Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope october 12th to october18th

ఈ సంచికలో >> శీర్షికలు >>

కనకదుర్గమ్మ మాయమ్మ - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

kanakadurgamma maayamma

అమ్మ గొప్పా? నాన్న గొప్పా? అని అడిగితే ఏ చెబుతాం? సృష్టిలో ఇద్దరూ సమానమే, ఇద్దరికీ ఒకే రకమైన ప్రాధాన్యత ఉంది అంటారు.
అమ్మ, అమ్మమ్మ, అక్క, చెల్లి ఇలా రకారకాలుగా స్త్రీ పురుషుడికి తన సహాయ, సహకారాలను అందిస్తోందంటే, పురుషుడేమన్నా తక్కువా? అతను కూడా నాన్న, తాతయ్య, అన్న, తమ్ముడిగా స్త్రీకి సహకరించట్లేదా అంటారు.

అమ్మ..కనకదుర్గమ్మ అంటే, నాన్న నారాయణుడు అంటారు. ఇది ఇలా సాగుతూనే ఉంటుంది కదూ! లేదు..ఎలాగంటే-
అమ్మలగన్నయమ్మ..అంటాం గాని నాన్నలగన్న నాన్న అనం. అమ్మ అంటే ప్రకృతి. ప్రకృతి మాత. ప్రకృతి నుంచి అన్నీ జనిస్తాయి. ఉద్భవిస్తాయి. మనిషికి పాఠాలు నేర్పేది కూడా ప్రకృతే! ప్రకృతి మనిషికి ప్రథమ గురువు.

శిశు జననంలో అమ్మా, నాన్నల పాత్ర అద్వితీయం. కాదనం, అయితే ఇద్దరిదీ సమాన భాగస్వామ్యం అనలేం. కారణం అమ్మ పిండం దశనుంచి పిల్లాడి దశదాకా తన ఉదరంలో దాచుకుని..అంటే తనలో భాగం చేసుకుని తొమ్మిదినెళ్ల అనంతరం ఈ ప్రపంచంలోకి జార విడుస్తుంది. తండ్రి ఆ పని చేయలేడు. అందుకే పేగు బంధం చాలా గొప్పది. మనుషులు ఏ రుణం అన్నా తీర్చుకోగలరు కాని తల్లి రుణం తీర్చుకోలేరు. తల్లి ఎంత గొప్పది కాకపోతే ‘దేశమాత’ అని దేశాన్ని తల్లితో పోలుస్తారు? ఉబుసుపోక అలా ఊరికే పోల్చలేదు. ఒక దేశంలో జనాభా పెరుగుతోందంటే ఆ దేశం జనాభాకి జన్మనిస్తున్నట్టే, వాళ్లను పెంచి పోషిస్తున్నట్టే! కడుపులో పెట్టుకుని భద్రంగా చూసుకుంటున్నట్టే!! ఒక్క తల్లి తప్ప ఎవరు అలా చేయగలరు?

హక్కులు, బాధ్యతలు అన్నవి పక్కన పెడితే ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ అన్నది మన సంస్కృతిలో భాగం. సంప్రదాయ బద్ధం. పురాణాల్లో పురుషులు స్త్రీలపట్ల ఎంత భక్తి, గౌరవం ప్రకటించేవారో మనకు తెలుసు. ఒకవేళ ఎవడైనా పురుషాధముడు తప్పుగా ప్రవర్తిస్తే ఎలా మట్టిగొట్టుకు పోయాడో కూడా మనకు తెలుసు.  ‘ఇవి స్త్రీల కోసం కేటాయించిన సీట్లు. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’ అన్న రాతలు చూడకుండానే స్త్రీలకు సరైన స్థానాలు గౌరవప్రదంగా మనం ఇవ్వగలగాలి. ఒదిగి ఉండే స్థితి నుంచి స్త్రీలు పురుషులతో సమానంగా ఎదుగుతుంటే ఈర్ష్య కాదు కలగవలసింది, చేయూతనందించి ఆకాశాన్నందేలా ప్రోత్సహించాలి.

పురాణాల్లోని రావణుడిని, కీచకుడిని చీదరించుకునే మనం, సమాజంలో ఈనాటికీ అలాంటి మదాందులను పేపర్లలో, టీ వీల్లో చూడ్డం సిగ్గుచేటు.

అసిఫాలాంటి పసి పిల్లలను సైతం వదలని రక్కస కృత్యాలను జాతిమొత్తం ఖండిస్తోంది. టీనేజ్ పిల్లను హింసించి పొట్టన పెట్టుకున్న మృగాళ్లను చూసి సభ్య సమాజం తల నేలకు వాల్చేసుకుంది. నిర్భయ చట్టం రూపు దిద్దుకుంది. దాదాపు ప్రతి ఆఫీసులోనూ లైంగిక వేదింపులు వాళ్లను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. ‘అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా ఒంటరిగా నడిచే రోజునే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్ట’ని ఆనాడు గాంధీమహాత్ముడు చెప్పాడు. దశాబ్దాల తర్వాత ఈనాటికీ అలాంటి పరిస్థితిలు మృగ్యమే! చట్టాలు కాదు కావలసింది. రావలసింది మనుషుల్లో మార్పు. 

దసరా అంటే అమ్మ పండగ. మన వృత్తికి, ప్రవృత్తికీ ఆది దేవత. పనిముట్లను ఆయుధాలుగా భావించి ఆయుధ పూజ చేస్తాం. మన జీవనగతికి, ఉన్నతికి ఆ చల్లని తల్లి కరుణే కారణం.

‘కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింటినుండ నొల్లదు సుమతీ!’ అని సుమతీ శతకకారుడు పద్య రూపంలో మనకు ఇచ్చిన గొప్ప సందేశం. స్త్రీలను ఆదరించడం, అభిమానించడం పురుషుడికి గౌరవ సూచకం. మగాడి జీవితం సంపూర్ణమవడానికి స్త్రీ సహకారమే కారణమన్నది అక్షర సత్యం. ‘ప్రతి మగాడి విజయం వెనక..’ అన్న నానుడి స్త్రీ బలం తెలిసిన వ్యక్తి నోటి నుంచి వెలువడిందే!

ఇప్పటి ఈ దసరా నుంచైనా స్త్రీలను దేవతలుగా కాకపోయినా సాటి మనుషులుగా గౌరవిద్దాం. వారి మానాన వారిని బతకనిద్దాం.
"గోతెలుగు పాఠకులకు ‘విజయ’ దశమి (దసరా) శుభాకాంక్షలు"

మరిన్ని శీర్షికలు
No one should be named disabled