తడుకు పెట నుండి ఫోన్ చేసిన తాతయ్య తో విదేశంలో ఉన్న అక్షిత్ మాట్లాడుతున్నాడు . నాలుగు సంవత్సరాల వయసు పూర్తికాని అక్షిత్ మాట్లాడే ముద్దు మాటలకూ మురిసిపోయాడు.
తాతయ్యతో మాట్లాడుతూ ఫోన్ ఇవ్వకుండా ఉన్న అక్షిత్ దగ్గరనుండి బలవంతంగా ఫోన్ తీసుకొని."మామయ్యా అక్షిత్ ను ప్లే స్కూల్ కు తీసుకెళ్లే సమయం అయింది. మరలావచ్చాక ఫోన్ చేస్తాను " చెప్పింది ఊహ .
“అక్షిత్ తో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉందమ్మా .మా అబ్బాయి జయదేవ్ ఉన్నాడా ...."
"ఆయన కార్ దగ్గర మా కోసం ఎదురు చూస్తున్నారు .సాయంత్రం ఫోన్ చెయ్యమంటాను మామయ్యా. ఇక ఉంటాను " అంటూ ఫోన్ పెట్టేసింది ఊహ
అక్షిత్ , ఊహ కూర్చొనగానే కార్ స్టార్ట్ చేసాడు జయదేవ్ .
“అక్షిత్ తెలుగులో మాట్లాడుతుంటే మీ నాన్నగారు చాల ఆనందం పొందుతున్నారు" అంది ఊహ.
“ నీ వల్ల, మా నాన్న వల్ల మన అక్షిత్ చెడిపోతున్నాడు "
“ ఏమిటండీ మీరనేది “
“ మనం ఉండేది తడుకుపేటలో కాదు. విదేశంలో ఉన్నాము.మూడు సంవత్సరాలు నిండింది కదాని ప్లే స్కూల్ నందు చేర్పించాము . మరో రెండెడ్ల తరువాత స్కూల్ నందు చేర్పించాలి . ఇక్కడ కూడా చదువుల్లో పోటీ ఉంటుంది. వాడు బాగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ముందు మనం వాడితో ఇంగ్లీష్ లో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి అని ఎన్ని సార్లు చెప్పాలి.ఎప్పుడూ ఇంట్లో ఉండే నీవు ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా చెప్పకుండా తెలుగులోనే మాట్లాడుతావు .మా నాన్న చదువుకోని వ్యక్తి అయితే పరవాలేదు .హై స్కూల్ హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు. తెలుగులో మాట్లాడవద్దని ఎన్ని సార్లు చెప్పినా వినరు. " విసుగ్గా అన్నాడు జయదేవ్
"స్కూల్ నందు చేర్పించినప్పుడు వాడి చదువుగురించి నేను చూసుకొంటాను లెండి. మన భాష సమస్య రాదు. స్కూల్ కు వెళ్లే లోపున మన అబ్బాయికి తెలుగులో పిల్లల పాటలు వేమన పద్యాలూ నేర్పిస్తాను. మమ్మయ్య కూడా అదే చెప్పారు చిన్ని చిన్ని కథలు కూడా ఇకపై చెప్పాలనుకొన్నారంట " " అంది ఊహ.
“మాటలు కాకుండా పద్యాలు పాటలు కథలూ ప్రారంబిస్తావా .తెలుగు మీద అంత పిచ్చి ఉండకూడదు. ఆంగ్లంలో కూడా ఎన్నో పద్యాలు కథలు ఉన్నాయని తెలీదా " అంటూ విసుగ్గా తల కొట్టుకున్నాడు.
భర్త మాటలకు ఏవిధమైన సమాధానం చెప్పకుండా మౌనంగా తలవంచుకొంది.
కొడుకును,భార్యను ప్లే స్కూల్ దగ్గర వదలి " ఈ వేళ ఇంటిలోనే లాప్ టాప్ ద్వారా చేసే పని ఉంటె స్కూల్ వదలడానికి ముందు వస్తాను. ఆఫీస్ నందే పని ఉంటె ఫోన్ చేసి చెబుతాను. నీవు అక్షిత్ ను తీసుకొని ఇంటికి వెళ్ళు ఊహా " అంటూ ఆఫీస్ కు బయలుదేరాడు జయదేవ్. .
ఊహ లోనికి వెళ్లి అక్షిత్ ను పిలుచుకొని భర్త కోసం ఎదురు చూడసాగింది. ఇంట్లోనే లాప్ టాప్ ద్వారా పని ఉండటం వల్ల లో స్కూల్ కు వచ్చాడుజయదేవ్
అక్షిత్ చాలా ఉత్సాహంగా ఉండటం గమనించాడు.
"అక్షిత్ ఈ రోజు ఏమైనా కొత్త గేమ్స్ నేర్పించారా ..." ఆంగ్లంలో అడిగాడు జయదేవ్.
జయదేవ్ గత కొంత కాలంగా అక్షిత్ తో ఇంగ్లీషులో మాట్లాడటం ప్రారంభించాడు. జయదేవ్ ఆంగ్లంలో ప్రశ్నించినా అర్థం చేసుకొని తెలుగులో సమాధానం ఇవ్వడం అలవాటు చేసుకొన్నాడు అక్షిత్. జయదేవ్ కు అక్షిత్ తెలుగులో సమాధానం ఇవ్వడం నచ్చకున్నా కొంతకాలం పోయిన తరువాతైనా ఆంగ్లంలో సమాధానం చెబుతాడన్న నమ్మకంతో ఉన్నాడు.
కార్లో కూర్చుని ఇంకా కార్ స్టార్ట్ చెయ్యలేదు. అక్షిత్ ఒక్కసారిగా తండ్రి కళ్ళను ఒక చేతితో మూస్తూ " వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమి " అంటూ తండ్రి చేతిని మరో చేతిలోకి తీసుకొని తల్లి వైపు చూపించాడు
ఆ మాటలకు బాంబు పడ్డట్టుగా ఉలిక్కి పడ్డాడు. తన కళ్ళపైనున్న చేతిని తీసివేసి" ఏమిటీ ఈ ఆట నేర్పించారా " ఆశ్చర్యంగా అడిగాడు.
“ అక్కడ ప్లే స్కూల్ నందు ఆడుకొంటూ ఎలాగో తెలుగు అబ్బాయిలు నలుగురు కలుసుకున్నారు. అందులో ఒక అబ్బాయి ఈ అట నేర్పించాడట. వీళ్ళు ఆడుతున్న ఆటను చూసి . అక్కడి పిల్లలందరూ ఈ ఆటను సరదాగా ఆడుకొనడం ప్రారంభించారట"అంది ఊహ.
‘ప్రపంచంలో అన్ని భాషలూ గొప్పవే. అన్నింటికన్నా గొప్పదైన మాతృబాష ను గౌరవించు ' అంటూ తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చింది.ఇక్కడకు వచ్చినా ఎంతోమంది తమ మాతృ భాషను గౌరవిస్తున్నారు. నేనే పొరపాటు బడ్డాను 'అని అనుకొన్నాడు
“అక్షిత్ ఇంటికెళ్ళాక మనమందరం వీరీ వీరీ గుమ్మడి పండు ఆడుకొందామా "అంటూ తెలుగు లో అడుగుతున్న భర్త వైపు ఆశ్చర్యంగా సంతోషంగా చూసింది ఊహ.
(అయిపొయింది)
హామీ పత్రం
" వీరీ వీరీ గుమ్మడి పండు " కథ నా స్వంతము. నా స్వీయ రచన. దేనికి నువాదము,అనుకరణ,అనుసరణ కాదని హామీ ఇస్తున్నాను. ఇంతవరకు ఎక్కడా ప్రచురుణ,ప్రసారము కాలేదని హామీ ఇస్తున్నాను.
ఇట్లు
ఓట్ర ప్రకాష్ రావు
cell No: 09787446026
చిరునామా
Otra Prakash Rao,(Rtd.BHEL),
84-A, Jyothi samy Temple street,
Tiruttani. Pin :631209
Tamil Nadu .
Cell: 09787446026 email:[email protected]
|