Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
javaanukutumbam

ఈ సంచికలో >> కథలు >> భరతమాత ముద్దుబిడ్డ

bharatamata muddu bidda

రమేష్ నేషనల్ డిఫెన్స్ అకాడమి ఆధ్వర్యంలో యుపిఎస్సిపరీక్ష పాసై ఎస్ ఎస్ బి ఇంటర్వూ లో సెలక్ట్ కాబడి శారీరక,వైద్యపరీక్షలు పూర్తి చేసుకుని ఆర్మీ విభాగాన్ని ఎంచుకుని ఇండియన్ మిలటరి ఎకాడమి లో ఒక సంవత్సరంశిక్షణ పూర్తి చేసుకుని ఆఫీసర్ గా చేరడానికి ఆ రోజే జాయిన్ కావడానికి బయలుదేరివెళ్ళుతున్నాడు.ఊరుఊరంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు.తల్లితండ్రులు మాత్రం ఆందోళనతో ఉన్నారు ఎంతైనా కన్నపేగు కదా,వెళ్ళాలా తప్పనిసరిగా అని రమేష్ ని అడుగుతున్నారు.

“మీరే కదా అమ్మా! ఉగ్గుపాలతో దేశభక్తి పొంగిపొరలేలా ,నరనరాన దేశభక్తి జీర్ణించుకునేలా భగత్ సింగ్,సుఖదేవ్,రాజ్ గురులు దేశం కోసం తమ జీవితాలను తృణప్రాయంగా భావించి ఉరికంబాలను ముద్దాడిన విషయాలను,అల్లూరి పోరాటపటిమను,ఝాన్సీలక్ష్మీబాయి ధీరోదాత్తమైన వీరోచిత పోరాటాన్ని గురించి బోధించి, తమ పిల్లలను సైన్యంలోకి పంపించవలసి వచ్చేసరికి భయపడితే మాతృభూమి ఋణాన్ని ఏ విధంగా తీర్చుకోగలం” అన్నాడు రమేష్. దేశభక్తి మాటలకే పరిమితం చేసి చేతల కొచ్చేసరికి వెనుకంజ వేస్తే ఎలా?తిరిగి ప్రశ్నించాడు.

కన్నబిడ్డ ఎంత ఎత్తుకు ఎదిగాడో అర్ధం అయి దేశ రక్షణకోసం వెళుతున్నాడు మా బిడ్డ అనే తృప్తితో సాగనంపారు.

***        ***

రమేష్ లెఫ్టినెంట్ స్థాయి నుండి అంచెలంచెలుగా కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి చేరుకున్నాడు.మేనమామ కూతురు విజయ ని వివాహం చేసుకున్నాడు.ఏ క్షణాన్నైనా  దేశం కోసం ప్రాణాలర్పించడానికి ముందుంటాను,దానికి అంగీకారమైతే ఈ పెళ్ళి అని విజయ దగ్గరనుంచి మాట తీసుకుని వివాహన్ని చేసుకున్నాడు.అపుడపుడు సెలవులు పెట్టుకుని వచ్చి రెండు మూడు నెలలుండి వెళ్ళేవాడు రమేష్ . విజయ,రమేష్ దంపతులకు ముందు అమ్మాయి పుట్టింది.ఇపుడు రెండవసారి విజయ మరల గర్భిణి. సీమంత వేడుకలకు వచ్చి డెలివరీ అయ్యేవరకు ఉండేలా సెలవు తీసుకుని వచ్చాడు రమేష్.

***        ***

సీమంతం వేడుకలు ఆనందంగా జరిగాయి. నవమాసాలు పూర్తయ్యి డెలివరీ కి దగ్గరయ్యేసరికి కల్నల్ నుంచి సందేశం.అర్జంటుగా రిపోర్ట్ చేయమని ,దాయాది దేశం పాకిస్తాన్, కార్గిల్ సెక్టర్ లో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.దాన్ని ధీటుగా ఎదుర్కోవాలి వెంటనే బయలుదేరి రమ్మని.హుటాహుటిన బయలుదేరి వెళ్ళాడు.

“విజయా! పాకిస్తాన్ సైనికులపై పోరాడటానికి బయలుదేరి వెళుతున్నా.త్రివర్ణపతకాన్ని ఎగురవేస్తూ వస్తా లేదా త్రివర్ణపతకాన్ని నా దేహానికి చుట్టబడి అయినా వస్తా. ధైర్యంగా ఉండు, ఏమయినప్పటికి పుట్టబోయేది ఆడబిడ్డ అయితే భారతి అని నామకరణం చేయండి,మగబిడ్డ అయితే భరత్ అని పేరు పెట్టండి.ఉగ్గుపాలతో దేశభక్తి రంగరించి పెంచండి”అని ఉద్బోధ చేసాడు.

లెఫ్టినెంట్ కల్నల్ రమేష్ నేతృత్వంలో బెటాలియన్ వీరోచితంగా పాకిస్తాన్ సైనికులను ఎదుర్కోవడానికి ముందుకు ఉరికింది. అత్యంత సాహసంతో పోరాడి వందలాది శత్రుసైనికులను తుదముట్టించి విజయగర్వంతో వెనుదిరుగుతుంటే పాకిస్తాన్ ముష్కరుడు దొంగచాటుగా పేల్చిన గన్ తూటాలు వెన్నులో దిగబడి లెఫ్టినెంట్ కల్నల్ రమేష్ తుదిశ్వాస విడిచాడు దేశమాత సేవలో తరిస్తూ. అదే సమయంలో విజయ పురిటినొప్పులు భరిస్తూ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.విషయం తెలిసి రమేష్ తల్లితండ్రులు,భార్య విజయ అశ్రునయనాలతో ఆ ఇల్లు శోకసంద్రమే అయింది.

***        ***

త్రివర్ణపతాకం తో చుట్టబడిన రమేష్ పార్ధివ దేహం ఇంటికి చేరుకుంది. సైనిక లాంచనాలతో రమేష్ అంత్యక్రియలు జరిగాయి.అందరూ ఆశ్చర్యపడేలా పచ్చిబాలింత అయిన విజయ గుండెలపై భారత త్రివర్ణపతాకం ధరించి చంకన మగబిడ్డతో ఝాన్సీలక్ష్మీబాయిలా వచ్చి రమేష్ చితిపై “మన బిడ్డలో మిమ్మల్ని చూసుకుంటూ మీరు చూపిన మార్గంలోనే మన బిడ్డను పెంచుతా” అని శపధం చేసింది. భరతదేశం తన ముద్దుబిడ్డను చూసి మరొకసారి పరవశించింది.

మరిన్ని కథలు