Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
raktabhishekam

ఈ సంచికలో >> కథలు >> అంత:కరణశుద్ధి

amtakarasuddhi

 “పనసతొనల కన్న    
పాకం గారెల కన్న
పట్టు తేనె కన్న
మిన్న మా నాన్న”

మా ఆఫీస్ లో నా కొలీగ్ రమేష్ పితృదినోత్సవ సందర్భంగా వాట్సప్ లో పంపిన పోష్టింగ్ చూసి చాలా సంతోషమేసింది. ఈ మధ్యకాలంలో ఇట్లా మాతృదినోత్సవం,స్నేహితుల దినోత్సవం,ప్రేమికుల దినోత్సవం వంటి వెన్నో జరుపుకుంటుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ విధంగా తిరిగి బంధుత్వాలు, బాంధవ్యాలు, ప్రేమలు ,ఆప్యాయతలు నెలకుంటున్నందుకు. అందుకే ఈ పోష్టింగ్ చూసిన వెంటనే తిరిగి “కృతజ్ఞతలు”అని పంపి మొక్కుబడి తీర్చుకోవడం కాకుండా అటువంటి అదృష్టాన్ని పొందిన  వాడి తండ్రి తో కాసేపు మాట్లాడితే మనసుకు సాంత్వన ఉంటుందని వాళ్ళ ఇంటికి స్వీట్ పేకెట్ తో వెళ్ళి తలుపుకొట్టాను. రమేష్ భార్య తలుపు తీసి “రండి అన్నయ్య గారు”అని లోపలికి ఆహ్వానించింది.

“రమేష్ ఇంట్లో లేడామ్మా” అడిగా.  ఇపుడే బయటకు వెళ్ళారండి అని సమాధాన మిచ్చింది. పోని మీ మావయ్య గారు, అదే రమేష్ నాన్న గారు ఉన్నారమ్మా అని అడిగా. “ఆయనాండి,ఆయనాండి ఆయన బయటే ఉన్నారండి అంది. సరేమ్మా! మరోసారి వస్తాలే అని స్వీట్ పేకెట్ అక్కడ పెట్టి తలుపు దగ్గరకొస్తుంటే రమేష్ కొడుకు దూసుకుంటూ వచ్చి “అమ్మా!అమ్మా! తాతయ్య ఉండే చోట అందరూ తాతయ్యలే అమ్మా, మేం పట్టుకెళ్ళిన పనసతొనలు, పాకం గారెలు ఎంత ఇష్టంగా తిన్నాడో” విరామం లేకుండా అరుచుకుంటూ లోపలికి పోయాడు. రమేష్ భార్యని,రమేష్ తండ్రి గురించి అడిగినప్పుడు ఆయన బయటకు వెళ్ళారని కాకుండా బయటే ఉన్నారండి అని నర్మగర్భంగా అనటంలో అంతరార్ధం ఏమిటో ఇపుడు అర్ధం అయింది. రమేష్ కొడుకు అన్నమాటలకు లోపల వాడి అమ్మ,మధ్యలో నేను,నా వెనుక వాడి నాన్న బిర్రబిగుసుకుపోయాం. ఓహో! నీ వాట్సప్ సందేశంలో అర్ధం ఇదా అని మనసులో అనుకున్నా.తింగరి మొహం వేసుకుని “ఏరా, వచ్చేముందు చెప్పి రావచ్చుకదా” అన్నాడు.దాంట్లో రెండు అర్ధాలు వచ్చేలా,అయ్యో నువ్వొచ్చేసరికి నేను ఇంట్లో లేకుండాపోయానే అని ఒక అర్ధం,ఈ విధంగా బయటపడిపోకుండా చక్కదిద్దుకునే వాణ్ణి కదా అని మరో అర్ధం వచ్చేలా. “తిరిగి కృతజ్ఞతల తో సరిపెట్టేస్తే ఏంబాగుంటుంది రా అని ఇంటి కొచ్చా ” అన్నా వాడికి ఎక్కడో గుచ్చుకోవాలన్న ఉద్దేశంతో. “అది కాదురా,మేమిద్దరం ఉద్యోగస్తులమే కదా,రోజులు ఎలా ఉన్నాయో చూస్తున్నావు కదా, ఇంట్లో వయసు పైబడిన వాళ్ళున్నారని తెలిస్తే ఇంటిని దోచుకోవడమే కాకుండా అడ్డువస్తే పెద్దవాళ్ళు అని కూడా చూడకుండా చంపేసే కిరాతకులుంటున్నారు కదా అందుకే మా నాన్న క్షేమంగా ఉంటారనే ఉద్దేశ్యంతో వృద్ధాశ్రమంలో చేర్పించారా”అంటూ చెప్పుకొచ్చాడు.. మనసులో మహానటుడువురా నువ్వు అనుకుంటూ, అన్యమనస్కంగా కాసేపు మాట్లాడి వచ్చేసా ఇంటికి.

***            ***            ***            ***            ***

ఈ సారి మాతృదినోత్సవం. ముందుసారి అనుభవం మరిచిపోలేదేమో,అందుకే రమేష్ దగ్గరనుంచి మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఏమీ రాలేదు కానీ ఈసారి ఊరి చివర  ఉంటున్న తమ్ముడు వరసయ్యే మా దగ్గరి బంధువు సురేష్ నుంచి వాట్సప్ లో మాతృదినోత్సవ శుభాకాంక్షల మెసేజ్

“ అమ్మంటే నాకెంతో గారం నింపుతా అమ్మ ఒంటినిండా బంగారం  అన్నింటా అమ్మకే అధికారం అమ్మ సేవలో రోజంతా జాగారం”
మెసేజ్ చూసి మరల ముచ్చటేసింది. లోలోపల మనసులో పీకుతున్నా, రమేష్ విషయంలోనే అలా జరిగింది గాని అందరూ అలాగే ఉంటారా ఏంటీ అనుకుంటూ సురేష్ ఇంటికెళ్ళా. వీధి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి.హాలులో భార్యాభర్తలు సోఫాలో కాళ్ళు జాపుకుని వెనక్కి జారబడి టీ.వి. సీరియల్ లో తీక్షణంగా నిమగ్నం అయి అలౌకికానాందాన్ని పొందుతున్నారు.నన్ను చూడగానే మా తమ్ముని భార్య బెడ్ రూమ్ లోపలికి వెళ్ళిపోయింది.

“రా!రా! అన్నయ్యా!”అంటూ లోపలికి ఆహ్వానించాడు మా తమ్ముడు. “అమ్మా! అన్నయ్య వచ్చాడు, మంచినీళ్ళు తీసుకురా” కదలకుండానే ఆర్డర్ వేసాడు. చెమటలు కక్కుకుంటూ మంచినీళ్ళ గ్లాసుతో వంటింటి లోంచి వచ్చిన మా చిన్నమ్మని చూసేసరికి మనసు నీరుగారిపోయింది. బక్కచిక్కిపోయి ముతక చీర తో ఎండుతట్టం లా ఉంది. మెళ్ళో ఓ రోల్డ్ గోల్డ్ గొలుసు వేసుకుంది.చేతికి మట్టిగాజులుతో ఉంది. వీడ్ని చూస్తే రెండు చేతులవేళ్ళకి చెరొక రెండేసి ఉంగరాలు,హేండ్ చెయిన్,మెడలో గొలుసు తో ధగధగ మెరిసిపోతున్నాడు.వాడిని అట్లా చూస్తే ఒంటిమీద పై నుండి కింద వరకు బంగారం తో నింపుకుని  “ఐహిక సుఖాలే మనిషి వినాశనానికి హేతువులు,వీటిని వీడిన వాడే నిజమైన భక్తుడు,అతనికే మోక్షమార్గం సిద్దిస్తుంది”అని టి.వి.లలో ఉద్భోద చేసే స్వాములు గుర్తుకువచ్చారు.  వాడి భార్య కూడా ఒళ్ళంతా బంగారంతో దిగేసుకుని కనిపించింది.

మనసులో అనుకున్నా “నింపుతా అమ్మ ఒంటినిండా బంగారం” అన్నాడు కాని వీడి వరస చూస్తే  “ఒలుస్తా  అమ్మఒంటిమీదున్నబంగారం”అన్నరీతిలో ఉంది ఎందుకంటే  ఒకప్పటి మా చిన్నమ్మ “లక్ష్మీదేవి” కి మారు రూపుగా ఉండేది. “చిన్నమ్మా!ఒంట్లో ఏమైనా బాలేదా”అడిగా. “నాకేంట్రా,భేష్షుగ్గా ఉంటే” అంది. చిన్నమ్మఇంకేం చెప్పేస్తాదో ఏంటో అని భయపడ్డాడో ఏమో “అమ్మా! అన్నయ్యకు టీ పెట్టు” అంటూ పురమాయించాడు.ఓహో! “అన్నింటా అమ్మకే అధికారం” అంటే వంటింటి పనులన్నీ “చిన్నమ్మే” చేసే అధికారం అని అర్ధమైంది.ఇక మెసేజ్ లో “అమ్మ సేవలో రోజంతా జాగారం” అంటే “చిన్నమ్మ సేవలు చేస్తుంటే రోజంతా భార్యాభర్తలు సీరియళ్ళు చూస్తూ జాగారం చేస్తారన్నమాట” అని చెప్పకనే అర్ధమైంది. వీడి అధ్బుతమైన నటనకు మనసులోనే జోహారులర్పిస్తూ మెల్లగా బయలుదేరా అక్కడినుంచి.
***            ***            ***            ****            ****
    “ఏమండీ! నా స్నేహితురాలు రాధ నిజంగా ఎంత ఆప్యాయత,ఆత్మీయత కలదనుకున్నారు,నాతో ఆత్మీయంగా మాట్లాడటం గొప్ప విషయం కాదండి.స్వయంగా వాళ్ళ ఇంటికెళ్ళినపుడు చూసా,వాళ్ళ అత్తగారు చనిపోయి ఐదేళ్ళయిందట కానీ ఆశ్చర్యం నేను వెళ్ళేసరికి వాళ్ళ అత్తగారి ఫొటో దగ్గర ఇడ్లీలతో పెట్టిన ప్లేటు ఉంది.నా ఎదురుగానే నైవేద్యమిచ్చి అప్పుడు ఆ ఇడ్లీలు తింది.అలాగే కాఫీ కూడా ఆ ఫొటొ దగ్గర నైవేద్యమిస్తే గానీ తాగలేదు. అత్తగారి ఫొటో దగ్గర పొద్దున్న ఏమి టిఫిన్ చేస్తే ఆ టిఫిన్ నైవేద్యమిచ్చిన తర్వాత, ఆ టిఫిన్ తింటుందట.అలాగే కాఫీ,టీలు వగైరా అన్నీ అట్లాగేనటండి. అంత ఆప్యాయతలున్నవారిని ఈ కాలంలో ఎక్కడైనా చూసామాండీ!” అంటూ చెప్పుకుపోయింది నా శ్రీమతి.

తరువాత ఒక రోజు నా పాత మిత్రుడొకరు బజారులో కలిసినపుడు మాటల సందర్భంలో నా మిత్రుడు,       నా శ్రీమతి  స్నేహితురాలు రాధ భర్త చేసే ఉద్యోగం ఒకచోటే కాకుండా వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పాడు.అప్పుడు నా శ్రీమతి చెప్పిన విషయమే చెప్పా.
 “ ఆ మహాతల్లా,తెలివిగా భర్తని ఒప్పించి అత్త,మామలను రప్పించి అత్తగారిచే అడ్డమైన చాకిరి చేయించడమే కాకుండా,  పట్టుకుని రాచిరంపాన పెట్టేదట. వాళ్ళకి వయసు మీదబడిందని గ్రహించి ఏ విధంగా వాళ్ళను వెనక్కి పంపించెయ్యేలా అని ఆలోచించి,ఒకసారి అత్తగారికి తీవ్రంగా జబ్బు చేస్తే హాస్పిటల్ జాయిన్ చేసి తగ్గిన తర్వాత ఇంటికి తీసుకువద్దామని భర్త సిద్దమవుతుంటే,తీసుకువస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే పాపం అతని అమ్మానాన్నలు వృద్ధాప్యంలో తిరిగి వాళ్ళ సొంతూరుకెళ్ళాల్సిన పరిస్థితి
దాపురించిందట, అని నా మిత్రుడు స్వయంగా నా  దగ్గర చెప్పి ఎంతో బాధపడ్డాడు.అటువంటిది ఇప్పుడు ఏకంగా ఫొటోకే టిఫిన్లు,కాఫీలు ఇచ్చేస్తుందన్నమాట”అని  అసలు గుట్టు విప్పాడు నా మిత్రుడు. అప్పుడు అనిపించింది ఇంతకన్నా మహానటి ఇంకెవరుంటారని.

****            ****        ****            *****                ****

ఇక స్నేహితుల దినోత్సవానికొస్తే “స్నేహితులనే వారు జీవితం అనే వంటకం లో ముఖ్య దినుసులు.నా జీవితం అనే వంటకానికి నీవొక ముఖ్యదినుసు”వంటి పుంఖానుపుంఖాలైన  కొటేషన్స్ తో నా వాట్సప్ , ఫేస్ బుక్ నిండిపోయింది. ఒక్కరంటే ఒక్కరు నోటితో మాట్లాడింది లేదు.వచ్చి పలకరించిందిలేదు.

***        ***        ***        ***        ***        ***        ***

ఆ రోజు పర్యావరణదినోత్సవం. మా సంస్థలో పర్యావరణదినోత్సవ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.ఆ కార్యక్రమంలో పర్యావరణ ప్రాముఖ్యత గురించి వివరించటానికి ఒక ప్రముఖ వ్యక్తిని ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆయనకు సుస్వాగతాన్ని తెలియజేస్తూ ప్రాంగణమంతా ఫ్లెక్సీలతో నింపారు. ఆయన పర్యావరణ ప్రాముఖ్యత గురించి,ప్లాస్టిక్ వస్తువులు,పోలిధీన్ కవర్లు ఉపయోగించటం వల్ల కలిగే అనర్ధాల గురించి, అనర్గళంగా ఉపన్యసించి పర్యావరణ పరిరక్షణకై అందరం ప్లాస్టిక్ వస్తువులు,పోలిధీన్  కవర్లు వినియోగించకుండా నిషేదించాలంటూ తను వీటిపై రాసిన పుస్తకాలను తన ప్లాస్టిక్ సంచిలోంచి తీసి పంచారు. అతిధులందరికి మా సంస్థ సభ్యులు ప్లాస్టిక్ మెమెంటోలు బహుమతిగా అందచేయటమే కాకుండా స్వీట్స్, హాట్ మరియు టీ లు ప్లాస్టిక్ ట్రేలలో పోలీధీన్ ప్లేట్లు,గ్లాసులలో అందచేసారు. ఇవన్నీ వింటున్న,చూస్తున్న నాకు ప్లాస్టిక్ సామానులు,పోలీధీన్ సంచులు నిషేదించాలంటున్న ఆ ప్రముఖవ్యక్తి, అలాగే మా సంస్థ సభ్యులు, ఇంకా రమేష్, సురేష్, రాధ వీళ్ళందరి మధ్య ఏదో విషయమై సంబంధముంది,ఏదో విషయమై సంబంధముంది అనిపించింది. “ఏంటది,ఏంటది” అని మనసు పరిపరివిధాలుగా  ఆలోచించసాగింది.ఆఖరికి తెలిసింది. అవును…అవును ఆ సంబంధం ఏమిటో తెలిసింది.

****        *****            *****            ****        ****        ****

ప్లాస్టిక్ వస్తువులు,పోలీధీన్ కవర్లుని నిషేదించుకోవటం కాదు ముందు; రమేష్,సురేష్,రాధ,స్నేహితులు,పర్యావరణహితాన్ని కోరే వ్యక్తి,మా సంస్థ సభ్యులు ఎవరైనా కానీవండి, వీళ్ళంతా ప్రేమలు,ఆప్యాయతలు,అభిమానాలు, ఆదర్శాలు  అనే పోలీధీన్ కవర్లని ముఖాలకు అతికించుకున్నారు. వాటితోనే  జీవితంలో నటిస్తున్నారు. అవును, రమేష్ కి తండ్రి మీద ప్రేమ కన్నా తండ్రిమీద ప్రేమ ఉన్నట్టు కనపడటం అనే పోలిధీన్ కవర్ ముసుగు ముఖ్యం.సురేష్ కి అమ్మమీద ప్రేమ కన్నా నలుగురిలో అమ్మంటే తనకు అపురూపం అనిపించుకోవటం అనే పోలీధీన్ కవర్ తో కనిపించడం ఇష్టం. రాధ తన అవసరాలకోసం అత్త,మామలు కావాలి,కానీ ఇతరుల సమక్షంలో అత్తమామలను
పూజిస్తున్నట్లుగా అందరూ భావించుకోవాలి అనే పోలీధీన్ కవర్ తో ముఖాన్ని కప్పుకుంది. ఆ ప్రముఖుడు పర్యావరణ పరిరక్షణకై అద్భుతంగా ప్రసంగిస్తారు కానీ ఆచరణకొచ్చేసరికి శూన్యం. పర్యావరణ పరిరక్షకుడు అనే పోలీధీన్ ముసుగు ఆయనకు ముఖ్యం. అందుకే ప్లాస్టిక్ వస్తువులు,పోలీధీన్ కవర్లను నిషేదించటానికన్నాముందుగా,వారిలో మార్పు రావాలి,ఈ రకమైన పోలీధీన్ కవర్ ముసుగులు ముందుగా తొలగించుకోవాలి,ఒకసారి ఆ ముసుగు పొరలు తొలగిపోతే అన్నింటిని మన:స్సాక్షితో  ఆచరించగలుగుతారు,అంతవరకు ఇంతే……………….అప్పుడే నా అంతరాత్మ నాకు ఎదురు తిరిగింది. వారందరి గురించి అంటున్నావు మరి నీ సంగతో!

***        ***        ***        ***        ***        ***        ***

అంత:పరీక్ష చేసుకున్నా,చాలా చేదు నిజాలు తెలిసాయి.ఫ్రాయిడ్ చెప్పిన “రక్షక తంత్రాలు” అనే పోలీధీన్ కవర్     ముసుగేసుకుని అత్యద్భుతంగా జీవితాన్ని గడిపేస్తున్నాననిపించింది ఎందుకంటే ఎవరైనా “మీ అమ్మానాన్నలను ఒంటరిగా ఆ  పల్లెటూర్లో ఏంట్రా,నీ దగ్గరకు తీసుకుతెచ్చుకోవచ్చుకదా అంటే నా సమాధానం “వాళ్ళు సొంత యింటిని,స్వగ్రామాన్ని విడిచి పెట్టి రాలేరంట” నిజానికి వాళ్ళనడిగిందే లేదు.స్నేహితుల దినోత్సవానికొస్తే నేను చేసిందీ  అదే, వచ్చిన సందేశాలన్నింటికి తిరుగు సందేశాలిచ్చా,మిగతావారికి మంచి మంచి కొటేషన్స్ తో స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు పంపా.ఇక ప్లాస్టిక్,పోలీధీన్ కవర్ల వినియోగానికొస్తే ఇంట్లో ఉన్న జనపనార సంచులను, కూడా బయటకు పట్టికెళితే పోలీధీన్ కవర్ల అవసరం చాలా వరకు తగ్గించుకోవచ్చు కానీ ఏనాడు కూడా జనపనార సంచిని పట్టికెళ్ళిన సందర్భమే లేదు.ఇంట్లోగానీ,ఆఫీసులో గాని డస్ట్ బిన్ గా అట్టపెట్టెలను ఉపయోగించుకోవచ్చు కానీ ఏనాడు ఉపయోగించిందే లేదు.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో….

నా అంతరాత్మ చెప్పింది అక్షర సత్యమే.అందుకే  ముందు భావించినట్లుగా వారిలో కాదు మార్పు రావాల్సింది.నాలో మార్పు రావాలి.నేను మారాలి, అందుకే నా  అంత:కరణ  శుద్ది కావాలి. ముందుగా నేను ఆచరించి చూపాలి.తద్వారా అందరిలో మార్పు వచ్చే దిశగా మార్గదర్శకం చేయవచ్చు లేదా వారికి ఆదర్శం కావచ్చు.అందుకే  ఆ దిశగా నన్ను నేను మార్చుకునేలా వడివడిగా అడుగులు ముందుకేసా.

  

 

                                    

 

    

 

 

    

    

    


    

 

మరిన్ని కథలు