Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly-horoscope march8th to march 14th

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

దేవుడి రిమోట్ కంట్రోల్!

ఒకప్పుడు ఏ ఎలక్ట్రానిక్ ఉపకరణాన్నన్నా ఉపయోగించుకోవాలంటే దాని దగ్గరకు వెళ్లు స్విచ్ లు ఆపరేట్ చేయాల్సి వచ్చేది. మనిషి స్వతహాగా బద్ధకస్తుడు. విస్తట్లో అన్నీ వడ్డిస్తేనే బాసింపట్టు వేసుకుని సుష్టుగా తింటాడు. ఏ మహానుభావుడోగాని రిమోట్ కంట్రోల్ కనుక్కున్నాడు. ఇహ మనిషి జీవితం మరింత సౌకర్యవంతంగా..సుఖవంతంగా మారింది. మంచం మీదో, సోఫా మీదో పడుకుని అలవోకగా వేళ్లతో స్విచ్ లు ఆపరేట్ చేస్తూ టీ వీలోని ఛానల్స్ మార్చుకోవచ్చు, ఫాన్ ఆన్ ఆఫ్ చేయడంతో పాటు వేగాన్ని నియంత్రించవచ్చు.

మొన్నొకసారి రిమోట్ ను చూస్తున్నప్పుడు నాకో వింత ఆలోచన కలిగింది. అదేమిటంటే- మనం దేవుడు ఆడించే బొమ్మలమని ఏనాడో ఓ పెద్ద మనిషి చెప్పాడు. అప్పుడు భగవంతుడు మనకు తాళ్లు కట్టి ఆడించే తోలుబొమ్మలమయితే, ఇప్పుడు ఈ మాడర్న్ టైం లో ఆయన రిమోట్ తో ఆడించే బొమ్మలమన్నమాట! కాలం మారింది కదా!

మన మనసులోని ఆలోచనలు ఒక్కోసారి అనూహ్యంగా మారిపోతుంటాయి. అంటే ఎవరో మన మనసు ఫ్రీక్వెన్సీని తమ చేతిలో ఉన్న ఉపకరణంతో (రిమోట్) మార్చినట్టుగా!

ఒక చోటకు వెళ్లాలని అనుకుని క్షణంలో మనసు మార్చుకుని మరోచోటకి వెళ్లడం తదనుగుణంగా లాభ నష్టాలు జరగడం. హాయిగా ఇంటి పట్టున ఉండే కుర్రాడికి అప్పటికప్పుడు స్నేహితులతో ఏ జలపాతాల దగ్గరకో, నదుల దగ్గరకో వెళ్లి ఈత కొట్టాలని సెల్ఫీలు తీయించుకోవాలని అనుకోవడం..అలా వెళ్లి అంతమయిపోవడం..

భగవంతుడు ఎంత శక్తిమంతుడైనా, పెరిగే జనాబాని ఎలా నియంత్రించగలడు? అందుకే ఆయనా తన దగ్గరున్న (స్వర్గంలో) లేక తన దగ్గరకొచ్చిన సైంటిస్ట్ ల (భూమ్మీద మరణించి) చేత రిమోట్ లాంటి ఉపకరణాలు చేయించుకుని అందరి జీవితాలను నిర్దేశిస్తున్నాడు. విచిత్రమేమిటంటే, దేవుడిదగ్గరున్న కంప్యూటర్ మోస్ట్ పవర్ ఫుల్. అద్భుతమైన మెమరీ చిప్స్ కలిగి ఉంటుంది. ప్రోగ్రామ్ లో బగ్స్ అస్సలుండవు. పైగా ఆ కంప్యూటర్ రిమోట్ తో ఆపరేట్ చేయబడుతుంది. రిమోట్ లోని బ్యాటరీ డిస్చార్జ్ అవదు, లేదా పాడవదు. ఆయన ప్రోగ్రాం ని ఎవరూ హ్యాకింగ్ చేయలేరు.

ఏదేమైనా మనం ఆయన చేతి సెల్ ఫోన్ లోని వీడియో గేమ్ పాత్రలం కూడా! ఎవర్ని ఉంచుతాడో, తుంచుతాడో తెలీదు.  దేవుడు భలే క్రేజీ కదా! ఆయణ్ని మంచి చేసుకుందామని పూజలు, పునస్కారాలు, స్తోత్రాలు చేసినా ఆయన తన పని తను చేసుకుపోతుంటాడు కాని, మన పాపాల్నుంచి మనకు వెసులుబాటు కల్పించడు. అంచేత మనం ఆయన్ని కాకుండా మరో మనిషిని మానవతావాదంతో, జీవరాశిని సమదృష్టితో ఆదరిస్తే అప్పుడు ఆయన కాస్త కరుణించే అవకాశం ఉంది. మనుషులం విచక్షణా జీవులం కదా! అసలు ఆయన విచక్షణ మనకు ప్రసాదించింది అందుకే కదా!

మరిన్ని శీర్షికలు
Bellamin & Rose Water