Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue301/782/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి) ‘‘అవును సార్‌! ఆరు నెలలు అయింది. అదిగో అప్పట్నుండే యలమంచిలి గ్రూప్‌లో ముసలం ప్రారంభమైంది. తండ్రి ఉన్నంత కాలం ఆయన  వెంటే  ఎంతో  హుషారుగా కంపెనీ కార్య కలాపాల్లో పాల్గొనే వారు మహా శ్వేతా దేవి. ఆమె
ఉత్సాహాన్ని చూసి కంపెనీ వైస్‌ చైర్‌ పర్సన్‌ చేసారు చైర్మన్‌ గారు. మీకు తెలుసా?! తండ్రి కూతుళ్ళ ప్రత్యేక ఇంటర్‌వ్యూ ఫోర్డ్సుమేగజైన్‌లో కూడా వేసారు. వీరి వ్యాపార సామ్రాజ్యం గురించి విస్తరించిన విధానం గురించి ఎంత అద్భుతంగా రాసారో తొసా?!’’ ఆనందంగా అంది మనోరమ.
మనోరమ చెప్పిందంతా మౌనంగా వింటూ కూర్చున్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
‘తండ్రి చని పోయిన అయిదు నెలలకే కూతురు కూడా కారు యాక్సిడెంట్‌లో చని పోయింది’ అంటున్నారు. అంటే ఆలోచించాల్సిన విషయమే.
‘‘మీ చైర్మన్‌ గారెలా చని పోయారు?!’’ ఉన్నట్టుండి మనోరమ కేసి తీక్షణంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్న వాడిలా అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
‘నిద్రలో! రాత్రి పడుకున్నాయన ఉదయానికి చనిపోయి ఉన్నారు. హార్ట్‌ ఎటాక్‌ అన్నారు’’ అంది మనోరమ.
‘‘మీ మేడమ్‌ మహా శ్వేతా దేవి?’’ అడిగాడు ఎస్సై.
‘‘భార్యా భర్తలు అరకు విహారానికి వెళ్ళారు. ఆమె అరకు నుండి విశాఖ పట్నం కారులో వెళ్తూ ఘాట్‌ రోడ్‌ మలుపు తిరుగుతూ లోయలో పడి చని పోయారని... కారు లోయలో దొర్లుకుంటూ పడి పోయినప్పుడు కారు కాలి బూడిదయి పోయిందని తెలిసింది. మేడమ్‌ శ్వేతా దేవి ‘శవం’ కూడా గుర్తు పట్ట లేనంతగా మాడి మసి బొగ్గులా మారి పోయింది.’’ శ్వేతా దేవి శవాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళల్లో నీళ్ళు దించుకుంది మనోరమ.
మనోరమ స్వామి భక్తికి ఎస్సై అక్బర్‌ ఖాన్‌ మురిసి పోయాడు. జేబులో సెల్ ఫోన్‌ తీసి రాజమండ్రిలో సత్యవతి దేవి కుటుంబం గ్రూప్‌ ఫోటో తీసి మనోరమకి చూపించాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
‘‘ఈ ఫోటోలో ఉన్నదెవరో గుర్తు పట్టగలవా?’’ చిన్నగా నవ్వుకుంటూ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
సత్యవతి దేవి తో ఆమె భర్త ఇద్దరు కొడుకులు కూతురు కలిసి తీయించుకున్న ఫోటో అది.
ఆ ఫోటో చూస్తూనే అదిరి పడింది మనోరమ.
‘‘ఈ గ్రూప్‌ ఫోటో ఎవరిది?! ఇందులో మధ్యలో ఉన్న మా మేడమ్‌ మహా శ్వేతా దేవి గారు తప్ప మిగతా వారెవరో నాకు తెలీదు. అయినా మేడమ్‌ గారొక్కరే కూతురు కదా చైర్మన్‌ గారికి. మరి, ఈ ఇద్దరూ... కూర్చొన్న వీళ్ళిద్దరూ? ఎవరు?’’ అయోమయంగా అడిగింది మనోరమ.
‘‘మధ్యలో ఉన్న ఆమె ఎవరో తెలుసా?! మీ మేడమ్‌ మహా శ్వేతా దేవి గారికి తల్లి. మీ చైర్మన్‌గారి భార్య.’’ చెప్పాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
ఎస్సై అక్బర్‌ ఖాన్‌ కేసి చూస్తూ తన కళ్ళను తనే నమ్మ లేనట్టు ఆశ్చర్యంగా చూసింది.
‘‘నిజమా?!’’ అయోమయంగా అంది మనోరమ.
‘‘ఈ ఫోటో చూసావా?’’ అంటూ దొంగల దగ్గర లాక్కున్న పర్సులో దొరికిన ఫోటో చూపించాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ఆ ఫోటో చూస్తూనే మరింతగా ఆశ్చర్య పోయింది మనోరమ.
‘‘ఈమె... ఈమె... మా మేడమ్‌... మా మేడమ్‌ శ్వేతా దేవి కాదా?’’ అయోమయంగా అంది మనోరమ.
‘‘ఎస్‌! మీ మేడమ్‌ శ్వేతా దేవి గారి ఫోటోయే! నీకు ఇంకో నిజం చెప్పనా?!’’ మనోరమ కేసి చూస్తూ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
‘‘చెప్పండి!’’ అయోమయంగా అంది మనోరమ.
‘‘మహా శ్వేతా దేవి చని పోలేదు, బ్రతికే ఉంది.’’ మనోరమ కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
ఎస్సై అక్బర్‌ ఖాన్‌ చెప్పింది వింటూనే అదిరి పడింది మనోరమ.
‘‘మీకు పిచ్చా! మా మేడమ్‌ పోయి నెల రోజులైంది. మీకు పేపర్లలో వచ్చిన వార్తలు కూడా చూపించారుగా మా శోభా దేవి మేడమ్‌’’ చిరాగ్గా అంది మనోరమ.
‘‘నువ్వన్నదే నిజమే అనుకో! అయితే ఈమె ఎవరు అంటావ్‌?!  ఈ ఫోటో ఆధారంగానే నేనింత వరకు రాగలిగాను. ఆ విషయం ఒప్పుకుంటావా?’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
అయోమయంగా ఎస్సై అక్బర్‌ ఖాన్‌ కళ్ళల్లో చూస్తూ బొమ్మలా కూర్చుండి పోయింది మనోరమ.
‘‘మీ శోభాదేవి మేడమ్‌ గారికి నాతో ‘రహస్యం’గా కలవాల్సిన అవసరం ఏముంది? శోభాదేవి మేడమ్‌ నీకు కాగితం మీద రాసి చెప్పిన విషయం ఎందుకు బహిరంగంగా నోరు విప్పి చెప్ప లేక పోతోంది. అంటే ‘యమంచిలి’ భవనంలో ‘శోభాదేవి’ కి శత్రువులు ఉన్నారనే కదా! ఎవరు వాళ్ళు?! శోభాదేవి నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు?!
అంతెందుకు?! ఆ ఆగంతకుడు... అదే... మీ వర్కింగ్‌ చైర్మన్‌ దగ్గర సెక్యూరిటీ టీమ్‌లో ‘బౌన్సర్‌’గా పని చేస్తున్న ‘గూండా’ కదా అతను. నాకెందుకు వార్నింగ్‌ ఇచ్చాడు? ‘ ఏ ‘రహస్యం’ కనిపెట్టేస్తానని నాకు వార్నింగ్‌ ఇచ్చి తిరిగి వెళ్ళిపొమ్మన్నాడు? ఎందుకు? ఎవరు?! ఇదంతా చేయిస్తున్నారు. వీటన్నిటికీ నీ దగ్గర సమాధానాలున్నాయా! చెప్పు మనోరమ.’’ సూటిగా చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
‘‘నిజమే!... మీరన్నట్టు ఏదో గూడు పుఠాణీ జరుగుతోంది. అది ఎవరు చేస్తున్నారో... కొంపదీసి మా కాబోయే... అదే వర్కింగ్‌ చైర్మన్‌ కాదు కదా!’’ ఆందోళనగా అంది మనోరమ.
‘‘ఏమో?... నిజానిజాలు తెలియాలంటే రేపు మీ మేడమ్‌ శోభాదేవి ఏం చెప్తారో చూడాలి. చూద్దాం. ఏం చెప్తారో?’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
‘‘సరే! మీరు ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? మా ఇంటికే వచ్చెయ్యండి. నేనూ అమ్మేగా ఉండేది.’’ అంది మనోరమ టక్కున ఎస్సై అక్బర్‌ ఖాన్‌ బ్రీఫ్‌కేస్‌ అందుకుంటూ.
‘‘వద్దు! మీకు శ్రమ... ఎక్కడో ఒక దగ్గర ఈ రాత్రి గడిపేస్తాను.’’ మొహమాటపడుతూ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
‘‘రండి... పదండి... నేను ఒక్క సారి చెప్తే వందసార్లు చెప్పినట్టు లెక్క’’ అంటూ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ బ్రీఫ్‌కేస్‌ చేత్తో పట్టుకుని నిబడింది మనోరమ.
ఇక చేసేది లేక నెమ్మదిగా లేవ లేక లేవ లేక లేస్తున్నట్టు నటిస్తూ మనోరమ చెయ్యి ఆసరా చేసుకు నిలబడి తూలి మనోరమ మీద పడి ఆమెని ఆమాంతం కౌగిలించుకున్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌. ముసలై పోయినా మీకింకా సత్తువ తగ్గలేదు మామయ్యా’’ అని కొంటెగా అంటూ నడుం మీద గట్టిగా గిల్లింది మనోరమ.
********
ఉదయాన్నే తొమ్మిది గంటలకే ఆఫీసుకి వెళ్ళి పోయింది మనోరమ. ఎస్సై అక్బర్‌ ఖాన్‌ తయారయి గదిలో కూర్చున్నాడు. మనోరమ తల్లి సమయానికి టీ, టిఫిన్‌ పెట్టి తన పనిలో పడి పోయింది.
రెండు బెడ్‌ రూమ్‌ ల ఇల్లు, బాగానే ఉంది. తల్లీ కూతుర్లే ఉంటున్నారు. హైదరాబాద్‌ నుండి వలస వచ్చేసామని చెప్పింది మనోరమ.
రాత్రి గదిలో దూరాక అసలు బైటకే రాలేదు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. మనోరమే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంది. భోజనం కూడా గదిలోకి తెచ్చి పెట్టింది. పాపం! వాళ్ళ అమ్మగారు ఇతను నిజంగా ముసలాడ్నే అనుకుని చాలా గౌరవంగా చూసింది.
మనోరమ తొమ్మిది గంటలకే వెళ్ళి పోవడంతో అక్కడ నుండి ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
పది గంటల కల్లా వడపళని పార్కులో ఉండమని చెప్పింది మనోరమ.
పదవుతుండగా ఇంట్లో నుండి బైటపడ్డాడు. మనోరమ అమ్మ గారు ఎన్నో జాగ్రత్తలు చెప్పింది ఎస్సై అక్బర్‌ ఖాన్‌ కి.
పది గంటల కల్లా వడపళని మురుగన్‌ టెంపుల్‌కి దగ్గరలోనే ఉన్న పార్క్‌లో కూర్చున్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
పదిన్నరవుతుండగా గాబరాగా పరిగెట్టుకు వచ్చింది మనోరమ. ఆ వెనుకే నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది శోభాదేవి. సాదా సీదా స్త్రీలా అంకరించుకుని ఉంది. గొప్పింటి స్త్రీలా ఏ కోశానా కన్పించ లేదు.
మర్యాదగా లేచి నిలబడి నమస్కారం చేసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌..
‘‘నమస్కారం బాబు! ఈ వేషంలో చాలా బావున్నారు’’ చిన్నగా నవ్వుతూ అంది శోభాదేవి. ‘తన గురించి ముందే చెప్పినట్టుంది మనోరమ’ అనుకున్నాడు ఎస్సై.
‘‘సారీ ఆలస్యమైంది. షాపింగ్‌ కాంప్లెక్స్‌ నుండి ఆటోలో రావడం వలన ట్రాఫిక్‌లో లేటయింది.’’ అంది మనోరమ.
‘‘అదేంటి?! ఇంటి ముందు అన్ని కార్లుంచుకుని....’’ ఏదో అనబోయాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
‘‘కార్ లో డ్రైవర్‌ ఉంటాడుగా. అందుకే షాపింగ్‌ కాంప్లెక్స్‌లో షాపింగ్‌ చేయడానికి లోపలికి వెళ్ళి అక్కడ నుండి చాటుగా ఆటోలో ఇక్కడకు వచ్చాం సార్‌’’ నవ్వుతూ అంది మనోరమ.
‘పోలీసులకన్నా మిన్నగా ఆలోచిస్తున్నారందరూ. తెలివి మీరి పోయారు. సినిమా ప్రభావం’ మనసులోనే అనుకున్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
ఎవరూ లేని చోటు చూసి ముగ్గురు అక్కడకు వెళ్ళారు. రెండు చెక్క బల్లలు అటూ ఇటూ ఎదురెదురుగా ఉన్నాయి. ఒక బల్ల మీద ఎస్సై అక్బర్‌ ఖాన్‌, మరో వైపు మనోరమ, శోభా దేవి కూర్చున్నారు.
క్షణం ముగ్గురి మధ్యా మౌనం రాజ్యమేలింది.
‘‘చెప్పండి మేడమ్‌! ఏదో చెప్పాలన్నారటకదా’’ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ముందుగా మాట కదిపాడు.
‘‘మా ‘మహాశ్వేత’ని నువ్వు చూసావా బాబూ! పిచ్చి పిల్ల! ఇప్పుడెలా ఉంది.’’ ఆతృత అణచుకో లేక అడిగింది శోభాదేవి.
శోభాదేవి అడిగిన ప్రశ్న వినగానే ‘మనోరమ’ అదిరి పడింది. ఇన్నాళ్ళూ చనిపోయిందనుకున్న ‘మహాశ్వేతా’ మేడమ్‌ బ్రతికే ఉందన్న నిజం శోభాదేవి నోట వినే సరికి ఉప్పొంగి పోయింది. నిన్న ఎస్సై అక్బర్‌ ఖాన్‌ చెప్పినా నమ్మ లేక పోయింది. మనసులో ఉప్పొంగి పోతూ ఆశ్చర్యంగా మేడమ్‌ శోభా దేవి కేసి చూసింది.
శోబా దేవి ఆందోళనగా ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ఏం చెప్తాడో వినాలన్నట్టు చూస్తోంది.
‘‘నేనైతే చూడ లేదమ్మా. ‘ఆమె’ ని వెదుక్కుంటూ నేను ఇక్కడకు వచ్చాను.’’ చెప్పాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
‘‘అయ్యో! చూడలేదా?!’’ దిగులుగా అయి పోయింది శోభాదేవి.
‘‘అందరూ చని పోయిందనుకుంటున్న ‘మహా శ్వేతా దేవి’ మీకు మాత్రమే బ్రతికున్నట్టు ఎలా తెలిసింది మేడమ్‌’’ ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
సమాధానం చెప్పకుండా మౌనంగా ఏడుస్తూ ఉండి పోయింది శోభాదేవి. ఏడుస్తున్న శోభా దేవి ని ఓదారుస్తున్నట్టు ఆమెని పొదిగి పట్టుకుంది మనోరమ.
‘‘నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మేడమ్‌. ఇన్ని వేల కోట్ల రూపాయలకి వారసురాలు...యజమాని అయి ఉండి కూడా మీ ‘మహాశ్వేతాదేవి’ బికారిలా బిచ్చగత్తెలా ఊర్లు పట్టుకు తిరగడం చాలా వింతగా విడ్డూరంగా ఉంది. మీరు కూడా ఇంత రహస్యంగా నన్ను కలవడానికి రావడం కూడా నమ్మ శక్యంగా లేదు. దయ చేసి చెప్పండి. ఏం జరిగింది? ఎందుకిలా దొంగల్లా దాక్కుంటున్నారు?  మహాశ్వేతా దేవి  ఎందుకలా  నాటకమాడుతున్నారు?  బ్రతికుండి  చని పోయినట్టు తన
ఉనికిని తనే ఎందుకు చంపేసుకుంటున్నారు?! దయ చేసి చెప్పండి.’’ వినయ పూర్వకంగా ప్రాథేయ పడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
అప్పటికే బ్రీఫ్‌కేస్‌ లోపల ఉన్న రికార్డర్‌ ఆన్‌ చేసి సిద్ధంగా ఉంచాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
ఇద్దర్నీ మౌనంగా గమనిస్తూ కూర్చుంది మనోరమ.
{ ఆమె చెప్పిన నిజాలేంటి? ఆ నిజాలతో ఇంతకాలం నుంచి కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడేనా....తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటి గంట దాకా వేచి చూడాల్సిందే.....}

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్