చక చకా నడుస్తున్న వాడల్లా, చటుక్కున ఆగి “లలితా నాన్నెక్కడే” అయోమయంగా చుట్టుపక్కల చూస్తూ అడిగాడు మధు.
“భలే వారే. నాకేం తెలుస్తుందండీ. ఇప్పటి వరకూ మనతోనే నడిచారుగా”.
“అలా అంటావేంటి. సినిమా వదిలాక ఒకరి వెనుక ఒకరం నడుస్తున్నాం కదా. ఇంతలోనే ఆయనెక్కడికి వెళ్ళి పోయారు” అనుకుంటూ అక్కడి నుండి మళ్ళీ వచ్చిన దారిలో నుండే వెనకకు వెళ్ళడఒ ప్రారంభించాడు.
సినిమా అయిపోవడంతో జనం గుంపులుగా వస్తుండడంతో, సముద్రానికి ఎదురీదుతున్నంత ఇబ్బందిగా అనిపించింది. అలా వెళ్తూ ఉంటే, వాళ్ళ నాన్న దూరంగా ఓ చిన్న పాపని “ఛీ ఛీ, ఏం పేరమ్మా. మీ మమ్మీ ఏమని పిలుస్తారు నిన్ను” అంటూ బుజ్జగిస్తూ కనబడ్డారు. దాంతో కోపం నషాళానికంటింది ఆయన్ని చూస్తూనే, “ఏంటి నాన్నా ఇది, ఆ పాపని ఇప్పుడే ముద్దు చేయాలనిపించిందా మీకు” పళ్ళు కోపంగా అడిగాడు..
“ఏంటోరా. ఏం నచ్చినా లేదా నచ్చింది చేయాలనిపించినా, చుట్టు ప్రక్కలే కాదు నన్ను నేనే మర్చిపోతాను. అదో వీక్ నెస్ నాకు” చెప్పారు మూర్తిగారు మధుతో.
తర్వాత ఇల్లు చేరారు ముగ్గురూ. చేరడమే ఆలస్యం అన్నట్టు, మధు అసహనంతో ఊగిపోతూ, “బావుంది నాన్నా నీ వరస. సమయం సందర్భం ఉండొద్దూ. అయినా నీకు ఎప్పుడు ఏది మనసుకి నచ్చేస్తుందో నాకు తెలీడం లేదు. మనం ఓసారి సిటీ బస్సులో వెళ్తున్నపుడు, దేవుడి ఊరేగింపు చూసి, చెప్పా పెట్టకుండా బస్ దిగిపోయి ఎక్కడికో వెళ్లిపోయావు. నేనూ, లలితా, అమ్మా కూడా నువ్వు ఏమైపోయావో అని దిగిపోతే, ఆ డ్రైవరు ఆలశ్యమై పోతోందని బూతులు తిట్టాడు. తర్వాత బస్ వెళ్ళి పోయింది. ఓ అరగంట తర్వాత చేతిలో ప్రసాదంతో, ముఖంలో చిరునవ్వుతో ప్రసాదం మాకు ఇచ్చి, బస్సు పోతే మరో రెండు నిమిషాల్లో మరో బస్సు దొరుకుతుంది. కానీ సూర్య భగవానుడి రథ యాత్రలో పాల్గొవాలంటే మళ్ళీ సంవత్సరం ఆగాలి. అద్బుతమైన దృశ్యం. నేను కూడా కొంచెం సేపు ఆ తాడు పట్టుకుని రథయాత్రలో పాల్గొన్నాను. చాలా సంతోషం అన్నావ్. తర్వాతో సారి, షాపింగ్ అంతా అయి పోయాక అందరం కిందకి దిగాక నువ్వు కనబడ లేదు. అసలే చెల్లించాల్సిన క్రెడిట్ కార్డ్ నీ దగ్గరే ఉండిపోయింది. దాంతో నువ్వు ఎక్కడికెళ్లిపోయావో అని నేనూ మీ కొడలూ అన్నీ ఫ్లోర్లూ, మూలలూ వెతికి, అలిసి పోయి కుక్క పిల్లల్లా ఒగరుస్తుంటే, నువ్వు నింపాదిగా ఓ చొక్కా తెచ్చుకుని, ఈ చొక్కా చూశానురా నచ్చి అలా ట్రయల్ రూమ్ లోకి వెళ్ళాను అన్నారు నవ్వుతూ. అమ్మ పోయాక మరీ అన్యాయంగా తయారయ్యారు. అలా నచ్చింది వెంటనే చేసేసె ముందు మాకు ఓ ముక్క చెప్పొచ్చుగా నాన్నా” అడిగాడు ఆవేశంగా.
“అదేంట్రా అలా అంటావ్. నా స్వతంత్రం నాకు ఉండొద్దూ. నేనేమైనా చిన్న పిల్లాడినా నువ్వు నన్ను వెతకడానికి లేదా నీ పర్మిషన్ నేను తీసుకోవడానికీనూ. నేను నీ తండ్రిని. నువ్వు నాకు నాన్నలా మాట్లాడకు. నా కోపంతో ఆటలాడకు”. అని ఆయన అనగానే, మధు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయాడు, తన తల్లి చివరి రోజుల్లో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆమెకి కేన్సర్ ముదిరి పోవడంతో కీమో తెరిఫీ కూడా కుదరలేదు. ఇంట్లో ఆమె ఎప్పుడూ ఓ మాట చెబుతూండేది. “ఒరేయ్ మధూ, నా తరువాత మీ నాన్నగారిని కొడుకులా కాదురా ఓ నాన్నలా చూసుకో. ఆయనకి నచ్చితే ఆగరు. నచ్చకపోతే దాన్ని అసలు అంటనే అంటరు. ఆయనిది చిన్నపిల్లల మనస్తత్వం రా. ఆయన మేధావే. కానీ ఒకరిలో ఒక వైపు వారిని గొప్పగా ఆవిష్కరిస్తే, మరో వైపు వారిని తక్కువగా చేసిపారేస్తుంది. నాణానికి రెండో వైపులా. నే చెప్పేదేవిటంటే, నువ్వే మీ నాన్నకి నాన్నవి కావాలాఇ. ఆయన కోపాన్ని సహించు. ఆయన మాటని గౌరవించు. ఆయన అల్లరి భరించు. నీ తండ్రి రుణం తీర్చుకో. నువ్వు నేటి తరం కొందరు కొడుకుల్లా ఉండకూడదనేరా నా ఆవేదన. నువ్ ఓ మాటంటే కోడలు కూడా మరో మాట అనొచ్చు. కనుక నువ్వు ఆయన్ని ఎప్పుడూ నీ భార్య ముందు అగౌరవ పరచకు. అలా ఉంటానని నాకు మాట ఇవ్వరా. ఇదే నా చివరి కోరిక. మరిచి పోకు” అని మాట తీసుకుందామె. అంతా గుర్తుకు వచ్చాక అమ్మా. అని పైకి అని కోపం చల్లార్చుకుని మనసులోనే అంకెలు లెక్కపెట్టాడు మధు. తర్వాత, కొంచెం ప్రశాంతంగా “నాన్న కనీసం ఆ సెల్ ఫోన్ అయినా దగ్గర పెట్టుకో నాన్నా. ప్లీజ్”. అని మాత్రం చెప్పాడు.
“వద్దురా. అది పెట్టుకుంటే ఎక్కడున్నావ్. త్వరగా రా. లేదంటే ఆఫీస్ నుండి ఫోన్ చేసి మార్కెట్ కి వెళ్ళి ఇవి పట్రా అవి పట్రా అంటావ్. అయినా ఫోన్ నాకు పడదురా. చెవి దగ్గర పెట్టుకోగానే మైగ్రైన్ హెడ్ ఏక్ వస్తుంది. కనుక సారీ మై సన్” చెప్పి అక్కడి నుండి వెళ్ళి పోయారు మూర్తి గారు.
మరుసటి రోజు ఆఫీస్ నుండి వచ్చిన మధుతో లలిత , “ఏవండీ మావయ్య గారు పొద్దుననగా బయటికి వెళ్లారు. ఇంకా ఇల్లు చేరలేదు. వాళ్ళ స్నేహితులకి ఫోన్లు చేశా. అందరూ రాలేదనే అన్నారు” చెప్పిందామె. గాబరాగా.
“ఏం పర్లేదు లలితా ఏ కొత్త స్నేహితుడి ఇంటికో వెళ్ళుఒటారు, అంతే”. అని మధు అంటుండగానే మూర్తి గారు ఇంటికి వచ్చారు. ఆయన్ని చూస్తూనే “ఏంటి నాన్న, పొద్దుననగా వెళ్ళి ఇప్పుడా రావడం. మీ కోడలు ఎంత కంగారు పడిందో తెలుసా”.
“ఏం లేదురా నా బాల మిత్ర ఒకడు చెన్నై నుండి మన వైజాగ్ వస్తే వాడికి సెండ్ ఆఫ్ ఇద్దామని రైల్వే స్టేషన్ కి వెళ్ళా. బోగీలో వాడితో మట్టాడుతుండగానే బండి కదిలి పోయింది కూడా తెలియలేదు. సరే లెమ్మని అనకాపల్లిలో దిగా. తీరా చూస్తే నా పర్స్ లేదు. నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు. భలే ఇబ్బంది అనిపించింది. అందుకే, నువ్ చెప్పినట్టే నా దగ్గర ఓ సెల్ ఉండాలిరా” చెప్పారు మూర్తి గారు.
ఆ మాట విన్న మధుకి, మండుటెండలో మావిడి రసం తాగినంత హాయిగా అనిపించింది.దాంతో సంతోషంగా, “సరే నాన్నా నే తెచ్చిపెడతాను." చెప్పాడు.
“కానీ నాకు సెల్ పడదుగా. అందుకే దీనికి ఓ పరిష్కారం ఆలోచించా. అప్పుడు నువ్ నేను ఎక్కడున్నా ఫోన్ సాయంతో తెలుసుకోవచ్చు”. చెప్పాడు.
“అదెలా!”. అని ఓ క్షణం ఆలోచించి, “ఓహో అర్దమైంది నాన్నా. ఇంటర్నెట్ వేయించి, గూగుల్ మేప్ ఆన్ లో ఉంచుతావ్. దాంతో నీ లొకేషన్ నేను ఈజీగా ట్రేస్ చేయొచ్చు. బావుంది నాన్నా”.
“అబ్బా మరీ అంత పాత కాలం వాడిలాగా ఆలోచించకురా. అని కొంచెం మొహమాటంగా అటు పక్కకి తిరిగి. నేను అని ఓ క్షణం ఆగి, నేనే నీకు ఓ పిన్నిని తెద్దామనుకుంటున్నానురా. అపుడు ఆమె సెల్ ఫోన్ కి నువ్ ఫోన్ చేసి నేను ఎక్కడున్నదీ తెలుసుకోవచ్చు. ఎలా ఉంది నా ఐడియా." అడిగారు మూర్తిగారు.
ఆ మాట విన్న మధు భార్య ముఖం మాడ్చి విసురుగా లోనికి వెళ్లి పోయింది. మధు కూడా అతన్ని, ఈ వయసులో ఏంటి నాన్నా అందామనుకున్న వాడల్లా ,ఓ క్షణం తన తల్లి ఫోటో వైపు చూస్తూ ఉండి పోయాడు. అప్పటికే మధు కళ్ళు కొంచెం మసకబడి, వినికిడి రాను రాను తగ్గిపోతూ, అంతా నిశ్శబ్దంగా అనిపిస్తోందతనికి.
“అమ్మా, నాన్నకే నాన్న అవుతానని నీకు తేలికగా మాట ఇచ్చేసాను. కానీ, నిలబెట్టుకోవడం ఇంత కష్టమా. నా నిశ్చితార్థం అయి పోయాక, పెళ్లి రెండ్రోజుల్లో అనగా నేను ఓ అమ్మాయిని ప్రేమించాను అనగానే, నాన్న నన్ను ఓ మాట కూడా అనకుండా, నిన్ను ఒప్పించి మరీ సరే అని అన్నారు. నేను ఓసారి టెన్త్ క్లాసులో ఇంట్లో చెప్పకుండా సినిమాకి వెళ్ళి వచ్చాను. పైగా నా మెడలొ బంగారు గొలుసు కూడా పోగొట్టాను. నువ్వు తిడుతుండగానే నాన్న అడ్డుకుని పోనీలే అని నన్ను కొంచెం మందలించి వదిలేసారు.
ఇంటికొచ్చిన వారు అడిగినా అడక్క పోయినా, మా అబ్బాయి ఇంజినీరింగ్ చదువుతున్నాడండీ అని గొప్పగా చెప్పుకునే వారు. నాకు ఉద్యోగం వచ్చినపుడు, ఆయన మన అపార్ట్ మెంట్ మొత్తానికి స్వీట్స్ పంచారు. అదీ నాన్న మనసు. కనుక నాన్నకే నాన్న అవడం అసాధ్యం. నాన్న నాన్నే. కనుక, ఆయన ఏం చేసినా ఓర్పు వహిస్తానమ్మా. కనీసం ఆయన కోరుకున్నది గౌరవించి కొడుకుగా నా రుణం కొంతైనా తీర్చుకుంటాను. ఆయనికంటూ ఈ వయసులో ఓ తోడు ఉండడం కూడా మంచిదే కదా అనుకుంటూ మౌనంగానే సరే అన్నట్టుగా తలాడించాడు.
|