Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ఏ దారెటు పోతుందో

e daretupotundo

ఖండంతరాల కేసి విమానం ఎగిరి పోయింది ….. విమానం తో పాటే విలాసిని కూడా విమానం తిరిగి వస్తుంది.  విలాసిని రాదు. చేరుకున్న విదేశంలో కట్టుకున్న మగాడితో ఉండి పోతుంది. విమానాశ్రయ  ప్రాంగణం ఎప్పటిలాగే హడావిడిగా, ఒకింత గందర గోళంగా ఉంది. కారు బైటకి తీసి పరధ్యానంగా డ్రైవ్ చేస్తున్నాడు జయరాం.  మనసును కమ్మేసిన నిరుత్సాహం శరీరానికి ప్రాకుతున్నట్టు అనిపించింది.

ఏర్ పోర్టు లోంచి బయటకు వచ్చి కారు పార్కింగు దాకా నడవడానికే ఇబ్బంది పడింది సుందరి. దాదాపు పదేళ్ళ గా ఎముకల సమస్య తనకి. వయసు వల్ల ఎముకలు కండరాలు బలహీన పడ్డాయని చెప్పాడు డాక్టరు.  కాల్షియం ఉన్న ఆహరం బాగా తీసుకొమ్మని చెప్పాడు. కానీ సుందరికి పాలు తీసుకుంటే సరిపోదు. సూర్యరశ్మి శరీరానికి తగిలేట్టు రోజూ నడక ఉండాలని కూడా డాక్టరు చెప్పాడు.

మెల్లగా నడిచి వచ్చి కార్లో కూర్చుంది సుందరి. డ్రైవింగ్ సీట్ లో కూర్చుని సీట్ బెల్టు బిగించి కారు స్టార్టు చేసాడు జయరాం. 

ఇంకా సరిగ్గా తెల్లవార లేదు.

సిటీకి వెళుతున్న విశాలమైన రహదారి వెంబడి బార్లు తీరి వొస్తూ పోతున్న వాహనాలు.

మౌనంగా కారు పోనిస్తున్నాడు జయరాం.

విలాసిని...

జె.విలాసిని…

అన్ని సర్టిఫికెట్లలో, పాస్ పోర్ట్ లో అలానే ఉంటుంది పేరు. జె అంటే జయరాం. జయరాం విలాసిని. తండ్రి పేరు ’సర్ నేమ్’ గా వ్రాయ బడే ప్రాంతం నుండి వొచ్చాడు తాను....చిట్టి బాబు జయరాం. చిట్టి బాబు జయరాం కూతురు జయరాం విలాసిని. అట్లా విలాసినికి తండ్రి పేరు ఎప్పటికీ అంటి పెట్టుకునే ఉంటుంది. ఒకింత సేద తీరాలనిపించింది. రోడ్డు కి బాగా ప్రక్కగా కారు ఆపాడు . రోడ్డు దిగి ఏదో పల్లెకు వెళ్ళే మట్టి బాట కనిపించింది. ఫర్లాంగు దూరం నడిచారు. మట్టి రోడ్డు ప్రక్కనే ఏదో పంట పొలం. బోరింగు లోంచి నీళ్ళు పొలానికి పారుతున్నాయి. వెళ్లి నీళ్ళు పడే దగ్గర రాతి అరుగు మీద కూర్చున్నారు ఇద్దరూ. చుట్టూ వేపచెట్లు. తూరుపు ఎర్రబారుతూంది. రక రకాల పిట్టలు కిచకిచమంటూ అరుస్తున్నాయి. బైటంతా ఒక ప్రశాంతత. లోన మాత్రం కోలుకో లేనంత నిరాశ.

'మాయా సంసారం తమ్ముడూ....

మదిలో సదాశివుని మరువకు తమ్ముడూ... ఎప్పటిదో పాత పాట... పిఠాపురం నాగేశ్వర రావు గొంతులో వినబడుతోంది....పిట్టలు చెట్లలోంచి ఎగిరి బైటకు దారి పడుతున్నాయి ......ఎక్కడ తిరిగినా పొద్దు క్రుంకే సరికి మళ్ళీ గూటికి చేరుకుంటాయి ...ఎగిరి పోయిన విలాసిని మాత్రం...రాదు ....ఎప్పటికీ .... జయరాంని ఒంటరి తనం చుట్టేసింది.... సుందరి ఒక డిప్రెషన్ లో ఉంది. బైటంతా ఒక ప్రశాంతత. లోన మాత్రం  కోలుకో లేనంత నిరాశ.

***

జయరాంకు నాలుగేళ్ళప్పుడు తండ్రి పోయాడు. తాగి తాగి. మరో మూడేళ్ళకు లేమి తెచ్చిన రోగంతో తల్లి పోయింది. అంతే. పిన తల్లి పెంపకంలోకి పోయాడు జయరాం. అమ్మకి చెల్లెలు….కొంతలో కొంత బాగానే చూసుకునేది. ఆవిడ మొగుడు మాత్రం ముక్కు పచ్చలారని జయరాంకి నరకం చూపించేవాడు. కూర్చున్నా తప్పే. నుంచున్నా తప్పే. జయరాం ని తిట్టి పోయడమే కాకుండా మరణించిన అతని తల్లిదండ్రులను కూడా చులకనగా మాట్లాడేవాడు. జయరాం ఉక్రోషంతో కుతకుతమని ఉడికి పొయ్యేవాడు. అంతకు మించి ఏం చెయ్య గలడు గనుక? మొగుడి దాష్టీకాన్ని జయరాం పిన తల్లి నివారించ లేక పోయింది. ఆవిడ పరిమితులు ఆవిడవి. వీధి చివర నివాసం ఉన్న లెక్కల మాస్టారు నరసింహులు ఆదుకోక పోతే జయరాం ఏమయ్యేవాడో ఊహించ లేం. ఆయన చలవ తోనే పన్నెండు సంవత్సరాలప్పుడు జయరాం గవర్నమెంటు హైస్కూల్ లో ఆరో తరగతి లో చేరాడు ….ముందు ముందు ఒక పూట అన్నం పెట్టి  పుస్తకాలూ అవీ కొనిచ్చి చదువు చెప్పేవాడు నరసింహులు మాస్టారు. తొమ్మిదో తరగతికి వచ్చే సరికి జయరాం పినతల్లి ఇంట్లోంచి నరసింహులు మాస్టారి ఇంటికి మారి పోయాడు. నరసింహులు మాస్టారి ఒక్కగానొక్క కూతురు సుందరి. 

జయరాం కంటే ఎనిమిదేళ్ళు చిన్నది. నరసింహులు మాస్టారి అండ, ఆదరణతో  జయరాం గతమూ దాని తాలూకు విషాదమూ మరుగున పడ్డాయి. డిగ్రీ అయి పోగానే జయరాం ఉద్యోగం చూసుకోవాలనుకున్నాడు.“అదేంటి జయరాం ......డిగ్రీ చదువూ ఒక చదువేనా? పీ జీ  చెయ్యి... పై చదువులు చదివిన ప్రయోజనం జీవితాంతం ఉంటుంది" అన్నారు నరసింహులు.

“ఎందుకు సార్... నా మీద ఇంకా ఖర్చు...." జయరాం కి అంతకు మించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు నరసింహులు మాస్టారు.

"లెక్కలు సరి చూసుకుంటూ పరిష్కారాలు చెయ్యడానికి జీవితం గణితం కాదు జయరాం....జీవితమంటే ఒక వాస్తవం....అనుభవాలు పేర్చుకుంటూ కొనసాగడం...." నరసింహులు  అన్నాడు. శిరసావహించాడు జయరాం.

ఎమ్మెస్సీ, ఆ పైన పీహెచ్ డీ కూడా ముగించాడు. జయరాంకి 27, సుందరికి 19 ఉండగా హఠాత్తుగా నరసింహులు గుండెపోటుతో కాలం చేసారు. డిగ్రీ ఫైనల్ చదువుతున్న సుందరి

నరసింహులు మాస్టారి పెన్షను, ఉన్న  సొంతిల్లూ చూసి సుందరిని పెళ్లి చేసుకుందుకు బంధువులు ముందుకు వచ్చారు. సుందరి ఒప్పుకోలేదు.

"ఎవరు వీళ్ళంతా.... ఇప్పుడు నాకు పెళ్ళేమిటి?" సుందరి ఒకింత నిర్లిప్తంగా అంది.

"ఒక్కదానివి....“ జయరాం అన్నాడు.

"ఒక్కదాన్ని ఏమిటి? నువ్వు వున్నావుగా"....

"సారు పోయాక ఇంకా నేను......."

"మా ఇంట్లో ఉండేందుకు అవదు....అంతేనా?"......సూటిగా అడిగింది సుందరి.

"సరిగ్గానే అర్థం చేసుకున్నావ్........." జయరాం

"లెక్కల మాస్టారి కూతుర్ని కదా...."

"నీ పెళ్లి ఈస్ ఈక్వల్టు నా నిష్క్రమణం " జయరాం పరాచికమాడినట్టు అన్నాడు. 

"ఈ ఈక్వేషన్ కి ఇంకో సొల్యూషన్ ఉంది......"

"??????......"

"నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం......." విస్తుపోయాడు జయరాం.

వాళ్ళ పెళ్లి జరిగి పోయింది. వాళ్ళ ఒంటరితనమే వాళ్ళని జత కలిపింది. కాలం పరుగులు తీస్తూనే ఉంటుంది. పీహెచ్ డీ చేసిన విశ్వవిద్యాలయంలోనే అసిస్టెంటు ప్రొఫెసర్ అయ్యాడు జయరాం .సుందరి జయరాంని తండ్రి ని  చెయ్య లేక పోయింది చాల ఏళ్ళు….పెళ్ళైన పద్నాలుగేళ్ళకి సుందరి నెల తప్పింది.. జయరాం జీవితం లో ఇదొక మెరుపు. తల్లీ తండ్రీ తనకి ఊహ రాక ముందే  పోయారు. ఇప్పుడు తన రక్తం పంచుకుని అంకురించబోయే బిడ్డ కోసం జయరాం ప్రతిక్షణం ఎదురు చూసాడు. నీరు విలువేంటో దాహం వేసిన వాడికే తెలుస్తుంది. చీకట్లో కూరుకున్నప్పుడే  వెలుతురు అవసరం గుర్తింపు గుర్తింపు కొచ్చేది. సంతోషమూ అంతే. ఎదురు చూసాక దొరికే ఆనందం అలవికానిది. బిడ్డ కోసం సుందరి, జయరాం ఎంత తపన పడ్డారో వాళ్ళకే తెలుసు. సుందరి తల్లి కాబోతున్నందుకు వాళ్ళ ఉద్వేగం ఉరకలు వేసింది.

భూగోళం యావత్తూ ఏదో పరివర్తన చెంది పోతున్నంత సంబర పడి పోయారు దంపతులు. ఆకాశం ఇంకొంత నీలం పులుముకున్నట్టు, పుడమి మరింత హరితమయినట్టు.....

ముసురుకున్న దైన్యానికి వీడ్కోలిచ్చి ఒక పునరుజ్జీవనాన్ని స్వాగతించుకున్నారు జయరాం, సుందరి. పుట్టబోయే బిడ్డ ను స్వాగతించడానికి వాళ్ళు నిత్యం సన్నాహాలు చేసుకునేవాళ్ళు. ప్రణాళికలు రచించుకునేవాళ్ళు. దేనికీ లోటు లేకుండా బిడ్డకు అన్నీ అమరించాలని స్వప్నాలు లిఖించేవాళ్ళు.

"మనం మన కోసమే జీవిస్తున్నామా?"....ఒక రోజు జయరాం సుందరిని ఆప్యాయంగా అడిగాడు.

"మీ కథ నాకు తెలీదు గాని.... నేను మాత్రం విలాసిని కోసమో విధాత కోసమో బ్రతుకుతున్నాను ...." సుందరి మురిపెంగా అంది ఏదో విధాన ప్రకటన చేస్తున్నట్టు.

"విలాసిని? విధాత?...వీళ్ళెవరు?"....అడిగాడు జయరాం...

"ఆడపిల్లయితే విలాసిని......మగ వాడయితే విధాత".....హాస్యమాడింది సుందరి. విలాసిని పుట్టాక జయరాం సుందరిలకి కూతురు తప్ప వేరే లోకమే లేక పోయింది. అపురూపంగా పెంచి పెద్ద చేసారు. ప్రతి ఘడియా కూతురి కోసమే గడిపారు. విలాసిని కాలేజికి వచ్చింది. అందాల భరిణె ఇప్పుడు విలాసిని. ఆమె లోకం కూడా వేరే అయ్యింది. ఇంటర్నెట్, సోషల్ నెట్ వర్క్ లు, స్నేహితులు, చాట్ లు, పార్టీలు....దూరం పెరిగింది. ఏదో నెపం చేసుకుని  తల్లిదండ్రుల సమక్షం నుండి పరోక్షం లోకి జారుకోవడం విలాసినికి అలవాటు అయ్యింది. గంటల కొద్ది మొబైల్ చెవికి ఆనించుకుని అతి  మంద్ర స్థాయిలో ఒకింత సిగ్గు పడుతూ చిలిపి తనం ప్రకటిస్తూ ఎవరితో మాట్లాడుతుందో,ఏ సంగతులు దొర్లుతాయో, రిటైరు అయిన ప్రొఫెసర్ జయరాంకి గాని, సాధారణ గృహిణి  సుందరికి గాని అర్థం అయ్యే ప్రసక్తే లేదు. అర్ధ రాత్రి ఎప్పుడో లేచి కూర్చుని అడిగేది సుందరి-" ఇదేవిటండీ ఇది ఇలా తయారయ్యింది-మనం దీనికి స్వేచ్చ ఇచ్చి పాడు చేసామా?“ అని

“ఒకే లా మనకి ఇష్టమైనట్టుగా సవ్యంగా సాగక పోవడమే జీవితం ప్రతి లాభం వెనక ఒక నష్టం ఉంటుంది”- సర్ది చెప్పే వాడు జయరాం.  
రాత్రిళ్ళు ఆలస్యంగా ఇల్లు చేరుకునేది విలాసిని..

"ఎందుకమ్మా ఇంత ఆలస్యం అయింది..." జయరాం

"ఫ్రెండ్స్ తో లేటయ్యింది నాన్నా...."

"లేట్ అయిందనే నేనూ అడిగేది ...."

"పార్టీ జరిగింది డాడీ"

"మొన్నెప్పుడో పార్టీ అన్నావ్?"

"ఈరోజు ఇంకోరు ఇచ్చార్లే డాడీ"

"ఇన్ని పార్టీలు, ఇంతలేసి ఆలస్యాలు....?"

"నీకూ నాకూ మధ్య నలభై ఏళ్ళు తేడా ఉంది నాన్నా..."

నిర్లక్ష్యంగా పడగ్గది తలుపు ధడేల్ మని వేసేసుకున్న కూతురు…… శరాఘాతం ఎప్పుడు ఏ మూల నుంచి తగుల్తుందో తన మానాన తానున్న కోకిలకేం తెల్స్తుంది....

"ఈ నెలాఖరుకు అమెరికా వెళుతున్నాను నాన్నా"

"ఇంకా పది రోజులేగా ఉంది"

"ఏర్పాట్లు అన్నీ అయి పోయాయి"

"హైయర్ స్టడీస్?"

"లేదు ఒక అమెరికన్ సిటిజెన్ ని పెళ్లి చేసుకుంటున్నాను...అక్కడే ఉండిపోతాను"

"ఇదంతా ఎప్పుడయింది? నాతో మాటయినా అనలేదే...?"

"అన్నీ నిన్న మొన్ననే ఒక కొలిక్కి వచ్చాయి..."

"ఎన్నాళ్లకొకసారి ఇక్కడికి వొస్తావ్?....."

"చెప్పలేను"

"అంటే.....ఎప్పటికీ నువ్వు అక్కడేనా...."

. . . . . . . . . . . . . . .”

***

"ఇది ఇలా ఎందుకు చేసిందండీ.....మనం ఏం తక్కువ చేశాం దానికి...?" మళ్ళీ గొణిగింది సుందరి. ఆప్యాయంగా సుందరి భుజం చుట్టూ చెయ్యి వేసాడు జయరాం. ఆ స్పర్శలో మాటలు వెల్లడించ లేని ఊరడింపు ఉంది.

"సహనమూ జ్ఞానమూ ఒకటే సుందరీ… అయినా విలాసిని ఏం చేసింది కనుక? తాను సరిగ్గానే చెప్పింది……నలభయ్ ఏళ్ళ వయసు తేడా ఉంది తనకీ మనకి….”

మౌనంగా ఉండి పోయింది సుందరి…

“బయలుదేరదామా... ఈ పాత కారు మార్చి ఏదైనా వేరే బ్రాండు కొనాలనుకున్నాం. రేపు నీకు ఆర్తోపెడిక్ డాక్టరు అప్పాయింట్మెంట్ ఉంది.నేను బీపీ చెక్ చేసుకోవాలి... రాస్తున్న ఆత్మకథ ఇంకో యాభై పేజీలు ముగించాల్సి ఉంది....." లేవదీసాడు సుందరిని జయరాం.......బ్రతుకు పుస్తకం లో మరో అధ్యాయం ఆరంభిస్తూ...వెలుగు ఎల్లెడలా పరచు కుంటూ ఉంది.....!

మరిన్ని కథలు
baadhyata