Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.....http://www.gotelugu.com/issue306/791/telugu-serials/katyayani/katyayani/

 

(గత సంచిక తరువాయి)..... అబద్ధం చెప్పలేని, చెప్పని మనిషాయన. కాత్యాయని విషయం ఎట్టి పరిస్థితిల్లోనూ లోకానికి వెళ్లడించకూడదని కడుపులో దాచుకున్న మహోన్నత వ్యక్తిత్వం  ఆయనది. ఇప్పుడు ఆయనకు సంకట పతిస్థితి ఎదురయింది. "అమ్మా మా పూర్వికులు కూడా భగవంతుడి సేవలో నిమగ్నమైనవారే.."అంటూ ఏదో చెప్పబోయారు. "అయ్యవారూ..ఆ విషయాలు సాయంకాలం నుంచి రాత్రిదాకా గుళ్లో తీరిగ్గా మాట్లాడుకుందాం. మీరు మాట తప్పిస్తున్నారంటే, అది తెలుసుకోవాల్సిందే అనిపిస్తోంది. నాకు ఆవిడ విషయం చెప్పండి దయచేసి" అంది ధృఢంగా.

ఆయన ఒకపరి ఆమె వంక తేరిపార చూసి "చూడమ్మా, ఆమెకి సంబంధించిన వివరాలు ఎవరికీ చెప్పనని, ఆమెకి ఆశ్రయం ఇచ్చాను. ఆ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టడం నీకు తగదు" అన్నాడు ప్రాధేయపూర్వకంగా.

"నేను ఆమెని ఒక్కసారి కలుస్తానంతే, మా కెమెరామెన్ ను కూడా నా వెంట తీసుకురాను. ఆమె అనుమతి లేకుండా బయటి ప్రపంచానికి ఆమె ఉనికిని ఎట్టిపరిస్థితిల్లోనూ వెల్లడించనని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నన్ను నమ్మండి" అంది నిశ్చలంగా. చేసేదేంలేక ఆమెని ఇంటికి తీసుకెళ్లి కాత్యాయనిని ఆమెకి పరిచయం చేశాడు.భోజనాలయ్యాక వాళ్లిద్దరినీ కాత్యాయని గదిలోకి వెళ్లి మాట్లాడుకోమన్నాడు.
"చూడండి కాత్యాయనిగారూ, గుళ్లో మీ ప్రవర్తన వింతగా తోచి నేనెన్నోమార్లు అడిగిన మీదట అయ్యవారు మిమ్మల్ని కలుసుకోనిచ్చారు. మీకు సంబంధించిన ఏ విషయం మీ అనుమతి లేకుండా లోకానికి వెల్లడి చేయను. నన్ను నమ్మి మీకు సంబంధించిన వివరాలు చెప్పొచ్చు. మీకు న్యాయం చేయడానికి నేను ఏమాత్రం సహాయం చేయగలిగినా చాలు. అందరూ అనుకునేట్టు నాలుగ్గోడల మధ్య ఉండే జీవితాలను నడివీధిలో పడేయ్యడం జర్నలిజం కాదు. సమాజానికి సరైన దిశానిర్దేశం చేసి, వ్యక్తులకు న్యాయం చేయడం జర్నలిజం. జర్నలిజం నా వృత్తికాదు, ప్రాణం" అంది హేమ.

హేమ మాటల్లోని నిజాయితీ, ఆత్మవిశ్వాసం కాత్యాయని మనసులో హేమపట్ల నమ్మకాన్ని కలిగించింది. పైగా దాదాపు ఒకే వయసు. చాలాకాలం తర్వాత హాయిగా ఆనందంగా ఆమెతో సంభాషించింది.

హేమ సాయంకాలం సోమయాజులుగారితో గుడికి వెళ్లలేదు. దానికన్నా కాత్యాయనితో గడపడమే ముఖ్యమనుకుంది. కెమెరామెన్ తో హోటల్ రూం కి వెళ్లిపొమ్మంది.

సోమయాజులుగారింటికొచ్చాక, మొట్టమొదటిసారి హేమతో ఆమె స్కూటీమీద షాపింగ్ కి వెళ్లింది కాత్యాయని. హేమ కాత్యాయనికి బట్టలు కొనిచ్చి, హోటల్ కి తీసుకెళ్లింది. మంచి ఫ్యామిలీ మూవీకీ వెళ్లారు. ఇంటికి వస్తు వస్తూ సోమయాజులుగారి దంపతులకు పళ్లుతీసుకున్నారు.
ఆరోజు కాత్యాయని పొందిన సంతృప్తితో కూడిన ఆనందం అంతఇంత కాదు.

ఆ రాత్రి కాత్యాయనితోపాటు అక్కడే ఉంటానని సోమయజులుగారికి చెప్పింది. ఆయన అంగీకరించారు. ఇద్దరాడపిల్లలు ఇంటికి పండు వెన్నెల పట్టుకొచ్చారని మురిసిపోయారు ఆ వృద్ధదంపతులు. ఆ రాత్రి హేమ, కాత్యాయని డాబామీదకి వెళ్లారు.

నిండు పున్నమి చంద్రుడు అల్లంత ఆకాశంలోనే ఉండి.. వెండి వెన్నెల వెదజల్లుతున్నఫ్పటికీ చేయి చాస్తే అందేంత దూరంలో ఉన్నట్టున్నాడు. కాసేపు చంద్ర బింబం వంక కన్నార్పకుండా చూశాక "చెప్పు కాత్యాయనీ, నీ గురించి నీ అనుమతి లేకుండా ఏదీ బయటకి వెల్లడించనని మరోసారి ప్రమాణం చేస్తున్నాను."

ఆ మాట విన్నాక కాత్యాయని కాసేపు మౌనాన్నశ్రయించింది. అప్పటిదాకా ఆమె మనసు పొరల్లో దాగున్న దృశ్యాలన్నీ ఒక్కటొక్కటిగా మనోఫలకంపై కదలాడసాగాయి.

హేమ , కాత్యాయని జీవితం లో  జరిగిన సంఘటనలన్నీ తెలుసుకుని , ఏటువంటి మార్పుని తీసుకొస్తుందో తెలియాలంటే...  వచ్చే శుక్రవారం  ఒంటిగంటదాకా ఎదురు చూడాల్సిందే.... 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana