Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sruti tappina ragam

ఈ సంచికలో >> కథలు >> ఎండమావి

endamaavi

రోజూ  ఉదయం ఎంతో హుషారుగా వాకింగ్ చేయడం నా అలవాటు. కానీ ఆ రోజు మాత్రం  అన్య మనస్కంగా మార్నింగ్ వాక్ కి బయలుదేరాను.

అంతకు ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన పదే పదే నా మనస్సులో మెదలసాగింది.

మా అబ్బాయి ,కోడలు ఇద్దరూ చెరో పక్కనుంచి నన్ను పరుష పదజాలంతో దూషించారు.

కోడలు నన్ను మాటలనడం నాకు కొత్త కాదు. అది కూడా  నా భార్య పోయిన తరువాత ఏదో నెపంతో నన్ను విసుక్కోవడం మామూలు అయిపోయింది.నేను గట్టిగా చెప్పలేక కాదు గాని,  ఇంట్లో అనారోగ్య వాతావరణం సృష్టించడం ఇష్టం లేక నోరు మూసుకుని కూచుంటున్నాను.

తిట్టో, కొట్టో రెండుపూటలా కాఫీ, తిండి నా మొహాన్న పడేస్తుంది కోడలు.అదే మహా భాగ్యం అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను.
అసలు అమ్మాయి , అల్లుడు అమెరికా రమ్మని ఎన్ని సార్లు చెప్పారో!!?? కానీ నాకే పుట్టిన ఊరు, దేశం వదలి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే ఉండిపోయాను. నిజం చెప్పాలంటే నన్ను కొడుకు కంటే అల్లుడే ప్రేమగా చూసుకుంటాడు. గౌరవిస్తాడు. కానీ ఆ మాట నేను ఎవ్వరి దగ్గర అనను.నామోషి !!??

కానీ నిన్న మాట్లాడినట్టు మా అబ్బాయి ఎప్పుడు మాట్లాడలేదు.అంతలేసి మాటలు ఎప్పుడు నన్ను అనలేదు. నిజానికి నిన్న నా కొడుకు,కోడలి  ప్రవర్తననికి , మాటలకి నా పరిస్థితిలో ఉన్న ఇంకెవరన్నా ఆత్మ హత్య చేసుకునేవారు. కానీ నేను అంత సున్నితత్వం కల వాణ్ణి కాదు .  పరమ  మొండి ఘటాన్ని!!??

ఒక ముఖ్యమైన జిల్లాకి కలెక్టర్ గా పని చేసి, తరువాత రాజధానిలో అత్యున్నత పదవులు ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన నన్ను ముఖ్య మంత్రి సహా  అందరూ ఎంతో మెచ్చుకునేవారు.ఒకసారి ప్రధాన మంత్రి వచ్చిన సందర్భంలో, అందరి ముందు ముఖ్యమంత్రి, నన్ను ప్రశంసలతో ముంచెత్తడం నా జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి. ఉద్యోగిగా అంతటి విజయం సాధించిన నాకు ఇంటిలో ఏనాడూ సరియిన గౌరవం దక్కలేదనే చెప్పాలి.నేను రచ్చ గెలిచాను గాని ఇంట ఓడిపోయాను. అయితే అన్ని వేళలా నా మొండి తనమే నాకు తోడూ,నీడా,రక్షగా నిలిచింది !!??

నా భార్య బ్రతికున్న రోజులలో ఏనాడు నన్ను ఒక భర్తగా గౌరవించలేదు. ఎప్పుడూ ఏదో  ఊహాజనితమైన అసంతృప్తితో నాకు నరకం సృష్టించేది. బయట అందరి చేత ఎంతో మన్నన పొందిన నేను ఎప్పుడూ ఆవిడ  ఛీత్కారాలు, పుల్ల విరుపు మాటలు భరించవలసి వచ్చేది. అయితే ఉద్యోగంలో ఉన్న రోజులలో నాకు పెద్దగా బాధ అనిపించేది కాదు. కాలం తెలయకుండా పరిగెత్తేది. కానీ పదవి విరమణ తరువాత  ఇంటిలో పోరు భరించడం కష్టం అయిపోయింది. భగవంతుడు ఎప్పుడు తీసుకు పోతాడా అని నేను ఎదురు చూస్తుంటే ఆవిడ అకస్మాత్తుగా పోయింది. విధి వైపరీత్యం అంటే అదేనేమో!!??

తరువాత నేను ఒక్కడిని ఉంటానంటే కొడుకు, కూతురు వినలేదు.కూతురు తనతో అమెరికా వచ్చెయ్యమంది.నేను సున్నితంగా తిరస్కరించాను.  కూతురి ప్రేమ స్వచ్చం అయితే కొడుకు ప్రేమలో స్వార్థం ఉందనిపించింది.లంకంత కొంప,పెన్షన్, డిపాజిట్ ల  మీద  వడ్డీలు ఇవన్నీ చాలా వరకు అతని వ్యాపారానికి పెట్టుబడులు అని గ్రహించి, తను కూడా వేరే  వెళ్ళి పోకుండా మా ఇంటిలోనే
ఉండిపోయాడు. అదికాక భార్య ఉద్యోగస్తురాలు కనుక ఇంటికి, తన కొడుకికి    నేను కాపలాగా  పడి ఉంటానని అతనికి తెలుసు.
ఏనాడు కూడా ప్రేమగా నన్ను “నాన్నా” అని పిలిచిన పాపాన  పోలేదు!!??”లోక సహజం” అని నవ్వుకున్నాను.అయితే నన్ను అనవసరంగా ఏమీ అనే వాడు కాదు.అదే సంతోషం.

కానీ నిన్న రాత్రి చాలా అన్నాడు. నేను పెద్ద ఐ ఏ ఎస్ ఆఫీసర్ అయి ఉండి ఊడ పొడిచింది ఏమి లేదు అని, అందరి పిల్లలు కార్లలో తిరిగితే, తాము మాత్రం బస్సులలో వెళ్ళేవాళ్ళమని, గవర్నమెంట్ స్కూల్స్ తప్ప తమకు గతి లేదని,నీతి నిజాయతి పేరుతో నా చాతకాని తనాన్ని కుటుంబం మీద రుద్దానని, ఒక సరదా సంతోషం లేదని దెప్పి పొడిచాడు.తన తల్లిని బ్రతికున్నంత కాలం సుఖ పెట్టడం చాత కాలేదని  ఏర్వాలు పూర్వాలు ఎత్తడం మొదలు పెట్టాడు.

ఆఖరకి మనవడికి మంచి స్కూల్ లో సీట్ ఇప్పించడం చేత కాలేదని ఏవగించుకున్నాడు. ఇక కోడలు సరే సరి.ఆవిడ నోటికి హద్దు పద్దు లేకుండా పోయింది.

అప్పడికి మా మనుమడు దగ్గరే ఉన్న ఒక కాన్వెంట్ లో యు కే జి వరకు చదివాడు. వాడికి   ఊరిలోనే మంచి పేరున్న ఒక  స్కూల్ లో ఒకటో క్లాసు   సీట్ ఇప్పించమని నా కొడుకు నాకు చెప్పి వారమయ్యింది.

ఆ స్కూల్ యజమాని నాకు పరిచయం లేదు. నేనా రిటైర్ అయిపోయాను.”అథారిటీ ఫర్గెట్స్  ఏ డైయింగ్ కింగ్” అనే సామెత మా నాన్నగారు తరుచుగా ఉదహరిస్తూ ఉండేవారు. అది నేటి రోజులలో నూటికి నూరు పాళ్ళు నిజం.

స్కూల్ యజమానికి ఫోన్ చేసి నేను ఫలానా అని చెప్పాను. అతను మీటింగ్ లో ఉన్నానని తరువాత ఫోన్ చేస్తానని చెప్పాడు. అది జరిగి నాలుగు అయిదు రోజులు అయ్యింది. అతను మరలా ఫోన్ చేస్తే ఒట్టు. ఏదో నేను  కూడా ఆ సంగతి అంత  శ్రద్ధ పట్టలేదు.  కానీ కొడుకు, కోడలు ఆ విధంగా మాట్లాడవలిసినంత ఘోర అపరాధం ఏమీ చెయ్య లేదు నేను. ఆ రోజు ఎలాగు అయినా నేను స్కూల్ కి వెళ్లి  ఆ స్కూల్ యజమానిని కలవాలని నిశ్చయించుకున్నాను.

నేను వెళ్ళేసరికి స్కూల్ లో జనం బాగా ఉన్నారు.అందరు వాళ్ళ వాళ్ళ పిల్లలని చేర్చడానికి ఎంత ఆశగా అక్కడకి వచ్చారు.నేను విజిటింగ్ కార్డు, స్కూల్ ఓనర్ కి ఇమ్మని, లోపలకి పంపించి, నా కోసం పిలుపుకి, ఎదురు చూస్తున్నాను. గంట గడిచింది. రెండు గంటలు గడిచాయి. ఊహు. నాకు పిలుపే రాలేదు.నాకు నవ్వు వచ్చింది. నేను పని చేసే రోజులలో నా కోసం జనం  గంటల తరబడి వేచి ఉండే వారు .ఇప్పుడు పరిస్థితి తిరగబడింది.

స్కూల్ సెక్రెటరీ  దగ్గరకు వెళ్ళి అడిగాను. నేను ఫలానా అని చెప్పి  పరిస్థితి ఏమిటి అని విచారించాను.“మీరు ఎవరు అయినా సర్ పిలిచేవరుకు మేము ఏమి చెయ్యలేం” అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు సెక్రెటరీ.నాకు తల కొట్టేసినట్లయ్యింది. కానీ కొడుకు, కోడలు గుర్తుకు వచ్చి నోరు మూసుకున్నాను. కృష్ణ పరమాత్మ కి సాక్షాత్తు తండ్రి అయిన వసుదేవుడికి తప్పలేదు గాడిద కాళ్ళు పట్టుకోవడం. ఇక నేను ఎంత !!??

కాసేపటి తరువాత నన్ను ఎలాగైనా ఒకసారి పంపించమని సెక్రెటరీ ని  బ్రతిమాలాను.కానీ ఫలితం శూన్యం. ఏమీ  చేసేది లేక కూచుండి పోయాను.కొంత సేపటకి ఎవరో ఒకతను  చావు కబురు చల్లగా చెప్పాడు. ఆ రోజు ఎవ్వరితో మాట్లాడం కుదరదు అని పెద్దాయిన చెప్పాడట !!??కోపం నిగ్రహించుకుంటూ “మరలా ఎప్పుడు రావాలి!!??” అని అడిగాను.మరలా మరుసటి రోజు ప్రయిత్నించమని ఉచిత సలహా ఇచ్చాడు సెక్రెటరీ.

“పోనీ అప్పాయింట్మెంట్ ఏమైనా........” ఏదో అనబోతున్న నా మాటలను మధ్యలోనే త్రుంచేసాడు సెక్రెటరీ. “ప్రైమ్ మినిస్టర్ అయినా  సరే ......ముందు అప్పాయింట్మెంట్ ఇచ్చే ప్రశ్నే లేదు.మీరు వచ్చి సర్ కి వీలు  ఉన్నప్పుడు కలవాల్సిందే.”అతని మాటలు ,హావ భావాలూ చాల నిష్కర్షగా ఉన్నాయి. నేను చేసేది ఏమీ లేక కాళ్ళు ఈడ్చుకుంటూ బయటకు వచ్చి కారులో కూచున్నాను. ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టు  ముట్టాయి.కొడుకు, కోడలికి ఏమి చెప్పాలో అర్థం కాలేదు. రిక్త హస్తం తో వెళుతున్న నేను వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో పాలు పోలేదు.

ఎందుకో జీవితంలో మరొక్కసారి  ఓడిపోయాననిపించింది.ఇంటిలో అడుగు పెట్టగానే కొడుకు ,తరువాత కోడలు అడిగిన ప్రశ్నకి ”నేను ప్రయత్నిస్తున్నాను” అని చెప్పి తల దించుకుని వేగంగా నడుస్తూ నా రూంలో అడుగు పెట్టాను.   ఆ క్షణంలో వాళ్ళ చూపులు భరించే శక్తి నాకు లేదు.’ఏమైనా సరే  రేపు తప్పక మనవడికి సీట్ సంపాదించాకే ఇంటికి రావాలి ‘అని నిర్ణయించుకున్నాను. ఆ రాత్రంతా ఆలోచనలతో నిద్ర పట్టలేదు.ఎపుడెపుడు తెల్లరుతుందా అని అటు,ఇటు దొర్లుతూ కాలం గడిపేను.

ఆ మరుసటి రోజు ఉదయానికే నాకు  జ్వరం వచ్చి నాలుగు రోజులు బయటకు వెళ్ళ లేక పోయాను.అనారోగ్యంగా ఉన్నాను అనే ధ్యాస కూడా లేకుండా సూటి పోటి మాటలతో నన్ను వేధిస్తూనే ఉన్నారు కొడుకు, కోడలు.

నాకు తెలిసిన ఒక  ఐ ఏ ఎస్ ఆఫీసర్ కి ఫోన్ లో విషయం వివరించి అతని సహాయం అర్ధించాను. ఎలాగైనా  నా మనమడికి ఒక సీట్ సంపాదించమన్నాను.ఆతను ప్రయత్నం చేస్తానని చెప్పాడు.కానీ అతని మాటలలో ఒక విషయం అర్థం అయ్యింది.అతను ఏదో మొహమాటానికి అన్నాడు కానీ గట్టి ప్రయత్నం చెయ్యడు అని.

నాకు  అతనితో మాట్లాడిన మరుసటి రోజు  జ్వరం బాగా ఎక్కువ అయ్యింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను.
ఏమనుకున్నాడో ఏమో   మా అబ్బాయి కూడా నాతో వస్తానని అన్నాడు.

ఇద్దరం కారులో బయలు దేరాం.

సాయంత్రం అవడం వలన  ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది.మాములుగా నేనే డ్రైవ్ చేస్తాను గాని ప్రస్తుత అనారోగ్య దృష్ట్యా అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు.నత్త నడకలా ప్రయాణించి మెల్లగా డాక్టర్ దగ్గరికి చేరుకున్నాం. మందులు అవీ రాయించుకొని , కొనుక్కుని తిరుగు ప్రయాణం అయ్యాం.

దారిలో మా మనవడిని చేర్చాలనుకున్న స్కూల్ బస్సులు మాకు ఎదురయ్యాయి.

అందరు పిల్లలు గట్టిగా అరుస్తూ, కేరింతలు కొడుతున్నారు. నిజానికి అలా అరుచుకుంటూ వెళ్ళడం సరి కాదు. కానీ ఈ కాలం పిల్లలు!! అంతలో ఉహించని పరిణామం జరిగింది. బస్సులలో పిల్లలు కాగితాలని చిన్న చిన్న  ముక్కలుగా చేసి రోడ్ల మీదకు విసరసాగారు. చక్కగా ఊడిచిన రోడ్లు అన్ని చెత్తతో నిండి పోయాయి.

“ఏమిటిరా!!?? ఈ పిల్లలు బొత్తిగా క్రమ శిక్షణ లేనట్లుగా ఉన్నారు.ఆ పిచ్చి పనులు ఏమిటి!!?? “ అన్నాను మా అబ్బాయితో.

“అవును నాన్నా  నాకు అలానే అనిపిస్తోంది. మన బాబు ని ఈ స్కూల్ లోనే కదా చేర్పిద్దాం అనుకున్నాం...... “ అన్నాడు  మా అబ్బాయి సాలోచనగా .

ఒక రెండు, మూడు నిమషాల తరువాత “వద్దు నాన్నా. ఈ స్కూల్ వద్దు.లక్షలు ఖర్చు పెట్టి బాబు కి క్రమశిక్షణా రాహిత్యం నేర్పడం ఎందుకు!!?? ఏదో మనకు తెలియని ,దూరంగా ఉన్న ,ఖరీదు అయిన స్కూల్  లోనే మీ మనవడు మంచి క్రమ శిక్షణ ,విధ్యాబుద్ధులు నేర్చుకుంటాడు అనుకోవడం ఎండమావిలో నీళ్ళు తాగవచ్చు అని భ్రమ పడడం అని తెలిసిపోయింది.చదువు,క్రమ శిక్షణ  మంచి టీచర్లు ఉన్న చోట ఉంటాయి గాని ,మంచి ఏరియాలలో ,గొప్ప బిల్డింగ్స్ లో ఉండవని తేటతెల్లం అయిపోయింది.     పిల్లాడు ఇంటి దగ్గరే  చదువుకుంటాడు .   మన ఇంటి దగ్గర ఉన్న గవర్నమెంట్  స్కూల్ లోనే  చేర్పిద్దాం నాన్నా . మన పక్క వాళ్ళ అబ్బాయి అక్కడే చదువుకుంటున్నాడు. అతని చదువు గురించి పెద్దగా మనకు తెలయదు గాని ,అతని ప్రవర్తన ,నడవడిక మాత్రం అద్భుతం.............. ఇంక ఆ సీట్ ప్రయత్నం వదిలెయ్యి నాన్నా” అన్నాడు మా అబ్బాయి నిశ్చయంగా.

నాకు పెద్ద రిలీఫ్.ఎంతో పెద్దది అనుకున్న సమస్య మంచులా  విడిపోయింది.ఎందుకంటే స్కూల్ లో సీట్ ఇవ్వడం కుదరదు అని అంతకు ముందు రోజే  నాకు ఫోన్ వచ్చింది !!!??

చదువు,క్రమ శిక్షణ అనేవి స్కూల్ ని బట్టి కాక విద్యార్ధులని  బట్టి ,ఇంకా చెప్పాలంటే టీచర్ల వల్ల, తల్లిదండ్రులు  ఇచ్చే తర్పీదు మీదా అధారపడి ఉంటాయని  అని మరొక్కసారి ఋజువు అయ్యిందనిపించింది.వాళ్ళని సక్రమమైన దారిలో పెట్టవలసిన బాధ్యత మనదే.మనందరిది.                                                  

మరిన్ని కథలు