Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రతాప వెంకట సుబ్బారాయుడు

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue286/751/telugu-serials/katyayani/katyayani/

 

(గత సంచిక తరువాయి)... కమలాకర్ ఆఫీసులో తన సెక్షన్ నుంచి మరో సెక్షన్ కు వెళ్లాలంటే రెండు ఫ్లోర్లు మెట్లెక్కాలి. ఆ ఆఫీసులో లిఫ్ట్ సౌకర్యం లేదు. అదో ఎక్సర్ సైజ్ గా ఉంటుందని చక చక మెట్లెక్కేవాడు. కానీ ఈ మధ్య మెట్లెక్కుతుంటే ఆయాసం వస్తోంది. పెళ్లయిన కొత్త, పెళ్లాం మనసు పెట్టి వండే వంటలు అద్భుతంగా ఉంటున్నాయి కాబట్టి పొట్టెక్కువై అలా ఆయాసం వస్తోందనుకున్నాడు. ఒక పది రోజుల పాటు డైట్ కంట్రోల్ చేసి చూశాడు. అయినా ఆయాసం వస్తోంది. నాలుగు మెట్లెక్కే సరికి గుండె వేగంగా కొట్టుకుంటోంది. కొద్ది సేపు ఆగి మెట్లెక్కాల్సొస్తోంది. ఈ మధ్య తరచూ చెమటలు కూడా పడుతున్నాయి. ఎందుకైనా మంచిది డాక్టర్ కు చూపించుకుంటే మంచిదనుకుని రాత్రి కాత్యాయనితో చెప్పాడు.

"అయ్యో, అదేంటండి. డాక్టర్ కి చూపించుకోడం ఎంతైనా మంచిది" అంది ఆందోళనగా.

"నువ్వు గాబరా పడకు, రేపు వెళతాలే" అన్నాడు.

"ఊహూ ఇప్పుడే వెళ్లి చూపించుకుందాం. మన అపార్ట్ మెంట్ కు రెండు అపార్ట్ మెంట్స్ అవతల డాక్టర్ క్లినిక్ ఉంది. ఆయన బాగా చూస్తాడట. పక్కింటావిడ మాటల సందర్భంలో చెప్పారు" అంది.

"కాత్యాయనీ రేపు వెళదామన్నానుగా"అన్నాడు కాస్త విసుగు మాటల్లో కనబరుస్తూ.

"పక్కనే కదండీ, కాస్త తినేసి అలా వాకింగ్ చేస్తూ వెళ్లి చూపించుకుందాం. సమయానికి చెప్పకపోవడం వల్ల ఇప్పటికే ఆలస్యమైంది. డాక్టరు గారు చూసి బలానికి మంచి మందులు రాసిస్తే కాస్త ధైర్యంగా ఉంటుంది"అంది బేలగా.

"నువ్విలా హడావుడి చేస్తావనే చెప్పలేదు.. సరే వెళ్దాం లే" అన్నాడు నీరసన్గా నవ్వుతూ.

రాత్రి లైట్ గా భోజనాలు చేశాక, నడుచుకుంటూ క్లినిక్ కు వెళ్లారు.

క్లినిక్ లోపల ఒక చిన్న టేబుల్, అక్కడో రిసెప్షనిస్ట్, ఆమెకి ఎదురుగా ఒక వరసలో నాలుగు కుర్చీలున్నాయి. వాటి ఎదురుగా టీపాయ్ మీద తెలుగు, ఇంగ్లీష్ పేపర్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఉన్నాయి. ‘ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఏం తినాలి’ అన్న విషయాల మీద తెలుగులో మంచి పోస్టర్లు అతికించి ఉన్నాయి.

వీళ్లెళ్లే సరికి చివరి పేషేంట్ కూడా డాక్టరుకు చూపించుకుని, వీళ్ల ముందు నుంచే వెళ్లిపోయాడు. రిసెప్షన్ లో కన్సల్టేషన్ ఫీజు చెల్లించి, ఆమె ఇచ్చిన ఫైల్ తీసుకుని లోపలికి తీసుకుళ్ళారు.

"రండి..రండి" అన్నాడు నవ్వుతూ డాక్టర్.

డాక్టర్ పాతికేళ్ల కుర్రాడు. చలాకీగా ఉన్నాడు. అతన్ని చూసే సరికీ ఇద్దరికీ తెలియని ధైర్యం వచ్చింది.

ఆయన ఎదురుగా కూర్చుని తన సమస్య చెప్పాడు కమలాకర్.

అతను స్టేతస్కోప్ ని కమలాకర్ గుండె పైనా, వెనక్కి తిరగమని వీపు పైనా ఉంచి పరీక్షించి "మీకేమైనా సిగరెట్లు, మందు తాగడం లాంటి అలవాట్లున్నాయా?"అనడిగాడు.

"లేవండీ"అన్నాడు కమలాకర్.

"అయితే వర్రీ అవ్వాల్సినదేం లేదు. కొన్ని విటమిన్, ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తాను, అంతా సర్దుకుంటుంది. వన్ వీక్ తర్వాత ఒక సారి రండి" అన్న డాక్టర్ మాటలతో ఇద్దరి మనసులూ తెరిపిన పడ్డాయి.

***

కమలాకర్ కు రెండు రోజులు బాగానే అనిపించింది. మెట్లు కూడా రెండు మూడు సార్లు ఎక్కి దిగాడు. ఏమీ అనిపించలేదు. అదే విషయాన్ని ’మీకిప్పుడు ఎలా ఉంది?’ అని రోజూ అడుగుతున్న భార్యతో పంచుకున్నాడు.

ఒకసారి మూడో అంతస్తులో ఫ్లోర్ ఇంఛార్జ్ దగ్గరకెళ్లి కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ డిస్కస్ చెయ్యవలసి వచ్చింది. రెండు ఫైల్స్ తీసుకుని మెట్లెక్కుతున్నాడు. గుండె చిక్కబట్టినట్టు అనిపించింది. విపరీతంగా చెమటలుపట్టాయి.  మెట్ల రెయిలింగ్ కానుకుని నుంచుండి పోయాడు.
అదృష్టవశాత్తు అప్పుడే మెట్లు దిగి వెళ్లబోతున్న భాస్కర్ "ఏంటి సార్? ఏవైంది" అంటూ ఆందోళనగా కమలాకర్ దగ్గరకు వచ్చి, జాగ్రత్తగా పట్టుకుని కిందకి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు.

అందరూ చుట్టూ ముట్టారు. డి జీ ఎం వచ్చి "వాట్ హేపెండ్ కమలాకర్?"అన్నాడు. పేలవంగా నవ్వాడు కమలాకర్.

తన అసిస్టెంట్ ను పిలిచి ‘కమలాకర్ ను ఇంట్లో దింపితే, రెస్ట్ తీసుకుంటాడు. వెళ్లి ఆ పని చూడు’ అన్నాడు.

కమలాకర్ ను కార్లో ఎక్కించి, ఇద్దరు స్టాఫ్ చెరో పక్కా కూర్చుని ఇంటికి పోనిచ్చారు.

డోర్ బెల్ మోగంగానే, వెళ్లి తలుపు తీసిన కాత్యాయని తన భర్తకి చెరోపక్కా ఇద్దరు వ్యక్తులుండడం గమనించి "ఏవైందండి?"అంది ఏడుపుగొంతుతో.

"ఏం లేదమ్మా, సార్ కాస్త వీక్ గా ఉన్నారు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటారని పట్టుకొచ్చాం. అంతే" అన్నాడు వాళ్లలో ఒకతను. వాళ్లు కమలాకర్ ను ఇంట్లో సోఫా దాకా తీసుకొచ్చి, అక్కడ కూర్చోబెట్టి "మేడం మేము వెళతాం"అన్నారు.

"మీకు కనీసం కాఫీ కూడా ఇవ్వలేదు.."అంది నొచ్చుకుంటున్నట్టు.

"ఫర్వాలేదు మేడం"అంటూ వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోయాక వెనక్కి తిరిగి చూస్తే..

***

కమలాకర్ కి కలిగిన అనారోగ్య పరిస్థితి   ఏ పరిణామాలకు దారితీస్తుందో తెలుసుకోవాలంటే వచ్చేశుక్రవారం ఒంటిగంటవరకు ఆగాల్సిందే..

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్