Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> అన్యోన్యత

anyonyata

 “ సంక్రాంతి దగ్గర పడుతుంది కదా,కొద్దిగా గదుల్లో సీలింగ్ దగ్గర బూజులు దులుపరా” నా శ్రీమతి కరుణ గొంతులో మార్దవ్యాన్ని రంగరించి అభ్యర్ధించేసరికి కాదనలేకపోయా.ఆ పని పూర్తయిన తరువాత “పనిలో పని గుమ్మాల,కిటికీల కర్టెన్ లు మార్చరా” కరుణ రసాన్ని ఒలికించేసరికి మరొకసారి రంగంలోకి దిగా.

“మంచం మీద దుప్పటి మార్చండి,అది కూడా నేనే చెప్పాలి” స్వరం మారి  విసుగుతో కూడిన ఆజ్ఞ జారీచేసేసరికి ఒళ్ళు మండి “నాకేం తెలుస్తుంది, చెపితేనే కదా తెలిసేది,పెద్దేదో ముత్యాలు రాలిపోతాయేమో ఒక మాట అంటే” తిరిగి సమాధానమిచ్చా.

“ ఆ! మరి ముత్యాలు నా ఒళ్ళోను,మెళ్ళోను పోసారు మరి రాలి పోవటానికి” తిరిగి జవాబిచ్చింది నాకు తిక్క రేగి “ పేరులో మాత్రమే  కరుణ , మనిషికి ఎక్కడా కరుణనన్నదే లేదు “

“ఆ! పెళ్ళికాక ముందు పేరుతో బాటు మనసు లో కూడా కరుణ ఉండేది. పెళ్ళైన తర్వాత పేరులోనే కరుణ మిగిలింది”

“నీతో వాదం వేసుకునే కంటే, పోయి పిచ్చికుక్కను ముద్దుపెట్టుకోవటమే నయం”

“పోయి ఆ పనే చేసుకోండి, ఆ పక్క మీద దుప్పటి మార్చటం తిప్పలేవో నేనే పడతాను”.

ఆ కోపంతో “వంట అయిపోవచ్చింది కేరేజి ఇచ్చేస్తాను“అంటున్నా వినిపించుకోకుండా ఆఫీసుకని బయటకొచ్చేసాను.

***        ***

మా పెళ్ళై మూడేళ్ళు అవుతుంది. అమ్మానాన్నలకు నేనొక్కడినే. నాన్న ఈ మధ్యనే చనిపోయారు. అమ్మనొక్కదాన్ని మా సొంతూరులో ఉంచడం ఇష్టం లేక పొలాన్ని కౌలుకిచ్చి అమ్మను నా దగ్గరకు తీసుకువచ్చేసాను. పెళ్ళైన రెండేళ్ళవరకు బాగానే ఉన్నాం.తర్వాత్తర్వాత “అప్పుడప్పుడు” ఇటువంటి చిన్నచిన్న వాదాలతో మెదలయినవి ఇపుడు “రోజు రోజు”కి వచ్చాము. గొడవ పడటం అయితే సర్వసాధారణమయింది,ఎటొచ్చి విషయం మాత్రం మారుతుంటుంది. ఎవరికి వాళ్ళం నా మాట నెగ్గాలంటే నా మాట నెగ్గాలనుకోవటమే వాదానికి కారణం అని మాకు తెలుసు అయినా ఇద్దరం తగ్గం. అప్పటివరకు బాగానే మాట్లాడుకుంటాం.ఇంతలో ఇద్దరిలో ఎవరోఒకరు ఏదో ఒక మాట తూలతాం,ఇక అక్కడి నుంచి రావణ కాష్ఠమే. అలాగని నేను శాడిస్టు కాదు, తను గయ్యాళి కాదు. పైపెచ్చు ఆఫీస్ నుంచి నేను రావటం కొంచెం ఆలస్యమయితే  విపరీతంగా  ఆందోళన పడిపోతుంది.. ఏదైనా చిన్నపాటి అనారోగ్యం చేసినా ఎంతో కంగారు పడిపోతుంది. సమయానికి వండి వార్చి పెడుతుంది. కొసరికొసరి వడ్డిస్తుంది. అయినా ఏంటో ఈ గొడవలు.

***        ***

“ఎమేవ్! కరుణా, కొంచెం నా మొహాన కాఫీ తగలెట్టు! “ అమ్మ హూంకరింపు.  నాకు దైవభక్తి ఉన్నప్పటికి మరీ శ్రీమతికి ఉన్నంత భక్తిప్రపత్తులు లేకపోయినా ఆమె ఆదేసానుసారం తనతో పాటు పూజలో కూర్చోవడానికి సిద్ధమవుతుంటే.

“ అత్తయ్యగారు,మీరు మొహం కడుక్కోవడానికా, తాగడానికా కాఫీ” తిరిగి సమాధానమిచ్చింది నా యిల్లాలు

“యెటకారం బాగా ఎక్కువైందిగానీ, తాగడానికే తగలెయ్యి కాఫీ”అమ్మ నుంచి జవాబు

“ప్రశాంతంగా పట్టుమని పదినిమిషాలు పూజ చేసుకుందామంటే ఉండదు” అని నా శ్రీమతి కాఫీ పెట్టడానికి సిద్ధమయ్యింది

“ ఆ కాఫీ ఏదో నా మొహాన్న కొట్టి పట్టుమని పదినిమిషాలేం ఖర్మ పదిగంటలు పెట్టుకో, పైగా “తా దూర కంతలేదు,మెడకో డోలు అన్నట్లు,నీకు సాయం వాడొకటి”అని నన్ను కదనరంగంలోకి దింపింది.

“చాల్లే,ఊరుకోండి.ఇల్లు రణరంగాన్ని తలపింపచేస్తున్నారు” అని కసరటంతో ఎట్టకేలకు విరామమిచ్చారు.

***        ***

“ఒరేయ్! రాజా,నేనొక్కసారి మన ఊరు వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూసివస్తాను,అలాగే మన కౌలు రైతు ఇవ్వాల్సిన డబ్బు తీసుకుని రెండు,మూడు రోజులు ఉండివస్తాను”అని చెప్పి అమ్మ మా ఊరెళ్ళింది.

“ఎలాగూ మీ అమ్మగారు రెండురోజులు ఉండటం లేదు కదా,ఎప్పటి నుంచో మీ పెద్దమ్మ గారి అమ్మాయి, అదే మీరు విశాలక్క అంటారు వాళ్ళింటికి రమ్మని గొడవపెడుతున్నారు కదా వెళ్ళి రెండు రోజులు ఉండి వద్దామని  కరుణ అనడంతో ఆఫీస్ లో సెలవు తీసుకుని,విశాలక్క కి ఫోన్ చేసి మేమిద్దరం వస్తున్నామని చెప్పేసరికి ఉబ్బితబ్బిబయ్యింది.విశాలక్క నా కంటే పదేళ్ళు పెద్దది. బావగారు శ్రీనివాస్ మంచి ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నారు.వాళ్ళకు అబ్బాయి,అమ్మాయి. ఇద్దరికి రెండేళ్ళు ఎడం. ఇద్దరూ హాస్టల్లో ఉంటూ అబ్బాయి బి.టెక్ మూడవ సంవత్సరం చదువుతుంటే, అమ్మాయి బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతుంది.

***        ***

మేమిద్దరం వాళ్ళింటికి వెళ్ళి బెల్ కొట్టేసరికి అక్కా,బావలు ఇద్దరూ మాకెదురొచ్చి శ్రీనివాస్ బావగారు కరుణనుద్దేశించి “రామ్మా,చెల్లెమ్మా ఎంతకాలం అయిందో మిమ్మల్ని చూసి” అని అంటే ,విశాలక్క నన్నుద్దేశించి “ పెళ్ళయిన తర్వాత ఇంతకాలానికి కుదిరిందన్నమాట మా ఇంటికి రావటానికి” అని లోపలికి సాదరంగా ఆహ్వానించారు.శ్రీనివాస్ బావగారి అమ్మగారు కూడా వాళ్ళతోనే ఉంటారు.ఆవిడ మమ్మల్ని చూసి “ ఏం బాబూ, మా అమ్మాయిని బాగా చూసుకుంటున్నావా అని, మీ  అమ్మగారు ఎలా ఉన్నారు బాబూ” అని ఎంతొ ఆప్యాయంగా పలకరించారు.

“విశాలీ,నేను బావగారి స్నానపానాదుల సంగతి చూసుకుంటాను,నువ్వు మా చెల్లాయికి ఏం కావాలో చూడు” అని బావగారు  అంటే దానికి అక్క “ రోజూ నాకు  ఏదో రూపేణా సాయం చేస్తూనే ఉంటారు,ఇపుడు తమ్ముడుకి కూడా మీరెందుకు నేను సిద్ధం చేస్తాను” అన్నా వినకుండా బాత్ రూమ్ లో నాకు అవసరమైన వన్నీ క్షణాల్లో అమర్చి తయారు అయి రండి అని చెప్పేసరికి అక్క,బావల అన్యోన్యతను చూసి విస్తుపోవటం నా వంతు అయ్యింది. ఒక పక్క ఆఫీసుకు తయారవుతూ మరో ప్రక్క అక్క అడిగిన పనులలో  సాయపడుతూ,అడగని పనులలోనూ  ఒక చేయి వేస్తూంటే, అక్కేమో ఆయన ఆఫీసుకు తయారుకావడానికి అవసరమైనటువంటివన్నీ దగ్గరుండి అందిస్తూ పనులు చక్కబెట్టుకుండటం చూసి అన్యోన్యతను వారి ఇద్దరి  దగ్గరనుంచి నేర్చుకోవచ్చనిపించింది. ఆఫీస్ లో అర్జంటు పని ఉండటంతో్ ఈ రోజు సెలవు పెట్టడానికి వీలు కావడం లేదని రేపు సెలవు తీసుకుంటానని ఎన్నాళ్ళకో వచ్చినా రెండు రోజులు పూర్తిగా మీతో గడపలేకపోతున్నాని బాధపడుతూ ఈ రోజు వీలైనంత తొందరగా వస్తానని చెప్పి బావ ఆఫీస్ కి వెళ్ళారు. మధ్యాహ్నసమయంలో బావగారి దగ్గరనుంచి విశాలక్కకు ఫోన్. అక్కగానీ,బావగారు గానీ ఫోన్ స్పీకర్ ఆన్ చేసే మాట్లాడుతారు,అలా ఎందుకని అడిగితే “మా మధ్య ఏం రహస్యాలుంటాయని, పైపెచ్చు అది మన జీవితాలలో పారదర్శకత తెలియచేస్తుందని చెప్పటం విని  ఆశ్చర్యపోయా. ఇంతకీ ఫోన్ లో బావగారు అక్కనుద్దేశించి “ఒరేయ్! విసూ! ఈ రోజు నువ్వు చేసిన గుత్తి వంకాయకూర ఎలా ఉందో తెలుసా,నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు ప్రత్యేకంగా నా కోసం తయారుచేసిన గుత్తొంకాయ కూరని తలపింపచేసిందోయ్,అని మా పెద్దమ్మ ని పొగిడేసరికి,”చాల్లే,ఊరుకోండి” అంటూ మా అక్క సిగ్గులమొగ్గే అయ్యింది.”. అపుడు నా మనసుకి అనిపించింది, మా పెళ్ళైన ఈ మూడేళ్ళలో కరుణ ఎన్నిసార్లు మంచిగా వంటను చేసిన సందర్భాలున్నప్పటికి ఒక్కసారైనా మన:స్ఫూర్తిగా పొగిడిన సందర్భమే లేదని గుర్తుకొచ్చి మొట్టమొదటిసారిగా నా మట్టుకు నాకే సిగ్గనిపించింది.

***        ***

బావగారు ఆఫీసు నుంచి వస్తూ వస్తూ కూడా ఎవరో స్నేహితుడిని వెంటబెట్టుకొచ్చారు. అప్పటి వరకు మా కందరికి చక్కబెట్టి అప్పడే చిన్నగా నడుం వాల్చింది అక్క. ఆ స్థితిలో చూసిన అక్కను బావగారు “ ఏరా! విసూ, నీకు ఏమైనా ఒక కప్పు టీ పెట్టడం వీలవుతుందా, నేనే పెట్టిచ్చేవాణ్ణి గానీ వాడి దగ్గర ఎవరూ ఉండరుకదా అని,పోనీలే ఇప్పుడే పడుకున్నట్టున్నావు” అనేసరికి “అయ్యో! అదేంటండీ, ఏం పర్వాలేదు నేను పెడతానులెండి “ అని లేవబోతుంటే బావగారి అమ్మగారు, బావగారిని ఉద్దేశించి “ ఒరేయ్! శ్రీనూ, అది ఇప్పుడే నడుం వాల్చిందిరా, దాన్ని లేపకు , ఆ మాత్రం దానికి నేను లేనూ, నేను పెడతానులే “ అంటూ ఆవిడ వంటింట్లోకి వెళ్ళబోతుంటే,మీ కెందుకండి శ్రమ అంటూ అత్తగారిని సముదాయించి తను వంటింటిలోనికి అడుగుపెట్టింది.

***        ***

“ఒరేయ్! తమ్ముడూ; నేను,మరదలు అలా గుడికెళ్ళొస్తాం, మీ బావగారికి నీలాగే దైవభక్తి తక్కువే,అందుకే ఆయన్ని మరీ అంతగా గుడికి రమ్మని గాని, నాతోపాటు పూజలో కూర్చోమని గాని అడగను. మీరిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండండి” అనేసరికి కరుణ,నేను ముఖముఖాలు చూసుకున్నాం ఎందుకుంటే పూజల విషయంలో తనతో పాటు నన్ను బలవంతంగా గుళ్ళూ,గోపురాలు అంటూ తిప్పడం గుర్తుకువచ్చి. అలా వాళ్ళని వెళ్ళనిచ్చి బావగారిని అడిగా “ ఇంత అన్యోన్యంగా ఎలా ఉండగలుగుతున్నారు”అని. దానికి బావగారు ఇలా చెప్పుకుంటూ పోయారు.

“చూడండీ బావగారు, ఏ సంసారమైనా అరమరికలు లేకుండా సజావుగా సాగిపోవాలంటే ముందుగా ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలి,అంతేగాని ఎవరికివారు తమ మాటే చెల్లించుకోవాలని చూసుకోకూడదు,ఇపుడే చూసారుగా, నాకూ దైవభక్తి ఉంది.అలాగని పెద్దగా గుళ్ళు,గోపురాల వెంట తిరగడం ఇష్టం ఉండదు,అందుకే నన్ను గుడికి వెళ్ళేటపుడు రమ్మనమని బలవంతపెట్టదు. అట్లాగే నేను పుస్తకాల పురుగుని,కనిపించిన ప్రతి పుస్తకాన్ని కొని చదువుతాను,తను పుస్తకాలు చదవుతుంది కానీ నా అంత పిచ్చి కాదు.అందుకే తెచ్చిన ప్రతి పుస్తకాన్ని చదవమని బలవంతంపెట్టను.నచ్చిన పుస్తకం చదువుకుంటుంది..అలాగే మా ఇద్దరిలో ఎవరు మంచి పనిచేసినా చిన్నపాటి ప్రశంస ఇచ్చుకుంటాము. ఒక చిన్న ప్రశంస వంద తప్పులను క్షమించేస్తుంది. చూడండి, నిన్న గుత్తివంకాయకూర బాగుంది అన్నమాట తనకి ఎంత ఆనందమిచ్చిందో తన మాటల్లోనే అర్ధమైంది. అంతే కాదు తను కట్టుకున్న చీరల్లో ఏదైనా చీరలో అందంగా అనిపిస్తే “ఏవోయ్! ఈ రోజు అప్సరసని తలపిస్తున్నావు” అని ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తా.దానికే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది. అట్లాగే మా మధ్య పొరపొచ్చాలు రావా అంటే వస్తాయి అయితే ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.రబ్బర్ బేండ్ ని కొంత వరకు సాగదీయవచ్చు కాని తెగిపోయే పరిస్థితి వచ్చింది అని గ్రహించేసరికి వదిలివేయాలి .అలా ఎవరో ఒకరు తగ్గాలి. దాన్ని మేము అనుసరిస్తాము.అందుకే మా మధ్య గొడవలు వచ్చే అవకాశం చాలా తక్కువ. అలాగే ఆడ,మగ ఇద్దరూ సమానమే. మనలో ఏళ్ళతరబడి పురుషాహంకారం ఉండిపోయింది. ఆ అహంకారాన్ని కొద్దిగా సడలించుకుంటే సంసారనౌక ఆనందసాగర ప్రయాణం అవుతుంది”.

బావగారు చెప్పిన మాటలతో ,మా కాపురంలో కలతలకి కారణం ఏంటో పూర్తిగా అవగాహన అయ్యింది

***        ***

గుడి నుంచి తిరిగి వచ్చిన తరువాత కరుణ మొహాన్ని పరికిస్తే ఏదో తెలియని వెలుగు కనిపించింది.బహుశా నాకు తెలిసి, బావగారిని నేను ఏమి ప్రశ్నించానో, కరుణ కూడా అక్కని అదే అడిగి ఉండాలి,అలాగే అక్క సమాధానం కూడా ఖచ్చితంగా బావగారు నాకు ఏం చెప్పారో అదే అక్క చెప్పియుంటుంది ఎందుకంటే కరుణ,నేను ఒకే తాను గుడ్డలం, అలాగే అక్క,బావగారు ఒకే గూటికి చెందిన గువ్వలు కదా.

***        ***

తిరుగు ప్రయాణమై,ఇంటికి చేరి ప్రయాణబడలికతో అలిసిపోయి సేద తీరుతున్న కరుణని చూసి కాస్త టీ తాగుదువుగాని నేను పెట్టుకొస్తా అనేసరికి “అయ్యయ్యో! అదేం లేదండి నేను పెట్టుకొస్తానంటూ వంటగదిలోకి పరుగెట్టింది.అలాగే కాస్త సేద తీరిన తరువాత కరుణ నోటిలోంచి వచ్చిన పలుకులు “ఏమండీ, నేను పూజ చేసుకుంటాను గానీ మీరు ఈ లోపే మన ఊరు వెళ్ళి అత్తయ్యగారిని తీసుకువచ్చేయండి, అక్కడ ఎలా ఉన్నారో ఏంటో” ఇంతకన్నా ఇంకేం కావాలి మా కాపురం అన్యోన్యతకు తొలిమెట్టు పడిందని చెప్పడానికి.

మరిన్ని కథలు
paruvukosam