శరీరానికి అన్నీ కావాలి. కానీ కొన్నింటినే శరీరానికి అలవాటు చేస్తున్నాం. మిగతా వాటిని దూరంగా పెట్టేశాం. అయితే ఇప్పుడు మళ్లీ ఆరోగ్యం విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సూపర్‌ఫైన్ రైస్ అలవాట్లను పక్కన పెట్టి పొట్టు బియ్యం వైపు ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి. వీటిలో భాగంగానే తృణ ధాన్యాల వాడకం పెరుగుతూ వస్తోంది. అయితే పెద్దలెప్పుడో చెప్పారు. 'అతి సర్వత్రా వర్జయేత్..' అని. శరీరాన్ని ఒక అలవాటు నుండి మరో అలవాటుకు మార్చాక, తిరిగి పాత అలవాటుకు తీసుకురావాలంటే తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా తీసుకునే ఆహారం అప్పటికప్పుడు మానేసి, సరికొత్త ఆహారం తీసుకుని అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. సరైన వైద్య సలహా తీసుకోకుండా అలా చేయడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారనీ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇలా వచ్చే ఆరోగ్య సమస్యల్లో అతి కీలకంగా చెప్పుకోదగ్గది జీర్ణ సంబంధిత సమస్య. మనం మామూలుగా తీసుకునే ఆహారం తో ఈజీ డైజేషన్‌కి అలవాటు పడిపోయింది మన శరీరం. కానీ ఇప్పుడు కొత్తగా తృణ ధాన్యాల్ని అలవాటు చేయడంతో డైజేషన్ సిస్టమ్ బాగా ఎఫెక్ట్ అవుతోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడంతా కెమికల్స్ నిండిపోయిన ఆహారమే తీసుకుంటున్నాం. కెమికల్స్‌ని విత్తన దశలోనే వాడేస్తున్నారు. ఆ ఎఫెక్ట్ పాలిష్ లేని పొట్టు బియ్యం, ఇతరత్రా తృణ ధాన్యాల పైనా ఎక్కువగా ఉంటుంది. వీటిని డైరెక్ట్‌గా తీసుకోవడం వల్ల ఆ కెమికల్ ఎఫెక్ట్ డైరెక్ట్‌గా శరీరానికి అందుతోంది. అంతేకాదు, పాలిష్ రైస్‌తో పోల్చితే పొట్టు బియ్యం, కొర్రలు, అవిసెలు వంటి తృణధాన్యాలు ఈజీగా డైజెస్ట్ కావు కూడా. అందుకే వైద్యుల సలహా మేరకు కొద్ది కొద్దిగా వీటిని శరీరానికి అలవాటు చేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా యూత్ సన్నబడడానికి తృణ ధాన్యాలను ఎక్కువగా వాడుతున్నారు. కానీ వీటిని వాడేందుకు ఓ పద్థతి ఉంది. ఆ పద్ధతిని ఫాలో చేసేదెంతమంది. పద్దతీ గిద్దతీ జాన్తా నై, జై భోలో గూగుల్ తల్లీ.. అంటోంది నేటి యువత. సులువుగా సోషల్ మీడియా ఆధారిత చిట్కాలు వీరిని ప్రేరేపిస్తున్నాయి. తక్కువ రోజుల్లోనే ఎక్కువ బరువు తగ్గిపోవాలనే అత్యాశ వీటి వాడకంలో యువత కొంప ముంచేస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఎడాపెడా వీటిని ఉపయోగించడం వల్ల లేని పోని రోగాల బారిన పడుతున్నారు. డయాబెటిక్ సమస్యలు వచ్చినవారు, ఊబకాయంతో బాధపడుతున్నవారు వైద్య సలహా మేరకు తృణధాన్యాలను తగిన మోతాదులో వాడితే మంచి ఫలితాలుంటాయి. సో తృణ ధాన్యాలు మంచే చేస్తాయి. కానీ ఓ పద్ధతి ప్రకారం వాటిని వాడితేనే. ఇది గమనించాలి సుమీ.!
|