Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tejas

ఈ సంచికలో >> కథలు >> హితవు

hitavu

 ఆ రోజు నేను ఎంతో సంతోషంగా వున్నాను.ఎందుకంటే నిత్యం నా హితవు కోరుకునే, నాకు ప్రియమైన లెక్చురర్ నాకు రాసిన ఉత్తరాన్ని మోసుకొస్తున్నాడు పోస్టుమేన్ .అల్లంత దూరాన  సైకిల్లో వస్తున్న పోస్టుమేన్ను గమనించాను. అప్పుడు నాలో నాకే తెలియని సంతోషంతో కూడికొన్న వుద్వేగంతో  వరాండాలోనుంచి త్వరత్వరగా పరిగెత్తినట్టు వెళ్ళి మా కాంపౌండు గేటు వద్ద నిలబడ్డాను.

"మేడం మీకు వుత్తరమొచ్చింది"అంటూ కవరు చేతికిచ్చి   వెళ్ళిపోయాడు పోస్టుమేన్ .

ఉత్తరాన్ని చేతికి తీసుకున్న నేను గబగబ నా పడక గదికి వెళ్ళి తలుపులు మూసికొని గడియపెట్టుకున్నాను.లైటు,ఫ్యాన్ వేసుకొని మంచం మీద కూర్చొని కవరును ఓపెన్ చేసి ఉత్తరాన్ని చేతికి తీసుకొని చదవను ప్రారంభించాను.

ప్రియమైన నీరజా!

నీ వుత్తరం అందింది.చదివాను.విషయాన్ని అర్థం చేసుకున్నాను.వెంటనే జవాబు రాస్తున్నాను.మొదటగా చపల బుద్దితో చంచలమైన నీ మనస్సును అదుపులోకి తెచ్చుకోవాలి.అదుపులోకి తెచ్చుకుంటావని ఆశిస్తున్నాను.నేను రాస్తున్నట్టు అదుపులోకి తెచ్చుకోకపోతే నీ జీవితం అంధకారంలోకి వెళ్ళిపోవడం ఖాయం. ఖచ్చితంగా నీకు నీ చుట్టూ వున్న నీ వాళ్ళు, ఈ సమాజం  దూరమౌతారు.అవునమ్మా నీరజా!నేను నీ వయస్సులో వున్నప్పుడు పెద్దలను ఎదిరించి నా ఇష్టానుసారంగా పిచ్చిగా తీసుకున్న ఆ నాటి నిర్ణయం నా జీవిత గమనాన్నే మార్చేసింది.అవునమ్మా!నాడు నేను అందర్నీ ఎదిరించి నాకు సర్వస్వం అనుకున్న  నా రాహుల్తో లేచి పోయాను.అతనితో జీవితం పంచుకున్నాను. ఆ కారణంతో అమ్మానాన్నల ప్రేమానుబంధాలకు   దూరమైయ్యాను.ఎన్నో కష్టాలను, అవమానాలను, ఇబ్బందులను  ఎదుర్కొన్నాను. రాహుల్ వల్ల నా జీవితం నరకంగా మారిపోగా నేను చీకటిలో గడిపిన రోజులే ఎక్కువ మరి.

అవును.అతనో ఎన్ .ఆర్ .ఐ. పెళ్ళయి పెళ్ళాం పిల్లలతో యు.ఎస్ .ఏ లో స్థిరపడిన వాడు. ఏదో పనిమీద ఇండియాకు వచ్చి మా ప్రక్క వాటాలో వున్న వాళ్ళ బంధువుల ఇంట్లో దిగాడు.నేను అతన్ని గురించి ఏమీ తెలుసుకోకుండా,పిచ్చిగా అతని  ఆరడుగుల ఎత్తుకు, అందానికీ ముగ్దురాలినై మురిసిపోయి తనే నాకు సరిజోడనుకొని మనసును పారేసుకొని పది రోజులకే  ప్రేమలో పడ్డాను.తనూ పెళ్ళి చేసుకుంటానని మాటివ్వగా వెంటనే లొంగిపోయి మంచం కూడా ఎక్కాను.అమ్మానాన్నలను మోసం చేసి అతన్ని నమ్ముకొని ఓ రాత్రి ఎవ్వరికీ తెలియకుండా అతనితో  వెళ్ళిపోయి నార్త్ ఇండియాలోని  ఏదో గుడిలో తాళి కట్టించుకొని  పొరుగు రాష్ట్రంలో సెటిలయ్యాను.ఇక అతను తనలో ఎగసి పడుతూ బుసలు కొడుతున్న తన కామ వాంఛను నాతో తనివితీరా తీర్చుకున్నాక నెలనాళ్ళ తరువాత ఓ రోజు రాత్రికి రాత్రే నన్ను అక్కడే విడిచిపెట్టి ఎటో వెళ్ళిపోయాడు.తరువాత అతని కోసం నా గాలింపు చర్యలు,పోలీసు రిపోర్టులని ఎన్నో జరిగాయి.ప్రయోజనం లేక పోయింది.ఇప్పటికీ అతని జాడ తెలియలేదు.గడిచిన ముఫ్ఫై సంవత్సరాల్లో నా ఒంటరి జీవితంలో ఎన్నో వూహించలేని వడిదుడుకులతో కూడికొన్న మలుపులు,మార్పులు చోటు చేసుకున్నాయి.చివరికి నా తల్లిదండ్రులను కూడా పోగొట్టుకొని ఒంటరిదాన్నయ్యాను.

ఇప్పుడు చెప్పు?అంటే...అతని మీద నాకు కలిగింది ప్రేమంటావా?...కాదు. మరి అతనికి నామీద ఏర్పడిందైనా ప్రేమంటావా??....అదీ కాదు.మరేమిటీ?...అంటే..అప్పుడు మా ఇద్దరిలో చోటు చేసుకున్నది ఒక్కటే! కేవలం కామంతో కూడుకున్న శరీరేచ్చేనని అంతా అయిపోయిన తరువాత ఆలస్యంగా తెలుసుకున్నాను.ఎస్!  నాడు మా మధ్య ఏర్పడింది లవ్వు కాదు  లస్టు. మొత్తంలో నా జీవిత పతనానికి కారణం... నేను నా తల్లిదండ్రుల మాటలు వినకపోగా నిర్లక్ష్యపు ధోరణితో ఉదాసీనంగా వాళ్ళను ప్రక్కన పెట్టి నా దారి నేను చూసుకోవడమే!

నీరజా!నిజం చెప్పాలంటే అతని ప్రోద్బలంమ్మీద నువ్వతనికి దగ్గరకావాలనుకొంటున్నది సరికాదు. నా మటుకు నేను కొన్నేళ్ళపాటు కళాశాల విద్యార్థులకు పాఠాలు చెపుతూ గడిపిన ఆ కొన్ని సంవత్సరాలు తప్ప నెమ్మది,సుఖసంతోషాలన్నవాటిని ఎప్పుడో కోల్పోయాను.ఒంటరిగా చీకటిలో మగ్గుతూ జీవించాను. దుఖఃతో,వేదనతో ఇంకా జీవితాన్ని కొనసాగిస్తున్నాను.

సరే! నా కథను అటుంచు.నీ విషయానికొస్తున్నాను.నా అభిప్రాయాన్ని తెలుపు తున్నాను.దానిపై మంచి నిర్ణయాన్ని తీసుకుంటావని నమ్ముతాను.నీమీద నాకా నమ్మకముంది.

చూడూ! నీకు ఇప్పుడు దగ్గరకావాలనుకుంటున్న వాడు స్వయాన నీ అక్కమొగుడు.నీకు బావ.నీ వుత్తరాన్నిబట్టి చూస్తే నీమీద తనకున్నది ప్రేమ కాదు.కామ వాంఛేనని ఇట్టే తెలిసి పోతోంది.దాన్ని నీతో తీర్చుకోవాలని తన తియ్యటి కబుర్లతో నిన్ను లొంగదీసుకుంటున్నాడు.ఒకవేళ అది బహిర్గతమైతే...నీ తల్లిదండ్రులే అవమానం భరించలేక నిన్ను అతనికి కట్టబెడతారని,అప్పుడు మీ యావదాస్తికి వారసుడై ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడుగా, ఇంటల్లుడిగా చెలామణి కావాలనుకొంటున్నాడేమోనన్నది నా భయాందోళనతో కూడికొన్న అంచన.ఇది చాలామంది మగవారిలో వుండే సహజ గుణమే!

నీరజా!నిజం చెప్పాలంటే అతని ప్రోద్బలంమ్మీద నువ్వతనికి దగ్గరకావాలనుకుంటున్నది నా దృష్ఠిలో సమర్థనీయం కాదు.అతనిపై నీకున్నది ప్రేమా కాదు.అతన్ని ఎంతో అందగాడని,అతని చిరునవ్వులతో ఆడవాళ్ళని అట్టే వశపరచుకోగల నేర్పరని ఇంకా ఎన్నో...ఎన్నెన్నో రాశావు.అవే నిన్ను ఆకర్షించాయి.అందుకే మీ అక్కగారు ఏ గుడికో,బజారుకో లేక దగ్గరి బంధువుల ఇళ్ళలో జరిగే ఫంక్షన్లకో వెళ్ళినప్పుడు తను ఒంటరిగా వుండి నిన్ను రమ్మంటే...నువ్వూ అతనితో గడపాలని తహతహలాడుతూ వాళ్ళింటికి వెళుతున్నా వు.అది తప్పమ్మా. తనేదో మాటల గారడితో నిన్ను లొంగదీసుకుంటున్నాడని ఎవేవో కథనాలను కూడా రాశావు.అలా అనుకుంటే నీలోని విజ్ఞత,విచక్షణ, సమాజపరమైన కట్టుబాట్లు ఏమైయ్యాయి?అసలు బావగారితో అక్రమ సంబంధమన్నది క్షమించరాని నేరం.అతనికి అనధికార భార్యగానో లేక వుంపుడుగత్తెగానో రహస్యంగా వుంటానన్నంతవరకూ వచ్చావంటే నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే అవుతుంది.పైగా నువ్వు నీ అక్కకు ద్రోహం చేసిందానవవుతావు. కనుక నా సలహాను పాటించు.నువ్వు ఆ ఊబిలోనుంచి బయటికిరా.ఏదో బ్రమలో పడి నీ బావగారికి నువ్వు సొంతం కావాలనుకొంటున్నావ్ . అది తప్పమ్మా. అతన్ని మరిచిపో!మనసును తేలిక చేసుకో. నీలో వున్న చెడు తలంపులకు సమాధి కట్టేయ్  !. నన్నూ,నా జీవితాన్ని మాదిరిగా తీసుకొని నిన్ను నువ్వు కాపాడుకో!నా సలహాను పాటిస్తావని నమ్ముతాను.ఉంటాను.

నీ లెక్చురర్,

ఝూన్సీ మేడం.

ఉత్తరం మొత్తం చదివిన నాకు ముచ్చెమటలు పోశాయి.కళ్ళు బయర్లు కమ్మి గుండె వేగంగా కొట్టుకోసాగింది.శారీరకంగా కాకపోయినా బావగారి మాయమాటలతో  ఏదో తెలియని అనుభూతిని పొంది మానసికంగా మలినపడి పెద్ద తప్పు చేశానని మనసు గద్దిస్తుంటే మా అక్క అమాయకపు ముఖం నా కళ్ళముందు నిలిచింది.కన్నీళ్ళు తెప్పించింది.

అంతే!వెంటనే లేచాను. ఫ్రిజ్ తెరచి నీళ్ళ బాటిల్ తీసుకుని అందులోని చల్లటి నీళ్ళను గటగట తాగేశాను.అప్పుడు అనూహ్యంగా నా చూపులు నా సెల్ ఫోన్ మీదకు వెళ్ళాయి.వెంటనే దాన్ని తీసుకుని బావగారి నబర్ను నొక్కాను.అవతలి నుంచి తను'హల్లో' అన్నాడంతే!

"వినండి.నేను మీతో లేసొచ్చి మా అక్కకు ద్రోహం చెయ్యలేను.మా ఇంటి పరువును బజారుకీడ్చి మా తల్లిదండ్రులకు తలవంపులు తేలేను.నేనిక మీ ఇంటికి రాను"అని ఫోన్ ఆఫ్ చేసి,వుత్తరాన్ని చించి డస్టుబిన్లో వేసి ఓ సుదీర్ఘమైన నిట్టూర్పుతో రిలాక్సవుతూ మనసును తేలిక చేసుకొని మంచంలో పడుకుని కళ్ళు మూసుకున్నాను.

మరిన్ని కథలు