Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> వంశీకి నచ్చిన కథ - చూపు

choopu telugu story by harikishan

క్యారియరు బ్యాగు భుజానికి తగిలించుకొని ఎయిట్ సీటర్ ఆటోలో డ్రైవరు పక్కన ముందు సీటులో కష్టపడి సర్దుకున్నా. వెనిక సీట్లన్నీ లేడీ స్టాఫ్ తో నిండిపోయి ఉన్నాయి. ఆటో దడదడదడ శబ్దం చేస్తూ ముందుకు పోసాగింది. కూర్చోవడం కష్టంగా ఉంది. ఒక్క డ్రైవర్ మాత్రమే కూర్చునే సీట్లో నలుగురుం ఇరుకున్నాం.

దాదాపు ప్రతిరోజు ఇలాగే గంట ప్రయాణం చేయాలి. బస్సెక్కితే మెయిన్ రోడ్డు మీద దించెళతాది. అక్కణ్ణించి ఊరు చేరడానికి మూడు కిలోమీటర్లు మట్టిరోడ్డు మీద నడిచి వెళ్ళాలి. ఇది చాతగాకపోతే  ఆటోనే గతి. ఆ దడదడలలోనే ఆటోలోని తెప్ రికార్డు 'ఓలమ్మీ తిక్కరేగిందా... ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా' అంటూ తన శక్తినంతా ప్రయోగిస్తూ ప్రయాణీకులను మైమరపించడానికి ప్రయత్నిస్తుంది. ఎదురుగా వాహనాలు వస్తున్నాయి. బస్సులు, జీపులు, లారీలు, ఆటోలు, కార్లు దూసుకుపోతున్నాయి. వెనకనుంచి ఎర్రటికారు మమ్మల్ని దాటుకుంటూ ముందుకు పోయింది.

దానిని చూడగానే మా తమ్ముడి కారు కళ్ళముందు మెదిలింది. మళ్ళీ మనసంతా అవే ఆలోచనలు. వద్దనుకున్నా కమ్ముకుంటూ...

వారం రోజులుగా ఎవరికీ చెప్పుకోలేక, లోలోపలే కుమిలిపోతూ, వాడితో నన్ను పోల్చుకుంటూ, గిల్టీగా ఫీలవుతూ, నా అశక్తతను గుర్తుచేసుకుంటూ మనసుని అదుపులో ఉంచుకోలేక పడుతున్న బాధ... ఎవరి మీద చూపించాలో తెలీని కోపం... అసహనం.

తమ్ముడి కొడుకు మొదటి పుట్టినరోజుకి హైదరాబాదుకి పోయినప్పటి సంఘటనలన్నీ వద్దనుకున్నా పదేపదే గుర్తుకురాసాగాయి.

-----------

"అన్నా... ఎలా ఉన్నాయి అరేంజ్ మెంట్స్" అన్నాడు కిరణ్ హోటల్ కింద ఫ్లోర్ లో ఉన్న రెస్టారెంట్లో ఫంక్షన్ ఏర్పాట్లను చూపిస్తూ.

"బాగున్నాయిరా... మీల్సెంత?" చుట్టూ చూస్తూ అడిగాను. "ప్లేట్ టూట్వంటీ రూపీస్. డ్రింక్స్ సపరేట్."

"ఎక్కువ కదరా."

"సిటీలో అంతేన్నా. అదీగాక ఐటమ్స్ ఫిష్ నుండి కూల్ డ్రింక్స్ వరకూ దాదాపు ఫార్టీ వెరైటీలు ఉన్నాయి కదా."

"ఎంతమంది రావచ్చు."

"దాదాపు ఒన్ ఫిఫ్టీదాకా ఎక్స్ పెక్ట్ చేస్తున్నా."

"స్థలం సరిపోతుందా" చుట్టూ పరిశీలిస్తూ అడిగాను.

"సరిపోతాదిలే. అదీగాక అందరూ ఒకేసారి రారుగదా. వచ్చేవారు వస్తుంటారు. డిన్నర్ చేసి పోయేవారు పోతుంటారు."

"అంతేలే... తొందరగా రావాలన్నా ఈ ట్రాఫిక్ జాముల్లో ఎవరు ఎప్పుడొస్తారో" నవ్వుతూ అన్నాను.

"అన్నా... మనవాళ్ళు ఎవరైనా వస్తే రిసీవ్ చేసుకుంటుండు. మా కొలీగ్స్ ఇంకా రాలేదు. ఎక్కడున్నారో కనుక్కుంటా. వస్తూనే మొదలుపెడదాం."

కిరణ్ గేటువైపు కదిలాడు.

నేను చివరలో ఒక చోట కూర్చుని చూడసాగాను.

పచ్చటి మెత్తని లాన్ మధ్యలో చిన్న స్టేజ్. స్టేజి మీద అమర్చిన టేబుల్ పైన ఎర్రటి వెల్వెట్ క్లాత్. దానిపై పెద్ద కేక్. ఆ కేక్ పైన "హ్యాపీ బర్త్ డే అఖిల్" అనే అక్షరాలు. కేక్ మధ్యలో అంటించడానికి సిద్ధంగా ఉన్న కొవ్వొత్తి. పక్కన పిల్లలకు పంచడానికి తెచ్చిన క్యాట్ బరీ చాక్లెట్లు, చిన్న చిన్న బహుమతులు.

స్టేజ్ ముందు వరుసగా మెత్తని కుర్చీలు వేయబడి ఉన్నాయి. కుడివైపు డిన్నర్ కి ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్, డ్రింక్స్... అన్నీ ప్రత్యేక కౌంటర్లలో. ఒకదాని పక్కన ఒకటి ఎదురుచూస్తూ ఉన్నాయి.

ఆహుతుల్లో చాలామంది ఖరీదయిన కార్లలో వస్తున్నారు. దాదాపు అందరిదీ ఒకే వయసు. ఇరవై అయిదు, ముఫ్ఫై అయిదు మధ్యలో ఉన్నారు. విలువైన బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తుల్లో, బంగారు చైన్లు, ఉంగరాలు, బ్రాస్ లెట్స్ వేసుకుని, ఖరీదైన సెల్ ఫోన్లు చేతుల్లో పట్టుకుని 'హాయ్ హాయ్' అంటూ పలకరించుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు.

వాళ్ళందర్నీ పరిశీలనగా చూస్తుండగానే నా భార్య వచ్చింది.

"గిఫ్ట్ ఇస్తావా..."

జేబులోంచి బంగారు గొలుసున్న చిన్న ఫ్లాస్టిక్ డబ్బా తీసి అందించాను.

"ఇచ్చేటప్పుడు పిలుస్తాను. రా..." అంది.

"ఫరవాలేదులే. నువ్విచ్చేయ్" అన్నాను.

నా భార్య దాన్ని హ్యాండ్ బ్యాగ్ లో భద్రపరచుకుంటూ కోపంగా చూసి వెళ్ళిపోయింది.

అంతకు ముందు మూడు రోజుల కిందట, ఆ గొలుసు కోసం చిన్న గొడవ జరిగింది.

"నీకేమి మొగోనివి. తోడికోడలి ముందు, వాళ్ళ బంధువుల ముందు తలదించుకోవాల్సిందీ, మాటపడాల్సిందీ నేనే. మొన్న పాప నామకారణానికి ఇంతలావు గొలుసు మెడలో వేసినాడు. అంతకుముందు బాబు పుట్టెంట్రుకలు తీసినపుడు పదివేలు వాని చేతిలో పెట్టినాడు. దానికితోడు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఖరీదయినవి పిల్లలకి తెచ్చిస్తూనే ఉన్నాడు. తోసుకోవడమే గాదు ఇవ్వడం కూడా ఉండాల. లేదంటే అలుసయిపోతాం..."

"అదికాదే... వాడంటే సాఫ్ట్ వేర్ ఇంజనీరు. వానికీ మనకూ పోలికా... మరో రెండు నెలల్లో చిన్నదాన్ని బళ్ళో వేయడానికి డొనేషన్ కావాలి. ఇప్పుడు ఖరీదయినవంటే కష్టంగదా. ఏదయినా ఒక బొమ్మనో, బట్టనో పెడ్తే సరిపోదూ... వాడు ఏమీ అనుకోడులే."

"మొదట్నించీ చూస్తున్నదే గదా నీ వరుస. ఫంక్షన్లకు గూడా పట్టుచీరలెందుకు అనే టైపు నువ్వు. మీరంటే అన్నాదమ్ముళ్ళు. సర్దుకుంటారు. నా పరిస్థితి అట్లా కాదు. మీ చెల్లెలు ముందు, తోడి కోడలి ముందు, వాళ్ల బంధువుల ముందు నా మర్యాద పోతాది. ముందు ఏమి అనకపోయినా వెనక చెవులు కోరుక్కుంటారు. ఆడదానివయిపుడ్తే తప్ప నా బాధ నీకర్ధం కాదు. కనీసం ఒక గొలుసయినా తీసుకుపోదాం."

ఆ మాటలకు కాసేపు మౌనంగా ఉండి అంది "చేతి నుండి ఏమి పడకుండా నేనొకటి చెప్తా విను. పాప గొలుసుంది కదా... దాన్ని కరిగించి వేరే డిజైన్ చేపిచ్చుకురా... ఇచ్చేద్దాం."

"ఆడపిల్ల గొలుసా" నసిగాను.

"ఐతే ఇంకోపని చేద్దాం. చిన్నదానికి బాగాలేదని చెప్పి నేనూ, పిల్లలు ఈన్నే ఉంటాం. నువ్వు ఒక్కనివే పోయిరా..."

ఇక నాకు మాట్లాడే అవకాశం దొరకలేదు.

పాప గొలుసు కరిగి కొత్తరూపం దాల్చుకుంది.

ఆలోచనల్లోనే సెల్ మోగింది. తీయడానికి జేబులో చేయివేశా. రెండు మూడు కళ్ళు ఆశబ్దానికి తిరిగి నన్నే చూస్తున్నాయి. తీయడానికి సిగ్గనిపించి జేబులోనే అరవకుండా దాని పీక పిసికేశా.

లైఫ్ లాంగ్ కార్డేసి, ఆ బ్లాక్ అండ్ వైట్ పీస్ నాకిచ్చేసి, నీవు వేరే మోడల్ కలర్లో కెమెరా, ఎమ్పీత్రీ వున్నది కొనుక్కో" అని నా భార్య చాలా సార్లు చెబుతూనే ఉంటాది. సంగీతం వినడమంటే ఎంత ఇష్టమైనా జీవితంలో ఒకసారి ఒక వస్తువును మాత్రమే కొనగలిగే నాకు, మళ్ళీ అదే వస్తువుపై ఐదారువేలు పోయాలంటే చాతగావడం లేదు.
ధైర్యం చేద్దామని అప్పుడప్పుడు అనిపించినా ఇంటి బడ్జెట్ అంతా కళ్ళముందు మెదులుతాది.

ఇంటి అద్దె, పిల్లలకు ఆటో, స్కూలు ఫీజు, సరుకులు, కూరగాయలు, ఎల్ఐసీ, పోస్టల్ ఆర్డీ... ఇలా లెక్కలేసుకుంటూ పోతే మిగిలేది ఏ వెయ్యో... ఐదువందలో... అదిగూడా పండగలకు బట్టలు కొనాల్సి వచ్చినప్పుడో,శుభాకార్యాలప్పుడో, అనుకోని ఆపదలొచ్చినప్పుడో హారతయిపోతాది. ఆరునెల్లకోసారి పెరిగే 'డీఏ' ల కోసం, సంవత్సరానికోసారి పెరిగే ఆన్యువల్ ఇంక్రిమెంట్లకోసం, ఐదు సంవత్సరాల కోసారి జరిగే రివిజన్ కోసం నిరంతరం ఎదురుచూస్తూ, కలలు కంటూ, బడ్జెట్ ఫ్లానును ఎప్పటికప్పుడు సవరించుకుంటూ బండిని ముందుకు నడిపే నాకు కొన్ని కోరికలు తీరని కల.

"సర్... ప్లీజ్" అనే మాట వినబడేసరికి తలెత్తి చూశాను. ఎదురుగా ఇద్దరు యువకులు. మూతి మీద అప్పుడప్పుడే మీసాలు మొలకలేస్తా ఉన్నాయి. "ఏం" అన్నట్లు కళ్లెగరేశాను.

"ఎవరైనా వస్తారా?" అన్నారు న పక్కనున్న ఖాళీ కుర్చీలని చూపిస్తూ.

"లేదు లేదు కూర్చోండి" అంటూ కొద్దిగా వెనక్కి జరిగాను. వాళ్ళు నన్ను దాటుకుంటూ పోయి సీట్లలో కూర్చొని మాటల్లో పడ్డారు.

పక్కనే ఉండడంతో వారి మాటలు నా ప్రమేయం లేకుండానే వచ్చి చెవుల్లో పడుతున్నాయి.

"ఏం గురూ! అమెరికా పోయే ఆలోచనేమన్నా ఉందా?"

"లేదు గురూ... ఐనా ఒకప్పుడు ఇక్కడ సంపాదించుకునే అవకాశాల్లేక అక్కడకు పొయినారు గానీ, ఇప్పుడు మన్లాంటి జెమ్స్ ఇక్కన్నే కాస్త అనుభవముంటే నెలకు యాభై పైనే ఇచ్చే సంస్థలు కొల్లలున్నాయి. అదీగాక ఈ మధ్య రోజురోజుకి మన రూపాయి బలపడుతూ ఉంది. అప్పుడే టెన్ రూపీస్ తేడా వచ్చింది..."

ఆ మాటలు వింటుంటే నాకు నా జీతంగుర్తుకొచ్చింది. పీహెచ్ డీ చేసి డాక్టరేట్ సంపాదించినా అప్పటికే నాలుగు కాలేజీల్లో అవకాశాలు మూసుకుపోవడంతో మరోదారి లేక డీఎస్సీలో టీచర్ ఉద్యోగం సంపాదించాను.

నెలకు పన్నెండు వందల్తో ప్రారంభం. పది సంవత్సరాలు దాట్నా ఇంకా తొమ్మిది వేలు దాటని జీతం.

తమ్మునివి చిన్నప్పటి నుంచీ కాన్వెంట్ చదువులే. డిగ్రీ పూర్తికాకుండానే అప్పుడే తెరమీదకొస్తున్న ఎంసీఏ లో చేరి పూర్తయ్యేసరికి క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం సంపాదించేశాడు. మీసాలు కూడా పూర్తిగా మొలవకముందే ఇరవై వేలతో ప్రారంభమై ఐదు సంవత్సరాలు తిరిగేసరికి, నాలుగు కంపెనీలు మార్చేసి, అరవై వేలకి చేరుకున్నాడు. హైదరాబాదులో డబల్ బెడ్ రూం ఫ్లాట్ కొనేశాడు. మరో సాఫ్ట్ వేర్ ని మంచి కట్నంతో పెండ్లి చేసుకున్నాడు. ఆ డబ్బుతో నాన్న చెల్లెలికి ఒక ఇంజనీర్ సంబంధం తేగలిగాడు. దాంతో వాళ్ళందరి ముందూ నా పరిస్థితి తీసేసినట్టయిపోయింది. ఇంతకుముందులా వాళ్ళతో స్వేచ్చగా కలవలేకపోతున్నాను.

అంతలో హడావిడి మొదలైంది.

ముఖ్యమైన వాళ్ళంతా వచ్చేశారు. బొద్దుగా, ముద్దుగా నల్లని సూట్ లో చిరునవ్వులు చిందిస్తున్న అఖిల్ చేయి పట్టుకొని కిరణ్ కేకు కట్ చేయిస్తుంటే, అందరూ చప్పట్లు చరుస్తూ "హ్యాపీ బర్త్ డే" అంటూ వెనకనుంచి వస్తున్న మ్యూజిక్ తో గొంతు కలిపారు.

దగ్గరి బంధువులు తమ తాహతును తెలియజేసే బహుమతులు మొదట అందజేస్తుంటే... నా భార్య కళ్ళతోనే నాకోసం గాలించి... కనబడకపోయేసరికి ఇది మామూలే అన్నట్లు గొణుక్కుంటూ... బంగారు గొలుసు తీసి అందరి ముందూ కాస్త గర్వంగా అఖిల్ మెడలో వేస్తూ ఫోటో దిగింది.

స్నేహితులంతా ఏవేవో బహుమతులు అందజేస్తూ విషెస్ చెబ్తూవుంటే మరోపక్క డిన్నర్ ప్రారంభమైంది.

అందరూ వెళ్లేసరికి రాత్రి పదకొండు దాటింది.

"అన్నా... టుమారో మార్నింగ్ టెన్ థర్టీకి వస్తాను. రెడీగా ఉండండి. ఇంటికి పోదాం" అన్నాడు కిరణ్ బై చెబుతూ.

'ఇంట్లో ఎందుకు అందరం ఇరుకిరుకుగా' అంటూ అదే హోటల్లో గది తీశాడు. పొద్దున బస్టాండ్లో దిగగానే రిసీవ్ చేసుకొని నేరుగా హోటల్లోనే వదిలి వెళ్ళాడు. నిద్రపోతున్న చిన్నోన్ని భుజమ్మీద వేసుకొని లిఫ్ట్ లో నాలుగో అంతస్తులోని గదికి చేసుకున్నా.

తరువాత రోజు పొద్దునే కిరణ్ వచ్చి బిల్ పే చేసి ఇంటికి తీసుకునిపోయాడు.

ఇల్లు చాలా అందంగా విశాలంగా ఉంది. గృహప్రవేశం తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. గదులన్నీ విలాసవంతమైన వస్తువులతో నిండిపోయి ఉన్నాయి. ఒక్కొక్క గదిని చూస్తూ షోకేస్ దగ్గరకొచ్చి ఆగాను. అందులో బంగారు రంగులో మెరిసిపోతున్న చిన్న ఫ్లవర్ వాజ్ లాంటిది కనిపించింది. గాని వెడల్పాటి మూతికి ఎరుపురంగులో రిబ్బన్ కట్టివుంది. అది బోసిగా అనిపించి పక్కనేవున్న ఇంకో ఫ్లవర్ వాజ్ నుండి కొన్ని పూలు తీసి అందులో ఉంచబోయాను.

అంతలో "అన్నా... అన్నా... అందులో ఏమీ పెట్టొద్దు" అన్నాడు గట్టిగా తమ్ముడు వెనుక నుంచి.

"ఏంరా" అన్నాను. చెయ్యి వెనక్కి తీసుకుంటూ.

"అన్నా... అది ఫ్లవర్ వాజ్ కాదు. అక్షయ పాత్ర. ఈ మధ్య కంపెనీ వర్క్ మీద ఫోర్ వీక్స్ చైనాకు పోయెచ్చా. అక్కడ ప్రతి హౌస్ లోనూ ఇది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని అలాగే ఖాళీగా ఉంచాలంట. అప్పుడు దేవతలు అది చూసి 'అరెరే ఎమీలేదే' అని అందులో ధనరాసులు నింపుతూ ఉంటారంట" అన్నాడు.

అంతలో మా చెల్లెలు గోడమీద పెద్దగా అతుక్కొని ఉన్న ప్లాస్మాటీవీని చూస్తూ "అదెంతరా కిరణ్" అనింది. వాడు నవ్వుతూ "ఫార్టీ నైన్ థౌజండ్సక్కా. థియేటర్లో చూసిన ఫీలింగ్ వస్తాది" అంటూ దాన్ని ఆన్ చేశాడు.

అంతలో మా మరదలు మాటల్లో తలదూరుస్తూ "మొన్న గోల్డన్ ఈవెంట్ రెస్టారెంట్లో ఇలాంటి టీవీలు కొన్న ఫ్యామిలీలకంతా సచిన్ తో కలిసి డిన్నర్ చేసే అవకాశం ఇచ్చారు. నేనూ మీ తమ్ముడు పోయెచ్చాం. సచిన్ తో ఆటోగ్రాఫ్ తీసుకోవడంతో పాటు ఫోటో కూడా దిగాం" అంటూ లోపలికిపోయి ఆల్బమ్ తీసుకొచ్చింది.

మాటల్లోనే మధ్యాహ్నం కావచ్చింది. పిల్లలు ఇంట్లో వున్న రకరకాల విదేశీ మ్యూజికల్ టాయ్స్ తో ఆటలాడ్తూ బిజీగా ఉన్నారు. రేపు తిరిగి డ్యూటీలో జాయిన్ కావాల. సంవత్సరం ఆఖరు కాబట్టి సెలవుల్లేవు. దాంతో ముందుగానే పిల్లల్తో ఇబ్బంది పడకుండా మూడుగంటల రైలుకి రిజర్వు చేసుకున్నా.

భోజనాలు పూర్తికాగానే బ్యాగులు సర్దుకున్నాం. నా భార్యకు, పిల్లలకు ఖరీదయిన బట్టలు బహుమతిగా ఇచ్చారు. వాటిని చూస్తే ఎందుకో భయం వేసింది. చెల్లెలు తర్వాత రోజు వెళ్తానంది. అమ్మానాన్నలు మరో వారంరోజులు ఉంటామన్నారు. అందరకీ వీడ్కోలు పలికి బైటపడ్డాం. కిరణ్ రైల్వేస్టేషన్ వరకూ కారులో డ్రాప్ చేశాడు.

రైలు కదిలి తిరిగి ఇంటికి వస్తున్నా అవే ఆలోచనలు. నా భార్య కూడా తప్పనిసరై అప్పుడప్పుడు ఒకటి రెండు మాటలు మాట్లాడ్తున్నా చాలావరకు మౌనంగానే ఉంది.

ఆమె మనసులో కూడా ఇలాంటి అల్లకల్లోలమే జరుగుతున్నట్టుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ఇలాగే ఉంటుంది. మళ్ళీ కొన్ని వారాలకుగానీ పూర్తిగా సర్దుకోలేం.

తమ్ముడితో రోజురోజుకీ దూరం పెరిగిపోతోంది. మనసు విప్పి మునుపటిలా స్వేచ్చగా మాట్లాడలేకపోతున్నా. మధ్యలో ఇనుపతెరలు పైకి లేస్తూ ఉన్నాయి. నా పరిస్థితి గమనిస్తూ నాన్న అప్పుడప్పుడు బాధపడేవాడు.

"రేయ్! నిన్ను బళ్ళో వేసేనాటికి కాన్వెంటు చదువులు చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు రావని ఎవరూ వేసేటోళ్ళు కాదు. చిన్నోని కాలానికి ఇంగ్లీషు మీడియాలు పుంజుకున్నాయి. మా స్నేహితుడు సదాశివం బలవంతం మీద వాని కొడుకుతో బాటు వీన్ని కూడా అందులో చేర్పించా. అక్కడికీ మనసు పాకుతానే ఉండేది. చిన్నోనికేమన్నా అన్యాయం చేస్తున్నానా అని. కానీ నా అంచనాలు ఇంత తలకిందులైపోతాయనీ... ఈ పదేళ్ళలో ఇంత మార్పు వస్తుందనీ నేనెప్పుడూ ఊహించలేదు.. నిన్ను అనవసరంగా తెలుగు మీడియంలో వేసి, భవిష్యత్తు పాడు చేశానేమో అని బాధ కలుగుతావుంది" అనేవాడు.

ఆటో కుదుపులకు ఈ లోకంలోకి వచ్చాను. ఆటో మెయిన్ రోడ్డు మీంచి నేను పనిచేసే ఊరువైపు తిరిగింది. రోడ్డంతా గుంతలే.

ఈ సంవత్సరం వానలు బాగా కురిసి భూమి బాగా పదునెక్కింది. వరుసగా రెండు సంవత్సరాలు వానల్లేక కడుపు చేత పట్టుకొని కర్నూలుకి వలస పోయిన చిన్నచిన్న రైతులు తిరిగి ఊరికి చేరుకున్నారు. రోడ్డంతా పొలాలకు వెళ్తున్న రైతులతో, కూలీలతో కళకళలాడుతోంది. మధ్యలో బడి మానేసి కూలిపనులకు పోతున్న పిల్లలు మమ్మల్ని చూడగానే సిగ్గుతో తల పక్కకు తిప్పుకొని పోతావున్నారు. హైస్కూలు పోయే పిల్లలు సంచీలు నెత్తికి తగిలించుకొని ఉండటంతో హైస్కూలుకు పోవాలంటే నన్నూరో, ఓర్వకల్లో పోవాలి.

వాళ్ళను చూస్తుండగానే ఆటో బడి దగ్గరికి చేరుకుంది. డ్రైవరు చేతిలో పది రూపాయలు పెట్టి బడి వైపు అడుగులేశాను. పిల్లలింకా వస్తూనే ఉన్నారు. మమ్మల్ని చూస్తూనే కొందరు పరుగున దగ్గరికొచ్చి "సార్... బ్యాగు" అంటూ మా పక్కనే నడవసాగారు. ప్రార్ధన పూర్తి కాగానే తరగతి గదికి చేరుకున్నా.

హాజరు వేస్తావుంటే "మేకమింగు సార్" అని వినబడి తలెత్తి చూశాను. ఎదురుగా సుబ్బన్న వాళ్ళనాయనతో వున్నాడు. వాని ఉచ్చారణకి లోలోపల నవ్వుకుంటూ 'కమిన్' అన్నాను. దాదాపు పది రోజులైంది వాడు బడికి రాక. వాళ్ళ నాయనతో బాగా పరిచయమే. కనపడ్డప్పుడల్లా పలకరిస్తుంటాడు.

"ఇట్లా ఇష్టమొచ్చినప్పుడు వస్తే ఆబ్సెంటు వేస్తాను" కోపంగా అన్నాను.

"అది కాదు సార్, పొలం పనులకు కూలీలు దొరక్క" సుబ్బన్న నాన్న నసిగాడు.

"అబద్ధాలు చెప్పొద్దు. బైటి పొలాలకు పంపుతున్నావని తెల్సునాకు. ఐనా ఎంతిస్తారు వానికి కూలీ?"

"నాకైతే అరవై వస్తాది కానీ, వీనికి రెక్కలింకా బలం పుంజుకోలా కదా... రోజుకు ఇరవయ్యి, ముఫ్ఫై ఇస్తారు..."

ఆ మాటలినగానే మనసంతా ఎలాగో అయిపోయింది.

"అదికాదు, నువ్వు ఇరవైకీ ముఫ్ఫైకీ ఆశపడ్తే వానికొచ్చిన కాస్త చదువు కూడా మట్టిగొట్టుకుపోతాది. ఆ పైన బాధపడి లాభముండదు."

"ఏం చెయ్యమంటారు సార్. మీ మాదిరి కాలుమీద కాలేసుకొని ఫ్యాను కింద కూచోని నెలకు ఐదారువేలు సంపాదించే బతుకులు కాదు కదా మావి. ఇంట్లో ఉన్న నలుగురమూ రెక్కలు ముక్కలు చేసుకున్నా రోజుకు నోరు రూపాయలు రాలవు. అదీ పంటల కాలమే. ఒక్కరోజు కూడా నామం పెట్టకుండా పంపుతే" అంటూ కష్టాలన్నీ ఏకరువు పెట్టాడు.

సుబ్బన్న వంక చూశాను. తల వంచుకొని భయం భయంగా అప్పుడప్పుడు కళ్ళెత్తి నావంక చూస్తున్నాడు. వాడిని పరిశీలనగా చూశాను.

మాసి చెమటకంపు కొడుతున్న చొక్కా, రేగిన జుట్టు, ఎండలో పనిచేసి చేసినల్లబడిన శరీరం, సరైన తిండిలేక లోపలికి పోయిన డొక్కలు, అలసి ఎర్రబడ్డ కళ్ళు...

వాటిని గమనిస్తున్న కొద్దీ నాలో ఏవేవో ఆలోచనలు... ఎన్నెన్నో ప్రశ్నలు!

వారం రోజులుగా నా మనసును తొలిచేస్తున్న బాధకు ముగింపునిస్తూ...

కొత్త చూపును ప్రసాదిస్తూ...
 


 

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు
Tabelu Gelupu