నిండిపోయి మరణానికి కారణభూత మవుతున్నాయి.అటువంటి కలుషిత వాతావరణంలోనే   మన పిల్లలు పెరుగుతున్నారు.  

నావుద్దేశo..మీకు ఆరోగ్య సూత్రాలను చెప్పడం కాదు.ఈస్కూల్ మానేజ్ మెంట్ ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొంది.నెక్స్ట్ ఇయర్ నుండి..మా స్కూల్ అడ్మిషన్ కావాలంటే అన్ని సర్టిఫికేట్లతో బాటు     తలిదండ్రుల  హెల్త్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాలి.మీరు ఓల్డ్ పేరెంట్ కాబట్టి మీకు ఆరు నెలల టైం  యిస్తున్నాను.మీ ఎన్టైర్ ఫ్యామిలీ హెల్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి.మీరు స్మోకింగ్ హేబిట్ మానుకుంటే మాత్రమే శాన్విత మాస్కూల్లో కంటిన్యు అవుతుంది.స్టూడెంట్స్ యెవరూ అబద్దం చెప్పరు.వాళ్ళు యిచ్చిన ఇన్ఫర్మేషన్ మూలంగానే పేరెంట్స్ ను ట్రేస్ అవుట్ చేయగలిగాము.చేస్తూనే వుంటాం. మార్పు కోసం మంచి కోసం  చేస్తున్న మా వుద్యమం రేపు అందరు ఆచరిస్తారని నమ్ముతున్నాము.” గాలిపోయిన బెలూన్ లా వాడిపోయిన ముఖంతో వచ్చిన భర్త వాలకాన్ని గమనించిన శారద మౌనంగా   ఉండిపోయింది.

“హాయ్ డాడీ !” అంటూ హుషారుగా వచ్చిన శాన్విత  తండ్రి చంకనెక్కేసి ముద్దులు కురిపించేసింది.

కూతురి  “పరిష్వంగాన్ని..ముద్దుల మధురిమను” ఆస్వాదించ లేని బ్రహ్మాజీ నిస్సహాయంగా తల తిప్పుకున్నాడు.

“మీ పాపకు ముద్దులు పెడుతూ ప్రేమను పంచుతున్నామని మురిసిపోతున్నారే తప్ప ..ఆపాప ఊపిరితిత్తుల్లో విషాన్ని నింపుతున్నారు.”

డాక్టర్ మాటలు గుర్తుకొచ్చి ఒక్కసారిగా నీరుగారిపోయాడు.జవసత్వాలు లేని వాడిలా నిలువునా సోఫాలో కూలిపోయాడు.

“వాట్ హేపెండ్ డాడీ?”

శాన్విత అడిగిన ప్రశ్నను కూడా గ్రహించలేని స్థితి లోకి జారిపోయాడు.

“ఏంటండి అలా వున్నారు?ఆమహాతల్లి బుర్ర తినేసి వుంటుంది.మంచినీళ్ళు యిమ్మంటారా?”

భార్య అడిగిన ప్రశ్నకు మౌనంగా తలవూపుతూ లేచి తిన్నగా బెడ్ రూము లోకి వెళ్లి వార్డ్ రోబ్ లో భద్రంగా దాచుకున్న ఐదు సిగరెట్ పేకెట్లను తీసుకొచ్చి కిచెన్ సింక్ లో పడేసి నిప్పు అంటించాడు.

నమ్మ శక్యం కాని ఆ దృశ్యాన్ని వింతగా చూస్తున్న శారద తను చూస్తున్నది కలో?నిజమో అర్ధం గాక కన్ ఫ్యూజ్ అయిపోయింది. తిన్నగా బాత్ రూమ్లోకి వెళ్లి డాక్టరక్క తనకు యిచ్చిన కాల్గేట్ ప్లేక్స్ ఫ్రెష్ మింట్ మౌత్ వాష్ తో ..పుక్కిలిస్తున్న భర్తను అయోమయంగా చూస్తూ భర్తకు టవల్ అందించింది.

టవల్ అందించిన భార్యను అభావంగా చూస్తూ..మౌనంగా వచ్చి సోఫాలో కూర్చుండిపోయాడు.

“మాట్లాడరే ?ఇంతకీ ఎందుకు పిలిచారు?ప్లీజ్ చెప్పండి.వూడుపులా..కోతలా?”

“శాన్విత స్టడీ రూమ్ లోకి వెళ్ళనీ..అంతా చెప్తాను.”

భారంగా చెప్పి మౌనముద్ర దాల్చాడు..స్మోకింగ్ కింగ్ ..బ్రహ్మాజీ.

“హాయ్ శారూ!అక్క డాక్టర్..అన్న లాయర్..అని తెగ యిదైపోయావు..నాట్రిక్ పనిచేసిందని మొన్న కౌన్స్ లింగ్ రూములో మరిది గారి ఫేసు చూడగానే అర్ధమై పోయింది.మా హాస్పిటల్ డాక్టర్ మీవారి బ్రెయిన్ని వాష్ చేస్తున్న సీన్ని సీసీ కెమారా ప్రసారం లో చూస్తూనే ఆనిర్ణయానికి వచ్చేసాను. అంటే..భార్య మీద..బ్రతుకు మీద లేని శ్రద్ధ.. భయం ..పిల్లల మీద వుంటుఒదన్న మాట. శాన్విత “ఫేక్ రిపోర్ట్” ముందు పెట్టగానే అదేంటో తెలుసుకో కుండానే  మరిది గారు దాదాపు మూర్చ పోయారు. అయినా చూసినా ఏమీ అర్ధం కాదనుకో.  అన్నయ్య లైన్స్ క్లబ్ మెంబర్.నీకోసం తన పలుకుబడి వుపయోగించి    

ఈ కేంప్   ముందుగా శాన్విత  స్కూల్లో కండక్ట్ చేయించ గలిగాడు.భర్తలు భార్య మాట వినరు.డాక్టర్ల మాట వినడం మానేశారు. అప్పుడు యేంచేయాలి ?ఎలా నీ ప్రోబ్లం సాల్వ్ చేయాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే ..    శాన్విత విషయం గుర్తుకొచ్చింది.నీకు  గుర్తుందా పోయిన నెల దానికి ఫీవర్ అని సకుటుంబ సమేతంగా  హాస్పిటల్    కి వచ్చావు.దానికి  ఇంజక్షన్ ఇస్తుంటే బ్రహ్మాజీ విలవిల లాడిపోయారు. నువ్వు దొంగ నవ్వులు నవ్వేసావు?

“అవునక్కా!దానికి దీనికి సంబంధం ఏమిటి?”

“అప్పుడు ఫ్లాష్ అయ్యింది ఐడియా.కూతురి మీదున్న ప్రేమతోనే..ఝలక్ యివ్వాలని డిసైడ్ అయిపోయాను.

మరిదిగారి  బలహీనత మీద ప్లే చేసాను. మా హాస్పిటల్ డాక్టర్ తో చిన్న నాటకం ఆడించాను.వీర సక్సెస్..

ఏది ఏమైనా ఒక్కరికోసం తలపెట్టిన మంచిపని ఎంతోమందికి ఉపయోగ పడింది.

ఎవరెస్ట్ ఎక్కాలన్నా మొదటి అడుగు తోనే సాధ్యం.అదే ఈ “తొలి అడుగు”.

శారూ!..నువ్వు హ్యాపీ యేగా?”

అక్క అవని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బిక్క ముఖం పెట్టి

“అక్కా!అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు? శాన్వికి వచ్చిన జబ్బు ప్రమాదం కాదుకదా?” ఏడుపు గొంతుకతో అడిగింది. డాక్టర్ అవని గలగలా నవ్వేసి..

“శారూ! నారి నోటిలో నువ్వు గింజ నానదు అంటారు.మరి నువ్వా సామెతను నిజం చేయనంటే ...” 

“అక్కా!నామీద..శాన్వి మీద ఒట్టు ..అసలు నోరే విప్పను.ప్లీజ్ చెప్పక్కా..”

“ప్రైమరీ క్లాస్ పిల్లల్ని టెస్ట్ చేసాము.చాలా మంది పిల్లల్లో తండ్రులు ప్రేమతో అంటించిన  “ప్రైమరీ కాంప్లెక్స్” లక్షణాలు  ట్రేస్ అయ్యాయి.నీకోసం చేసిన ఈ ప్రయత్నం ఎంతో మంది చిన్నారులకు బ్రతుకు నిస్తోంది.”

“అక్కా !ముందు శాన్వి విషయం చెప్పు..ప్లీజ్..”

“చెల్లీ!శాన్వి మాత్రమే కాదు అందరూ పిల్లలే.కొంచం ఓపిక పట్టు.”

“అక్కా!తల్లి మనసు తల్లడిల్లి పోతోంది..”

“ఇద్దరమ్మాయిల తల్లికి ..తల్లి మనసు తెలియదులే ! అయితే విను..లకీగా శాన్విత కు ఏ జబ్బూలేదు.మరిది  గారికి   షాక్ యివ్వాలని ..చిన్న ట్రిక్..అంతే.అయినా నేను ముందే చెప్పాను డాక్టర్ మీవారి ముందు పెట్టింది..

“ ఫేక్ రిపోర్ట్” అని .”

“అవని అక్కా!నిన్ను లక్ష ముద్దులతో ముంచేస్తాను..”   సంబరం అంబరాన్ని తాకుతుంటే శారద ఫోనుకే ముద్దులు పెట్టేసింది.

“మరీ ఆకాశానికి ఎగిరిపోకు..రేపు హాస్పిటల్ కు రా..నీకు టెస్ట్ చేస్తాను.టెస్టులో యేమీ లేదంటే ..యెగిరి పోదువు గాని..హద్దులు లేని అంబరానికి..  అప్పుడు పెడుదువు గాని సైనైడ్ లేని ముద్దులు.”

“నాకు ఆ జబ్బు వున్నా ఫర్వాలేదు ..నువ్వున్నావు..నాశాన్వికి యేజబ్బు లేదు అదే నాకు పదివేలు..” తల్లి మనసు తొంగి చూసింది ఆ రెండు వాక్యాలలో 

మరిన్ని కథలు