Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
IPL is coming

ఈ సంచికలో >> యువతరం >>

సమ్మర్‌లో హాట్‌ హాట్‌గా.!

hot hot...

ఇది కుర్రాళ్లని వేడెక్కించే అదో టైప్‌ విషయం గురించి కాదు. ఉడుకు రక్తం ఉప్పొంగే యువతరం కొత్తగా చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల వేటలో పడే సమయం కదా.! అదీ అసలు మేటర్‌. పరీక్షలకు ప్రిపేరవడం ఒక యెత్తు, పరీక్షలు రాయడం ఇంకో యెత్తు. అన్నింటికీ మించి పరీక్షలు రాశాక, భవిష్యత్తును వెతుక్కోవడం అన్నింటికన్నా పెద్ద విషయం. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ.. ఇలా ఈ ముగ్గురూ పరీక్షలు పూర్తయ్యాక భవిష్యత్‌ మీద బోలెడన్ని ఆశలతో తదుపరి స్టెప్‌ వేసే సమయమిది. టెన్త్‌ పూర్తయితే ఇంటర్‌ ఎలా చేయాలి.? ఇంటర్‌ పూర్తయితే ఇంజనీరింగో, మెడిసెనో ఎలా చేయాలి.? అవీ పూర్తయితే ఉద్యోగాలు ఎలా వెతుక్కోవాలి.? లేదంటే ఆ పై చదువుల కోసం ఇంకా ఏం చేయాలి.? ఇలా మెదళ్లను సవాలక్ష ప్రశ్నలు తొలిచేస్తుంటే, యువతరం ఉక్కిరి బిక్కిరి కాకుండా ఎలా ఉంటుంది.?

పోటీ పరీక్షల కాలం కదా. అందరూ అసలు పరీక్షల కంటే పోటీ పరీక్షల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోంది. ఓ అంచనా ప్రకారం 15 నుండి 25 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవారు మానసిక ఒత్తిడిని అత్యంత ఎక్కువగా భరిస్తున్న కాలం ఇదేనని తేలింది. ఈ మూడు నెలలు అత్యంత కీలకం కావడంతో యువత ఉరుకులూ, పరుగులూ పెడుతున్నారు. ఒకప్పుడు సమ్మర్‌ సీజన్‌ అంటే వెకేషన్‌. ఏడాదంతా కష్టపడి చదివి ఆ చదువు తాలూకు ఒత్తిడి నుండి రిలాక్స్‌ అవ్వడానికి సమ్మర్‌ కోసం ఎదురు చూసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మిగతా రోజుల్ని మించి సమ్మర్‌లో యువతరం మీద ఒత్తిడి పెరిగిపోతోంది. దురదృష్టమేంటంటే ఈ ఒత్తిడి బారిన పడి చిన్నపిల్లల జీవితాలు నాశనమైపోతున్నాయి. కారణాలు వెతుక్కుంటూ పోతే చాలానే కనిపిస్తాయి. పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తే ఆరోగ్యవంతమైన యువ సమాజాన్ని మనం చూడగలుగుతాం.

అయితే అంతటా ఒత్తిడే అనుకోవడానికి వీల్లేదు. చాలా ఎక్కువ ఒత్తిడి ఉన్న మాట వాస్తవం. అదే సమయంలో యువత సరికొత్త ఆలోచనలు చేయడానికి ఇదే మంచి సమయంగా భావిస్తోంది. భవిష్యత్తుకు మంచి పునాది వేసుకునే క్రమంలో ఒత్తిడిని తట్టుకుని టైమ్‌ని మ్యానేజ్‌ చేసుకుని ముందడుగు వేస్తున్న యువతకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. నెక్ట్‌ ఏం చదవాలి.? అనే విషయాన్ని కొంచెం పక్కన పెట్టి ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు, సాంకేతికంగా పుట్టుకొస్తున్న కొత్తదనాలు, ఇతరత్రా ఆశక్తికరమైన అంశాలు.. వీటి చుట్టూ యువత ఆలోచనలు పరిభ్రమిస్తుండడం ఆహ్వానించదగ్గ విషయం. తల్లితండ్రులు తమ పిల్లల విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ ఈ సమయంలో చూపించి యువతరం ఆలోచనలకు ఊతమివ్వగలిగితే హాట్‌ సమ్మర్‌ కూడా సో కూల్‌గా ఉంటుంది కదా.

మరిన్ని యువతరం