Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prema enta madhram

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి..http://www.gotelugu.com/issue309/798/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి).....  "మేడమ్..దిగువ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన నేను ప్రతి చిన్న కోరిక తీర్చుకోవడం కోసం, పైస పైసకి నాన్నని దేబిరించడం తో మా ఇంటి మీద, మా పరిస్థితిల మీద, మరీ ముఖ్యంగా సమాజం మీదా కసి ఏర్పడింది. అందుకే చక్కగా చదువుకుని, ఉద్యోగంలోని పొజిషన్ తో డబ్బు సంపాదించుకుని, దాంతో నా కోరికలు తీర్చుకోవడమే ధ్యేయంగా బతికాను. విశృంకళత్వానికి నేనో నమూనాగా ఉండేవాన్నంటే, నేనేంటో మీకు అర్థమవుతుంది. అలాంటి నేను కాత్యాయనిగారి అందానికి ఫిదా అయిపోయాను. కోరకూడని కోరికే కోరాను. కాని ఆ తర్వాతే నేను మనిషినయ్యాను. ఆవిడ చెప్పిందో లేదో కాని ఆవిణ్ని నేను తాకనైనా లేదు. ఆవిణ్ని కలవాలని ఎంతో ప్రయత్నించాను. కానీ ప్చ్..సాధ్యం కాలేదు. మీరు రూపొందించి టెలికాస్ట్ చేసిన ప్రోగ్రామ్ ఆవిడ ఉనికిని తెలియజెప్పింది. నాకు ఎడారిలో ఒయాసిస్సులా అనిపించింది. కాత్యాయనిగార్ని నేను ఒక్కసారి కలవాలి. ప్లీజ్.."అంటూ ప్రాధేయపడ్డాడు. అతనిలోని సీరియస్నెస్ కు హేమ ను కొద్ది క్షణాలు మాట్లాడ్నీయకుండా చేసింది.

తర్వాత "ఆవిడ గురించి నేను ఎవరికీ చెప్పనని మాటిచ్చాను" అంది సాలోచనగా.

"ప్లీజ్ మేడమ్, నేను ఒక్కసారి కలవాలి!" అన్నాడు మంకుపట్టు పట్టిన పిల్లాడిలా.

"ఒకపని చేస్తాను. కాత్యాయనిగారితో మీ గురించి చెబుతాను. తను ఒప్పుకుంటే కలుద్దురుగాని. లేదంటే నన్ను విసిగించకూడదు. సరేనా?"అంది.

అతను’సరే’అన్నట్టుగా తలూపాడు. తర్వాత "ఇదిగోండి నా బిజినెస్ కార్డ్. తను ఒకవేళ ఒప్పుకుంటే నాకు ఇమ్మీడియేట్ గా తెలియజేయండి. రెక్కలుగట్టుకు వాలతాను."అని కార్డ్ ఆమె చేతిలో పెట్టి లేచెళ్లిపోయాడు. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.

***

ఒక రోజు మధ్యాహ్నం హేమ సోమయాజులుగారింటికి వెళ్లింది.

అప్పుడే ఆలయంలో పూజ ముగించుకుని ఇంటికొచ్చినట్టున్నారు. బట్టలు మార్చుకోకుండా పడక్కుర్చీలో కూర్చుని భార్య ఇత్తడి చెంబుతో ఇచ్చిన మంచినీళ్లు తాగుతున్నాడు. దూరంగా చాప మీద కూర్చుని ఆధ్యాత్మిక పుస్తకం చదువుతున్న కాత్యాయని, హేమను చూడగానే పరుగున లేచొచ్చి, ఆనందంగా హేమను కౌగిలించుకుంది.

కాత్యాయనితో "ఓ ముఖ్యమైన విషయం మోసుకొచ్చానోయ్ నీకోసం" అంది. ఏవిటన్నట్టుగా చూసింది.

"మనోహర్ నిన్న మా ఆఫీసుకు వచ్చాడు. నిన్ను కలవాలనుకుంటున్నట్టు చెప్పాడు. మాటలు చాలా సిన్సియర్ గా ఉన్నాయి. నేను నీ పర్మీషన్ తీసుకు.. చెబుతానని అన్నాను" అంది.

కొద్దిసేపు కాత్యాయని అభావంగా నేలవైపు చూస్తుండి పోయింది.

"ఆ మనోహర్ ను కలవడమంటే ప్రశాంతమైన చెరువులో ఒక రాయి పడ్డట్టేనమ్మా..ఇప్పుడిప్పుడే మనోగాయాల్నుంచి అమ్మాయి తేరుకుంటోంది"అన్నాడు సోమయాజులుగారు."ఆయన చెప్పేది నిజమేనమ్మా..అసలు అతనివల్లే కదమ్మా అమ్మాయికి ఈ పరిస్థితి దాపురించింది"అంది వరాలమ్మ.

"కాని అతని వల్ల మంచే జరిగింది కాని చెడు జరగలేదు! అఫ్కోర్స్ అతను పెట్టిన ప్రపోజల్ రాంగ్..కాని తర్వాత అతను రియలైజ్ అయ్యాడు కదా! అతనే లేకపోతే, కాత్యాయని భర్త పరలోకానికి వెళ్లుండేవాడు"

కాత్యాయని నెమ్మదిగా తలెత్తి "ఇప్పుడు నన్నెందుకు కలవాలనుకుంటున్నాట్ట"అంది.

"ఏమో..అది నువ్వే కనుక్కుంటే బాగుంటుంది. అసలు అతని ఉద్దేశం ఏమిటో?. నువ్వు ‘ఊ’ అంటే అతన్నిక్కడికి తేను. నువ్వే మా ఆఫీసుకి వచ్చి అతన్ని కలుద్దువుగాని. ఏవన్నా తేడా జరిగితే అక్కడే అతనికి తగిన బుద్ధి చెప్పొచ్చు. ఏవంటావు?"అంది

"నువ్వు జర్నలిస్ట్ వి కాబట్టి నీకన్నీ ఆసక్తికరంగా ఉంటాయమ్మా, కాని తర్వాతి పరిణామాలు ఎదుర్కోవలసింది తనేగదమ్మా"అంది వరాలమ్మ.

"చూడమ్మ..మీరు దేవుడిచ్చిన తల్లిదండ్రులయితే..తను తోడబుట్టినదానితో సమానం. అతను ఇన్నాళ్ల తర్వాత కాత్యాయనిని వెతుక్కుంటూ వచ్చాడంటే, ఎందుకో విషయం తెలుసుకోవాలన్న ఆసక్తి తప్ప మరోటికాదు. ఈ అజ్ఞాతవాసం ఎన్నాళ్లు? తనకి ఈ విషయంలో కడదాకా నేను తోడుంటానమ్మా..నన్ను నమ్మండి" అంది.

కాత్యాయని ఒప్పుకుంది. వాళ్లూ అన్యమనస్కంగా తలూపారు.

"అయితే రేపు పదకొండు గంటలకు రెడీగా ఉండు" అని చెప్పి హుషారుగా వెళ్లిపోయింది హేమ.

 

కాత్యాయనిని మనోహర్ ఎందుకు కలవాలనుకున్నాడో తెలియాలంటే.. వచ్చే శుక్రవారం దాకా ఎదురు చూడాల్సిందే....)    

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్