మంచి, చెడుల మధ్య యుద్ధం ఈ నాటిది కాదు. కళ్లకు చెడు కనిపిస్తోంది కాబట్టి మారణహోమంతోనే అనుకున్నది సాధించగలమనుకుంటే పొరపాటే. దురదృష్టవశాత్తూ ఉడుకు రక్తం విచక్షణను కోల్పోతోంది. ఎవరో చేసిన పాపానికి యువతరం బలైపోతోంది. బ్రిటీష్ పాలకులు వెళుతూ, వెళుతూ పెట్టిన చిచ్చు పేరే మత విద్వేషం. ఇప్పుడంటే భారతదేశం, పాకిస్థాన్ అనే రెండు దేశాలున్నాయ్ కానీ, ఒకప్పుడు ఈ రెండూ కలిసి అఖండ భారతావనిగా ఉండేవి. బంగ్లాదేశ్ కూడా అఖండ భారతావనిలో ఒకప్పుడు అంతర్భాగమే. హిందువులకీ, ముశ్లిములకీ మధ్య తెల్ల దొరలు రేపిన చిచ్చు ఇప్పుడు భారత్ - పాక్ మధ్య వైరానికి కారణం.
భారత్ - పాక్ స్వతంత్ర దేశాలుగా దశాబ్ధాలు గడుస్తున్నా కాశ్మీర్ కోసం ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. భారత్ - కాశ్మీర్ కొట్టుకుంటుంటే మధ్యలో చైనా లాభపడుతోంది.
పాక్, చైనా ఆక్రమించుకోగా మిగిలిన కాశ్మీర్‌ని మ్యాప్‌లో చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. అంతలా ఆ రెండూ కాశ్మీర్‌లో చాలా భాగాన్ని ఆక్రమించేశాయి. అత్యాశ ఇంకా చావక మిగిలిన కాశ్మీర్‌ని దక్కించుకోవాలని చైనా, పాకిస్థాన్ కలిసి పన్నుతోన్న కుట్రలో భాగంగా కాశ్మీర్ రావణ కాష్టంగా మారింది. ఓ వైపు చైనా అరుణాచల్ ప్రదేశ్ మీద కన్నేసింది. కాశ్మీర్‌పై భారత్ ఏమాత్రం తగ్గినా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయ్. ఈ పరిస్థితుల్లో కాశ్మీర్‌ని రక్షించుకోవడం కోసం భారత సైన్యం పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. దురదృష్టం ఏంటంటే భారత పౌరులు, భారత సైన్యం పైనే తిరగబడుతున్నారు. అందరూ కాదు, కాశ్మీర్‌లో కొందరు మాత్రమే భారత సైన్యంపై తెగబడుతున్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే అలా తీవ్రవాదంపై మళ్లుతున్న వారంతా చాలా తక్కువ వయసున్నవారే. ఊహ తెలిసినప్పటి నుండే కొందరికి విద్వేషాన్ని అలవాటు చేస్తోంటే ఇంకొందరు యుక్త వయసుకొచ్చాక తీవ్రవాదం వైపు మళ్లుతున్నారు.
తాజాగా పుల్వామా ఘటన జరిగింది. 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాడికి ఆదిల్ ధర్ అనే సూసైడ్ బాంబర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. కశ్మీరీ యువకుడే ఆదిల్ ధర్. అంటే సైన్యంతో పాటు కశ్మీరీ యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడనుకోవాలి తప్ప ఈ ఘటనలో పాకిస్థాన్‌కి చెందిన ముష్కరుడెవరూ ప్రాణాలు కోల్పోలేదన్న మాట. విద్వేషం నూరి పోసిన మసూద్ అజార్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. వాడ్ని నమ్మి అదిల్‌ధర్ ప్రాణం పోగొట్టుకున్నాడు. దేశం మీద యుద్ధం చేద్దామనుకుంటే, అది సాధ్యమయ్యే పని కాదు. పాకిస్థాన్ సైన్యమంతా కలిసి ఇండియా మీద దండెత్తినా కాశ్మీర్ నుండి ఒక యాపిల్‌ని కూడా తీసుకెళ్లలేరు. భారత సైన్యం సత్తా ఏంటో పాక్ సైన్యానికి బాగా తెలుసు. గతంలో భారత సైన్యం లాహోర్ దాకా దూసుకెళ్లింది. మనం భిక్ష వేసినందువల్లే లాహోర్ ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉంది. కాశ్మీర్‌లో విద్వేషపూరిత ప్రసంగాలకు తలొగ్గుతున్న యువత ఈ వాస్తవం తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యం భారతదేశంలో వర్థిల్లుతోంటే, సైన్యం, తీవ్రవాదం పాక్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. బెంగుళూరులోనో, మరో చోటో కశ్మీరీ యువత ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వారిలోనూ ఒకరిద్దరు మాత్రమే విపరీత భావజాలానికి ఎట్రాక్ అవుతున్నారు.
అమర్‌నాధ్ యాత్రలో హిందువులకు రక్షణగా నిలబడుతున్నది కశ్మీరీ ముశ్లింలే. సైన్యంతో పాటు కశ్మీరీ ముశ్లింలు అమరనాధ్ యాత్రికులకు అందిస్తున్న సహాయ సహకారాల్ని ఎలా మర్చిపోగలం.? పెడదోవ పట్టిన కశ్మీరీ యువత మిగతా అందాల కశ్మీరాన్ని చూసి బుద్ది తెచ్చుకుంటే పాకిస్థాన్ పాపాల పుట్ట ఏంటో అర్ధమవుతుంది.
|