Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue282/742/telugu-serials/katyayani/katyayani/

 

(గత సంచిక తరువాయి)... ఆమె తండ్రి వంక, తల్లి వంక ఒక సారి చూసి " మాది ముగ్గురు సభ్యులతో కూడిన చిన్న ఐకమత్య కుటుంబం. ఇన్నాళ్లూ మేమందరం ఆనందం కలిగినా, దుఃఖం కలిగినా మేమే పంచుకున్నాం. అలాంటిది పెళ్లి పేరుతో వీళ్లకి, ఈ ఇంటికీ నేను దూరమై పోవడం ఎలా ఉంటుందో ఊహించండి.

మన సంప్రదాయాలు మగ వాళ్లకే పెద్ద పీట వేస్తాయి. ఏది చేసినా వాళ్ల కోసమే. ఇంట్లో ఒక మగ పిల్లాడుంటే, వాడు చదువుకుంటే తల్లి దండ్రుల్ని చూసుకుంటాడు. అదే ఒక్కతే ఆడపిల్లుండి, ఆమెని చదివిస్తే, ఆమె పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లి పోతే, కష్టపడి పెంచి, చదివించి, పెద్ద జేసిన వాళ్ల గతి ఏం కావాలి? ఇదేం ధర్మం? ఇదేం సంప్రదాయం. నేను సంప్రదాయానికి ఎదురీదాలని ఈ మాటలు మాట్లాడడం లేదు. మా నాన్న గారు అలా నన్ను పెంచ లేదు.

సంప్రదాయ వాది గానే పెంచారు. కాక పోతే అవసరమైన ఆలోచనలతో పెంచారు. కమలాకర్ గారూ, నేను పెళ్లి చేసుకున్నాక కూడా వీళ్ల యోగ క్షేమం కనుక్కోడానికి, అవసరమైతే సహాయం చెయ్యడానికీ పుట్టింటికి వస్తాను. కాణీ కట్నం, కానుకలు వద్దన్నారంటే మీ మనసు వైశాల్యం నాకు అర్థమైంది. ఈ విషయంలో కూడా ఎటువంటి ఆంక్షలూ లేక పోతే, మా అమ్మా నాన్నలకు మీరు నచ్చితే, నాకేమీ అభ్యంతరం లేదు" ఆంది.

అచ్యుత రామయ్య గారు కూతురి వంక మెచ్చికోలుగా చూస్తే, యశోదమ్మా, రాజారావు గారూ ఆశ్చర్యంగా చూశారు. కమలాకర్ మాత్రం "నాకేమీ అభ్యంతరం లేదండీ" అన్నాడు నవ్వుతూ.

"మాకో మూడు రోజులు సమయమివ్వండి. ఆలోచించుకు చెబుతాం"అన్నాడు అచ్యుత రామయ్య గారు.

"అలాగేనండి..మీ నుండి మంచి వార్త వింటానన్న నమ్మకం నాకుంది" అంటూ లేచాడు కమలాకర్.

"అమ్మా కాత్యాయని అతను నీకు నచ్చాడా, కళ్లు లేని అతని తల్లికి నువ్వు సేవలు చేయాల్సొస్తుందేమో, నీకు అంగీకారమైతే మనం ముందుకు వెళదాం. అతను రాజా రావు గారింట్లో ఉంటాడని, మంచి వాడనీ ఆయనే చెబుతున్నాడు. అబ్బాయి బావున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అన్నింటి కన్నా ముఖ్యంగా నిన్ను ఎంచుకుని కోరి వచ్చాడు. అందుకని నాకు నో చెప్పడానికి కారణాలేం కనిపించడం లేదు" అన్నాడు.

"నిజమేనండీ, ఇద్దరి ఈడూ-జోడూ కుదిరింది. ఇంక ఆలస్యం చేస్తే మనకే నష్టం" అంది యశోదమ్మ.

"నాన్న గారు. మనిషికి మనిషి సాయం అని మీరే అన్నారు. పాపం పరిస్థితులు పెట్టిన పరీక్షలో డస్సి పోయి ఓదార్పు కోరుకుంటున్నారు. నా పెళ్లి కోసం మీరు ఎవరికైనా కట్న కానుకలు ఇవ్వాల్సొస్తుందేమో, ఉన్న ఆ కాస్త డబ్బు పోగొట్టుకుంటే రేపు మీ వృద్ధాప్యాన ఎలా అనే మనో క్లేశం నన్ను నిత్యం వెంటాడేది. డబ్బుకు ప్రాధాన్యమివ్వకుండా మనిషికీ, మనసుకూ ప్రాధాన్యమిచ్చే అతని భావాలు నాకు నచ్చాయి. కాదనే అభ్యంతరం ఏం కనిపించడం లేదు" అంది.

"అయితే రేపు నేను రాజా రావు గారికి, కమలాకర్ వాళ్ల సంబంధం నచ్చిందనీ, వాళ్లకి తెలియ జేయమని చెబుతాను సరేనా" అన్నాడు.
కాత్యాయని సిగ్గుతో తల వంచుకుంది. యశోదమ్మ సరే అన్నట్టుగా సంతృప్తిగా తల ఊపింది.

***

మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లగానే రాజా రావు గారి దగ్గరకు వెళ్లి "కమలకర్ వ్యక్తిత్వం మాకెంత గానో నచ్చింది, ముఖ్యంగా మా అమ్మాయికీ. అతను మాకు నచ్చాడని దయ చేసి వాళ్లకి తెలియ జేయండి" అన్నాడు.

"థాంక్స్ అచ్యుత రామయ్య గారు. మీరేమన్నా చెప్పారా అని అతను రెండు మూడు సార్లు నన్ను అడిగాడు. మిమ్మల్ని అడగడం భావ్యం కాదని నేను మాట్లాడ లేదు. దీన్నిబట్టి మీ అమ్మాయిని అతను ఎంతగా కోరుకుంటున్నాడో మీకు తెలిసిందనుకుంటా" అన్నాడు సంతోషంగా.
అచ్యుత రామయ్య గారు రాజా రావు గారి చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా, గట్టిగా నొక్కుతూ "మీరే పూనుకోక పోతే మా అమ్మాయికి ఒక మంచి సంబంధం మిస్సయ్యేది" అన్నాడు.

అయ్య వారు చెప్పిన రోజున ఫార్మల్ గా నిశ్చితార్థం జరుపుకుని, పెళ్లికి మంచి ముహూర్తం పెట్టుకున్నారు. శ్రీ వేణు గోపాలస్వామి గుళ్లోనే నిరాడంబరంగా పెళ్లి జరపాలని నిశ్చయించుకున్నారు.

మనసును ఉల్లాస భరితం చేసే కార్యం ముందున్నప్పుడు రోజులు హడావిడిగా కదిలి పోతాయి. అప్పటికే అచ్యుత రామయ్య గారూ ఇంటికి సున్నం, పేయింట్లు వేయించి, ఇంటి ముందు-శుభకార్యం ఆ ఇంటిలో జరుగుతున్న గుర్తుగా తాటాకుల పందిరేయించి పెళ్లికళ తెచ్చారు. ఎంత నిరాడంబరం అనుకున్నా, ఒక్కగానొక్క కూతురు, తనకున్నంతలో ఏ లోటూ లేకుండా అత్తారింటికి సాగనంపాలనుకున్నాడు.

అక్కడ కమలాకర్ కు కూడా కాళ్లు భూమ్మీద నిలవడం లేదు. రాజా రావు గారింటికి సున్నాలు, పేయింట్లు వేయించాడు. రాజా రావు గారికీ చాలా ఆనందంగా ఉంది కమలాకర్ తన మూలంగా ఒకింటివాడవుతున్నాడని.

కాత్యాయని అంటే గుడి అయ్య వారికి ప్రత్యేక అభిమానం అందుకే ధర్మకర్తల మండలికి ప్రత్యేకంగా చెప్పి పెళ్లికి గుడి ఇప్పించాడు.
అచ్యుత రామయ్య గారూ మొదటి పేజీ మధ్యలో వినాయకుడు అటూ ఇటూ సీతారాములు, శివ పార్వతులూ, మధ్య పేజీల్లో శుభ ముహూర్త  సమయం, సీతారాముల కల్యాణ శ్లోకంతో ఉన్న అందమైన శుభ లేఖలు అచ్చు వేయించాడు.

అచ్యుత రామయ్య గారికి, కమలాకర్ వాళ్లకూ బంధు గణం తక్కువే, ఉన్న వాళ్లకు, చుట్టు పక్కల వాళ్లకు, ఆఫీసు స్టాఫ్ కు అచ్యుత రామయ్య,కమలాకర్ లు శుభ లేఖలు పంచారు.

భోజనాల కోసం సంప్రదాయ పద్ధతిలో వండి వడ్డించే కేటరింగ్ వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చారు అచ్యుత రామయ్య గారు. పెళ్లికి కొత్త బట్టలు, నగల షాపింగ్ లతో పెళ్లి రోజు గిర్రున తిరిగి మరీ దగ్గరయింది.

ఆరోజు రాత్రి (మరుసటి రోజు తెల్లవారుజాము అవుతుంది) గం.1.30 లకు ముహూర్తం. ఉదయానే పెద్ద కారు మాట్లాడుకుని అవసరమైన సామానులతో పాటూ, అచ్యుత రామయ్య గారి కుటుంబం గుడికి బయల్దేరింది.

అటు నుంచి కమలాకర్, అతని తల్లీ అవసరమైన సామాగ్రీతో కారులో గుడికి బయల్దేరారు.

***

అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ పైవాడెందుకు? అనుకోనివి జరగకపోతే జీవితమెందుకు?? ఏం జరగబోతోంది? అందరూ ఆశించినదేనా?? తెలియాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా వేచి చూడాల్సిందే)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana