Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> జీవితంలో వసంతం

jeevitam lo vasantam

నేను బీచ్ ఒడ్డున కూర్చున్నాను దిగాలుగా. ప్రపంచంలోని దైన్యమంతా నా  మొహంలోనే గోచరిస్తుంది. ఎదురుగా ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రం. పడి లేచే కెరటాలతో, వచ్చి పోయే అలలతో అల్లకల్లోలంగా ఉంది. నా మనసులాగే.

ఆ రోజు ఆదివారం కావడంతో బీచ్ అంతా సందడిగా ఉంది. తనని సందర్శించి, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పొందడానికి వయసు తారతమ్యాలు లేవని సముద్రం ఘోషిస్తున్నట్టుంది.

పిల్లలు ఆటల్లో మునిగిపోయారు. పెద్దవాళ్ళు  పిల్లలై పోయి సాగరాన్ని చూస్తూ ఆస్వాదిస్తున్నారు. అందరి మొహాల్లో ఎంతో  సంతోషం ఆనందం కన్పిస్తున్నాయి.

కానీ నా  మొహంలో..?

ఎంతో దిగులు, విచారం.

అసలు వీళ్లంతా అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? అనుకున్నాను నేను. ఒకప్పుడు నేనూ అంతే సంతోషంగా, ఆనందంగా ఉండే వాడ్ని. కానీ అవేవీ  ఇప్పుడు లేవు. కష్టాలు, కన్నీళ్లు తప్ప.

పట్టు పరికిణి, పట్టు జాకెట్ వేసుకున్న ఓ అందమైన అమ్మాయి ఒడ్డున నీళ్ళల్లో సంతోషంగా ఆడుతూ కనిపించింది నాకు. ఆ అమ్మాయిని చూడగానే నాకు కల్పన   గుర్తొచ్చింది. నా కళ్ళు జలధారలయ్యాయి.

కల్పన!

తను అలా చేసుండకూడదు. తొందర పడింది. తను చిన్నపిల్ల. లోకంపోకడ తెలియనిది. ఆవేశంలో నిర్ణయం తీసుకుంది.

కానీ నేనేం చేశాను?

పెద్దవాడ్ని. అన్నీ తెలిసిన వాడ్ని. నేనూ అలాగే ప్రవర్తించాను  . నేను  అలా మాట్లాడి ఉండకూడదు. ఆవేశంలో నేను  మాట్లాడిన తీరుకు పాపం ఆ లేత మనసు ఎంతగా  గాయపడిందో? ఎంతలా విల విల్లాడిందో? కష్ట కాలంలో ధైర్యాన్నిచ్చే ఒక తండ్రిగా నే నున్నానంటూ భరోసా ఇవ్వడం పోయి నా మాటలతో చిత్రవధ చేశాను.

 ఛ… ఛ… నేను చాలా మూర్ఖంగా మాట్లాడాను. బాధ్యత కలిగిన తండ్రిగా నేను ప్రవర్తించి  ఉంటె,  ఈరోజు నా కూతురు నాకు దూరమయ్యేది కాదు. నాకు ఈ గుండె కోత ఉండేది కాదు.  నేను సరిదిద్దుకోలేని పొరపాటు చేశాను. నా కూతురిని నేనే పొట్టన పెట్టుకున్నాను . కల్పన గుర్తొచ్చి రెండు కన్నీటి బొట్లు రాలాయి నా కళ్ళ నుండి. నా ఆలోచనలు గతంలో కి తొంగి చూశాయి.

****

పెళ్ళైన చాలా  కాలం తర్వాత మాకు  పుట్టిన గారాల పట్టి కల్పన.

ఒక్కతే కూతురు కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా, గారాబంగా పెంచి పెద్ద చేశాo.  ఏది అడిగితె అది  కాదనకుండా క్షణాల్లో అమర్చేవాళ్ళం.ఆమె ఆడింది ఆట. పాడింది పాటగా సాగిపోయింది కల్పన జీవితం.

కూతురు మీద అమితమైన ప్రేమతో ఆమెను ఎప్పుడూ ఒక్క మాట కూడా అని వుండ లేదు మేము. ఆ అతి గారాబమే, మితిమీరిన ప్రేమే మాకు గర్భ శోకాన్ని మిగుల్చుతుందని, ఆ క్షణం దంపతులుగా మేము ఊహించలేదు.

కల్పన చిన్నప్పటి నుంచి చాలా తెలివైనది. ఆట పాటలలో,  చదువు సంధ్యల్లో చాలా చురుగ్గా ఉండేది. అందంలో కూడా ఆమె అపరంజి బొమ్మలా ఉండేది.

కల్పన  పై చదువుల కోసం సిటీకి వెళ్ళ వలసి వచ్చింది.

మాకు ఇష్టం లేకపోయినా ఆమె ఎక్కడ నొచ్చుకుంటుందో నని,  ఆమె ఇష్టం మేరకు మేము పంప వలసి వచ్చింది. చదువు పూర్తి చేసి ఇంటికి వచ్చిన కల్పన చెప్పిన పిడుగు లాంటి వార్త విని తల్లి దండ్రులుగా మేము తల్లడిల్లి పోయాం.

కల్పన ప్రేమలో పడింది. తనతో పాటు చదివిన ఓ కుర్రాడ్ని ప్రేమించింది.

ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకు కూర్చుంది. కల్పన  మొండితనం తెలిసిన నేను,  చేసేది లేక ఆ అబ్బాయి గురించి వాకబు చేశాను. భయంకరమైన నిజాలు తెలిసాయి నాకు. అతడు మంచి వాడు కాదని. వ్యసనపరుడని. చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని.

ఆ విషయమే మేము కల్పనకు నచ్చ చెప్పి చూశాo. అతనితో ప్రేమ, పెళ్లి ఆమె జీవితాన్ని విచ్చిన్నం చేస్తాయని మొత్తుకున్నాం. కానీ అతని ప్రేమ మైకం పూర్తిగా కమ్మిన కల్పనకు మా మాటలు రుచించలేదు. తేలిగ్గా  కొట్టిపారేసింది. అతనెంతో మంచివాడని,  అతని గురించి తనకు బాగా తెలుసునని, మాకు అతనంటే ఇష్టం లేకే అలా చెబుతున్నామని మొండిగా వాదించింది.

ఆ అబ్బాయి అబద్దాలతో మా అమ్మాయిని ఎంతలా ప్రేమ మత్తులో  ముంచాడో అర్ధమైన మేము, గుడ్డిగా అతడ్ని నమ్మి,  మమ్మల్నే ఎదిరించి మాట్లాడిన కల్పన మాటలకు నిశ్చేష్టులయ్యాం. నివ్వెరపోయాం. వెయ్యి పిడుగులు మీద పడ్డట్టు అదిరి పడ్డాం.

అతనితో పెళ్లి మాకు ఇష్టం లేదని కరాఖండీగా చెప్పేశాం. అంతే.

ఆ రాత్రే కల్ప న  ఓ  ఉత్తరం రాసి పెట్టి ఆ అబ్బాయితో వెళ్లి పోయింది. నేనూ నా భార్యా గుండె లు పగిలేలా ఏడ్చాo.

కాల క్రమంలో కొన్ని రోజులు గడిచాయి.

ఒక రోజు ఇంట్లో ఫోన్ మోగింది.

ఫోన్ పైకెత్తి మాట్లాడిన నా మొహం కోపంతో ఎర్రబడింది.

ఆ ఫోన్ కాల్ కల్పన నుంచి!

తను ప్రేమించి పెళ్లిచేసుకున్న అబ్బాయి తనని మోసం చేసి వదిలేసాడని. ఇప్పుడు తనకేం చెయ్యాలో తెలియటం లేదని కన్నీరు మున్నీరుగా విలపించింది కల్పన.

మా మాట వినలేదని కల్పన మీద నేను చాలా కోపoగా ఉన్నాను. ఆ కోపంతో ఆమె చెప్పేది పూర్తిగా వినకుండా  వెంటనే ఫోన్ పెట్టే శాను. ఆ విషయం నా భార్యకు చెప్పాను. ఆమె కన్నతల్లి కాబట్టి తన కూతురుని కడుపులో పెట్టి చూసుకోవాలనుకుంది. కానీ నేను ససేమిరా అన్నాను.

మళ్ళీ ఫోన్ మోగింది  . " నాన్నా! నేను చేసింది తప్పే. మీ మాట విననందుకు నాకు తగిన శాస్తే జరిగింది. ఇప్పుడు నా జీవితం అగమ్య గోచరంగా ఉంది. ఈ ఒక్క తప్పుకి నన్ను క్షమించండి నాన్నా. జీవితంలో మళ్ళీ పొరపాటు చేయను. మీరు రమ్మంటే నేను మీ దగ్గరకి వచ్చేస్తాను నాన్నా!... కాదంటే నేను మీతో మాట్లాడిన ఈ మాటలే నా చివరి మాటలవుతాయి”  అంటూ కళ్ళ నీళ్ల పర్యంతమైంది కల్పన.
కానీ పరువు కోసం ఆలోచించే నా మనసు అందుకు ఒప్పుకోలేదు. కూతురి మీద ప్రేమని పరువు అనే నివురు కప్పేసింది. క్షణికావేశంలో "ఇంటికి రావద్దు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో" అంటూ కటువుగా మాట్లాడి ఫోన్ పెట్టేశాను.

కానీ క్షణం లోపే తేరుకున్న నేను చేసిన పొరపాటు గుర్తొచ్చి, తప్పుగా మాట్లాడినది తెలుసుకుని,  కల్పన పై ప్రేమ పొంగి అదే నంబర్ కు వెంటనే ఫోన్ చేశాను. కానీ మొబైల్ స్విచాఫ్ వచ్చింది. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.  కల్పన కి కన్నతల్లిలా గోదావరితల్లి ఆశ్రయం ఇచ్చింది. కల్పన శవమై తేలింది.

ఆ రోజునుండి నేను నా భార్య కల్పనని తలచుకోని రోజులేదు. కాదు.. కాదు.. క్షణం లేదు. కళ్ళు మూసినా తెరిచినా  కల్పనే మాకు గుర్తొస్తూ ఉండేది. ' నాన్నా! ఈ ఒక్క తప్పు క్షమించరూ?' అంటూ వేడుకుంటున్నట్టు అనిపించేది. పగలూ రేయి కలల్లో వస్తూ కనిపించేది. నవ్వేది. ఏడ్చేది. అందకుండా దూరంగా పారిపోయేది. మమ్మల్ని ఏడ్పించేది. గర్భ శోకాన్ని మిగిల్చి పోయిన కల్పనని మర్చిపోవడం మా వల్ల కావటం లేదు.

అప్పుడప్పుడైనా నేను కల్పనని కాస్త మరిచిపోగల్గుతున్నాను.  కానీ, నా భార్య కల్పన చావుకు నేనే కారణమంటూ గుండె పగిలేలా ఏడుస్తుంది. తన ముద్దుల కూతుర్ని తనకి తెచ్చివ్వమని పిచ్చిదానిలా మాట్లాడుతుంది. ఆమెని ఓదార్చటం నా వల్ల కూడా కావటం లేదు.
కాస్తంత మనశ్శాంతి కోసం వాకింగ్ పేరుతో నేను రోజూ  బీచ్ కి రావటం అలవాటు చేసుకున్నాను.

*****

జలధారలతో తడిచిన కళ్ళు తుడుచుకొని మళ్ళీ సముద్రం కేసి చూస్తూ ఉండిపోయాను. అప్పటికే సంధ్య చీకట్లు అలుముకున్నాయి. బీచ్ కి వచ్చిన జనమంతా వెళ్లి పోయి బీచ్ బోసి పోయింది.

నేను కూడా లేచి వెళ్ళటానికి ఆయత్తమయ్యాను.సరిగ్గా అప్పుడే ఓ దృశ్యంనా కంట పడింది.దూరంగా లీలగా ఓ ఆకారం సముద్రం వైపు నడుస్తూ వెళుతోంది. నేను చూస్తూనే ఉన్నాను. ఆ ఆకారం సముద్రం లోపలికి  వెళ్ళటానికి వెళుతున్నట్టుగా నాకు అనిపించింది. అంటే  ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. నేను క్షణం ఆలస్యం చేయలేదు. వెంటనే వేగంగా పరుగెత్తాను. ఆ వ్యక్తిని సమీపించాను. నీళ్లలో మునిగి చనిపోవాలను కుంటున్న ఆ వ్యక్తి చేతిని పట్టుకొని బలంగా లాక్కుంటూ ఒడ్డుకి వచ్చాను.

‘వదలండి.. నన్ను వదలండి.. నన్ను చావనీయండి’ అంటూ మెల్లగా రోదించసాగింది. అప్పుడు చూశాను ఆ వ్యక్తిని. నిర్ఘాంత పోయాను. నివ్వెరపోయాను.ఆ వ్యక్తి అతను కాదు! ఆమె!!నా  కూతుర్లాంటి మరొక అమ్మాయి. అభం శుభం తెలియని మరొక కూతురు. జీవితంలో మోసపోయినందుకు ఆత్మహత్య చేసుకోవాలను కుంటోంది నా కూతురు లాగానే.విషయం తెలిసి నా గుండె తరుక్కుపోయింది. ఆ అమ్మాయిలో నాకు నా కూతురు కల్పన కనిపించింది. ఆమె తప్పు చేసిందని  ఆ అమ్మాయి తండ్రి కూడా నాలాగే మూర్ఖంగా మాట్లాడినందుకు  ఆమె ఆత్మ హత్య చేసుకోవాలనుకుంది.

ఒక సారి నేను తప్పు చేశాను. మరో సారి మళ్ళీ అలాంటి తప్పు జరగ కూడదు. నేను చేసిన తప్పుని  సరిదిద్దుకోవాలనుకున్నాను. ఆమెతో చెప్పాను."అమ్మా.. నువ్వు చేసిన తప్పుకు నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు. మీ వాళ్ల్లు నిన్ను వదిలేసినా నేను కన్న బిడ్డలా నిన్ను అక్కున చేర్చుకుంటాను. నీ జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటాను. కూతురిగా నా ఇంట్లో అడుగుపెట్టు తల్లీ" అంటూ దొరికిన కూతురితో ఇంటివైపు నడిచాను ఆనందంగా.ఇప్పుడు మా జీవితాల్లో కూడా వసంతం వెల్లి విరియబోతోంది.

మరిన్ని కథలు
aagani chakram