Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Political Warning for Social 'Rowdies'!

ఈ సంచికలో >> యువతరం >>

ట్రెండీ ట్రెండీ పెళ్లి చూపులండోయ్‌.!

Trendy Trendy

పెళ్లంటే ఊరంతా సంబరమే.. అనేంతలా ఆకాశమంత పందిరేసి ఓ ఘనమైన వేడుక నిర్వహించడం ఒకప్పటి సందడి. ఇప్పుడు కూడా అక్కడక్కడా అలాంటి సందడి చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు పెళ్లిళ్లు కొత్త రూటులోకి షిఫ్ట్‌ అవుతున్నాయి. అమ్మాయి, అబ్బాయి ఉంటే చాలు. ఇంకెవ్వరితోనూ పని లేదు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. గుళ్లో పెళ్లి, చర్చిలో పెళ్లి, రిజిస్టర్‌ ఆపీస్‌లో పెళ్లి, ఇంకో చోట పెళ్లి ఇలా కొత్త ట్రెండ్‌ని చూస్తున్నాం. ఈ పెళ్లికి పెద్దగా పెళ్లి పెద్దలతో పనుండట్లేదు. మేము మేజర్లం కనుక అంతా మా ఇష్టం అనే ధోరణి కొంతమంది యువతలో కనిపిస్తోంది. ఏది తప్పు.? ఏది ఒప్పు.? అనేది నిర్ణయించలేని పరిస్థితి. ఉన్న చట్టాల ప్రకారం మేజర్లైన యువతీ యువకుల పెళ్లికి అడ్డు చెప్పలేని పరిస్థితి. అయితే అన్ని పెళ్లిళ్లు ఒకేలా ఉండవు కదా. కొన్ని పద్థతిగా జరుగుతున్నాయి. కొన్ని సందడిగా జరుగుతున్నాయి. కొన్ని సైలెంట్‌గా జరుగుతున్నాయి. మరికొన్ని ట్రెండీ ట్రెండీగా జరుగుతున్నాయ్‌.

అమ్మాయి, అబ్బాయి ప్రమేయం లేకుండా వారి తల్లితండ్రులు సంబంధాలు కుదిర్చేయడం తెలిసిన సంగతే. పిల్లల అభిప్రాయాలు తీసుకుని పెళ్లిళ్లు చేయడం మామూలే. అబ్బాయి, అమ్మాయి ఒకర్నొకరు ఇష్టపడ్డాక తల్లితండ్రుల అభీష్టంతో సంబంధం లేకుండా జరిగే పెళ్లిళ్లు కూడా మనకు తెలుసు. ఏదేమైనా పెళ్లి తంతు గురించి మాట్లాడుకోవల్సి వస్తే, ఇక్కడా బోలెడన్ని ప్రత్యేకతలున్నాయి. అమ్మాయిని, అబ్బాయిని ఒకచోట కూర్చోబెట్టి, ఇరువురి అభిప్రాయాల్ని విడివిడిగా తెలుసుకుని, వారిద్దరికీ పరిస్థితులు అర్ధమయ్యేలా చెప్పి, వారిద్దరి మధ్యా గాఢమైన బంధాన్ని ఏర్పర్చే ట్రెండీ పెళ్లి పెద్దలు ఇప్పుడు దీన్నొక ఉపాధి మార్గంగా మార్చుకుంటున్నారు. నిజానికి వీళ్లేమీ పెళ్లిళ్ల బ్రోకర్లు కాదు. అదే సమయంలో తల్లితండ్రుల్ని ఎదిరించి పెళ్లిళ్లు చేయడం లేదు. యువతీ యువకుల అభిప్రాయాలను తెలుసుకుని వారిద్దరూ వైవాహిక బంధాన్ని సుదీర్ఘ కాలం పాటు కొనసాగించగలరు అనే నమ్మకం కల్గించుకున్నాకే, వారిని ఒక్కటి చేసి, వారి తల్లితండ్రుల్ని ఒప్పించి పెళ్లిళ్లు చేస్తున్నారు.

పెళ్లంటే బోలెడంత సందడి కదా. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కావచ్చు. సాంప్రదాయబద్దమైన పెళ్లి కావచ్చు. సింపుల్‌గా జరిగే పెళ్లి కావచ్చు. ఒక ప్యాకేజీ అనే తరహాలో ఇరువురి బడ్జెట్‌లకు అనుగుణంగా ఈ అద్భుత ఘట్టాన్ని రక్తి కట్టిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లానే పెళ్లి పనులు చక్కబెట్టేస్తారు. పెళ్లి పెద్దల్లో వీళ్లూ ఒకరిగా ఉంటారు. పెళ్లయ్యాక కూడా, వైవాహిక జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు సులువైన పరిష్కారాలు చూపుతారు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లుగా ఈ కొత్త ఐడియాతో యువత ఒక టీమ్‌గా ఏర్పడి తమ వ్యాపకాలు తాము చూసుకుంటూ, వీలు చిక్కినప్పుడల్లా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ట్రెండీ ట్రెండీ పెళ్లి పెద్దలు అనిపించుకుంటున్నారు.

మరిన్ని యువతరం