Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
aarambam okka adugutone

ఈ సంచికలో >> కథలు >> స్వయంకృతం

svaamkrutam

మోహనరావు మనసు అశాంతితో నిండి పోయింది. ఒక్కగానొక్క కొడుకు నిశాంత్ అమెరికాలో పెద్ద పేరున్న డాక్టర్. ఎంత కష్టపడ్డాడు వాడి చదువు కోసం. మూడవ సంవత్సరం వచ్చీ రాక ముందే ఇంటర్నేషనల్ స్కూలులో చేర్పించాడు తన తోటి వాళ్ళు వద్దంటున్నా. ఎందుకు అందరి కంటే తన కొడుకు ముందుండాలని. తన కోరిక తీర్చాడు కొడుకు ఆ విషయంలో. ఆరవ తరగతి నుంచే హాస్టల్ లో వుంచినా బెంగ పెట్టుకోకుండా ప్రతి క్లాసులో ర్యాంకు తెచ్చుకుంటూ తన పరువు నిలిపాడు. EAMCET లో సీటు తెచ్చుకోవడం, MS పూర్తి చేసి అమెరికా వెళ్ళిపోవడం వరుసగా జరిగిపోయాయి.

కాలం వేగాన్ని పుంజుకుంది. కోడలు, మనవడు కుటుంబంలో కలిశారు. వయసు పైబడి ఒంటరితనం వెక్కిరించ సాగింది. అమెరికాలో వాళ్ళు, ఇండియాలో వీళ్ళూ. అప్పటి దాక గర్వంగా అనిపించిన స్థానంలో ఏదో భయం చోటు చేసుకుంది. అదే చెప్పాడు కొడుకుతో. దాని పర్యవసానమే ఈ బంగరు పంజరపు బ్రతుకు.

ఇక్కడ అన్నీ వసతులు వున్నాయి. ఒక రకంగా ఇంట్లో కంటే హాయిగా వుంది. ఎసి గది, వేళకు భోజనం, స్నేహితులు, ఎదురుగా భార్య అన్నీవున్నాయి. కాని లేనిదొక్కటే పిల్లల పలకరింపు. ఈ వయసులో కావలసింది లేనిది అదే. ఆ దిగులే మోహన రావును కృంగదీస్తోంది.

"సార్ మీకు కొరియర్ లో లెటర్ వచ్చింది" అంటూ కొరియర్ కుర్రాడిని వెంట పెట్టుకొచ్చాడు కాపలా రంగయ్య. సంతకం పెట్టి కవర్ తీసుకున్నాడు. అది నిశాంత్ వ్రాసిన ఉత్తరం.

ప్రియమైన నాన్నగారికి

నమస్కారములు. ఎలా వున్నారు? అమ్మ ఎలా వుంది? అక్కడ అందరూ పరిచయమయ్యారనుకుంటాను. గొప్ప గొప్ప వాళ్ళు వుండే ఓల్డ్ ఏజ్ హోమ్ కదా వసతులు బాగానే వుంటాయి. ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలేశామని ఫీల్ అవకండి. తప్పదు నాన్నా. ఇక్కడ మేమిద్దరం ఉద్యోగాలకెళతాం. వాడు స్కూల్ కెళతాడు. ఇక్కడా మీరు ఒంటరే. ఎవరూ పలకరించరిక్కడ. అక్కడయితే అంతా మీ వయసు వారే. మంచి కాలక్షేపం. నేనూ అంతే కదా నాన్నా మూడేళ్ళ వయసులోనే స్కూల్ కెళ్ళాను. అమ్మతో మీతో ఆడుకుంటూ ముచ్చట చెప్పవలసిన వయసులో సీట్ అరిగేలా కూర్చున్నాను. మీరంటే భయం. ఇంటికి వస్తే మీరు ఏమంటారో. అప్పుడు మొదలైన భయం పదవ తరగతి వరకు అలాగే వుండిపోయింది. ఏ.సి. గదిలోను, పుస్తకాల మధ్య నా బ్రతుకు తెల్లవారి పోయింది.

సెలవులు యిస్తే అందరినీ ఇండ్లకు పంపేవారు. అందరికీ రెండు నెలలు సెలవువయితే నాలాంటి వారికి వారం. కారణం మేము ర్యాంకర్స్. ఆ వారంలో కూడా ఎక్కడ వెనుకబడతానోనని మీరూ చదివించే వారు. ఒక్కొక్కసారి విసుగొచ్చేది నాన్నా. అయినా మీ కోసం చదివాను.

ఇంటికొచ్చినా ఆనందం లేదు. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు ఎలా వుంటారో తెలియదు. నా పెళ్ళిలో చూశానంతే. అందుకేనేమో నాకు బాధ్యత తప్ప ప్రేమ తెలియదు నాన్న.

బహుశా చిన్నతనం నుంచి ఇప్పటి దాక హాస్టల్ లో స్నేహితులతో అలవాటై ఇంటర్ నుంచి ఇంటికి కూడ రావాలనిపించేది కాదు. నిజం చెప్పాలంటే మీరు మా దగ్గరకొస్తే పరాయి వాళ్ళ లాగే అనిపిస్తారు. అందుకే వద్దనుకున్నాము.

ఇప్పుడు మీకు సంతోషంగా వుంది కదా. నాకు అదే కావాలి. చిన్నప్పుడు నా ఎదుగుదల గురించి ఎంత శ్రద్ధ చూపారో నేను అలాగే ప్రతి సంవత్సరం మిమ్మల్ని చూడటానికి వస్తాను. అక్కడ మీకేమి కావాలన్నా మేనేజర్ నడగండి. అరేంజ్ చేస్తాడు. డబ్బుకు ఇబ్బంది పడవద్దు. నేను చూసుకుంటాను. శేష జీవితాన్ని సంతోషంగా గడపండి. మీ సంతోషమే మా సంతోషం. దగ్గర లేమని బాధపడకండి. ఇక్కడి కొస్తే ఒంటరి తనం అక్కడయితే పదిమంది మధ్య. అమ్మకు మా నమస్కారములు చెప్పండి.

అన్యథా భావించకండి. ఇది మీరు తప్పు చేశారని కాదు. ఎప్పటి పరిస్థితులు అప్పటివి అంతే. ఉంటాను నాన్నగారు.

ఇట్లు
మీ నిశాంత్.

ఉత్తరం చదివిన మోహన రావుకు గొంతు తడారి పోయింది. అంటే కొడుకు కావాలనే ఇలా చేశాడు. పరోక్షంగా తన తప్పును ఎత్తి చూపాడు. ఒక్కక్షణం కోపం వచ్చింది.

మనసు గతం లోకి వెళ్ళింది. ఇదే రకంగా తన తండ్రి అడిగాడు. 'ఆ ఉద్యోగమేదో మన ఊరిలో చూసుకోరాదటరా ' అని. తాను వినకుండా వాళ్ళను వదిలేసి రాష్ట్రం దాటి వచ్చాడు. తరువాత అంతా చుట్టం చూపే. కనీసం తన కొడుకుకు కూడ చూపించ లేదు ఆ వూరు. ఎందుకనో అది తప్పనిపించ లేదు అప్పుడు. మరి ఇప్పుడెందుకిలా?

ఆ రోజు రాష్ట్రాలు దాటారు ఇప్పుడు దేశాలు దాటుతున్నారు అంతే. మనుషుల మనస్తత్వాలు మారలేదు. పెరిగింది వయసు, అవసరం. తన దగ్గరకొచ్చసరికి తప్పనిపించింది. చిన్నవాడైనా వాడు చెప్పింది నిజం. పోటీ ప్రపంచంలో నిలబెట్టాలని బిడ్డకు పంచవలసిన ప్రేమను మొగ్గలోనే తుంచేసారు. వారిని చదువుకునే యంత్రాలుగా తయారు చేశారు. ఇప్పుడు ఏడ్చి లాభం ఏమిటి. అంతా స్వయంకృతం.

ఉమ్మడి కుటుంబాల జీవనాన్ని త్రుంచి పిల్లలను బంధుత్వాలకు, బాంధవ్యాలకు దూరం చేసి సంపాదనే ధ్యేయంగా పెరిగి, పిల్లలనలాగే పెంచి ఇప్పుడు నింద పిల్లల మీదకు నెట్టివేయడం ఎంత వరకు సమంజసం? నేరం వాళ్ళది కాదు. మనది. పంచుకుంటే పెరిగే ప్రేమను మొగ్గ వయసులోనే కాల్చేసిన నేరస్థులు పెద్దలు. ఇది వారి స్వయంకృతం. శిక్ష అనుభవించాల్సిందే అనుకుంటూ కారుతున్న కన్నీటిచుక్కను తుడుచుకుని ఆ ఉత్తరాన్ని చించి గదిలోకి దారి తీశాడు భార్యకు చెప్పి కష్టపెట్టడం ఇష్టంలేక.

మరిన్ని కథలు