Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> నేను కన్నతండ్రిని

nenu kannatandrini

జగన్నాధం పడుకున్నాడన్న మాటేగాని కునుకు పట్టడం లేదు. కన్ను మూసినా తెరచినా కన్నకూతురు సుధామే కళ్ళ ముందు మెదులుతున్నది. ఉద్యోగపరంగా గాని, ఆర్థికపరంగా గాని స్థితి తక్కువవాడైనా ఉన్నగా నొక్క కూతురిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాడు. అప్పోసొప్పో చేసి ఇంజనీరింగ్ చదివించాడు. తెలివిగల పిల్ల కావడంతో ఎక్కడా తప్పకుండా అన్నీ మంచిమార్కులతో పాసవుతూ, ర్యాంకులు తెచ్చుకుంటూ తక్కువ ఖర్చుతోనే పట్టా తెచ్చుకుంది. అన్నీ సవ్యంగానే జరిగిపోయి అమ్మాయి ఉద్యోగప్రయత్నాలు మొదలుపెట్టింది. పెద్దలు చెప్పినట్లు కల్యాణఘడియ వస్తే ఆగదని మా బంధువుల పెళ్ళిలో సుధామను చూసిన ఒక అబ్బాయి మా అమ్మాయిని చేసుకుంటానని మా బంధువుల ద్వారా కబురుపంపాడు. సుధామ ససేమిరా వద్దంది. తను ఉద్యోగం చేసి తన కాళ్ళమీద తను నిలబడ్డ తరువాతే పెళ్ళి అంది. అబ్బాయి మంచివాడని, పూనేలో సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తూ నెలకు లక్ష రూపాయలు జీతమని, ఇంత మంచి సంబంధం వదులుకుంటే మరల రాదని తల్లి సునంద పెట్టిన పోరు భరించలేక అంగీకరించింది.

ఒక సంవత్సరం పాటు అంతా సజావుగానే సాగింది. ఒకరోజు హటాత్తుగా ఊడిపడింది సుధామ. ఆ రోజు తనక, తన భర్తకు గొడవలవుతున్నాయని  చెప్పింది. కారణం చెప్పమంటే దాటవేసింది. అతను డబ్బు మనిషని, అతనితో వేగడం కష్టమని, విడాకులు తీసుకుంటానని చెప్పింది. దానితో అదిరిపడ్డ సునంద కాపురమన్నాక సర్దుకుపోవాలని, భర్త చెప్పినట్టు నడుచుకోవాలని అనేక నీతులు చెప్పింది. బేలగా నా వైపు చూసిన సుధామకు తప్పదమ్మా అన్నట్లుగా చూశాను. ఏమనుకుందో ఏమో మరుసటి రోజే వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఫోన్ లు తగ్గించింది. తరువాత ఒకసారి ఫోన్ చేసి పెద్దగా ఏడ్చింది 'నావల్ల కాదమ్మా ఈ కాపురం 'అంటూ. షరా మామూలే. సునంద నీతులు, బెదిరింపులు. భర్తను వదలి పుట్టింటికి వస్తే మా పరువు గంగలో కలిసిపోతుంది. మాకు చెడ్డపేరు తేవద్దు అని ఖరాఖండిగా చెప్పి పెట్టేసింది సునంద. నేను మరల ఫోన్ చేసి తొందరపడవద్దని సర్దిచెప్పి పెట్టేశాను. ఆ రోజునుంచి పరిష్కారం కోసం ఆలోచిస్తూనే ఉన్నాను. నిన్న సుధామ నుంచి వచ్చిన ఉత్తరం నిద్రలేకుండా చేస్తున్నది.

******

ప్రియమైన అమ్మ నాన్నలకు,

ఎలా ప్రారంభించాలో తెలియడం లేదు. పెళ్ళయిన రెండు సంవత్సరాలలోనే నూరేళ్ళ అనుభవాన్ని పోగుచేసుకున్నాను. అవన్నీ మీకు చెప్పాలని, నా గుండెలో బరువు దించుకోవాలని ఉంది. కాని మీనుంచి నాకు సపోర్ట్ రాదు నాన్న. ఎందుకంటే పోయినసారి వచ్చినపుడు నా బాధలు అమ్మకు చెప్పాను. నేను ఎంత ఆడపిల్లనైనా నేనూ మనిషినే కదా. నాకూ ఆత్మాభిమానం ఉంటుంది. ప్రతిరోజూ నేను ఎదుర్కొనే అవమానాలు అమ్మకు చెప్పాను. అమ్మ అన్నీ విని కాపురమన్నాక సర్దుకుపోవాలన్నది. మీ పరువు బజారుకు ఈడ్చవద్దన్నది. నేను చిన్నపిల్లను కాదుకదా. నాకు మంచి, చెడు తెలుసు. సర్దుకున్నాను నాన్నా. నా రోషాన్ని, పౌరుషాన్ని చంపుకున్నాను. అణిగి మణిగే ఉన్నాను. కాని శృతిమించిపోయింది నాన్న. మాటలు దాటి చేతలకు దిగారు వీళ్ళు. నన్ను వదిలించుకుని మరో అమ్మాయిని తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. అయినా మీరేమి కంగారుపడకండమ్మా. నా ముఖాన ఎలా రాసి వుంటే అలా జరుగుతుంది. నా ఖర్మకు మీరేమి చేస్తారు. మహా అయితే చంపేస్తారు అంతే కదా. పోరాడుతాను నాన్నా ప్రాణం పోయేటంతవరకు పోరాడుతాను. ఇంటికి వస్తానని భయపడవద్దు అమ్మా. నేను రాను. మీకు తలవంపులు తీసుకురాను. ఎందుకో చివరిసారి మిమ్మల్ని కనీసం ఉత్తరం ద్వారా పలకరించాలనిపించి రాశాను. తప్పులుంటే మన్నించండి. ఉంటాను

మిమ్మల్ని చూడగలనో లేనో తెలియని
మీ
సుధామ"

********

"ఏమిటి ఈ రోజు అప్పుడే తయారయ్యారు. ఎక్కడికి" కాఫీ చేతికిస్తూ అడిగింది సునంద మౌనంగా ఉన్నాడు జగన్నాధం. మరల తనే అందుకుంది. "సుధామ నుంచి వచ్చిన ఉత్తరం చూస్తే దాని బ్రతుకు ఏమైపోతుందన్నది చాలా భయంగా ఉన్నది" గొంతులో బాధ ధ్వనించింది.

"ఏం చెయ్యాలో నువ్వే చెప్పు" కాఫీ కప్పు తిరిగి ఇస్తూ అన్నాడు జగన్నాధం.

"ఏం చేద్దామండి. దాని ఖర్మకు మనమేం చెయ్యగలం. ఒకసారి వెళ్ళి వాళ్ళ అత్తగారితో మాట్లాడివద్దామా" భర్త కళ్ళల్లోకి చూసింది

"అదికూడ చేశాము కదా ఇంతకుముంది. ఏమన్నారు మన అమ్మాయిదే తప్పుగా చిత్రీకరించారు. అది అబద్దమని తెలిసినా మనం సుధామకే నీతులు చెప్పి వచ్చాము. చివరకు అది ఇంటికి వచ్చి తన గోడు వెళ్ళబోసుకున్నా మనమేం చేశాము. కాపురమంటే సర్దుకుపోవాలమ్మా అని మరలా ఆ నరకానికే పంపాము. ఇప్పుడు వెళ్ళినా మనం చేసేది అంతేగా" అన్నాడు జగన్నాధం.

అది నిర్లిప్తతో, నిష్టూరమో అర్థంకాలేదు సునందకు. మాటరాలేదు నోటినుంచి.

"సునందా ఇంతకాలం నీ మాటకు తలవంచి నేను సుధామ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు తీసుకుంటున్నాను ఒక తండ్రిగా. తల్లిగా నువ్వు నాకు సహకరించినా, సహకరించకపోయినా నా నిర్ణయం మారదు. ఇంతకాలం ఆడపిల్ల అంటే పెళ్ళిచేసి పంపితే చాలు బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను. దాని కాపురం దాని అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. మనం నిమిత్తమాత్రులం అని అనుకునేవాడిని. కాని అది తప్పని తెలుసుకున్నాను. కళ్ళముందు కూతురు కష్టపడుతుంటే దాని జాతకం అంతేనని వదిలేస్తే వాడిని తండ్రి అనకూడదు. కిరాతకుడు అనాలి. 'ఇక్కడ నా ఛావుకు ముహూర్తం పెడుతున్నారు నాన్నా' అని అసహాయంగా పలికే బిడ్డకు సమాజానికి వెరచి 'నీ ఖర్మ నీదేనమ్మా' అని వదిలేసే తండ్రిని కాలేను. నేను బ్రతికున్నంతకాలం దానికి అండగా ఉంటాను. అంతేకాదు నా బిడ్డ తన కాళ్ళ మీద తను నిలబడేలా, తలెత్తుకు తిరిగేలా చేస్తాను. కన్నతండ్రిగా నా బాధ్యత నిర్వర్తిస్తాను." జగన్నాధం మాటల్లో బాధతో కూడిన ఆవేశం ధ్వనించింది. భర్త మాటలలో ఆవేశం వెనుక దాగిన నిర్ణయం కొంత భయాన్ని కలిగించింది అది ఎటు దారితీస్తుందో అని.

"ఏమండీ మరొకసారి ఆలోచించండి. పదిమంది పదిరకాలుగా అంటారేమో"

"ఎవరే పదిమంది. ఇంతకాలం నా బిడ్డ అత్తగారింట్లో నరకం చూస్తుంటే ఎక్కడికి పోయారే వాళ్ళు. ఏంచేసారు? రేపు నా కూతురు చనిపోతే తిరిగి దాన్ని బ్రతికిస్తారా వాళ్ళు. పదిమందికి జడిసి పిల్లను బలిచేయలేను. నా నిర్ణయం మారదు" అంటూ బయలుదేరుతున్న జగన్నాధాన్ని  అలానే చూస్తుండిపోయింది

'ఇలాటి తండ్రి అందరి ఆడపిల్లలకు ఉంటే ఈ అత్తగారింట ఆరళ్ళు, ఆడపిల్లల చావులు తగ్గిపోతాయి కదా. కన్నతండ్రి అంటే జన్మంతా రక్షణకవచంలా ఉండే వాడని నిరూపించండి. పదిమందికి మార్గదర్శిగా నిలవండి' మనసులో అనుకుంటూ లోనికి దారి తీసింది.

మరిన్ని కథలు
samaanatvam